అభిశంసనకు గురైన అధ్యక్షుడికి దక్షిణ కొరియా కోర్టు జారీ
ఆయన కార్యాలయంలో సోదాలు చేయాలని ఆదేశం
పట్టించుకునేది లేదన్న యూన్ లాయర్లు
సియోల్: దక్షిణ కొరియా రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు సియోల్‌లోని జిల్లా కోర్టు సోమవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయన ఆఫీసు, నివాసాల్లో సోదాలు చేపట్టాలని ఆదేశించిందని అవినీతి నిరోధక విభాగం వెల్లడించింది.. అయితే, అధికారికంగా యూన్‌ను పదవి నుంచి తొలగిస్తేనే తప్ప ఆయన నివాసం, కార్యాలయంలో తనిఖీలు చేపట్టేందుకు అవకాశాలు చాలా తక్కువని నిపుణులు అంటున్నారు. యూన్ ఈ సమన్లను పట్టించుకోరని చెబుతున్నారు.
ఇప్పటికే విచారణకు రావాలంటూ అందిన సమన్లను ఆయన పక్కనబెట్టేశారని, అధ్యక్షునికి ఉన్న రాజ్యాంగపరమైన రక్షణలను చూపుతూ భద్రతా సిబ్బంది ఇతర దర్యాప్తు అధికారులెవరినీ ఆయన నివాసంలోకి గానీ ఆఫీసులోకి గానీ రానివ్వడం లేదని సమాచారం. యూన్ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం తిరుగుబాటు కిందికి వస్తుందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు అవినీతి వ్యతిరేక విభాగం తెలపడాన్ని ఆయన లాయర్లు తప్పుబడుతున్నారు. ఈ విభాగం సోమవారం జారీ చేసిన సమన్లకు ఎలాంటి చట్టబద్ధతా లేదని కొట్టిపారేస్తున్నారు. అరెస్ట్‌కు యూన్ అంగీకరిస్తే తప్ప తామేమీ చేయలేమని అవినీతి నిరోధక విభాగం సైతం అంగీకరించింది. అప్పటి వరకు తమ తదుపరి కార్యాచరణ ఏమిటనేది ఇంకా నిర్ధారణ కాలేదని తెలిపింది.
అయితే, విచారణకు సహకరించేలా ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లుగా నిపుణులు చెబుతున్నారు. గతంలో, అవినీతి ఆరోపణలెదుర్కొన్న 2017లో మాజీ అధ్యక్షుడు పార్క్ గుయెన్ హే కూడా ఇదే విధంగా విచారణ అధికారులకు సహకరించలేదని గుర్తు చేస్తున్నారు. అవినీతి నిరోధక విభాగం తిరుగుబాటు ఆరోపణలను రుజువు చేయగలిగిన పక్షంలో యూన్‌కు మరణ శిక్ష లేదా జీవితకాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇతర నేరారోపణలైతే ఆయనకు అధ్యక్ష హోదా కారణంగా మినహాయింపులు వర్తిస్తాయి. తిరుగుబాటు, దేశద్రోహం వంటి ఆరోపణలు రుజువైతే మాత్రం అధ్యక్షుడికి ఎలాంటి రక్షణలు, మినహాయింపులు ఉండవు.
మార్షల్ లా విధించిన ఆరోపణలపై ప్రతిపక్షం మెజారిటీ ఉన్న పార్లమెంట్ డిసెంబర్ 14వ తేదీన యూన్‌ను అభిశంసించింది. అయితే, ఉత్తర కొరియాకు ప్రతిపక్షం అనుకూలంగా మారిందని యూన్ ఆరోపిస్తున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ, తరచూ ఉన్నతస్థాయి నేతలపై అభిశంసన తీర్మానాలను ప్రవేశపెడుతూ అడ్డుతగులుతోందని ఆయన విమర్శిస్తున్నారు. ఇటువంటి దేశ వ్యతిరేక శక్తులను అదుపు చేసేందుకే మార్షల్ లా పెట్టినట్లు యూన్ వాదనలు వినిపిస్తున్నారు. యూన్ అభిశంసన సరైనదా కాదా అనే అంశంపై దేశ రాజ్యాంగ కోర్టు విచారణ జరుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment