ఇమ్రాన్‌ఖాన్‌కు రెండు కేసుల్లో ఊరట.. నిర్దోషిగా ప్రకటన | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్‌ఖాన్‌కు రెండు కేసుల్లో ఊరట.. నిర్దోషిగా ప్రకటన

Published Tue, Mar 19 2024 9:02 PM

Pak Court Acquits Imran Khan Two Cases Vandalism Anti govt March - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు రెండు కేసుల్లో ఊరట లభించింది. 2022 నాటి ప్రభుత్వ వ్యతిరేక ‘లాంగ్‌ మార్చ్‌’ విధ్వంసం ఘటన కేసుల్లో జిల్లా సెషన్స్ కోర్టు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ షైస్టా కుండి ఇమ్రాన్‌ ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటించారు. ఇస్లామాబాద్‌లోని లోహిభైర్, సహలా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో ఆయన మంగళవారం తీర్పు వెల్లడించారు.

ఈ కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ తరఫున న్యాయవాది నయీ పంజోథా వాదనలు వినిపించారు. తన క్లైంట్‌ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నేత ఇమ్రాన్‌ఖాన్‌పై ఒకే రోజు అనేక కేసులు అక్రమంగా నమోదు చేశారని తెలిపారు. సెక్షన్‌ 144 కింద నిషేధాజ్ఞలకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్‌ జారీ చేయటం,  సమాచారం అందించటం లేదని పేర్కొన్నారు.

ఇక..ఫిర్యాదుదారుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్(SHO)అని.. కేసు నమోదు చేసే అధికారం ఆయనకు లేదని స్పష్టం చేశారని తెలిపారు. అదే విధంగా ఇమ్రాన్‌ఖాన్‌పై దాఖలైన కేసుల్లో ఏ సాక్షి స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదని తెలిపారు. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌.. ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్‌లోని రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న విషయం తెలిసిందే.

ఆయన తోషాఖానా, ఇద్దత్ (ఇస్లామేతర వివాహం), ప్రభుత్వ రహస్య పత్రాల లీక్ తదితర కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే 2022లో అధికారం కోల్పోయిన తర్వాత మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ఇమ్రాన్‌ ఖాన్‌ ‘లాంగ్‌ మార్చ్‌’ చేపట్టిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement