పార్టీ పెడతా.. ఎలా సీఎం అవుతావో చూస్తా
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్వాదీ పార్టీలో వివాదం సమసిపోయిందని భావిస్తున్న తరుణంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అనగా మార్చి 11 తర్వాత కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్ ప్రకటించారు. అంతేగాక మళ్లీ ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తావో చూస్తానని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు సవాల్ విసిరారు. అఖిలేష్‌కు శివపాల్ స్వయానా బాబాయ్ అవుతారు.
యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్తో ఎస్పీ జతకట్టడాన్ని శివపాల్ తప్పుపట్టారు. ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన ములాయం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఎతాహ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో శివపాల్ మాట్లాడుతూ.. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, యూపీలో కనీసం నాలుగు సీట్లు కూడా గెలవలేదు అని చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎస్పీ తరఫునే జస్వంత్ నగర్ స్థానం నుంచి పోటీ చేస్తానని, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొత్త పార్టీని స్థాపిస్తానని చెప్పారు. ములాయంను అఖిలేష్ అవమానించారని, కావాలనే తన వర్గీయులకు టికెట్లు ఇవ్వలేదని ఆరోపించారు. పార్టీలో ఎక్కువ మంది తనతోనే ఉన్నారని శివపాల్ చెప్పారు. యూపీ అసెంబ్లీకి ఫిబ్రవరి 11 నుంచి ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా, మార్చి 11న ఓట్లను లెక్కిస్తారు.
సమాజ్వాదీ పార్టీ.. అఖిలేష్, శివపాల్ వర్గాలుగా విడిపోగా.. అఖిలేష్ పార్టీలో పూర్తి పట్టు సాధించారు. ఎస్పీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తండ్రి ములాయంను తొలగించి.. అఖిలేష్ పార్టీ పగ్గాలు చేపట్టారు. యూపీ పార్టీ చీఫ్‌గా ఉన్న శివపాల్‌ను పదవి నుంచి తొలగించారు. ఎన్నికల సంఘం వద్ద పోరాడి పార్టీ పేరు, పార్టీ గుర్తు సైకిల్‌ను అఖిలేష్ దక్కించుకున్నారు. పార్టీలో శివపాల్‌ను దాదాపుగా ఒంటరి చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని మళ్లీ అధికారంలోకి రావడానికి అఖిలేష్ పోరాడుతున్నారు.
సంబంధిత వార్తలు చదవండి