బాబాయ్ x అబ్బాయ్
సాక్షి, నేషనల్ డెస్క్ : దేశంలోనే అతిపెద్దదైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార సమాజ్‌వాదీ పార్టీని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈసారీ గెలవాలని పట్టుదలగా ఉన్న రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్‌కు సొంతింట్లో కుంపటి తలనొప్పిగా మారింది. కొంత కాలంగా కుమారుడు(అఖిలేశ్), తమ్ముడు (శివ్‌పాల్) మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న భేదాభిప్రాయాలు ఇప్పుడ రోడ్డున పడటం ములాయంకు ఇబ్బందిగా మారింది. మళ్లీ గెలవాలంటే.. కీలకమైన మార్పులు తప్పవని, అందరినీ పక్కనపెట్టి ముందుకెళ్లేందుకు అఖిలేశ్ దూకుడు పెంచగా.. ఈ నిర్ణయాలు పార్టీ అభివృద్ధికోసం తను చేస్తున్న ప్రయత్నాలకు సమస్యగా మారాయని శివ్‌పాల్ అంటున్నారు. అయితే.. కుర్చీలాటలో అఖిలేశ్‌కే ములాయం మద్దతిస్తుండటం యాదవ కుటుంబంలో విభేదాలు సృష్టిస్తోంది.
‘మిస్టర్ క్లీన్’ అనిపించుకోవాలని..
2017 ఎన్నికల్లో సమాజ్‌వాదీ విజయానికి శాంతిభద్రతల సమస్య ప్రధాన అవరోధంగా మారింది. ఎస్పీ అధికారంలోకి వచ్చాక ఈ సమస్య ఎక్కువైందనేది బహిరంగ రహస్యమే. దీంతో కనీసం ఈ ఆర్నెల్లలో వీలైనంత మార్చి..ప్రజానుకూల ప్రభుత్వమని, తను మిస్టర్ క్లీన్ అనిపించుకోవాలనేది అఖిలేశ్ తాపత్రయం. తండ్రిచాటు బిడ్డ అనే ముద్ర తొలగించుకునేందుకు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్వామీ ఏక్తా దళ్ (గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ స్థాపించిన పార్టీ)ని సమాజ్‌వాద్ పార్టీలో విలీనం చేసే ప్రక్రియకు అఖిలేశ్ అడ్డుపడ్డారు. అయితే.. తను కుదిర్చిన ఈ డీల్‌ను అఖిలేశ్ అడ్డుకోవటాన్ని శివ్‌పాల్ అవమానంగా భావించారు. మరోవైపు, తన సన్నిహితుడు దీపక్ సింఘాల్‌ను సీఎస్‌గా తొలగించటం.. తన చేతిలోని కీలక శాఖలను తప్పించటం శివ్‌పాల్‌కు ఇబ్బందికరంగా మారింది. అయితే, పార్టీ యూపీ చీఫ్‌గా అఖిలేశ్‌ను తప్పించటం, స్వతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ శివ్‌పాల్ నిర్వహణ నైపుణ్యంపై ములాయం ప్రశంసించటం ములాయం కంటితుడుపు చర్యలుగా అర్థమవుతోంది.
సీఎం సీటుపై కన్ను.. 2012లో యూపీ అధికారంలోకి రావటంలో కీలకంగా వ్యవహరించిన శివ్‌పాల్ అప్పుడే సీఎం పదవిని ఆశించారు. అయితే ములాయం పుత్రుడిపైనే నమ్మకం ఉంచటంతో డీలా పడ్డారు. ఇటీవలి కాలంలో అఖిలేశ్ తీరుపై ఆరోపణలు వస్తుండటంతో.. వచ్చే ఎన్నికల్లోనైనా సీఎం అభ్యర్థిగా తన పేరును ప్రకటిస్తారని శివ్‌పాల్ భావిస్తున్నారు. మళ్లీ పార్టీలో చేరిన ఎంపీ అమర్‌సింగ్ పార్టీలో మళ్లీ క్రియాశీలకంగా మారుతుండటాన్ని శివ్‌పాల్ స్వాగతిస్తుండగా.. అఖిలేశ్ బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ఇది కూడా విభేదాలకు కారణమైంది.