అశోక్‌రెడ్డి పక్కనే ఉన్న హతుడు మునెయ్య (వృత్తంలో ఉన్న వ్యక్తులు)
ప్రకాశం: టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు, వ్యక్తిగత విభేదాలు వెరసి ఓ వర్గానికి చెందిన నాయకుడి హత్యకు దారితీశాయి. సోమవారం రాత్రి గిద్దలూరు మండలం గడికోట పంచాయతీ పరిధిలోని పరమేశ్వరనగర్‌లో టీడీపీకి చెందిన నలుగురు వ్యక్తులు కలిసి అదే పార్టీకి చెందిన పాముల మునెయ్య(35) అనే వ్యక్తిపై గొడ్డలితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
ఈ ఘటనతో వైఎస్సార్ సీపీ నాయకులకు ఎలాంటి సంబంధం లేకపోయినా టీడీపీ నేతలు హత్యా రాజకీయానికి తెరలేపారు. గిద్దలూరు టీడీపీ ఇన్‌చార్జి ఎం.అశోక్‌రెడ్డి హడావుడిగా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వైఎస్సార్ సీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా విష ప్రచారానికి పూనుకున్నారు. హంతకులు, హతుడు ఇద్దరూ టీడీపీ నాయకులే అయినప్పటికీ వాస్తవాలను కప్పి పుచ్చి అబద్ధాలు ప్రచారం చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
టీడీపీ నేత అశోక్‌రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్న నిందితుడు అల్లూరయ్య
ఇవిగో వాస్తవాలు..
పరమేశ్వరనగర్‌కు చెందిన పాముల మునెయ్య(35)కు తన సమీప బంధువు అయిన గుండాల అల్లూరయ్యకు వ్యక్తిగత విభేదాలున్నాయి. పలు సందర్భాల్లో వారి మధ్య ఘర్షణ కూడా చోటుచేసుకుంది. ఈ క్రమంలో పాముల మునెయ్య స్నేహితుడైన ఓబులాపురం తండా నివాసి రామాంజనేయులు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జామాయల్ కర్ర కొట్టుకొచ్చాడు.
దీనిపై ఈ నెల 14వ తేదీన అటవీశాఖ అధికారులకు సమాచారం అందడంతో జామాయిల్ తోటను పరిశీలించి నిందితుడైన రామాంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. అతడికి జరిమానా కూడా విధించారు. అయితే, అల్లూరయ్య ఇచ్చిన సమాచారంతోనే రామాంజనేయులును అటవీశాఖ అధికారులు పట్టుకున్నారని ఆగ్రహించిన మునెయ్య దుర్భాషలాడాడు. అదీగాక గ్రామంలోని పలువురు మహిళలతో మునెయ్య అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, ఆ విషయంలోను అల్లూరయ్యకు మునెయ్యకు మధ్య ఘర్షణ చోటుచేసుకుందని సమాచారం.
దీనికి తోడు తెలుగుదేశం పారీ్టలో మునెయ్యకే ప్రాధాన్యత ఇస్తుండటం వల్ల అల్లూరయ్య పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకుండా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో అల్లూరయ్య తన మనుషులైన ఈశ్వర్, ప్రేమ్‌కుమార్, రంగయ్యతో కలిసి గొడ్డలితో మునెయ్యపై దాడికి పాల్పడ్డాడు. తలపై తీవ్ర గాయాలైన మునెయ్యను బంధువులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాడి ఘటనతో ప్రమేయం ఉన్న నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వైవీ సోమయ్య తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment