వందలాది మంది ఉద్యోగులకు మెయిళ్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ చర్యలు ప్రభుత్వాలతోపాటు సొంత దేశస్తులను సైతం కలవర పెట్టిస్తున్నాయి. యూఎస్ ఎయిడ్(యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్) ఇక మూతబడక తప్పదని బిలియనీర్ ఎలన్ మస్క్ వ్యాఖ్యానించారు. రహస్య పత్రాలను పరిశీలించేందుకు నిరాకరించారన్న ఆగ్రహంతో యూఎస్‌ఎయిడ్‌కు చెందిన ఇద్దరు ఉన్నత భద్రతాధికారులను సెలవుపై పంపారన్న వార్తల నేపథ్యంలో ఈ ప్రకటన చేయడం గమనార్హం.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోజ్)కు సారథిగా మస్క్‌ను ట్రంప్ నియమించడం తెలిసిందే. ప్రభుత్వ వ్యయంపై కోతలు విధించే విధుల్లో భాగంగా వాషింగ్టన్‌లోని యూఎస్‌ఎయిడ్ ప్రధాన కార్యాలయంలోని రహస్య సమాచారం చూపేందుకు సోమవారం డోజ్ బృందానికి అధికారులు అనుమతించకపోవడంపై మస్క్ తీవ్రంగా స్పందించారు. యూఎస్‌ఎయిడ్‌ను నేరగాళ్ల సంస్థగా అభివరి్ణస్తూ..దాని మూసివేసే సమయం వచ్చిందంటూ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు.
డోజ్‌కు అనుమతివ్వని యూఎస్‌ఎయిడ్ సెక్యూరిటీ డైరెక్టర్ జాన్ వూర్హీస్, ఆయన సహాయక డైరెక్టర్ బ్రియాన్ మెక్‌గిల్‌లను ట్రంప్ ప్రభుత్వం సెలవుపై పంపించిందని మీడియా అంటోంది. సుమారు 600 మందికి తమ హెడాఫీసులోని కంప్యూటర్లకు యాక్సెస్ లేకుండా చేశారని ఉద్యోగులు అంటున్నారు. కంప్యూటర్లతో యాక్సెస్ ఉన్న వారికి కూడా ‘సంస్థ నాయకత్వం సలహా మేరకు ప్రధాన కార్యాలయాన్ని 3న మూసివేస్తున్నాం’అంటూ సమాచారం వచ్చిందన్నారు. అయితే, ఇవన్నీ అసత్యాలని వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చ్యుంగ్ కొట్టిపారేశారు. మీడియాను సైతం ఆయన తిట్టిపోశారు.
దక్షిణాఫ్రికాకు సాయం నిలిపేస్తాం: ట్రంప్
ఇలా ఉండగా, దక్షిణాఫ్రికాకు ఇకపై అన్ని రకాల సాయం నిలిపివేస్తామని ట్రంప్ చెప్పారు. ఒక వర్గానికి చెందిన ప్రజల భూములను దక్షిణాఫ్రికా ప్రభుత్వం బలవంతంగా ఆక్రమించుకుంటోందని ఆరోపించారు. శ్వేత జాతికి చెందిన కొందరు రైతుల భూములను ఎలాంటి పరిహారం లేకుండా ఆక్రమించుకునేందుకు ఉద్దేశించిన వివాదాస్పద బిల్లుపై గతం వారం దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా సంతకం చేశారు. 2023లో దక్షిణాఫ్రికాకు అమెరికా సుమారు 440 మిలియన్ డాలర్ల సాయాన్ని అందజేసింది. 2023లో 180 దేశాలకు 72 బిలియన్ డాలర్ల మేర అమెరికా సాయం అందించింది. ఇందులో సగం వరకు యూఎస్‌ఎయిడ్ ద్వారానే పంపింది.
Comments
Please login to add a commentAdd a comment