
లక్నో : తాజా ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా ఆ పార్టీకి ప్రజలు గట్టి బుద్ధి చెప్పారని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేనివారిని తాజా ఉప ఎన్నికలు ఓడించాయని ఆయన చెప్పారు. ఎన్నికల్లో బీజేపీ ఆడుతున్న ఆటను.. తాము కూడా ఆడుతున్నామని, విపక్షాలను చీల్చి గండి కొట్టాలన్న బీజేపీ ఎత్తుగడలకు బ్రేక్ వేశాయని ఆయన అన్నారు. గెలిచిన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు.
‘బీజేపీ మాతో ఆడుతున్న ఆటనే.. మేం ఆ పార్టీ నుంచి నేర్చుకొని.. ఆడుతున్నాం. రైతులకు రుణాలు మాఫీ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కానీ ఏమైంది? రుణమాఫీ కాదు రైతుల ప్రాణాలను బీజేపీ సర్కారు బలిగొంటోంది. ఇది పెద్ద మోసం’ అని అఖిలేశ్ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని కైరానా లోక్‌సభ నియోజకవర్గంలో ఆర్‌ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్ 55వేల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇక్కడ విపక్షాలన్నీ(ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్) కలిసి ఆర్‌ఎల్డీకి మద్దతునిచ్చాయి. మరోవైపు నూర్పూర్ అసెంబ్లీ స్థానంలోనూ బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ సిట్టింగ్ నియోజకవర్గమైన ఇక్కడ ఎస్పీ అభ్యర్థి విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment