పనామాకు అమెరికా వార్నింగ్
వాషింగ్టన్: పనామా కాలువపై చైనా ఆధిపత్యం, నియంత్రణను తగ్గించడానికి అత్యవసర మార్పులు చేయాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పనామా దేశాన్ని హెచ్చరించారు. ఆదివారం పనామాలో పర్యటించిన రూబియో.. పనామా దేశాధక్షుడు జోస్ రౌల్ ములినోతో భేటీ అయ్యారు. కాలువపై యథాతథ స్థితి ఆమోదయోగ్యం కాదని, తక్షణ మార్పులు లేకపోతే, ఒప్పందం ప్రకారం తన హక్కులను రక్షించడానికి అమెరికా అవసరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అయితే అమెరికా బెదిరింపులకు తాము భయపడబోమని ములినో స్పష్టం చేశారు.
చైనా ఆధిపత్యం గురించి అమెరికా ఆందోళనలను పోగొట్టేందుకు చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రూబియో పర్యటన వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడం వంటి ఉమ్మడి ఆసక్తులపై దృష్టి పెడుతుందని ములినో ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు నుంచి తాము వైదొలుగుతున్నట్లు పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో ప్రకటించారు.
ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ములినో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో చేరేందుకు 2017లో చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని తాము పునరుద్ధరించబోమని ఆయన తెలిపారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యాక అక్రమ వలసదారుల ఏరివేతకు సహకారాన్ని పెంచుతామని ములినో హామీ ఇచ్చారు. రూబియో పర్యటనకు ముందు పనామాలో తీవ్ర నిరసనలు చెలరేగాయి. నిరసనకారులు ట్రంప్, రూబియో దిష్టి»ొమ్మలను దగ్ధం చేశారు. దీంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.
Comments
Please login to add a commentAdd a comment