న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యత అధికార బీజేపీని గట్టి దెబ్బతీసింది. మొత్తం నాలుగు లోక్‌సభ స్థానాలు, 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా.. మూడు లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క మహారాష్ట్రలోని పాల్ఘర్ నియోజకవర్గాన్ని బీజేపీ నిలబెట్టుకుంది.
ఇటు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లోనూ బీజేపీకి చేదు అనుభవమే ఎదురైంది. మొత్తం 11 స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. తొమ్మిది స్థానాల్లో ఎదురీదుతోంది. ముఖ్యంగా మేఘాలయాలోని అంపటి అసెంబ్లీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అంపటిలో కాంగ్రెస్ అభ్యర్థి మియానీ డీ షిరా 3,191 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాజా గెలుపుతో మేఘాలయలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది.
మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మేఘాలయాలో తాజా గెలుపుతో కాంగ్రెస్ సంఖ్యాబలం 21కి చేరింది. మరోవైపు అధికార ఎన్పీపీ 20 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఎన్పీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కోనార్డ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ-బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కర్ణాటక రాజకీయాలను మేఘాలయలో పునరావృతం చేసి.. విపక్షాల ఐక్యతతో మరో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సాధారణ మెజారిటీ సాధించలేదు. అయినా, గవర్నర్ వజుభాయ్ వాలా మొదట బీజేపీ నేత యడ్యూరప్పకు అవకాశం కల్పించారు. దీంతో బిహార్, గోవా, మణిపూర్ తదితర రాష్ట్రాల్లోనూ అతిపెద్ద పార్టీలుగా నిలిచిన పలు పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని ఆయా రాష్ట్రాల గవర్నర్‌లను కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేఘాలయాలో అధికార బీజేపీకూటమిని గద్దె దింపి.. ప్రతిపక్షాల ఐక్యతతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment