Dominance Fighting
-
గండి బాబ్జీ Vs బండారు.. టీడీపీలో మరోసారి ఆధిపత్య పోరు బహిర్గతం
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. గండి బాబ్జీ, బండారు సత్యనారాయణ మూర్తి మధ్య ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది. బండారుకి వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా గండి బాబ్జీ మాట్లాడుతున్నారు. గతంలో బండారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తనను ఏ కార్యక్రమానికి పిలవలేదని.. పెందుర్తి టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా తనకు తగిన గౌరవం ఇవ్వాలంటూ గండి బాబ్జీ వ్యాఖ్యానించారు.ఇప్పుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా తనకు తెలియకుండా ఏ కార్యక్రమం పెట్టడానికి వీల్లేదన్నారు. గండి బాబ్జీ వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా బండారు తనయుడు అప్పలనాయుడు కౌంటర్ ఇచ్చారు. పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఎలా మెలగాలో నాకు తెలుసు.. గత్యంతరం లేక వేరే పార్టీల నుంచి వచ్చిన వారి నుంచి నేర్చుకోవలసిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. -
ఒక హత్య.. వంద అబద్ధాలు
ప్రకాశం: టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు, వ్యక్తిగత విభేదాలు వెరసి ఓ వర్గానికి చెందిన నాయకుడి హత్యకు దారితీశాయి. సోమవారం రాత్రి గిద్దలూరు మండలం గడికోట పంచాయతీ పరిధిలోని పరమేశ్వరనగర్‌లో టీడీపీకి చెందిన నలుగురు వ్యక్తులు కలిసి అదే పార్టీకి చెందిన పాముల మునెయ్య(35) అనే వ్యక్తిపై గొడ్డలితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనతో వైఎస్సార్ సీపీ నాయకులకు ఎలాంటి సంబంధం లేకపోయినా టీడీపీ నేతలు హత్యా రాజకీయానికి తెరలేపారు. గిద్దలూరు టీడీపీ ఇన్చార్జి ఎం.అశోక్‌రెడ్డి హడావుడిగా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వైఎస్సార్ సీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా విష ప్రచారానికి పూనుకున్నారు. హంతకులు, హతుడు ఇద్దరూ టీడీపీ నాయకులే అయినప్పటికీ వాస్తవాలను కప్పి పుచ్చి అబద్ధాలు ప్రచారం చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. టీడీపీ నేత అశోక్‌రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్న నిందితుడు అల్లూరయ్య ఇవిగో వాస్తవాలు.. పరమేశ్వరనగర్కు చెందిన పాముల మునెయ్య(35)కు తన సమీప బంధువు అయిన గుండాల అల్లూరయ్యకు వ్యక్తిగత విభేదాలున్నాయి. పలు సందర్భాల్లో వారి మధ్య ఘర్షణ కూడా చోటుచేసుకుంది. ఈ క్రమంలో పాముల మునెయ్య స్నేహితుడైన ఓబులాపురం తండా నివాసి రామాంజనేయులు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జామాయల్ కర్ర కొట్టుకొచ్చాడు. దీనిపై ఈ నెల 14వ తేదీన అటవీశాఖ అధికారులకు సమాచారం అందడంతో జామాయిల్ తోటను పరిశీలించి నిందితుడైన రామాంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. అతడికి జరిమానా కూడా విధించారు. అయితే, అల్లూరయ్య ఇచ్చిన సమాచారంతోనే రామాంజనేయులును అటవీశాఖ అధికారులు పట్టుకున్నారని ఆగ్రహించిన మునెయ్య దుర్భాషలాడాడు. అదీగాక గ్రామంలోని పలువురు మహిళలతో మునెయ్య అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, ఆ విషయంలోను అల్లూరయ్యకు మునెయ్యకు మధ్య ఘర్షణ చోటుచేసుకుందని సమాచారం. దీనికి తోడు తెలుగుదేశం పారీ్టలో మునెయ్యకే ప్రాధాన్యత ఇస్తుండటం వల్ల అల్లూరయ్య పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకుండా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో అల్లూరయ్య తన మనుషులైన ఈశ్వర్, ప్రేమ్‌కుమార్, రంగయ్యతో కలిసి గొడ్డలితో మునెయ్యపై దాడికి పాల్పడ్డాడు. తలపై తీవ్ర గాయాలైన మునెయ్యను బంధువులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాడి ఘటనతో ప్రమేయం ఉన్న నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వైవీ సోమయ్య తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని చెప్పారు. -
సూడాన్‌లో వైమానిక దాడి..
కైరో: సూడాన్ రాజధాని ఖార్టూమ్‌పై శనివారం జరిగిన వైమానిక దాడిలో అయిదుగురు చిన్నారులు సహా 17 మంది చనిపోయారు. ఆర్మీకి, శక్తివంతమైన పారా మిలటరీ విభాగం ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్(ఆర్ఎస్ఎఫ్)కు మధ్య ఏప్రిల్ నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మిలటరీ విమానాలు ఆర్ఎస్ఎఫ్పై దాడులు జరుపుతుండగా, ఆర్ఎస్ఎఫ్ బలగాలు డ్రోన్లతో సైన్యంపై దాడులకు దిగుతోంది. ఖార్టూమ్‌లోని యోర్మౌక్ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య భీకరపోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజా దాడికి ఎవరు కారణమనే విషయం స్పష్టం కాలేదు. ఈ దాడిలో మరో 11 మంది వరకు గాయపడినట్లు మానవతా సాయం అందిస్తున్న ఒక సంస్థ అంటోంది. మిలటరీయే అక్కడ దాడి చేసిందని, తాము ఒక మిగ్ యుద్ధ విమానాన్ని కూల్చివేశామని ఆర్ఎస్ఎఫ్ అంటోంది. ఆర్మీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అరబ్ మిలీషియాకు చెందిన జన్జవీద్ సంస్థ ఆర్‌ఎస్‌ఎఫ్‌తో కలిసి పోరాడుతోందని సమాచారం. జన్జవీద్ను విమర్శించినందుకే ఇటీవల పశ్చిమ దర్ఫుర్ గవర్నర్ ఖమిస్ అబ్దల్లా అబ్కర్ను చంపేశారని విమర్శలు వస్తున్నాయి. -
కొండా Vs ఎర్రబెల్లి.. తెర వెనుక ఏం జరుగుతోంది?
సాక్షి, వరంగల్: వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవి.. కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టిందా.. ఇద్దరు మహిళా నేతల మధ్య ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసిందా.. తూర్పు టిక్కెట్ రాజకీయంగా దూమారం రేపుతుందా?.. అంటే ఔననే సమాధానం వస్తుంది. డీసీసీ తొలి సమావేశంలో వర్గ విబేధాలు బహిర్గతంకావడం కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తుంది. తూర్పులో కొండా వర్సెస్ ఎర్రబెల్లి అన్నట్లు రాజకీయాలు సాగుతున్నాయి. ఉద్యమాల ఖిల్లా వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు రచ్చకెక్కాయి. తూర్పులో రెండు వర్గాల మధ్య ఆధిపత్యపోరు సాగుతుంది. రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యే తానే అంటు మాజీమంత్రి కొండా సురేఖ ప్రచారం సాగిస్తుండగా అనూహ్యంగా డీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకున్న మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇద్దరి మధ్య ఇప్పుడు పచ్చిగడ్డి వస్తే భగ్గుమనే స్థాయిలో గ్రూప్ రాజకీయాలు సాగుతున్నాయి. వరంగల్ డిసీసీ అధ్యక్ష పదవి తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు కొండ సురేఖ-మురళీ దంపతులు విశ్వప్రయత్నం చేశారు. చివరకు ఎర్రబెల్లి స్వర్ణకు డీసీసీ పదవి దక్కింది. అప్పటి నుంచి గుర్రుగా ఉన్న కొండా దంపతులు పార్టీలో తమ ప్రాధాన్యతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. డీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతల స్వీకరణ సందర్బంగా ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్ తూర్పునియోజకవర్గంలో తొలిసారి పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జిల్లాలోని నాయకులతోపాటు పక్క జిల్లాలకు చెందిన పార్టీ సీనియర్ నేతలు హజరయ్యారు. తూర్పు టిక్కెట్ ఆశిస్తు ప్రచారం సాగిస్తున్న కొండా దంపతులు మాత్రం ఆ సమావేశానికి హాజరుకాలేదు. వారి అనుచరులను సైతం సమావేశానికి హాజరుకాకుండా కట్టడి చేశారు. కానీ కొండా వర్గానికి చెందిన కట్టస్వామి హాజరయ్యారు. తమకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని ప్రశ్నించే ప్రయత్నం చేయగా అతనిపై పరకాల నియోజకవర్గానికి చెందిన ఇనుగాల వెంకట్రాంరెడ్డి వర్గానికి చెందినవారు దాడి చేశారు. చొక్కా చించేసి చితకబాదారు. పార్టీ ముఖ్యనాయకుల సమక్షంలోనే రెండు వర్గాలు పరస్పరం తన్నుకోవడంతో సమావేశం రసాభసగా మారింది. ముందుగా ఎర్రబెల్లి స్వర్ణ-వరదరాజేశ్వర్‌రావు, కొండా సురేఖ-మురళీ వర్గీయులే కొట్టుకున్నారని ప్రచారం సాగింది. ఆ ప్రచారాన్ని ఎర్రబెల్లి వర్గీయులు కొట్టిపారేశారు. పార్టీలో గ్రూప్‌లు లేవని, తామందరిది ఒకే గ్రూప్ కాంగ్రెస్ అని ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు స్పష్టం చేశారు. డీసీసీ సమావేశానికి కొండా దంపతులు దూరంగా ఉన్నప్పటికి సాయంత్రం లేబర్ కాలనీలో కొండా మురళీ పర్యటించి పలువురిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కొండా దంపతుల పని అయిపోయిందని, సురేఖ ఇటురాదని, వేరే వాళ్లు వస్తారని ప్రచారం కావడంపై మురళీ ఘాటుగానే స్పందించారు. సురేఖ ఎటూ పోదు..తూర్పు నుంచే పోటీ చేస్తుందని మురళి స్పష్టం చేశారు. ఇరువర్గాల నేతల వ్యాఖ్యలు కాస్త పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. పైకి అంతాకలిసి ఉన్నామని పోజులిచ్చినప్పటికి అంతర్గతంగా గ్రూప్ రాజకీయాలతో రగిలిపోతున్నారు. వర్గ విబేధాలకు ప్రధాన కారణం వరంగల్ తూర్పు అసెంబ్లీ టిక్కెట్, డీసీసీ అధ్యక్ష పదవేనని తెలుస్తుంది. పనిచేసే వారికి అధిష్టానం డీసీసీ పదవి ఇచ్చిందని ఎర్రబెల్లి వర్గం భావిస్తుండగా, ఏకాభిప్రాయం లేకుండా ఎలా డీసీసీ అధ్యక్ష పదవిని ఖరారు చేస్తారని కొండా వర్గీయులతోపాటు అసంతృప్తివాదులు మడిపడుతున్నారు. ఇంతకాలం నివురు గప్పిన నిప్పులా ఉన్న టికెట్ పోరు ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన టీపీసీసీ సమావేశంతో సైతం బహిర్గతమైనట్లు సమాచారం. ఆ సమావేశంలో పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలని పార్టీ పెద్దలు సూచించారట. పీసీసీ నాయకత్వం కొండా సురేఖను పరకాల నుంచి పోటీ చేయాలని సూచించగా, సురేఖ మాత్రం వరంగల్ తూర్పు నుంచే పోటీ చేస్తానని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పీసీసీ నాయకత్వం కొండా ప్రతిపాదనలకు భిన్నంగా ఎర్రబెల్లి స్వర్ణను డీసీసీ అధ్యక్షురాలిగా నియమించడంతో తూర్పు తమదేనంటూ ప్రచారం సాగిస్తున్న కొండా దంపతులకు మింగుడు పడడంలేదట. అందులో భాగంగానే గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయట. తూర్పు అభ్యర్థిగా సురేఖ స్వయంగా ప్రకటించుకుని నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తున్నారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించన ఎర్రబెల్లి స్వర్ణ సైతం తూర్పులో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట. డీసీసీ అధ్యక్ష పదవి తమ అనుచరులకు ఇవ్వకుండా ఎర్రబెల్లి స్వర్ణకు కట్టబెట్టడమే కాకుండా తెరచాటుగా తూర్పు నియోజకవర్గంపై స్వర్ణ కన్నెయ్యడంతో కొండా దంపతులు అసంతృప్తితో పరోక్షంగా హెచ్చరిస్తున్నట్లు సమాచారం. చదవండి: కొండా వర్గీయుడిపై ఇనుగాల వర్గీయుల దాడి ఎవరైనా తూర్పులో కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే క్రేన్‌కు వేలాడదీస్తామని, పాత కొండా మురళిని చూస్తారని హెచ్చరించినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఇద్దరు మహిళా నేతల మధ్య టికెట్ పోరు అటు పార్టీ పెద్దలను ఇటు కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నాయి. పరోక్ష హెచ్చరికలు, గ్రూప్ రాజకీయాలు ఎటువైపు దారితీస్తాయోనని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయంతో పార్టీ శ్రేణులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతుంటే వర్గ విభేదాలు, గ్రూప్ తగాదలు తలనొప్పిలా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
Sudan crisis: ఇద్దరి అధికారహం, అంతర్యుద్ధం.. సామాన్యుల ఆకలి కేకలు
ఇద్దరు మిలటరీ నాయకుల మధ్య ఆధిపత్య పోరాటం సూడాన్‌లో సామాన్యుల ఆకలి కేకలకు దారితీస్తోంది. అధికారం కోసం వారు చేస్తున్న పోరాటంతో సామాన్యులు సమిధలుగా మారుతున్నారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు దొరక్క, కటిక నేలపై నిద్రిస్తూ ఎప్పుడే తూటా తమ ప్రాణాల్ని హరిస్తుందో తెలీని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. సూడాన్‌లో ఎందుకీ ఘర్షణలు ? దశాబ్దాల తరబడి నియంత పాలనలో మగ్గిపోయిన సూడాన్‌లో 2019లో ఆర్మీ తిరుగుబాటు జరిగి ఆనాటి అధ్యక్షుడు, నియంత ఒమర్ అల్– బషీర్‌ని సైన్యం గద్దె దింపడంతో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారో లేదో రెండేళ్లకే 2021లో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కొదమసింహాల్లాంటి ఇద్దరు జనరల్స్ చేతులు కలిపారు. అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణలు చెలరేగి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ రెండేళ్లకే అధికార బదలాయింపులో సమస్యలు మిత్రులైన ఆ మిలటరీ జనరల్స్‌ను శత్రువులుగా మార్చింది. వారే సూడాన్ ప్రస్తుత పాలకుడు, ఆర్మీ చీఫ్ జనరల్ అబ్దుల్ ఫత్తా అల్ బుర్హాన్, ఉపాధ్యక్షుడు, ఆర్ఎస్ఎఫ్ చీఫ్ జనరల్ మొహమద్ హమ్దాన్ దగలో (హెమెడ్తీ) . వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరాటం తారస్థాయికి చేరుకుంది. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం గత ఏడాది చివర్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో దేశంలో ఎన్నికలు జరగాలి. కానీ బుర్హాన్ అనుకున్నట్టుగా ఆ పని చేయలేదు. ఈలోగా అధికారాన్ని తన గుప్పిట్లో తీసుకోవడానికి హెమెడ్తీ పౌర పార్టీల కూటమైన ఫోర్సెస్ ఫర్ ఫ్రీడమ్ అండ్ ఛేంజ్ (ఎఫ్ఎఫ్సీ)తో సత్సంబంధాలు పెట్టుకున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ తనని తాను ఒక రాజనీతిజ్ఞుడిగా చూపించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. బంగారం గనులు, ఇతర వెంచర్ల ద్వారా హెమెడ్తీ, ఎఫ్ఎఫ్సీలు బాగా సంపద పోగేసుకున్నారు. మాజీ అధ్యక్షుడు బషీర్ అనుచరులు, ఇతర సీనియర్లు, ఆర్మీలో చాలా రోజులుగా పాతుకుపోయి ఉన్న వారిని పక్కకు తప్పించాలని ప్రణాళికలు రచించారు. ఆర్ఎస్ఎఫ్ను దేశవ్యాప్తంగా చాప కింద నీరులా విస్తరించడం ప్రారంభించారు. ఈలోగా లక్ష మంది బలగం ఉన్న ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్ఎస్ఎఫ్)ను సైన్యంలో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. తర్వాత సైన్యాధ్యక్షుడుగా ఎవరు ఉంటారన్నది సవాల్‌గా మారాయి. ఈ పరిణామాలన్నీ తన పదవికి ఎసరు పెడతాయని అధ్యక్షుడు బుర్హానా భావించారు. ఫలితంగా ఈ నెల 15న ఇరు వర్గాల మధ్య పోరు మొదలైంది. అయిదు రోజులుగా నరకం సూడాన్‌లో వారం రోజులుగా సాగుతున్న హింసాకాండలో ఇప్పటివరకు 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. పోరాటమంతా రాజధారి ఖర్టూమ్ పరిసరాల్లో జనావాస ప్రాంతాల్లో జరుగుతోంది. సూడాన్ జనాభా 4.6 కోట్లు అయితే రాజధాని పరిసర ప్రాంతాల్లోనే 1.2 కోట్ల మంది నివసిస్తారు. ఈ ప్రాంతాలన్నీ కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. వీధుల్లోనే శవాలు పడి ఉన్నా పట్టించుకునే వారే లేరు. విద్యుత్ సదుపాయం నిలిచిపోయింది. బేకరీలో బ్రెడ్ కొనుక్కొని తెచ్చుకోవడానికి 3 గంటలు క్యూ లైన్లో నిల్చోవాల్సి వస్తోంది. కిలోమీటర్ దూరంలో ఉండే ఆఫీసుకి వెళ్లడం కూడా అందరికీ కష్టమవుతోంది. ఇల్లు కదిలి కాలు బయట పెడితే ప్రాణాలతో బతికి ఉంటారన్న నమ్మకం లేదు. అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాలన్నా వీధుల్లో వినిపిస్తున్న కాల్పుల మోతలతో బయటకి అడుగుపెట్టే ధైర్యం చేయడం లేదని 65 ఏళ్ల వయసున్న అబ్బాస్ చెప్పారు. సూడాన్ పాలకులకు ప్రజల ప్రాణాలపై కనీస గౌరవం కూడా లేదని ఆయన మండిపడ్డారు. ‘‘వేలాది మంది ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో సరుకులు అయిపోతున్నా, మంచినీరు, కరెంట్, మందులు వంటివి లేకపోయినా బయటకు వచ్చే పరిస్థితి లేదు’’అని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల హై కమిషనర్ వోల్కర్ టిర్క్ చెప్పారు. కొన్ని దశాబ్దాల పాటు బషీర్ పాలనలో అంతర్యుద్ధంలోనే ప్రజలు గడిపారు. పేదరికం, అణచివేతను ఎదుర్కొంటూ దుర్భర పరిస్థితుల్ని చూశారు. ఇప్పుడైనా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతుందన్న వారి ఆశలు అడియాసలుగా మారాయి. ఎవరిది పై చేయి? బుర్హాన్, హెమెడ్తీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇద్దరికి ఇద్దరూ తగ్గేదేలే అంటున్నారు. ఆర్ఎస్ఎఫ్ను ఒక తిరుగుబాటు సంస్థగా ముద్రవేసిన బుర్హాన్ వెంటనే దానిని రద్దు చేయాలని పట్టు బడుతున్నారు. మరోవైపు హెమెడ్తీ బుర్హాన్‌ను క్రిమినల్‌గా అభివర్ణిస్తున్నారు. బషారీ పాలన నుంచి విముక్తి పొందినా దేశంలో శాంతి స్థాపన జరగకపోవడానికి ఆయనే కారణమని నిందిస్తున్నారు. సూడాన్ ఆర్మీలో 3 లక్షల మంది సైనికులతో వైమానిక బలగం కూడా దాని సొంతం. ఆర్ఎస్ఎఫ్లో లక్ష మంది సైనికులే ఉన్నారు. అయితే ఆర్ఎస్ఎఫ్కు సూడాన్ పశ్చిమ ప్రాంతంలో గిరిజన తెగల అండదండలు ఉన్నాయి. అంతర్జాతీయ సమాజం కూడా ఇద్దరు బలవంతులు కొట్టుకుంటూ ఉంటే ఎలా స్పందించాలో తెలీక మౌనం వహిస్తోంది. మానవీయ సంక్షోభం రాకుండా చర్యలు తీసుకోవాలని వారికి సలహా ఇవ్వడం మినహా మరేమీ చేయలేకపోతోంది. సూడాన్ జనాభా: 4.6 కోట్లు కాల్పులు జరుగుతున్న ప్రాంతంలో నివసిస్తున్నవారు: 1.2 కోట్లు మానవీయ సాయం కావాల్సిన వారు: 1.6 కోట్ల ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారు: 1.17 కోట్లు – సాక్షి, నేషనల్ డెస్క్ -
నువ్వా? నేనా?.. సైకిల్ పార్టీలో ఏం జరుగుతోంది?
గత ఎన్నికల్లో సీమలో తెలుగుదేశం పార్టీ రెండు సీట్లు గెలుచుకున్న జిల్లా అది. ఈసారి ఒకటి కూడా కష్టమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అటువంటి జిల్లాలోని ఓ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరాయి. వీలున్నప్పుడల్లా నువ్వా? నేనా అన్నట్లుగా ముష్టి యుద్ధాలకు దిగుతున్నారు. పచ్చపార్టీలో అనంత వివాదాలు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఫైట్ పీక్ స్టేజ్‌కు చేరింది. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఇద్దరు నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి.. కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు మధ్య చాన్నాళ్ళుగా ఆధిపత్య పోరు జరుగుతోంది. అనంతపురం జిల్లా టీడీపీలో వృద్ధ నేత హనుమంతరాయచౌదరి 2014 నుంచి 2019 దాకా కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో హనుమంతరావు చౌదరికి టిక్కెట్ నిరాకరించిన చంద్రబాబు.. ఉమామహేశ్వర నాయుడుని బరిలో దింపారు. గత ఎన్నికల్లో ఉమామహేశ్వర నాయుడు ఘోరంగా ఓడిపోయారు. సైకిల్‌కు ఫ్లెక్సీ వార్ ఉమామహేశ్వర నాయుడుకి జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. 2019లో ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి ఇప్పటివరకు.. టీడీపీ చేపట్టే అన్ని కార్యక్రమాలను ఉన్నం, ఉమా మహేశ్వరుడు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఎవరికి వారుగా ఫ్లెక్సీలు చేయించుకోవడం.. బలప్రదర్శన చేయడం.. ఒకరిపై మరొకరు బాహాటంగా విమర్శించుకోవటం కల్యాణదుర్గంలో సాధారణ విషయంగా మారింది. బహిరంగంగా కుస్తీలాట కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ పదవుల ఎంపిక జరుగుతోంది. కళ్యాణదుర్గంలోనే సమావేశం నిర్వహిస్తే రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతుందని భావించిన టీడీపీ అధిష్టానం ఆ సమావేశాన్ని అనంతపురంలో జరపాలని ఆదేశించింది. మాజీ మంత్రులు కాలువ శ్రీనివాస్, అమర్నాథ్ రెడ్డి, టీడీపీ జిల్లా ఇంఛార్జి బీటీ నాయుడు సమక్షంలో కళ్యాణదుర్గం పార్టీ సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే.. ఉన్నం హనుమంతరాయచౌదరి, ఉమామహేశ్వర నాయుడు పార్టీ పదవులు తమ వర్గానికే ఇవ్వాలని పట్టుబట్టారు. మాటల యుద్ధంతో ఇరు వర్గాలు రెచ్చిపోయాయి. వాగ్వాదం, తోపులాటలతో పాటు పరస్పరం కొట్టుకోవడం.. కుర్చీలు విసురుకోవడం జరిగింది. రెండు వర్గాలకు సర్ది చెపచెప్పేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు ముఖ్య నేతలు. దీంతో చేసేది లేక అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించారు. లాబీయింగ్ బాబు కళ్యాణదుర్గం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు పొందేందుకు మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరి తీవ్ర స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో తనకు గాని.. తన కొడుకు మారుతీ చౌదరికి గానీ టిక్కెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. మరోవైపు ఇంఛార్జి పదవిని కాపాడుకుంటూనే వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని ఉమా మహేశ్వర నాయుడు భావిస్తున్నారు. అందుకే ప్రతి విషయం లోనూ రెండు వర్గాలు బాహాబాహీకి దిగుతున్నాయి. నియోజకవర్గంలో నాయకులు అనుసరిస్తున్న తీరుపై పార్టీ కార్యకర్తలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
కేశినేని వర్సెస్ దేవినేని.. టీడీపీలో హాట్ టాపిక్..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: నందిగామ నియోజకవర్గంపై పూర్తిస్థాయి పట్టు తమకే ఉండాలని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), మాజీ మంతి దేవినేని ఉమామహేశ్వరరావు పోటాపోటీగా వ్యవహరిస్తుండటం జిల్లా తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. కేశినేని, దేవినేని వర్గ పేచీలు గత వారంగా చంద్రబాబు వద్ద వరుస పంచాయితీలు జరుగుతున్నాయి. చదవండి: డప్పు రమేష్ కన్నుమూత ఏ వర్గం తన వద్దకు వస్తే ఆ వర్గానికి మద్దతుగా మాట్లాడుతూ నిలకడలేని ఆలోచనలు, నిర్ణయాలతో చంద్రబాబే గందరగోళ రాజకీయ పరిస్థితులకు కారకులవుతున్నారని సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. నందిగామతో మొదలైన రచ్చ ఇతర నియోజకవర్గాల ఇంఛార్జులను మార్చాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయని, ఈ పరిణామాలు పార్టీలో అనిశ్చితికి దారితీస్తున్నాయని పెదవి విరుస్తున్నారు. తమ అనుయాయులను అడ్డుగా పెట్టుకుని రిజర్వుడు నియోజకవర్గంలో పెత్తనంపై వారివురి పేచీ ఏంటని సీనియర్లు నిలదీస్తున్నారు. నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు, సోదరులైన మొండితోక జగన్మోహన్రావు, అరుణ్‌కుమార్‌లు ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్నింటా వేగంగా స్పందిస్తున్నారని, పార్టీ పరంగా పూర్తిగా బలపడిపోయారని, వారిని ధీటుగా ఎదుర్కొనే స్థితిలో సౌమ్య లేరని ఎంపీ కేశినేని చంద్రబాబునాయుడు వద్ద ప్రస్తావించి ఆమెను మార్చాలంటూ పట్టుపట్టారనేది సమాచారం. మరో ఇంఛార్జిని ఎంపికచేసుకునే వరకు విజయవాడకు చెందిన తమ సామాజికవర్గానికే చెందిన గన్నె వెంకట నారాయణ ప్రసాద్ (అన్న)కు నియోజకవర్గ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదించారు. కేశినేనితో పాటు విజయవాడ జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, అన్న, బొమ్మసాని సుబ్బారావు తదితరులను వెంట పెట్టకుని వెళ్లడంతో చంద్రబాబు అంగీకరించారు. ఈ విషయం తెలుసుకున్న దేవినేని ఉమా తంగిరాల సౌమ్యతో పాటు నందిగామ నియోజకవర్గంలోని పలువురు నాయకులను వెంటపెట్టుకుని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఉన్న చంద్రబాబు వద్దకు వెళ్లి ససేమిరా కుదరదని, సౌమ్యనే ఇంఛార్జిగా కొనసాగించాలని పట్టుపట్టడంతో అందుకు కూడా పార్టీ అధినేత అంగీకరించారని చెపుతున్నారు. తాము వెళ్లినప్పుడు అన్నాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి మళ్లీ మాటమార్చడంపై కేశినేని వర్గం కినుక వహించిందని సమాచారం. ఈ వ్యవహారం నందిగామతో ఆగలేదని తిరువూరు ఇంఛార్జి అంశం కూడా రచ్చకెక్కిందని చెపుతున్నారు. గతంలో స్వామిదాసు ఉండగా ఆయన స్థానంలో చావల దేవదత్తుకు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు. తాజాగా జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి వాసం మునెయ్యను ఇంఛార్జిగా నియమించాలని కేశినేని నాని ప్రతిపాదిస్తున్నారు. అదేవిధంగా జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల ఇంఛార్జుల మార్పు అంశాన్ని కూడా చంద్రబాబు వద్ద ఎంపీ ప్రస్తావించారని చెపుతున్నారు. లోక్‌సభ నియోజకవర్గం నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఏడు శాసనసభ స్థానాల బాధ్యతలను అప్పజెపితే అన్నింటినీ చక్కబెడతాననేది కేశినేని నాని తన వాదనగా వినిపిస్తుండగా ఆయన వ్యతిరేకవర్గంగా ఇప్పటికే వ్యవహరిస్తున్న దేవినేని ఉమ, బొండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా, తంగిరాల సౌమ్య తదితరులు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. -
ఊ అంటావా బాబూ.. ఉఊ అంటావా..
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి): తెలుగుదేశం పార్టీలో ఇద్దరు కీలక నేతల మధ్య వర్గ పోరు తమ్ముళ్లకు తలపోటుగా మారింది. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న కాకినాడ రూరల్ నియోజకవర్గంపై పెత్తనం కోసం ఎవరికి వారే పావులు కదుపుతున్నారు. పార్టీలో నంబర్–2గా చలామణీ అవుతున్న ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పలు రూరల్ పారీ్టలో అగ్గి రాజేస్తున్నారని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వారిద్దరూ నియోజకవర్గంలో నివాసం, క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని అతిథి పాత్ర పోషిస్తున్నారు. పారీ్టలో వర్గాలకు ఊతమిస్తున్నారు. వారిద్దరి మధ్య జరుగుతున్న ఈ పోరు చివరకు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి తప్పించే దశకు చేరింది. చదవండి: సినీ దర్శకులను ఆకర్షిస్తున్న ఉప్పాడ బీచ్‌రోడ్డు తద్వారా ఆమెకు, ఆమె భర్త, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి(సత్తిబాబు)కు చెక్ పెట్టాలని రాజప్ప వర్గం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా తనకు అనుకూలుడైన నాయకుడిని నియమించుకోవాలనేది రాజప్ప వ్యూహంగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఆయన తెర వెనుక చాలాకాలంగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో పిల్లి దంపతులను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాలంటూ అధిష్టానం వద్ద యనమల పట్టుబడుతున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కూడా పిల్లి వర్గానికి వెన్నుదన్నుగా ఉండేవారు. భాస్కర రామారావు మరణానంతరం సత్తిబాబు వర్గానికి పార్టీలో యనమల ఒక్కరే పెద్ద దిక్కుగా మిగిలారు. చంద్రబాబుకు సత్తిబాబు వైరి వర్గం ఫిర్యాదు సత్తిబాబును వ్యతిరేకించే నాయకులందరూ తాజాగా ఒక్కటయ్యారు. సత్తిబాబు దంపతులను పార్టీ ఇన్చార్జిగా తప్పించాలనేదే వారందరి ఉమ్మడి లక్ష్యం. ఇదే అవకాశంగా రాజప్ప వర్గీయులు తెర వెనుక పావులు కదుపుతున్నారని ఆ పార్టీలో ముమ్మర ప్రచారం జరుగుతోంది. ఇందుకు బలం చేకూర్చేలా సత్తిబాబును వ్యతిరేకించే రూరల్ నేతలు పార్టీ అధినేత చంద్రబాబును శుక్రవారం కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సత్తిబాబు పార్టీ కోసం ఏ కోశానా పని చేయడం లేదని వారు ఆధారాలతో నివేదించారు. కాకినాడ కార్పొరేషన్లో పలు డివిజన్లకు ఉప ఎన్నికలు జరిగాయి. రూరల్ నియోజకవర్గం పరిధిలోని 3వ డివిజన్‌కు టీడీపీ అభ్యర్థి నామినేషన్ వేసినప్పటికీ తరువాత ఉపసంహరించుకున్నారు. ఈ విషయంలో సత్తిబాబుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన అంగీకారంతోనే నామినేషన్ ఉపసంహరించుకున్నట్టు చంద్రబాబుకు నాయకులు ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర నుంచి ఇటీవలి కాకినాడ కార్పొరేషన్ ఉప ఎన్నికల వరకూ పార్టీ అభ్యర్థులు బరిలో లేకుండా చేసి, టీడీపీకి సత్తిబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సత్తిబాబు దంపతులను ఇన్చార్జిగా ఎలా కొనసాగిస్తారని చంద్రబాబును గట్టిగానే నిలదీశారని సమాచారం. వారిని ఇన్చార్జిగా తప్పించకుంటే రూరల్‌లో పార్టీకి అడ్రస్సే లేకుండా పోతుందనే వాదనను బాబు ముందుకు తీసుకువెళ్లారు. మరోపక్క ఇటీవల పార్టీ పిలుపు మేరకు ఓటీఎస్‌కు వ్యతిరేకంగా ఇరు వర్గాలూ విడివిడిగానే ధర్నాలు చేయడం గమనార్హం. పేరాబత్తుల రాజశేఖర్, మామిడాల వెంకటేష్, పెంకే శ్రీనివాసబాబా తదితర నేతలను చినరాజప్ప వర్గం ఎగదోస్తోందని పార్టీలో ఒక చర్చ జరుగుతోంది. బీసీ సామాజికవర్గానికి చెందిన అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతులను తప్పించి, సొంత సామాజికవర్గానికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించే వ్యూహంలో భాగంగానే రాజప్ప ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. టీ కప్పులో తుపానేనా! గతంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు, వివాదాలు కాకినాడ రూరల్ టీడీపీలో జరిగాయి. అయితే అవి టీ కప్పులో తుపాను మాదిరిగానే చల్లారిపోయాయి. ఇన్చార్జిగా తప్పుకొని, కార్యకర్తగా కొనసాగుతానని సత్తిబాబు గతంలో ఒక సందర్భంలో పత్రికా ముఖంగా ప్రకటించడం తెలిసిందే. కానీ అంతలోనే ప్లేటు ఫిరాయించేశారు. అధిష్టానం మాట ప్రకారం కొంత కాలం కొనసాగుతానని చెప్పారు. నియోజకవర్గంపై పెత్తనం కోసమే చినరాజప్ప, ఆయన వర్గం తెర వెనుక ఇదంతా జరిపిస్తున్నారని ఆ సందర్భంగా సత్తిబాబు పేర్కొనడం గమనార్హం. అప్పటి నుంచి శుక్రవారం నాటి చంద్రబాబు భేటీ వరకూ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే.. రూరల్ నియోజకవర్గ పార్టీ సమీక్షకు సత్తిబాబు దంపతులు గైర్హాజరయ్యారని అంటున్నారు. మరోపక్క సత్తిబాబు పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ, నియోజకవర్గంలో ఆయన పెత్తనం లేకుండా చేయాలనే గట్టి పట్టుదలతో వైరి వర్గానికి చినరాజప్ప వ్యూహాత్మకంగా సహకరిస్తున్నారనే వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఈ విషయంలో అధిష్టానం కూడా ఇన్చార్జి మార్పునకే మొగ్గు చూపుతున్నట్టు టీడీపీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఇన్చార్జి పదవి ఆశిస్తున్న నేతలందరూ కట్ట కట్టుకుని మరీ వెళ్లి సత్తిబాబు దంపతులపై ఫిర్యాదుల చిట్టాను చంద్రబాబు ముందు పెట్టడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది. అయితే ఇన్చార్జి మార్పునకు చంద్రబాబు “ఊ అంటారా.. ఉఊ అంటారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. -
చిత్తూరు జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు
మదనపల్లె (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పర్యటనలో బహిర్గతమైంది. మదనపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్గా మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆధిపత్యాన్ని సహించేది లేదని మరోవర్గం ప్రకటించింది. ఆదివారం సోమిరెడ్డి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి మదనపల్లెకి వచ్చారు. ఈ సందర్భంగా అన్నమయ్య సర్కిల్లోని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ తన గెస్ట్‌హౌస్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ గెస్ట్‌హౌస్ మాజీ సైనికుల నుంచి కబ్జా చేసిన స్థలం అని దీనిపై కోర్టులో కేసు నడుస్తోందని, అలాంటి చోట సమావేశాలు నిర్వహిస్తే తాము రాలేమని టీడీపీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు అధినాయకులకు చెప్పారు. సమావేశాన్ని అక్కడ కాకుండా వేరెక్కడైనా ఏర్పాటు చేస్తే పాల్గొంటామని తెలిపారు. అయితే తన ప్రత్యర్థి వర్గం వాదనలకు విలువివ్వకుండా తన గెస్ట్‌హౌస్‌లోనే రమేష్ సమావేశం ఏర్పాటు చేయడంతో శ్రీరామ్‌చినబాబు, బాబురెడ్డి, టౌన్‌బ్యాంక్ మాజీ చైర్మన్ విద్యాసాగర్, మైనారిటీ నేతలు మస్తాన్, పఠాన్‌ఖాదర్ ఖాన్, దొరస్వామినాయుడు తదితరులు సమావేశాన్ని బహిష్కరించారు. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో సోమిరెడ్డి హడావుడిగా సమావేశాన్ని ముగించి ప్రత్యర్థి వర్గంతో బుజ్జగింపులు మొదలుపెట్టారు. అవి ఫలించకపోవడంతో ఆయన వెనుదిరిగారు. -
