
తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని
సియోల్: ఎమర్జెన్సీ ప్రకటించినందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పర్యవసానాన్ని అనుభవించారు. ఆయనపై విపక్షాలు ప్రవేశపెట్టిన రెండో అభిశంసన తీర్మానం శనివారం పార్లమెంటు అమోదం పొందింది. 300 మంది సభ్యుల్లో అభిశంసన తీర్మానం నెగ్గాలంటే 200 ఓట్లు రావాల్సి ఉండగా 204 మంది ఓటేశారు. 85 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో యోల్ పదవీచ్యుతుడయ్యారు.
ప్రధాని హాన్ డక్ సో తాత్కాలిక దేశాధినేతగా వ్యవహరించనున్నారు. యోల్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలా, పూర్తిగా తొలగించాలా అన్నది రాజ్యాంగ న్యాయస్థానం నిర్ణయిస్తుంది. ఇందుకు ఆర్నెల్లు పట్టవచ్చు. తొలగించే పక్షంలో 60 రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. పీపుల్ పవర్ పార్టీ సభ్యుల గైర్హాజరీతో గత శనివారం తొలి అభిశంసన తీర్మానం నుంచి ఆయన గట్టెక్కారు. ఈసారి మాత్రం ఆయన సొంత పార్టీ సభ్యుల్లో పలువురు అభిశంసన తీర్మానం ఆమోదం పొందడానికి సహకరించారు.
ఇది దక్షిణ కొరియా ప్రజలకు, ప్రజాస్వామ్యానికి దక్కిన విజయమని విపక్ష డెమొక్రటిక్ పార్టీ ఫ్లోర్ లీడర్ పార్క్ చాన్ డే అన్నారు. ఫలితాలపై యోల్ స్పందించలేదు. పాలనపై కోల్పోతున్న పట్టును నిలుపుకునేందుకు ఆయన ఇటీవల అనూహ్యంగా ‘మార్షల్ లా’ ప్రకటించడం, గంటల్లోనే పార్లమెంటు దాన్ని ఎత్తేయడం తెలిసిందే. యోల్, ఆయన భార్య, కుటుంబీకులు, సన్నిహితులపై భారీ అవినీతి ఆరోపణలున్నాయి. తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ప్రధాని హాన్ డక్–సో సాంకేతిక నిపుణుడు. పారీ్టలకతీతంగా వైవిధ్యమైన కెరీర్ ఆయనది. పాలనాపరంగా విస్తృతమైన అనుభవముంది. ఐదుగురు వేర్వేరు అధ్యక్షుల ఆధ్వర్యంలో మూడు దశాబ్దాలకు పైగా నాయకత్వ పదవుల్లో పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment