![అయిననూ పోటీచేసి తీరుతాను! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/41484750614_625x300.jpg.webp?itok=ggmlOM2l)
అయిననూ పోటీచేసి తీరుతాను!
లక్నో: అధికార సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అంతర్గత కుటుంబపోరులో చతికిలపడి.. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి భ్రష్టుడైన శివ్‌పాల్ యాదవ్ ఎన్నికల్లో పోటీకి వెనుకాడటం లేదు. అన్న ములాయం కొడుకు అఖిలేశ్ యాదవ్‌తో పార్టీ ఆధిపత్యం విషయమై శివ్‌పాల్ పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. ఎస్పీ మెజారిటీ నేతలు, ఎమ్మెల్యేలు అఖిలేశ్ వైపు మొగ్గు చూపడంతో పార్టీ అధికారిక సైకిల్ గుర్తును అఖిలేశ్ వర్గానికి ఈసీ కేటాయించింది. దీంతో ఎస్పీని అధికారికంగా అఖిలేశ్ చేజిక్కించుకున్నట్టు అయింది.
ఈ నేపథ్యంలో అఖిలేశ్ తో సయోధ్యకు సిద్ధపడిన ములాయం సింగ్ యాదవ్.. తన అనుయాయిలను ఎస్పీ తరఫున బరిలోకి దింపాలంటూ 38మంది సభ్యుల జాబితాను కొడుకుకు పంపించారు. ఈ జాబితాలో ములాయం సోదరుడు శివ్‌పాల్ పేరు కూడా ఉంది. ములాయంతో సఖ్యత కోరుతున్న అఖిలేశ్ ఈ జాబితాలోని పేర్లకు చాలావరకు ఆమోదం తెలిపే అవకాశముంది.
ఈ నేపథ్యంలో వచ్చేనెల జరిగే యూపీ ఎన్నికల్లో తాను పోటీ చేసి తీరుతానని 61 ఏళ్ల శివ్‌పాల్ యాదవ్ స్పష్టంచేశారు. మళ్లీ ఎన్నికల్లో పోటీచేయాలన్న ఒకప్పటి తన ప్రత్యర్థి అయిన బాబాయ్ శివ్‌పాల్ కోరికను అఖిలేశ్ అనుమతిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.