బ్రహ్మంగారి మఠం: తెగని పంచాయితీ, చర్చలు విఫలం
సాక్షి, వైఎస్సార్ కడప: కాలజ్ఞాని పోతులూరి శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి మఠం పరిధిలో ఉన్న కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపత్యం వివాదంలో జరపుతున్న చర్చలు విఫలమయ్యాయి. శివైక్యం చెందిన 11వ మఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాముల వారి రెండు కుటుంబాల మధ్య ఎంత ప్రయత్నించినా సయోధ్య కుదరడం లేదు. పీఠాధిపత్యం విషయంలో చర్చలు కొలిక్కిరావడం లేదు. మఠం పీఠాధిపతి పదవికి తానే అర్హుడని వసంత వెంకటేశ్వరస్వాములు పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి పట్టుడుతుండగా.. తనను మఠం మాతృశ్రీగా నియమించాలన్న రెండో భార్య మహాలక్ష్మమ్మ డిమాండ్ చేస్తోంది. వీరితోపాటు తనకూ ప్రాధాన్యం ఇవ్వాలంటూ మొదటి భార్య రెండో కుమారుడు వీరభద్రస్వామి అంటున్నాడు. ఇదిలా ఉండగా డబ్బు, బంగారం, స్థిర, చరాస్తులు భారీగా ఉండటం, తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ కీర్తి ప్రతిష్టలు, మఠాధిపతిగా గౌరవం, పలుకుబడి ఉండడంతో పీఠానికి డిమాండ్ పెరిగింది. నేనంటే.. నేనే వసంత వెంకటేశ్వరస్వాములు పెద్ద భార్యకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె కాగా పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి మఠాధిపత్యం కోరుకుంటున్నారు. ఆయన న్యాయ విద్య పూర్తి చేశారు. పెద్ద భార్య చంద్రావతమ్మ మరణంతో వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాములు 63 సంవత్సరాల వయసులో ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన 24 ఏళ్ల వయసున్న మారుతి మహాలక్షుమ్మను వివాహమాడారు. వివాహానంతరం ఆమెకు ఇద్దరు కుమారులు జన్మించారు. వీరిద్దరూ మైనర్లు. పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి(53), రెండో భార్య పెద్ద కుమారుడు గోవిందస్వామి(9)ల మధ్య పీఠాధిపత్యంలో పోటీ నెలకొంది. గోవిందస్వామి మేజర్ అయ్యేంత వరకు తాను ప్రస్తుతం మఠం బాధ్యతలను తాత్కాలికంగా స్వీకరిస్తానంటూ రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ పోటీలోకి రావడం వివాదం నెలకొంది. మారుతి మహాలక్షుమ్మకు మఠం మేనేజర్ ఈశ్వరయ్యతోపాటు స్థానిక విలేకరి కుటుంబ సభ్యులు, బెంగళూరులో ఐఏఎస్ అకాడమీ నిర్వహిస్తున్న ఆమె సమీప బంధువులు మద్దతు పలుకుతున్నారు. మరోవైపు వెంకటాద్రిస్వామికి స్థానిక ప్రజాప్రతినిధితో పాటు వారి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యులు, బద్వేలు కోర్టులో పనిచేస్తున్న మరికొందరు న్యాయవాదులు మద్దతుగా నిలిచారు. చదవండి: శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి మఠాధిపత్యం కోసం ఇరువర్గాల పోరు -
ఆధిపత్యంపై ‘పీఠ’ముడి!
సాక్షి ప్రతినిధి, కడప: కాలజ్ఞాని పోతులూరి శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి మఠం పరిధిలో ఉన్న కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై ఆధిపత్య పోరు నెలకొంది. డబ్బు, బంగారం, స్థిర, చరాస్తులు భారీగా ఉండటం, తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ కీర్తి ప్రతిష్టలు, మఠాధిపతిగా గౌరవం, పలుకుబడి ఉండడంతో పీఠానికి డిమాండ్ పెరిగింది. మఠం పరిధిలో కడప, కర్నూలు, అనంతపురం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రూ.10 కోట్లు విలువజేసే 84.24 ఎకరాల భూములున్నాయి. వీటిపై వచ్చే కౌలుతోపాటు దేవస్థానం పరిధిలోని వివిధ దుకాణాల కోసం కేటాయించిన గదుల ద్వారా ఏటా మఠానికి సుమారు రూ.4 కోట్ల మేర రాబడి వస్తున్నట్లు చూపిస్తున్నా వాస్తవానికి రెట్టింపు రాబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండడం, ఆ మొత్తాన్ని ఇష్టానుసారంగా ఖర్చు చేసే అధికారాలు ఉండడంతో వీరబ్రహ్మేంద్రస్వామి మఠం 12వ పీఠాధిపత్యం కోసం పోటీ ఏర్పడింది. మఠానికి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున కానుకలు పంపుతుంటారు. వీరబ్రహ్మేంద్రస్వామి భక్తుడైన గాలి జనార్దన్‌రెడ్డి మఠం అభివృద్ధికి డబ్బులు వెచ్చించి సొంతంగా పలు భవనాలు కట్టించారు. ఇద్దరూ.. ఇద్దరే శివైక్యం చెందిన 11వ మఠాధిపతి శ్రీవీరభోగ వసంత వెంకటేశ్వరస్వాముల వారి మొదటి భార్య కుమారుడితోపాటు రెండో భార్య మారుతి మహాలక్షుమ్మలు మఠాధిపత్యం కోసం పోటీ పడుతున్నారు. అవసరమైతే న్యాయస్థానానికి వెళ్లేందుకూ సిద్ధపడుతున్నారు. ఇద్దరికీ స్థానిక నేతలతోపాటు బంధుగణం, సన్నిహితులు మద్దతు పలుకుతూ వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నారు. వసంత వెంకటేశ్వరస్వాములు పెద్ద భార్యకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె కాగా పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి మఠాధిపత్యం కోరుకుంటున్నారు. ఆయన న్యాయ విద్య పూర్తి చేశారు. పెద్ద భార్య చంద్రావతమ్మ మరణంతో వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాములు 63 సంవత్సరాల వయసులో ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన 24 ఏళ్ల వయసున్న మారుతి మహాలక్షుమ్మను వివాహమాడారు. ఆమెది నిరుపేద కుటుంబం. వివాహానంతరం ఆమెకు ఇద్దరు కుమారులు జన్మించారు. మారుతి మహాలక్షుమ్మకు మఠం మేనేజర్ ఈశ్వరయ్యతోపాటు స్థానిక విలేకరి కుటుంబ సభ్యులు, బెంగళూరులో ఐఏఎస్ అకాడమీ నిర్వహిస్తున్న ఆమె సమీప బంధువులు మద్దతు పలుకుతున్నారు. మరోవైపు వెంకటాద్రిస్వామికి స్థానిక ప్రజాప్రతినిధితో పాటు వారి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యులు, బద్వేలు కోర్టులో పనిచేస్తున్న మరికొందరు న్యాయవాదులు మద్దతుగా నిలిచారు. స్వయం ప్రతిపత్తితో.. మఠం స్వయం ప్రతిపత్తితో నడుస్తోంది. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదు. మఠాధిపతులు నచ్చినట్లుగా ఖర్చు చేయవచ్చు. ఏడాదికి ఒకసారి రాబడి, ఖర్చులను దేవదాయశాఖకు వెల్లడించాలి. మఠం పరిధిలో 46 మంది ఉద్యోగులు ఉండగా జీతాల కింద నెలకు రూ.6 లక్షలు ఖర్చవుతోంది. మఠాధిపతికి నెలకు రూ. 40 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. బ్రహ్మంగారి ఆరాధన, మహా శివరాత్రి, బ్రహ్మంగారి జయంతి, దసరా ఉత్సవాల కోసం ఏటా రూ.50 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏటా రాబడిలో దేవదాయశాఖకు కాంట్రిబ్యూషన్ కింద 8 శాతం, ఆడిటింగ్ ఫీజు 1.05 శాతం, సీజీఎఫ్ 9 శాతం, అర్చక వెల్ఫేర్ 8 శాతం చొప్పున చెల్లిస్తున్నారు. మఠం స్థిరాస్తుల వివరాలు – కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలోని కేతారంలో 50 సెంట్లు – గుంటూరు జిల్లా ఎల్లలూరులో 50 సెంట్లు, నగరంలో 1.10 ఎకరాలు, కంతేరులో 1.16 ఎకరాలు – ప్రకాశం జిల్లా రెడ్డిచర్లలో 16 సెంట్లు, పల్లెగుట్టపల్లెలో 6.43 ఎకరాలు – అనంతపురం జిల్లా చలివెందులలో 27 సెంట్లు – వైఎస్సార్ జిల్లా సోమిరెడ్డిపల్లెలో 18 ఎకరాలు, చీపాడులో 2.26 ఎకరాలు, పెద్ద గురవలూరులో 1.18 ఎకరాలు, మడూరులో 2.96 ఎకరాలు, వాసుదేవపురంలో 68 సెంట్లు, ఉప్పరపల్లెలో 1.19 ఎకరాలు, రంగాపురంలో 10.57 ఎకరాలు, దుంపలగట్టులో 1.93 ఎకరాలు, నందిపల్లెలో 1.93 ఎకరాలు, చెన్నూరు ఉప్పరపల్లెలో 50 సెంట్లు, పెద్దపుత్తలో 78 సెంట్లు, పైడికాల్వలో 60 సెంట్లు, బుగ్గరాపురంలో ఒక ఎకరా, సంకటితిమ్మాయపల్లెలో 2.24 ఎకరాలు. – కర్నూలు జిల్లా నరసాపురంలో 4.57 ఎకరాలు, ఆలమూరులో 7.60 ఎకరాలు – కర్నూలు జిల్లాలోని భూములతోపాటు వైఎస్సార్ జిల్లా శోస్తి వెంగన్నపల్లెలో 1.10 ఎకరాల భూములు కోర్టు వివాదంలో ఉన్నాయి. బంగారం, వెండి, ఎఫ్డీలు – మఠం పరిధిలో 3.20 కిలోల బంగారం, 142 కిలోల వెండి ఉంది. – దుకాణాల బాడుగలపై ఏటా రూ. 6 లక్షల ఆదాయం – పలు బ్యాంకుల్లో రూ. 12 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు – తలనీలాలు, హుండీ ఆదాయం, టెంకాయల వేలం ద్వారా రాబడి -
రెవెన్యూపై ‘అధికార’ పెత్తనం
రెవెన్యూ శాఖపై అధికార పార్టీ నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. పాలనలో కీలకమైన రెవెన్యూ వ్యవస్థను తమ గుప్పెట్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా ప్రభుత్వ ఆçస్తులు దోచుకునేందుకు ఆ పార్టీ నేతలు ఇప్పటికే పాలనలో తల దూర్చి చక్రం తిప్పుతున్నారు. తమ మాట వినని తహసీల్దార్లను బదిలీ చేయించి, వారి స్థానాల్లో డిప్యూటీ తహసీల్దార్లను నియమించుకుని పెత్తనం చేస్తున్నారు. రెవెన్యూ శాఖను అధికార పార్టీ నాయకులు చేతి రుమాలుగా వాడేసుకుంటున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు. నెల్లూరు(పొగతోట): రెవెన్యూ శాఖలో రాజకీయ బదిలీలు ప్రారంభమయ్యాయి. తహసీల్దార్లను బదిలీలు చేసి వారి స్థానంలో డిప్యూటీ తహసీల్దార్ల (డీటీ)లను ఇన్చార్జిలుగా నియమిస్తున్నారు. ఉదయగిరి, కావలి, వెంకటగిరి నియోజకవర్గాల్లో ఈ తంతు జరుగుతోంది. కలిగిరి తహసీల్దార్ మూడు నెలల కిందట పదవి విరమణ చేశారు. కొంత కాలం తర్వాత ఉషాను కలిగిరి తహసీల్దార్‌గా నియమించారు. అధికార పార్టీ నాయకులు చక్రం తిప్పడంతో ఆమెను కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. అక్కడే పని చేస్తున్న డీటీని ఇన్చార్జి తహసీల్దార్‌గా నియమించారు. జలదంకి తహసీల్దార్‌ను బదిలీ చేయమని అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు చేస్తున్నారు. త్వరలో జలదంకి తహసీల్దార్‌కు రాజకీయ బదిలీ తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఉదయగిరి తహసీల్దార్‌ను జాయిన్ చేసుకోవద్దంటూ ఒత్తిళ్లు చేశారు. చివరికి వారం రోజుల తర్వాత తహసీల్దార్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో వీఆర్ఓ, ఆర్ఐ, జూనియర్, సినియర్ అసిస్టెంట్, డీటీ తహసీల్దార్లు అధికార పార్టీ నాయకులు అనుమతి లేనిదే బాధ్యతలు స్వీకరించే పరిస్థితి లేదు. అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా ఉండే వారిని కావాల్సిన మండలాలకు బదిలీలు చేయించుకుంటున్నారు. వీరు చెప్పిన పనులు చేయకపోతే ఒత్తిళ్లు తీసుకువచ్చి బదిలీలు చేయిస్తున్నారు. త్వరలో రెండు మూడు మండలాల్లో రాజకీయ బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. గోడకు కొట్టిన బంతిలా తహసీల్దార్ల పరిస్థితి జిల్లాలో 46 మండలాలు ఉన్నాయి. కలిగిరి మండలం తప్ప మిగతా అన్ని మండలాల్లో తహసీల్దార్లు ఉన్నారు. 46 మండలాలు, ప్రత్యేక పోస్టులు కలిపి జిల్లాలో 67 మంది తహసీల్దార్లు ఉన్నారు. రెండు ప్రత్యేక తహసీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నెలాఖరుకు నాయుడుపేట తహసీల్దార్, వచ్చే నెలలో టీపీగూడూరు తహసీల్దారు పదవీ విరమణ చేయనున్నారు. రేషన్‌కార్డులు, ఓటు నమోదు, తొలగింపులు, భూములు, నివాస స్థలాలు ఇతర పథకాల అమలు చేయడంలో రెవెన్యూ శాఖది కీలక స్థానం. ఆయా కార్యక్రమాలు అమలు చేయడంలో తహసీల్దార్లు, డీటీలు, ఆర్ఐలు, వీఆర్ఓల పాత్ర ప్రధానం. దీంతో అధికార పార్టీకి అనుకూలంగా పని చేసే వారిని నియమించుకునేందుకు నాయకులు చక్రం తిప్పుతున్నారు. కీలక పోస్టులు దక్కించుకోవడానికి రెవెన్యూ ఉద్యోగులు గతంలో అధికార పార్టీ నాయకులు చుట్టు ప్రదక్షణలు చేశారు. తహసీల్దార్లను బదిలీలు చేసిన ఆయా ప్రాంతాల అధికార పార్టీ నాయకుల అనుమతి ఇవ్వనిదే బాధ్యతలు స్వీకరించే అవకాశం లేదు. మండలాలకు బదిలీలు చేసిన తర్వాత ఇతను మాకు వద్దు మరొక అధికారిని నియమించమని జిల్లా అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్నారు. ప్రస్తుతం సీజేఎఫ్ఎస్, డాట్ భూములు ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. సీజేఎఫ్ఎస్ కమిటీలను రద్దు చేసి లబ్ధిదారులకు పట్టాలు మంజూరు చేయనున్నారు. సీజేఎఫ్ఎస్ భూములు బినామీల పేర్లపై పట్టాలు మంజూరు చేయించుకునేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. దగదర్తి, అల్లూరు, బోగోలు తదితర మండలాల్లో వందల ఎకరాల సీజేఎఫ్ఎస్ భూములు బినామీల పేర్లతో పట్టాలు మంజూరు చేయించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 2019 ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని తహసీల్దార్లు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు బదిలీలు చేస్తారు. ఈ లోపు అధికార పార్టీకి అనుకూలంగా పనులు చేయించుకునేందుకు అడ్డుగా ఉండే తహసీల్దార్లను బదిలీలు చేయించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బదిలీలు చేయకూడదని నిబంధనలు ఉన్నాయి. నిబంధనలు పక్కన పెట్టి పరిపాలన సౌలభ్యం కోసం బదిలీలు చేసేలా చర్యలు చేపడుతున్నారు. త్వరలో జలదంకి మండలంతో పాటు రెండు. మూడు మండలాల్లో రాజకీయ బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
ఆర్జేడీలో అన్నదమ్ముల పోరు?
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో ఆధిపత్య పోరు మొదలైన సూచనలు కనిపిస్తున్నాయి. లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ చేసిన ట్వీట్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. చిన్న విషయాన్ని భూతద్దంలో చూడవద్దని చిన్న కొడుకు తేజస్వీయాదవ్ పార్టీ శ్రేణులను కోరినప్పటికీ ఇద్దరి మధ్య అంతరం పెరిగిన సూచనలు కనిపిస్తున్నాయి. ‘అర్జునుడిని హస్తినాపురం సింహాసనంపై కూర్చోబెట్టి ద్వారకకు తిరిగెళ్లిన కృష్ణుడిలా ఉండాలనుకుంటున్నా’ అని తేజ్ ప్రతాప్ ట్వీట్ చేశారు. దాంతో ఎన్నికల అనంతరం సోదరుడు తేజస్వీయాదవ్‌ను ముఖ్యమంత్రిగా చేసి, ఆ తరువాత ఆయన రాజకీయాల నుంచి రిటైర్ కానున్నారనే వార్తలు ఆర్జేడీ వర్గాల్లో వ్యాపించాయి. అనంతరం తేజ్ ప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను పార్టీలోనే కొనసాగుతా. ఆర్జేడీని స్థాపించిన మా తండ్రి, ఈ స్థాయికి తీసుకువచ్చేందుకు ఎంతో శ్రమించారు. కొందరు లోపలి వ్యక్తుల కారణంగా పార్టీకి హాని కలుగుతోంది. అవి సంఘ వ్యతిరేక శక్తులు. వాళ్లు మా తల్లిదండ్రులు, తేజస్వీ, మిసా(సోదరి, రాజ్యసభ ఎంపీ), నా పేరు వాడుకుని స్వార్థం కోసం పార్టీని నాశనం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. దీనిపై తేజస్వీ స్పందిస్తూ..‘మా అన్నతో నాకు అభిప్రాయ భేదాలున్న మాట అవాస్తవం. తేజ్‌ప్రతాప్ నాకు సోదరుడు, మార్గదర్శకుడు. చిన్న విషయాలను పెద్దగా చూడొద్దు’ అని అన్నారు. -
అధికార పార్టీలో ఆధిపత్య పోరు!
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్లో సంస్థాగతంగా ఆధిపత్య పోరు సాగుతోందా..? అధికార పార్టీ హోదాతో తమకేదో జరిగిపోతుందని ఆశపడిన కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారా..? పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం, జిల్లాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ ప్రశ్నలకు అవుననే సమధానం ఇస్తున్నాయి! గడిచిన పధ్నాలుగేళ్లుగా ఒకే పార్టీలో సహచరులుగా కొనసాగిన నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్టు సమాచారం. వీరిలో కొందరికి ఉన్నత పదవులు దక్కడం, మరికొందరికి ఏవో కొన్ని పదవులు దక్కినా ప్రోటోకాల్ ప్రకారం వెనకపడడం వంటివి నేతల మధ్య అంతరాలకు కారణంగా చెబుతున్నారు. ఫలితంగా ఒకరంటే ఒకరికి పొసగని పరిస్థితి తలెత్తింది. దీంతో ఆయా నేతలను అనుసరిస్తున్న కార్యర్తలూ రెండు వర్గాలు విడిపోయారు. అలాగే పార్టీలో కొత్తగా చేరిన నాయకులు, వారిని అనుయాయులకు, పాత వారి మధ్య సఖ్యత కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక విధంగా జిల్లాల్లో నాయకులు ఎవరికి వారుగా రాజకీయం నడుపుతున్నాని విశ్లేషిస్తున్నారు. మంత్రులదే హవా.. మెజారిటీ జిల్లాల్లో మంత్రులదే ఇష్టారాజ్యంగా నడుస్తోంద న్న అభిప్రాయం ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నామమాత్రంగా మారారని, ప్రతీ పనికి మంత్రి ఆమోదం ఉంటే కానీ సంబంధిత అధికారులు పలకడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా అంతోఇంతో ఆర్థికంగా నిలదొక్కునేందుకు నేతలు చేస్తున్న ప్రయత్నాలకూ మంత్రులు మోకాలడ్డుతున్నట్టు సమాచారం. ఇద్దరు మంత్రులు ఉన్న జిల్లాల్లో ఆధిపత్య పోరు తక్కువగా ఉన్నా.. ఒకే మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాల్లో అభిప్రాయ భేదాలు తారస్థాయికి చేరాయంటున్నారు. అధికార పార్టీ నేతలు ఎంత కాదని చెబుతున్నా.. చెరువుల పూడిక తీత కోసం మొదలు పెట్టిన మిషన్ కాకతీయ పథకంలో అత్యధిక పనులు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల అనుచరులకు, వారు చెప్పిన వారికే దక్కాయి. కానీ కొందరు మంత్రులు అడ్డం పడిన చోట మాత్రం ఇది సాధ్యం కాలేదు. దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాల్లో ఒక ఎమ్మెల్సీ తన కార్యకర్తలకు ఒకటీ, అరా పనులు ఇప్పించుకున్నారు. ఇది అక్కడ్నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేకు గిట్టలేదు. మిషన్ కాకతీయ పనులు ఎట్టి పరిస్థితుల్లో సదరు ఎమ్మెల్సీ అనుచరులకు ఇవ్వొద్దని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. చివరకు ఈ పంచాయితీ సాగునీటి శాఖ మంత్రి పేషీకి చేరినా ఉపయోగం లేకుండా పోయిందని సమాచారం. తలలు పట్టుకుంటున్న ద్వితీయ శ్రేణి నేతలు రాష్ట్రస్థాయిలోనే ఇద్దరు మంత్రులు రెండు వర్గాలుగా ఉంటున్నారన్న ప్రచారం పార్టీలో ఉంది. ఈ ఇద్దరికీ అనుచరులు వేర్వేరుగా ఉన్నారు. ఈ ప్రభావం కింది స్థాయి దాకా ఉందని, నాయకుల మధ్య సయోధ్య లేక పోవడం తమకు ఇబ్బందిగా మారిందని, పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. ఒక మంత్రి తన సహచరులకు, చివరకు తన సొంత నియోజకవర్గం వారికీ స్వేచ్ఛగా ఏ పనీ చేయలేని పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఉత్తర తెలంగాణలోని ఒక జిల్లాలోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లోనూ ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ ఇబ్బందులను పార్టీ అధినేత దృష్టికి తీసుకుపోలేక, కార్యకర్తలకు సర్ది చెప్పుకోలేక సతమతమవుతున్నామని నాయకులు వాపోతున్నారు. చివరకు జిల్లాల్లో పార్టీకి కొత్త కార్యవర్గాలనూ నియమించలేని పరిస్థితి ఉంది. ‘రాష్ట్ర స్థాయిలోనే కమిటీలను వేయలేదు. జిల్లాలో అవసరమా’ అని పార్టీ మొత్తాన్ని చెప్పుచేతల్లో పెట్టుకున్నారని, జిల్లా అధ్యక్షులు కూడా నామమాత్రంగా మారారని కొందరు నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు.