giddalur
-
ఒక హత్య.. వంద అబద్ధాలు
ప్రకాశం: టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు, వ్యక్తిగత విభేదాలు వెరసి ఓ వర్గానికి చెందిన నాయకుడి హత్యకు దారితీశాయి. సోమవారం రాత్రి గిద్దలూరు మండలం గడికోట పంచాయతీ పరిధిలోని పరమేశ్వరనగర్‌లో టీడీపీకి చెందిన నలుగురు వ్యక్తులు కలిసి అదే పార్టీకి చెందిన పాముల మునెయ్య(35) అనే వ్యక్తిపై గొడ్డలితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనతో వైఎస్సార్ సీపీ నాయకులకు ఎలాంటి సంబంధం లేకపోయినా టీడీపీ నేతలు హత్యా రాజకీయానికి తెరలేపారు. గిద్దలూరు టీడీపీ ఇన్చార్జి ఎం.అశోక్‌రెడ్డి హడావుడిగా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వైఎస్సార్ సీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా విష ప్రచారానికి పూనుకున్నారు. హంతకులు, హతుడు ఇద్దరూ టీడీపీ నాయకులే అయినప్పటికీ వాస్తవాలను కప్పి పుచ్చి అబద్ధాలు ప్రచారం చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. టీడీపీ నేత అశోక్‌రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్న నిందితుడు అల్లూరయ్య ఇవిగో వాస్తవాలు.. పరమేశ్వరనగర్కు చెందిన పాముల మునెయ్య(35)కు తన సమీప బంధువు అయిన గుండాల అల్లూరయ్యకు వ్యక్తిగత విభేదాలున్నాయి. పలు సందర్భాల్లో వారి మధ్య ఘర్షణ కూడా చోటుచేసుకుంది. ఈ క్రమంలో పాముల మునెయ్య స్నేహితుడైన ఓబులాపురం తండా నివాసి రామాంజనేయులు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జామాయల్ కర్ర కొట్టుకొచ్చాడు. దీనిపై ఈ నెల 14వ తేదీన అటవీశాఖ అధికారులకు సమాచారం అందడంతో జామాయిల్ తోటను పరిశీలించి నిందితుడైన రామాంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. అతడికి జరిమానా కూడా విధించారు. అయితే, అల్లూరయ్య ఇచ్చిన సమాచారంతోనే రామాంజనేయులును అటవీశాఖ అధికారులు పట్టుకున్నారని ఆగ్రహించిన మునెయ్య దుర్భాషలాడాడు. అదీగాక గ్రామంలోని పలువురు మహిళలతో మునెయ్య అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, ఆ విషయంలోను అల్లూరయ్యకు మునెయ్యకు మధ్య ఘర్షణ చోటుచేసుకుందని సమాచారం. దీనికి తోడు తెలుగుదేశం పారీ్టలో మునెయ్యకే ప్రాధాన్యత ఇస్తుండటం వల్ల అల్లూరయ్య పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకుండా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో అల్లూరయ్య తన మనుషులైన ఈశ్వర్, ప్రేమ్‌కుమార్, రంగయ్యతో కలిసి గొడ్డలితో మునెయ్యపై దాడికి పాల్పడ్డాడు. తలపై తీవ్ర గాయాలైన మునెయ్యను బంధువులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాడి ఘటనతో ప్రమేయం ఉన్న నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వైవీ సోమయ్య తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని చెప్పారు. -
అనాథ శవానికి అంత్యక్రియలు..41 రోజుల తర్వాత ప్రత్యక్షం!
గిద్దలూరు రూరల్(ప్రకాశం): చనిపోయాడనుకున్న ఆ వ్యక్తి అంత్యక్రియలు చేసిన అనంతరం 41 రోజుల తర్వాత వారి కళ్ల ముందుకు వచ్చి కనిపించటంతో కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన గిద్దలూరు మండలంలోని ముండ్లపాడులో జరిగింది. అసలు ఏం జరిగిందంటే.. గ్రామానికి చెందిన పఠాన్ సైదుమియా మద్యానికి బానిసై ఆర్మీ ఉద్యోగం వదిలేసి లారీ క్లీనర్‌గా వెళుతున్నాడు. అతనికి భార్య రహమత్బీ, కుమార్తె ఉన్నారు. భార్యాభర్తలు తరచూ గొడవలు పడి విడిపోయారు. అప్పటినుంచి రహమత్బీ తన కుమార్తెతో కలిసి అనుమలవీడులోని తన తల్లి ఇంట్లో ఉంటోంది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటోన్న సైదుమియా లారీ క్లీనర్‌గా పనికి వెళ్తే ఒక్కోసారి 2, 3 నెలల వరకు గ్రామంలోని ఇంటికి వచ్చేవాడు కాదు. ఈ క్రమంలో 41 రోజుల క్రితం మార్కాపురం రైల్వేస్టేషన్లో ఓ వ్యక్తి మృతి చెందాడని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న బంధువులు.. మృతి చెందింది సైదుమియానే అని భావించి మృతదేహాన్ని ముండ్లపాడుకు తీసుకువచ్చారు. భార్య రహమత్బీని పిలిపించి వారి పద్ధతుల్లో అంత్యక్రియలు పూర్తిచేశారు. 3 నెలలుగా లారీ క్లీనర్‌గా పని చేసుకుంటూ ఉన్నానని, గ్రామంలో జరిగే పీర్ల చావిడిలో పాల్గొనేందుకు ఇప్పుడు వచ్చానని సైదుమియా తెలిపాడు. -
రెండు రోజుల క్రితం చిన్నారి అదృశ్యం.. గోనె సంచిలో శవమై..
సాక్షి, ప్రకాశం (గిద్దలూరు) : గోనె సంచిలో ఓ చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ సంఘటన మండలంలోని అంబవరం సమీపంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికలు తెలిపిన వివరాల ప్రకారం.. అంబవరం గ్రామానికి చెందిన ఖాశీంవలి కుమార్తె ఖాశింబీ (7) రెండు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఆమె కోసం గురువారం నుంచి గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాశింబీ గ్రామ శివారు చిల్లచెట్ల మధ్య ఓ గోనె సంచిలో మృతదేహమై కనిపించింది. సమాచారం అందుకున్న సీఐ ఫిరోజ్, ఎస్ఐ త్యాగరాజులు సంఘటన స్థలానికి చేరుకుని గోనె మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. బావిలో పడి వ్యక్తి మృతి కొనకనమిట్ల: పాడుబడిన బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రం కొనకనమిట్లలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. కొనకనమిట్లకు చెందిన మువ్వా పోలురాజు(35) స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో పాడుబడిన నేల బావి పక్కన వెళ్తూ ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. దీంతో తీవ్ర గాయాలపాలై పోలురాజు మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. నిచ్చెన సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై శివ పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
పవన్‌కు దమ్ముంటే ఎన్నికల్లో గెలవాలి
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ శవ రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్సీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా సింగరపల్లి గ్రామంలో జనసేన కార్యకర్త ఆత్మహత్యకు తానే కారణమంటూ పవన్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ‘జనసేన కార్యకర్త వెంగయ్య వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు. నా వల్లే, నా కార్యకర్తల వేధింపుల వల్లే అతను మరణించినట్టు జనసేన పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సింగరపల్లి వెళ్తే నాపై దౌర్జన్యానికి ఉసిగొల్పారు. తపంచాలు, నాటు బాంబులతో తిరిగిన వ్యక్తితో నా కార్యకర్తలకేం సంబంధం? ఈ వ్యవహారంలో నా ప్రమేయం ఉందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. వాస్తవాలు తెలుసుకోకుండా పవన్ కూడా మా నియోజకవర్గానికి వచ్చి నాపై ఆరోపణలు చేశారు. భారీ మెజారిటీతో గెలిచిన నేను.. రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడి గెలవగలను. దమ్ము, ధైర్యం ఉంటే పవన్ ప్రజాతీర్పు కోరగలరా? ఆయన గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఓడిపోతే పవన్ పార్టీ మూసేసుకుని వెళ్లిపోతారా?’ అని ప్రశ్నించారు. -
తప్పులు ఒప్పుకోకుంటే చంద్రబాబు ఇంటివద్ద దీక్ష
సాక్షి, వైఎస్సార్ జిల్లా : వచ్చే శాసనసభ సమావేశాల నాటికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తప్పులను ఒప్పుకుని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆయన ఇంటి ముందు ఆమరణ దీక్షకు దిగుతానని గిద్దలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు హెచ్చరించారు. టీడీపీ దుష్టపాలనకు చరమగీతం పాడి ప్రజలకు మేలు చేసే కొత్త యువ నాయకత్వాన్ని అందించింనందుకు కృతజ్ఞతగా ఈ నెల 4న గిద్దలూరు నియోజకవర్గం నుంచి ప్రారంభించిన తిరుమల పాదయాత్ర 8వ రోజైన బుధవారం నాటికి వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణ శివార్లలో బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ జి.వెంకటసుబ్బయ్యతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్థానిక సాయి ఫంక్షన్‌హాలులో ఎమ్మెల్యే అన్నా రాంబాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడంతో పాటు ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకుని నైతిక విలువలకు తిలోదకాలిచ్చారని మండిపడ్డారు. అటువంటి చంద్రబాబు జగన్ పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వంద రోజుల పాలనలో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారని, అది జీర్ణించుకోలేని చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. -
మెప్మాలో ధనికులదే పెత్తనం
సాక్షి, గిద్దలూరు (ప్రకాశం): మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో పేదలను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇచ్చి తక్కువ వడ్డీలకు రుణాలు ఇప్పించి పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన మెప్మాలో ఉద్యోగుల భార్యలు, ధనికులు పెత్తనం చెలాయిస్తున్నారు. గిద్దలూరులోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో సగానికిపైగా ఆర్పీలు ఉద్యోగుల భార్యలు, ఇతర ఉద్యోగాలు నిర్వహిస్తున్న వారే కొనసాగుతున్నారు. దీంతో పట్టణంలోని పేదలకు తీరని అన్యాయం జరుగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. మెప్మా అధికారులు పేదరికంలో ఉన్న ఆర్పీలను తొలగించి ధనికుల వద్ద నగదు తీసుకుని ఆర్పీలుగా నియమిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. గత ఏడు సంవత్సరాలుగా మెప్మాలో అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ చూస్తున్న మెప్మా అధికారులు గత ప్రభుత్వ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి పట్టనట్లు వ్యవహరిస్తూ వారి విధులను విస్మరించారన్న విమర్శలు ఉన్నాయి. నగర పంచాయతీ కమిషనర్ పర్యవేక్షించాల్సి ఉన్నా అటువైపు వెళ్లిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో మెప్మాలో టీడీపీకి అనుబంధంగా ఏర్పడిన ఆర్పీల ఆగడాలకు అడ్డేలేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. మెప్మాలో నాలుగు సంవత్సరాల పాటు ఆర్పీగా పనిచేసిన పి.అంజనీదేవిని నిర్దాక్షిణ్యంగా తొలగించి నగదు ఇచ్చిన వారిని ఆర్పీగా నియమించుకున్నట్లు సమాచారం. ఆర్పీలుగా ఎవరిని నియమించాలి..? పట్టణంలో పేద మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు 15 నుంచి 20 స్వయం సహాయక సంఘాలను ఒక స్లమ్ లెవల్ ఫెడరేషన్ (ఎస్ఎల్ఎఫ్)గా ఏర్పాటు చేసి ఒక్కో ఎస్‌ఎల్‌ఎఫ్‌కు ఒక ఆర్పీని నియమించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో రిసోర్స్ పర్సన్లు (ఆర్పీలు)గా నియమింపబడాలంటే స్వయం సహాయక సంఘం అధ్యక్షురాలుగా ఉండాలి. స్వయం సహాయక సంఘాలను కేవలం పేదలతోనే ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆమె ఉన్న సంఘంను విజయవంతంగా నిర్వహించి ఆర్థిక లావాదేవీల్లో సంఘం ఉన్నతంగా ఉండేలా చూడాలి. ఆమె సంఘం ఎస్‌ఎల్‌ఎఫ్‌లో చేరి ఉండాలి. పదో తరగతి చదువుకుని మహిళా సంఘాల నిర్వహణ గురించి తెలిసి ఉండాలి. ఆమె సమాఖ్య రికార్డుల నిర్వహణ, బ్యాంకు లావాదేవీలు, సభ్యుల అవసరాలను గుర్తించి వారికి సంఘం ద్వారా చేయూతనిచ్చే విషయాల్లో అవగాహన కలిగి ఉండాలి. కానీ స్థానిక మెప్మా కార్యాలయంలో ధనికులే పెత్తనం చెలాయిస్తున్నారు. పట్టణ సమాఖ్యకు అధ్యక్షులు, కార్యదర్శులు ఉద్యోగుల భార్యలే. టీడీపీకి అనుబంధ సంస్థగా ఏర్పాటై పేదలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు వారికి దక్కకుండా చేస్తున్నారన్న అపవాదు ఉంది. మెప్మాకు అందని ప్రభుత్వ ఫలాలు... పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో సభ్యత్వం తీసుకుని ఎస్‌ఎల్‌ఎఫ్‌లో చేరిన మహిళా సంఘాలన్నీ టౌన్ లెవల్ ఫెడరేషన్ టీఎల్ఎఫ్గా ఏర్పడతాయి. ఇలా పట్టణంలో 35 ఎస్ఎల్ఎఫ్లు ఉన్నాయి. టీఎల్ఎఫ్లో చేరిన మహిళలకు, వీధి వ్యాపారులకు, ఇతర చిన్న పరిశ్రమలు నిర్వహించుకునే వారికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు స్త్రీనిధి, రివాల్వింగ్ ఫండ్ ఇస్తుంది. దీంతో పాటు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇప్పించాల్సి ఉంది. ఇక్కడ తీసుకున్న రుణాలను పెట్టుబడిగా పెట్టి ఆర్థికంగా స్థిరపడేందుకు మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇప్పించి మహిళాసాధికారత దిశగా నడిపించాలి. కేవలం బ్యాంకు రుణాలు ఇప్పించి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో టీఎల్ఎఫ్లో లావాదేవీలు సక్రమంగా జరగకపోవడం వలన ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయని తెలుస్తోంది. దీంతో పేదలై గ్రూపు సభ్యులకు తీరని అన్యాయం జరుగుతోంది. ఓ ఆర్పీ నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో కార్యాలయంలో పెత్తనం సాగిస్తూ అధికారులతో కలిసి వడ్డీలేని రుణాలు, స్కాలర్షిప్ నిధులను పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. మరో ఇద్దరు ఆర్పీలు మెప్మా ద్వారా రుణాలు ఇప్పిస్తామని మహిళల వద్ద పెద్ద మొత్తంలో నగదు వసూళ్లకు పాల్పడగా, బాధితులు కార్యాలయానికి వస్తున్నారని వారు అటు వైపు వెళ్లడం మానేశారు. అయినప్పటికీ వారిపై చర్యలు తీసుకోలేదు. ఉన్నతాధికారులు మెప్మా కార్యాలయంపై పర్యవేక్షణ లేకపోవడం వలనే ఇవన్నీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆర్పీలుగా ఉద్యోగుల భార్యలు ఉండకూడదు ఆర్పీలుగా ఉద్యోగులు, ఉద్యోగుల భార్యలు పనిచేయరాదు. ఇప్పటికే అంజనీదేవి అనే మహిళ తాను గతంలో ఆర్పీగా పనిచేస్తుండగా తనను తొలగించి ఉద్యోగుల భార్యను నియమించుకున్నారని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నేను గిద్దలూరుకు రాక ముందు జరిగింది. అనర్హులను తొలగిస్తున్నాము. మహిళా సంఘాలకు ప్రస్తుతానికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రాలేదు. ప్రపోజల్స్ పంపిస్తున్నాం. రుణాలు ఇప్పిస్తామని నగదు వసూళ్లకు పాల్పడిన ఇద్దరిని కార్యాలయానికి రావద్దని చెప్పాం. ఆర్పీలుగా తొలగించాల్సి ఉంది. త్వరలో అన్నింటినీ సరిచేస్తాం. – చంద్రశేఖర్, సిటీ మిషన్ మేనేజర్, గిద్దలూరు ఆర్పీగా తొలగించారు నేను నాలుగు సంవత్సరాల పాటు ఆర్పీగా పనిచేశాను. ఇటీవల ఆర్పీల జాబితాను ప్రభుత్వానికి పంపాలని వచ్చినప్పుడు తన పేరు తొలగించి వేరొకరి పేరు పంపారు. దీంతో తాను ఉద్యోగం కోల్పోయాను. టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారంలో తిరగలేదన్న కక్షతో తనను నిర్దాక్షిణ్యంగా ఆర్పీ నుంచి తొలగించారని, ఆర్పీలంతా ఉద్యోగుల భార్యలు, ఇతర ఉద్యోగాలు చేసే వారే ఉన్నారు. తనకు ఆర్పీగా ఉద్యోగం ఇప్పించాలని స్థానిక అధికారులను కోరినా పట్టించుకోవడం లేదు. నాకు ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలి. – పి.అంజనీదేవి, రాజానగర్, గిద్దలూరు. -
అక్కడ స్వీపర్లే నర్సులు..!
సాక్షి, గిద్దలూరు (ప్రకాశం): స్థానిక కమ్యూనిటీ వైద్యశాలలో వైద్యం కోసం వచ్చే వారికి పారిశుధ్య విభాగంలో పనిచేసే స్వీపర్లే సేవలందించాల్సిన దుస్థితి ఏర్పడింది. వైద్యశాలలో నర్సులు ఉన్నప్పటికీ రోగులను పట్టించుకోకుండా కుర్చీల్లో కూర్చుని కబుర్లు చెప్పుకునేందుకే పరిమితమవుతున్నారు. వైద్యశాలల్లో ఐదుగురు డాక్టర్లు ఉన్నారు. వారు రోగులను పరీక్షించి మందులు, ఇంజక్షన్లు రాస్తారు. డాక్టర్ రాసిచ్చిన మందులు ఇంజక్షన్లను రోగులకు ఇవ్వాల్సిన నర్సులు.. ఆ పనిని స్వీపర్లతో చేయిస్తున్నారు. వైద్యశాలలో సుమారు 15 మంది వరకూ నర్సులు ఉన్నప్పటికీ రోగులకు అరకొరగా కూడా వైద్యసేవలు అందించకుండా తీవ్రస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోగులకు ఇంజక్షన్లు వేయడం, సెలైన్లు పెట్టడం వంటి పనులన్నింటినీ పారిశుధ్య కార్మికులతోనే చేయిస్తున్నారు. దీనిపై రోగులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్వీపర్లు మరుగుదొడ్లు, వార్డులు శుభ్రపరచి అపరిశుభ్రమైన చేతులతో తమకు ఇంజక్షన్లు చేయడం, సెలైన్లు ఇవ్వడమేంటని ఆగ్రహిస్తున్నారు. అంతేగాకుండా ఎలాంటి శిక్షణ లేని స్వీపర్లు వైద్యసేవలు అందించడం వలన కొన్నిసార్లు రోగులు తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంజక్షన్లు చేసే సమయంలో తీవ్రంగా నొప్పి, సెలైన్లు ఎక్కించే సమయంలో రక్తస్రావం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. నర్సులు చేయాల్సిన పనులను స్వీపర్లతో చేయించడం ఏంటని ఆయా సమయాల్లో నర్సులను నిలదీస్తున్నప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోందని, వారిలో ఏ విధమైన మార్పూ రావడం లేదని రోగులు, వారి బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గాయాలకు కట్లు కట్టేది.. కుట్లు వేసేది కూడా స్వీపర్లే... రోడ్డు ప్రమాదాలు, తదితర సంఘటనల్లో గాయాలపాలై వైద్యశాలకు వచ్చిన క్షతగాత్రులకు కట్టుకట్టి వైద్యం చేయాల్సిన నర్సులు పట్టించుకోకపోవడంతో పాటు ఆ పనులను స్వీపర్లతో చేయిస్తున్నారు. గాయాలకు స్వీపర్లే డ్రస్సింగ్ చేసి కట్టు కడుతున్నారు. కొందరికి కుట్లు కూడా వారే వేస్తున్నారు. స్వీపర్లు వైద్యం అందించడంపై కొందరు రోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా.. ప్రమాద సమయంలో తప్పడం లేదని సర్దుకుపోతున్నారు. దీనిపై వైద్యశాల వైద్యులకు చెప్పినా పట్టించుకోవడం లేదని రోగుల బంధువులు వాపోతున్నారు. డ్యూటీ డాక్టర్లైనా రోగులకు చేయి పట్టుకుని వైద్యం అందిస్తారుగానీ, నర్సులు మాత్రం రోగులను పట్టించుకోరన్న ఆరోపణలు ఈ వైద్యశాల నర్సులపై ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో నర్సులకు కౌన్సిలింగ్ ఇచ్చి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు. -
గిద్దలూరు ప్రచార సభలో వైఎస్ జగన్
-
చంద్రబాబుకు ఓట్లు అడిగే ధైర్యం లేదు: వైఎస్ జగన్
-
చంద్రబాబుకు ఓట్లు అడిగే ధైర్యం లేదు: వైఎస్ జగన్
సాక్షి, గిద్దలూరు: సీఎం చంద్రబాబు నాయుడుకు తన ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిపై ఓటు అడిగే ధైర్యం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ స్కూల్ కూడా ఉండదని తెలిపారు. ఇప్పటికే ఆరు వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని గుర్తుచేశారు. చంద్రబాబుకు ఓటేస్తే.. ఎల్కేజీకి లక్ష రూపాయలు, ఇంజనీరింగ్‌కు 5లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుందన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు కూడా తీసేస్తారని, తనను ప్రశ్నించినవారిని ఎవరినీ చంద్రబాబు బతకనివ్వరని విమర్శించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఎండలు మండుతున్న తన కోసం తరలివచ్చిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా? ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘గిద్దలూరులో తాగునీటి సమస్యలేని గ్రామమేదైనా ఉందా?.230 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారానే నీటి సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ల ఓనర్లుకు పది కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించకపోవడంతో వారు సరఫరా నిలిపివేశారు. 48 మండలాలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే గిద్దలూరులో నీటి సమస్య తీరుతుంది. వెలిగొండ ప్రాజెక్టు పనులను దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 80 శాతం వరకు పూర్తిచేశారు. ప్రాజెక్టు పూర్తయితే తాగునీటి సమస్య తీరుతుందని తెలిసిన కూడా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. పత్తికి కనీసం 4,500 రూపాయలు కూడా రావడంలేదు. మిర్చికి 10వేల రూపాయలు ఉంటే 5,500 రూపాయలు కూడా ఇవ్వడం లేదు. ఇలా పత్తి, మిర్చి, శనగ, కంది పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. ఇంతటి అన్యాయమైన పరిస్థితుల్లో రైతన్నలు ఉంటే పట్టించుకోని ప్రభుత్వం మనకు అవసరమా? చంద్రబాబు ధనిక సీఎం.. రైతన్న అత్యంత పేదవాడు చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అని రిపోర్టులు చెబుతున్నాయి. అయితే మన రైతన్నలు అత్యంత రుణభారంలో ఉన్నారని నా బార్డు నివేదికలు తెలిపాయి. పొదుపు సంఘాల అక్కాచెల్లమ్మల అప్పులు వడ్డీలతో కలిపి 26వేల కోట్ల రూపాయలకు పెరిగిపోయాయి. ఈ ఐదేళ్ల కాలంలో అక్కాచెల్లమ్మలు అప్పులు రెట్టింపు అయ్యాయి. నిరుద్యోగ సోదరుల సంఖ్య రెట్టింపు అయింది. చంద్రబాబు నాయుడు హయంలో రైతులు, అక్కాచెల్లమ్మలు, యువత ఎవరు బాగుపడలేదు. బాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్టా? ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగున్నటా?. 2014 ఎన్నికల సమయంలో జాబు రావాలంటే బాబు రావాలన్నారు చంద్రబాబు.. కానీ నేడు జాబ్ రావాలంటే బాబు పోవాలని యువత అంటుంది. ఇక్కడ జాబులు దొరక్క ప్రజలు పక్క రాష్ట్రాలకు వలస పోతున్నారు. రాష్ట్రంలో లక్షా 42వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమల్‌నాథన్ కమిటీ చెప్పింది. రిటైర్ అయిన వారితో కలిపి ఖాళీలు 2.30లక్షలకు చేరాయి. చంద్రబాబు నాయుడు పాలనలో ఉద్యోగాలు రావడం సంగతి పక్కన ఉంచితే.. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. 30వేల మంది ఆదర్శ రైతులు, 1000మంది గోపాలమిత్రల, ఆయూష్‌లో పనిచేస్తున్న 8000 మంది, సాక్షార భారత్‌లో పనిచేస్తున్న 30 వేల మంది ఉద్యోగాలు పోయాయి. 14 ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న 85వేల మంది అక్కాచెల్లమ్మల ఉద్యోగాలు పోయాయి. జీతాలు పెంచమని హోంగార్డ్‌ల నుంచి, ఆశా వర్కర్లు, అంగన్ వాడీలు జీతాలు పెంచాలని అడుగుతూంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. నిరుద్యోగులకు వైఎస్ జగన్ భరోసా.. చంద్రబాబు అన్యాయమైన పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి కష్టాన్ని నేను చూశాను. నేను విన్నాను. మీ అందరికీ నేను ఉన్నాను అని హామీ ఇస్తున్నాను. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ప్రతి ఏడాది జనవరి 1వ తేదీన ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తాం. ప్రతి ఊరిలోను గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తాం. అందులో ఆ ఊరికి చెందిన చదువుకున్న పదిమందికి ఉద్యోగాలు ఇస్తాం. జన్మభూమి కమిటీలు ఉండవు, ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పథకాలకు, నవ రత్నాలకు సంబంధించి ఏ పని అయినా 72 గంటల్లో పూర్తి చేసేలా గ్రామ సచివాలయం పనిచేస్తుంది. ఇందులో కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడమని హామీ ఇస్తున్నాను. ప్రతి 50 ఇళ్లకు ఒకరికి గ్రామ వాలంటీర్‌గా ఉద్యోగం ఇస్తాం. వారికి గౌరవ వేతనం కింద 5000వేల రూపాయలు అందజేస్తాం. ఆ 50 ఇళ్లకు సంబంధించి పూర్తి బాధ్యతలను వారే చూస్తారు. రేషన్, పింఛన్ ఇలా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు. పరిశ్రమల్లో స్థానికంగా ఉన్నవారికి ఉద్యోగాలు రావడం లేదు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చివేస్తాం. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తెస్తాం. ప్రతి జిల్లాకు ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. గవర్నమెంట్ కాంట్రాక్టులన్నీ నిరుద్యోగ యువతకే ఇస్తాం. నిరుద్యోగ యువతకు వ్యాపార నిమిత్తం పెట్టుబడి కింద రుణం, సబ్సిడీ అందజేస్తాం. కాంట్రాక్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం. ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుంది.. దేశంలో రేపు ఏ ఒక్కరు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి ఉందని వార్తలు వెలువడుతున్నాయి. మనం 25 స్థానాల్లో వైఎస్సార్సీపీ ఎంపీలను గెలిపించుకుందాం. ప్రత్యేక హోదా ఇచ్చే వారికే కేంద్రంలో మద్దతిస్తాం. ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది. ఉద్యోగ సమస్యకు ఒక మంచి పరిష్కారం లభిస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది చంద్రబాబు చేయని మోసం, చెప్పని అబద్దం ఉండదు. రానున్న రోజుల్లో ఈ కుట్రలు ఇంకా పెరుగుతాయి. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి. ఇరవై రోజులు ఓపిక పట్టమని చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. గతంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు అది కనిపించని పరిస్థితి. ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మీ చేతికే అందిస్తాం. అంతేకాకుండా మళ్లీ బ్యాంకుల వద్ద నుంచి సున్నా వడ్డీకే రుణాలు వస్తాయని చెప్పండి. మహిళలను లక్షాధికారులను చేయాలనే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. పసుపు కంకుమ డ్రామాకు మోసపోవద్దని ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. రైతలకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా.. గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ కూడా ఇస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబును, ఎంపీ అభ్యర్థి శ్రీనన్నను ఆశీర్వదించమ’ని కోరారు. -
గిద్దలూరులో టమాట రైతు ఆందోళన
-
వైఎస్సార్సీపీలోకి చేరిన 200 మంది యువత
-
వైఎస్సార్సీపీలోకి చేరిన 200 మంది యువత
-
వైఎస్సార్సీపీలోకి చేరిన 200 మంది యువత
సాక్షి, ప్రకాశం : వైఎస్సార్‌సీపీతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గిద్దలూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంచార్జీ ఐవీ రెడ్డి పేర్కొన్నారు. బెస్తవారిపేట పట్టణంలోని 200 మంది యువకులను కడ్డువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఐవీ రెడ్డి మాట్లాడుతూ.. పెద్దమొత్తంలో యువత పార్టీలోకి చేరడం శుభపరిణామం అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడం కోసం యువత కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బెస్తవారిపెట మండల కన్వీనర్ బొల్ల బాలి రెడ్డి, పట్టణ కన్వీనర్ కొండా రఘునాద్ రెడ్డి, జిల్లా బీసి సెల్ విభాగం మోగులురి భీమయ్య యాదవ్, కోటయ్య, వినోద్, జిల్లా సాంసృతిక అధ్యక్షులు కొండా తిరుపతి రెడ్డి, యంవి సుబ్బా రెడ్డి, నాగరాజు, మరియు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆధార్‌లో వయోమాయ
గిద్దలూరు: కామన్ సర్వీసు సెంటర్ (సీఎస్సీ)లు, మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఆధార్ కార్డులతో మాయలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలల్లో లబ్ధిపొందాలనుకునే వారి వయస్సు వారికి కావాల్సినట్టుగా మార్చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు నకిలీ గుర్తింపు కార్డులు ఐడీలు తయారు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇందుకు లబ్ధిదారుల నుంచి వేలకు వేలు వసూలు చేసి, జేబులు నింపుకొంటున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లోని మీ సేవ కేంద్రాలను పట్టణాల్లో నిర్వహిస్తూ అక్కడే సీఎస్సీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.5 వేలు వసూలు.. అధికార పార్టీ నాయకులు గ్రామాల్లో బలం నిరూపించుకునేందుకు పింఛన్లు, పెళ్లికానుకలు ఇప్పిస్తామని చెప్పి వారి ఆధార్‌కార్డుల్లో తక్కువ వయసు ఉన్నా వయసు పెంచి, అనర్హులకు లబ్ధి కల్పించడం.. ఇందుకు ఒక్కొక్కరి నుంచి రూ.5వేలు చొప్పున వసూలు చేయడం పనిగా పెట్టుకున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. గిద్దలూరు నియోజకవర్గంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బాల్య వివాహాలు చేసుకునే వారు పెళ్లికానుక పథకానికి అనర్హులు. ఇందుకు బాలికకు చెందిన ఆధార్‌కార్డులో వయస్సు మార్పించేస్తున్నారు. మీసేవ కేంద్రాలను నిర్వహించే బాధ్యత 2012లో ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. ఏజెన్సీవారు అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండలంలోని అంబవరం గ్రామంలో నిర్వహిస్తున్న మీ సేవ కేంద్రం నిర్వాహకుడు అంబవరంతో పాటు, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు చెందిన ఆధార్‌కార్డులను మార్చేసినట్లు అందిన ఫిర్యాదు మేరకు ఏజెన్సీ నిర్వాహకులు కేంద్రాన్ని నాలుగు నెలల క్రితం రద్దు చేశారు. అప్పటికే కొన్ని వేల ఆధార్‌కార్డుల్లోని సమాచారాన్ని మార్చేసినట్లు తెలుస్తోంది. ఇదేవిధంగా కొమరోలు, గిద్దలూరు మండలాల్లోని గ్రామాల్లో ఉన్న మీసేవ కేంద్రాలను పట్టణంలో ఏర్పాటు చేసుకుని దందా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కేంద్రాలు రద్దయినా ఆగని అక్రమాలు.. కొన్ని ఆధార్ సీడింగ్ కేంద్రాల నిర్వాహకులు గోప్యంగా ఉంచాల్సిన వ్యక్తుల యూఐడీఐని బహిర్గతం చేస్తున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం ఆధార్ ఎర్రోలింగ్ కేంద్రాలను తీసేసింది. ఎన్‌రోలింగ్ బాధ్యతలను కేవలం మండల కేంద్రాల్లోని మీసేవ కేంద్రాలకు, బ్యాంకులకు, పోస్టాఫీసులకు మాత్రమే ఇచ్చారు. బ్యాంకుల్లో సీసీ కెమెరాలు ఉండటం వలన అక్రమాలు జరగవని ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో తగిన సిబ్బంది లేకపోవడం వలన ఆధార్ ఎన్‌రోలింగ్ బాధ్యలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. కొన్ని బ్యాంకుల్లో పనిచేసే సిబ్బంది వారి ఐడీలను రూ.5వేల నుంచి రూ.10వేల వరకు విక్రయించుకున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. వారి ఐడీ ప్రకారం సదరు ఉద్యోగికి చెందిన వేలిముద్రలు తీసుకుని బయట సీఎస్సీ కేంద్రాల్లో ఆధార్ కార్డుల్లో వయస్సు, ఇతర సమాచారాన్ని మార్చేస్తున్నారని సమాచారం. ఇలాంటి కేంద్రాలు గిద్దలూరులోని వ్యవసాయశాఖ కార్యాలయం సమీపంలోని సీఎస్సీ కేంద్రంలో రూ.4వేలు తీసుకుని ఆధార్‌కార్డులో వయస్సు మార్చి ఇస్తున్నారు. ఆశకు పోతే అనర్ధం జరిగింది.. కొమరోలు మండలానికి చెందిన ఓ వ్యక్తికి 55 ఏళ్లు ఉండగా పింఛను ఇప్పిస్తామని ఓ నాయకుడు ఆధార్‌కార్డు తీసుకెళ్లి వయస్సు 65గా మార్పించారు. ఏడాది పాటు పింఛను రాలేదు. ఆయన అనారోగ్యంతో మృతిచెందాడు. వయస్సు ఎక్కువ వేయడం వలన చంద్రన్న బీమాకు అనర్హుడయ్యాడు. దీంతో ఆ కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. అదేవిధంగా గిద్దలూరు మండలంలోని ముండ్లపాడుకు చెందిన 9వ తరగతి విద్యార్థినికి వివాహం చేసిన కుటుంబ సభ్యులు పెళ్లి కానుక కోసం ఆధార్‌కార్డులో వయస్సు పెంచారు. బాల్య వివాహం చేసుకున్నారంటూ ఫిర్యాదు అందడంతో సదరు అధికారులతో గొడవలు పడి కేసులు పెట్టకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. కొత్త కేంద్రాలకు గ్రహణం.. పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజలకు సరిపడినన్ని మీ సేవ కేంద్రాలు లేకపోవడం వలన ప్రైవేటు వ్యక్తులు వివిధ ఏజెన్సీల పేర్లతో రహస్యంగా ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. గిద్దలూరు పట్టణంలో 10 మీసేవ కేంద్రాలు ఉండాల్సి ఉన్నా కేవలం ఒక్కటే నడుస్తోంది. దర్శి నియోజకవర్గ కేంద్రంలో 8 కేంద్రాలు ఉండాల్సి ఉన్నా ఒక్కటే ఉంది. దీనిపై పలువురు ప్రజా ప్రతినిధులు కోర్టుకు వెళ్లినా కొత్త కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా అధికారులు చొరవ చూపడం లేదు. ఫలితంగా అక్రమార్కులు బినామీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఆధార్ ఎన్‌రోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టడంతో పాటు, జనాభా ఆధారంగా మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు జైలుశిక్ష
గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు రెండేళ్ల జైలుశిక్ష పడింది. ఓ ప్రైవేటు కేసులో మార్కాపురం కోర్టు ఈ మేరకు సోమవారం తీర్పు వెలువరించింది. 2008లో మార్కాపురానికి చెందిన గోళ్ల సురేంద్రనాథ్‌కి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకి మధ్య భూమి విషయంలో వివాదం ఉంది. ఆ వ్యవహారంలో తమకు అన్యాయం జరుగుతోందంటూ సురేంద్రనాథ్ భార్య కోర్టును ఆశ్రయించారు. దీనిపై తీర్పు ఇచ్చిన మార్కాపురం కోర్టు.. ఆ వెంటనే రాంబాబుకు బెయిల్ మంజూరు చేసింది. జైలుశిక్ష తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు రాంబాబుకు అక్టోబర్ 13వ తేదీ వరకు కోర్టు అవకాశం ఇచ్చింది. కొద్ది నెలల కిందటే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన అన్నా రాంబాబు.. నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ సమయంలో తిరిగి అదే పార్టీకి వత్తాసుగా హల్‌చల్‌చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. -
లాటరీ పేరుతో మోసం
► రూ.20 వేల విలువైన వస్తువులు రూ.5 వేలకే ఇస్తామంటూ నమ్మబలికిన ఆగంతకుడు ► పోస్టాఫీస్‌లో డబ్బులు కట్టి పార్శిల్ తీసుకున్న యువకుడు ► అందులో పని చేయని వాచీ ఉండటంతో నెవ్వెరపోయిన బాధితుడు ►సెల్‌ఫోన్ కాల్స్‌తో మోసపోతున్న అమాయకులు గిద్దలూరు : సర్.. మీకు లాటరీ తగిలింది.. రూ.20 వేల విలువైన స్మార్ట్ ఫోన్, ఇంపోర్టెడ్ వాచీ, బూట్లు మొత్తం కలిపి రూ.5 వేలకే ఇస్తున్నాం.. మీరు పోస్టాఫీస్‌కు వెళ్లి రూ.5 వేలు నగదు చెల్లించి పార్శిల్ తీసుకోవడమే తరువాయి.. అని ఫోన్ వస్తుంది. రూ.20 వేల విలువైన వస్తువులు ఇస్తామన్న వారు కనీసం రూ.10 వేల విలువైన వస్తువులు ఇవ్వకపోతారా.. అని కొందరు అమాయకులు నిలువునా మోసపోతున్నారు. మండలంలోని వెంకటాపురం తండాకు చెందిన రోలర్ ఆపరేటర్ కార్తీక్‌కు రెండు రోజుల క్రితం కొత్త నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఓ వ్యక్తి మాట్లాడుతూ తాను ఫలానా కంపెనీ ప్రతినిధినంటూ పరిచయం చేసుకున్నాడు. లాటరీలో మీకు రూ.20 వేల విలువైన బహుమతులు వచ్చాయని నమ్మించాడు. నమ్మిన కార్తీక్ బహుమతులు ఎక్కడకు వచ్చి తీసుకోవాలని ప్రశ్నించాడు. మీరు ఎక్కడికీ వెళ్లొద్దు.. మీ గ్రామంలోని పోస్టాఫీస్‌కు వస్తాయని చెప్పాడు. ఎన్ని రోజులకు వస్తాయని కంపెనీ ప్రతినిధిని కోరగా ఆయన రేపే పోస్టాఫీస్‌కు వెళ్లి రూ.5 వేలు డబ్బు చెల్లించి బహుమతుల బాక్సు తీసుకోవాలని చెప్పాడు. పని వదిలేసి మరీ పోస్టాఫీసుకు వెళ్లి రూ.5 వేలు చెల్లించిన కార్తీక్.. ఆ తర్వాత గిఫ్ట్ బాక్సు తీసుకున్నాడు. బయటకు వచ్చి తెరవగా అందులో రూ.100ల విలువైన బూట్లు, పనిచేయని రీబక్ కంపెనీ వాచీ మాత్రమే ఉంది. ఎలాంటి బిల్లులు లేకుండానే ఫోన్లో అమాయకులను మోసం చేస్తున్నారు. కార్తీక్‌కు వచ్చిన ఫోన్ నంబర్ 93123 20099కు తిరిగి కాల్ చేస్తే తాము బూట్లు, రీబక్ వాచ్ ఇస్తామని మాత్రమే చెప్పామని బదులిచ్చారు. వాచీ పనిచేయడం లేదని, దాన్ని ఏం చేయాలని ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదని ఫోన్ పెట్టేశారు. -
మాజీ ఎంపీటీసీ హత్య
గిద్దలూరు: ప్రకాశంజిల్లా గిద్దలూరు మండలం మాజీ ఎంపీటీసీ దొనపటి రమణ(37) గడికోట గ్రామంలో సోమవారం హత్యకు గురయ్యారు. తెలుగుదేశం పార్టీకి చెందిన రమణ తన పొలంలో వరి నాట్లు వేశారు. పందుల బెడద నుంచి పంటను రక్షించుకునేందుకు రాత్రి పొలంలో మంచె వద్ద కాపలాకు వెళ్లారు. ఆ సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయన గొంతు కోసి హత్య చేశారు. సంఘటనా స్థలంలో దుండగులు, రమణ మధ్య పెనుగులాట జరిగినట్లు తెలుస్తోంది. కాగా, గ్రామంలో ఆయనకు ఎవరితోనూ రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, ఇలా ఎందుకు జరిగిందో తెలియడంలేదని స్థానికులు అంటున్నారు. రమణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై గిద్దలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు బైక్‌లు ఢీ: ముగ్గురికి గాయాలు
గిద్దలూరు: ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అచ్చంపేట సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక చొల్లవీడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని సుజాత, ఆమె భర్త సంపత్ తో కలసి బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా మరో బైక్‌పై వచ్చిన వ్యక్తి ఢీకొట్టాడు. ఈ ఘటనలో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
గిద్దలూరులో పెద్దపులి సంచారం
గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పాములపల్లి గ్రామంలో పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామంలో పెద్ద పులి కాలిముద్రలను గుర్తించిన గ్రామస్థులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకొని పులి కాలిముద్రలు పరిశీలిస్తున్నారు. -
గిద్దలూరు తమ్ముళ్ల తన్నులాట
ఇరువర్గాలకు చెందిన ఎనిమిది మందికి గాయాలు గిద్దలూరు : గిద్దలూరు టీడీపీలో పాత, కొత్త నేతల మధ్య విభేదాలు శుక్రవారం మరోసారి బహిర్గతమయ్యాయి. పట్టణంలో తాగునీటి సరఫరా విషయంలో ఏర్పడిన వివాదం చినికిచినికి గాలివానలా మారి పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ సంఘటనలో 17వ వార్డు కౌన్సిలర్ చింతలపూడి రామలక్ష్మితో పాటు మరో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులకు గాయాలయ్యాయి. 17వ వార్డు కౌన్సిలర్ రామలక్ష్మి ఇటీవల టీడీపీలో చేరిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వర్గంలో.. 18వ వార్డు కౌన్సిలర్ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబు వర్గంలో ఉన్నారు. వాటర్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న బత్తుల లక్ష్మీనారాయణపై నాలుగు రోజుల క్రితం 18వ వార్డు కౌన్సిలర్ సూరేపల్లి గుర్రమ్మ కుమారుడు వెంకట్రావు, అతని కుటుంబ సభ్యులు దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలో ఇరువర్గాలపై కేసులు నమోదయ్యాయి. గాయపడిన లక్ష్మీనారాయణ వైద్యశాలలో చికిత్స పొంది తిరిగి శుక్రవారం విధుల్లో చేరాడు. ఉదయం 7 గంటల సమయంలో తాగునీటి ట్యాంకర్ వెంట వెళ్తున్న లక్ష్మీనారాయణను పాములపల్లె గేట్ వద్ద వెంకట్రావు అడ్డుకున్నారు. ట్యాంకర్‌ను తాను చెప్పిన చోట నిలపాలని డిమాండ్ చేశాడు. దీనికి లక్ష్మీనారాయణ తాను అధికారులు చెప్పిన విధంగా చేస్తానని సమాధానమిచ్చాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. అక్కడితో ఆగకుండా లక్ష్మీనారాయణ తన బంధువు 17వ వార్డు కౌన్సిలర్‌కు ఫోన్ చేశాడు. వెంకట్రావు కూడా తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పిలిపించుకున్నారు. ఇరువర్గాల వారు ఒకరిపై మరొకరు దాడులకు తెగబడ్డారు. ఘర్షణలో 18వ వార్డు కౌన్సిలర్ బంధువులైన సూరేపల్లి వెంకట్రావు, కన్న, శ్రీధర్, భూతరాజు విజయలక్ష్మిలకు గాయాలయ్యాయి. శ్రీధర్‌కు వీపుపై కొరికిన గాయాలున్నాయి. 17వ వార్డు కౌన్సిలర్ చింతలపూడి రామలక్ష్మి, బత్తుల బాలరంగమ్మ, ఆదిలక్ష్మి, లక్ష్మీనారాయణలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఎనిమిది మంది స్థానిక ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఒకరిపై ఒకరు కారం చల్లుకుని కొట్టుకున్నారు. తమ నాన్నను చంపుతామని లక్ష్మీనారాయణ బంధువులు ఫోన్లో బెదిరిస్తున్నారని, ఫోన్ సంభాషణలు సీడీలో వేసి పోలీసులకు ఇచ్చినట్లు వెంకట్రావు కుమార్తె విజయలక్ష్మి తెలిపారు. మార్కాపురం డీఎస్పీ గిద్దలూరు చేరుకుని లక్ష్మీనారాయణ, వెంకట్రావులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వెంకట్రావు వర్గీయులను మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైద్యశాలలో పరామర్శించారు. -
గిద్దలూరు టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
ఒంగోలు : ప్రకాశం జిల్లా గిద్దలూరు టీడీపీలో విభేదాలు బుధవారం భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి చేరికపై టీడీపీ నేత అన్నా రాంబాబు వర్గం నిప్పులు చెరుగుతోంది. తమ కార్యకర్తలను ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అన్నా రాంబాబు ఆవేదన చెందుతున్నారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావుకు ఫిర్యాదు చేసేందుకు దాదాపు 600 మంది కార్యకర్తలతో అన్నా రాంబాబు బుధవారం ఒంగోలు తరలివెళ్లారు. -
మంత్రులు వస్తున్నారని ..నీళ్లు నేలపాలు
‘ప్రతి నీటి బొట్టూ విలువైనదే ... ప్రాణప్రదంగా చూసుకోవాలి ... సద్వినియోగం చేసుకోవాలి’ తెల్లారిన దగ్గర నుంచి రాత్రి వరకూ ఇటు ప్రజాప్రతినిధులు ... అటు అధికారులు చేస్తున్న హితబోధలివీ... గిద్దలూరు పట్టణంలో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతుంటే మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ పట్టణానికి వచ్చారని నీటిని ట్యాంకర్లతో తెచ్చి రోడ్డుపై వెదజల్లిన వైనం చూసినవారు విస్తుపోయారు. మంత్రి వర్యులు వచ్చిన కార్యక్రమం ఏమిటో తెలుసా ‘సేవ్ వాటర్ – సేవ్ లైఫ్’ కార్యక్రమానికి. ఆయన కారులో రయ్...మన్నప్పుడు దుమ్ము,ధూళి పైకి ఎగరకూడదని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ట్యాంకుల నీటిని ఇలా గాంధీ బొమ్మ సెంటరు నుంచి పోలీస్ స్టేషన్ వరకు రోడ్డుపై విరజిమ్మారు. నీటిని ఇలా వృధా చేస్తున్న సమయంలోనే ఓ వృద్ధుడు నీటి బిందెలను నాలుగు చక్రాల బండిపై పెట్టుకుని నెట్టుకొస్తూ కనిపించగా ‘సాక్షి’ కెమెరా క్లిక్మంది. – గిద్దలూరు -
పదవి కోసమే టీడీపీలో కుమ్ములాటలు
= గిద్దలూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కోసం ఎత్తుకు పైఎత్తులు = టీడీపీలో కుమ్ములాటలు.. ముఖ్య నేతలకు పరస్పర ఫిర్యాదులు = కొన్ని పేర్లతో జాబితా ఇచ్చిన టీడీపీ ఇన్చార్జి అన్నా రాంబాబు = అదేం కుదరదని అధికారులతో చెప్పిన పాత నాయకులు = మార్కెట్ యూర్డు కమిటీ ఎంపిక మళ్లీ వాయిదా? జిల్లాలో టీడీపీ నేతలకు నామినేటెడ్ పదవులపై కన్నుపడింది. వరుసగా పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న నేతలు ఎలాగైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందాన ఇప్పుడు పదవుల కోసం ముఖ్య నాయకుల చుట్టూ తిరుగుతూ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. పార్టీలో పాత.. కొత్త నేతలుగా విడిపోయి కుమ్ములాటలకు దిగుతున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఈ పోటీ మరింత తీవ్రంగా ఉంది. అక్కడి మార్కెట్ యూర్డ్ చైర్మన్‌గిరి కోసం తెలుగు తమ్ముళ్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఓ గ్రూపు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి అన్నా రాంబాబుపై తిరుగుబాటు జెండా ఎగురవేసింది. గిద్దలూరు : గిద్దలూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కోసం టీడీపీలో కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. ఇటీవల వెలిగొండ ప్రాజెక్టు వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆ పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి రాంబాబు మార్కెట్ యార్డు కమిటీకి కొన్ని పేర్లను ప్రతిపాదిస్తూ లేఖ అందజేశారు. అందులో డెరైక్టర్లుగా ఉన్న వారిలో ఎక్కువ మంది రాంబాబు అనుచరులే. ఆ జాబితాలో ఇటీవల పార్టీలోకి వచ్చిన వారు కొందరైతే.. రాంబాబు అడుగుల్లో అడుగులు వేసేవారు మరికొందరు. దీంతో ఆ జాబితాను పాత టీడీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నా నేటికీ మార్కెట్ యార్డుకు కమిటీని నియమించడంలో ఆ పార్టీ ముఖ్య నేతలు విఫలమయ్యూరు. నియోజకవర్గంలోనే కంభం మార్కెట్ యార్డుకు కమిటీని నియమించిన ప్రభుత్వం.. గిద్దలూరు విషయంలో మాత్రం వెనుకంజ వేస్తోంది. పాత, కొత్త నేతల మధ్య వార్ మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కాపుల మధ్య చిచ్చు రేపేలా తయారైంది. రెండు నెలల క్రితం వరకు యాదవులకు చైర్మన్ పదవిని కట్టబెడతారని ప్రచారం జరగడంతో ముగ్గురు నాయకులు ఇన్చార్జి చుట్టూ తిరిగారు. వారి మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఆ పదవి ముగ్గురిలో ఎవరికీ దక్కకుండా పోయింది. ఈ నేపథ్యంలో కాపు వర్గానికి చైర్మన్ పదవి ఇచ్చేందుకు ఇన్చార్జి ఒక నిర్ణయూనికి వచ్చారు. కాలక్రమంలో వారిలోనూ పోటీ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 7 నెలల పాటు చైర్మన్‌గా పనిచేసిన ఆర్డీ రామకృష్ణ, రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన కుప్పా రంగనాయకులు, టీడీపీ జిల్లా మాజీ కార్యవర్గ సభ్యుడు సిరిగిరి లింగయ్యలు పోటీ పడ్డారు. వీరిలో ఇద్దరు నాయకులు రాంబాబుతో పాటు టీడీపీలో చేరిన వారు కావడంతో వారి మధ్య సమోధ్య కుదుర్చి కుప్పాకు చైర్మన్ పదవి ఇచ్చేందుకు నిర్ణయించారు. 20 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న లింగయ్యను మాత్రం ఆర్థిక స్థోమత లేదంటూ పక్కకు నెట్టేశారు. లింగయ్యతో పాటు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నల్లబోతుల వెంకటేశ్వర్లు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. తమను కాదని సొంత అనుచరులకు పదవి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నా రాంబాబుపై పాత టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తోళ్లకే అందలం పదేళ్లు పార్టీ కష్టకాలంలో ఉంటే తాము పార్టీని వెన్నంటి ఉన్నామని, ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారికి పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ టీడీపీలో ముందు నుంచీ ఉన్న నేతలు కొందరు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పార్టీని వెన్నంటి ఉన్న వారికే నామినేటెడ్ పదవులు ఇస్తామని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చెబుతున్నారని గుర్తు చేశారు. గిద్దలూరులో తమను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులెలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డుకు వ్యవసాయం గురించి తెలియని వారిని ఎలా నియమిస్తున్నారని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి మార్కెట్‌యార్డు కమిటీ ప్రకటన జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్లు ఉన్న వారికే పదవి ఇస్తామంటున్నారు: సిరిగిరి లింగయ్య, టీడీపీ సీనియర్ నాయకుడు మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని ముందు రెండు, వెనకాల రెండు కార్లు ఉన్న వారికే ఇస్తామని గిద్దలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి అన్నా వెంకట రాంబాబు చెబుతున్నాడు. కార్లలో తిరిగే వారు రైతులకు ఎలా సేవలందిస్తారు? అలాంటి వారికి రైతుల కష్ట సుఖాలు ఎలా తెలుస్తాయి? నేను 20 ఏళ్లుగా పార్టీలో ఉన్నాను. ఇన్చార్జి తన సొంత వర్గానికి పదవులు కట్టబెట్టి పార్టీ కోసం కృషి చేసిన మాకు మొండి చేయి చూపాలని చూస్తున్నాడు. ఇప్పటికైనా పార్టీ అభివృద్ధికి కష్టపడే వారిని గుర్తించి నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలి. -
పిచ్చికుక్క స్వైరవిహారం
పిచ్చికుక్క దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీరాంనగర్‌లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన చక్రవర్తి, సుబ్బారాయుడు, పెంకయ్య, హుసేనమ్మతో పాటు మరో వ్యక్తిపై పిచ్చికుక్క దాడి చేసి గాయపర్చింది. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
కత్తితో దాడి: ఇద్దరికి గాయాలు
గిద్దలూరు: ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో గురువారం ఉదయం నడిచి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రాచర్లకు చెందిన వై.మరియదాసు, టీవీ నారాయణ అనే ఇద్దరు మార్నింగ్ వాక్ చేస్తుండగా బైక్‌లపై వచ్చిన దుండగులు వారిని ఢీకొట్టారు. అనంతరం కత్తులతో దాడి చేయగా ఇద్దరికీ గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
గడ్డి మోపునకు విద్యుత్ తీగలు తగిలి...
గిద్దలూరు: ప్రకాశం జిల్లాలో విద్యుత్ తీగలు తగిలి మహిళ మృతి చెందింది. గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో గురువారం మధ్యాహ్నాం తలపై మోసుకు వస్తున్న గడ్డి మోపునకు తక్కువ ఎత్తులో ఉన్న కరెంటు తీగలు తగిలి షేక్ చాంద్‌బీ(35) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే మహిళ మృతికి కారణమైందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
యువకుని దారుణ హత్య
గిద్దలూరు రూరల్ : కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఆటోడ్రైవర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు మడత బ్లేడుతో గొంతుకోసి అతి కిరాతకంగా హత్యచేశారు. ఈ సంఘటన గిద్దలూరు మండలంలోని కేఎస్ పల్లె రోడ్డులో ఉన్న ఫారమ్ సమీపంలో మంగళవారం వేకువజామున జరిగింది. ఆ వివరాల ప్రకారం... కర్నూలు జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన టంకం జాకీర్‌హుస్సేన్ (25) టాటా ఏస్ లగేజీ ఆటోకు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎక్కువగా నంద్యాల, మహానంది ప్రాంతాల నుంచి అరటిలోడులు వేసుకుని గిద్దలూరు, చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తుంటాడు. ఈ నేపథ్యంలో గిద్దలూరు మండలం నరవ గ్రామంలో బియ్యం లోడు ఉందని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో గోపవరం గ్రామంలోని ఇంటి నుంచి బయలుదేరిన జాకీర్‌హుస్సేన్.. మంగళవారం ఉదయం స్థానిక కేఎస్ పల్లె రోడ్డులోని ఫారమ్ సమీపంలో శవమై కనిపించాడు. అతని ఆటో అక్కడే రోడ్డు మార్జిన్లో నిలిపి ఉంది. ఆ వాహనానికి కొంతదూరంలో ఉన్న రైల్వే పట్టాలు, రోడ్డుకు మధ్య చిల్లచెట్లలో శవమై పడిఉన్నాడు. అతని గొంతుపై బ్లేడుతో కోసినట్లు గాయమై ఉంది. మంగళవారం ఉదయం అటుగా వెళ్తున్న వారి ద్వారా సమాచారం అందుకున్న మార్కాపురం డీఎస్పీ శ్రీహరిరావు, సీఐ ఎండీ ఫిరోజ్, ఎస్సై ఎం.రాజేష్‌లు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. జాకీర్‌ను ఆటోలో నుంచి హంతకులు బలవంతంగా బయటకు ఈడ్చుకెళ్లి అదే ఆటోలో ఉన్న అరటి గెలలు కోసేందుకు ఉపయోగించే మడత బ్లేడ్లతో గొంతుకోసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు ఉపయోగించిన బ్లేడ్లలో ఎరుపు రంగు బ్లేడు ఒకటి హత్య జరిగిన స్థలంలోనే పడి ఉండగా, పసుపురంగు బ్లేడు రక్తపు మరకలతో ఆటోలోనే ఉంది. మరో బ్లేడు విరిగి ఆటో టైర్లవద్ద పడి ఉంది. ఆటోలో మరో వ్యక్తికి సంబంధించిన చెప్పులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు జాకీర్‌కు ఏప్రిల్ నెలలో వివాహం కుదిరినట్లు సమాచారం. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ఏరియా వైద్యశాలకు పోలీసులు తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆగని అన్నదాత మృత్యుఘోష
జిల్లాలో అన్నదాత ఆక్రందన ఆగడం లేదు. ప్రకృతి ప్రకోపంతో కొందరు, పాలకుల వైఖరితో మరికొందరు, బ్యాంకుల నోటీసుల అవమానాలతో ఇంకొందరు మనస్తాపానికి గురై నేలకొరుగుతున్నారు. బతకడానికి దారులు మూసుకుపోవడంతో చావులో ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో ఐదుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరో విషాదం: గిద్దలూరు మండలం బురుజుపల్లె గ్రామానికి చెందిన యరముల వెంకటరెడ్డి (50) పురుగుమందుకు బలైపోయాడు. వెంకటరెడ్డి తనకున్న పదమూడెకరాల పొలంలో వరి, మొక్కజొన్న, పత్తి పంటల్ని సాగు చేశారు. బోర్లను నమ్ముకుని వ్యవసాయం చేశాడు. ప్రకృతి కరుణించడంతో ఇల్లు కూడా కట్టుకున్నాడు. పొలంలో వేసిన బోర్లలో నీరు తగ్గిపోవడం, పంటలు ఎండిపోతుండటం, మరోవైపు అప్పులు 30 లక్షలు దాటిపోవడంతో పొలానికి పిచికారీ చేసే పురుగుమందు తీసుకుని చనిపోయాడు. జనవరి17న: యద్దనపూడి గ్రామానికి చెందిన రైతు గొట్టిపాటి ఆదియ్య పురుగుమందు తాగి చనిపోయాడు. రైతు కాస్తా కౌలు రైతుగా మారిన ఆదియ్య వ్యవసాయంపై మక్కువ తీరక, వేరే ఉపాధి లేక ఆరెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తూ వచ్చాడు, గత ఏడాది శనగ సాగు చేసి గిట్టుబాటు ధర లేకపోవడంతో తక్కువ రేటుకు అమ్ముకుని నష్టపోయాడు. ఈ ఏడాది మళ్లీ పత్తి సాగు చేశాడు. దీని కోసం కుమార్టె బంగారం తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడు. ఈ ఏడాది పత్తి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, దిగుబడులు కూడా తగ్గడంతో ఆందోళనతో ఉన్న ఆదియ్య, రుణం చెల్లించాలని బ్యాంకు నోటీసులు రావడంతో పురుగుమందును ఆశ్రయించాడు. సెప్టెంబరు 23న: పర్చూరు నియోజకవర్గం మార్టూరు మండలం కోలలపూడి గ్రామానికి చెందిన దాసరి లక్ష్మీనారాయణ గత ఏడాది సెప్టెంబర్ 23న పొలంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తనకు ఉన్న కొద్దిపాటి భూమితోపాటు కౌలు సాగు చేస్తుంటాడు. ఇతనికి సొంతపొలం ఎకరం 38 సెంట్లుండగా, నాలుగెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. తన సొంత భూమిలో రూ.20 పెట్టుబడితో గోరుచిక్కుడు సాగు చేయగా తెగుళ్లు సోకి పంట చేతికి రాలేదు. నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నా వర్షాలు లేకపోవడంతో ఎకరంన్నరలోనే వరి వేశాడు. కౌలు పొలంలో ఎకరంన్నర సాగు చేసిన వరి నీరు సకాలంలో అందక ఎండుముఖం పట్టింది. అప్పటికే 25 వేలు ఖర్చు చే శాడు. మిగిలిన రెండున్నర ఎకరాలలో వర్షాలు సక్రమంగా సాగు చేయలేదు. దీంతో గతంలో ఉన్న అప్పులతోపాటు సాగు సక్రమంగా లేక రైతు ఆత్యహత్య చేసుకున్నాడు. నవంబరు 28న: యద్దనపూడి మండలంలోని చిమటవారిపాలెం గ్రామానికి చెందిన రైతు గనిపిశెట్టి వెంకట్రావు(52) గత ఏడాది నవంబర్ నెల 28న పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. రుణమాఫీ అవుతుందో లేదో తెలియక బ్యాంకులో పాసు పుస్తకాలుపై తీసుకున్న అప్పు బ్యాంకులు నోటీసులివ్వడంతో ఒన్‌టైమ్ సైటిల్ మెంట్‌కు దరఖాస్తు చేశాడు. మొత్తం లక్షా 80 వేల వరకూ బకాయి ఉండగా 96 వేల రూపాయలు వన్‌టైమ్ సెటిల్మెంట్ చేసుకున్నాడు. అప్పు తెచ్చి రూ.95 వేలు బ్యాంకులో జమచేశాడు. డబ్బులు కట్టిన తర్వాత కూడా పాస్‌పుస్తకాలు ఇవ్వకుండా బ్యాంకు అధికారులు తిప్పకున్నారు. పట్టాదారు పుస్తకాలు ఇవ్వాలని కోరినా బ్యాంకర్లు సకాలంలో ఇవ్వకపోవడంతో అవమానంగా భావించాడు. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటునట్లు లేఖరాసి ప్రాణాలు తీసుకున్నాడు. రుణమాఫీ కాకపోవడం, బ్యాంకు అధికారుల ఒత్తిడి ఫలితంగా పొన్నలూరు మండలం భోగనంపాడు గ్రామానికి చెందిన రైతు కరేటి వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి చెందాడు. తన భార్య పేరుతో బంగారం తాకట్టు పెట్టి రెండు విడతలుగా రుణం తెచ్చుకున్నాడు. మొదటి విడత తెచ్చిన రుణం పూర్తిగా చెల్లించినా రెండో విడత రుణం కట్టమని బ్యాంకు అధికారులు నోటీసులు పంపించారు. డబ్బు చెల్లించకపోతే బంగారం వేలం వేస్తామని బ్యాంకు అధికారులు నోటీసులు ఇవ్వడంతో మనస్థాపానికి గురై గుండెపోటుతో మరణించాడు. -
ప్రేమించినోడికి బైబై చెప్పింది
వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒక్కటవుదామని పోలీసులను ఆశ్రయించారు. యువతి తల్లిదండ్రులు వచ్చి కన్నీటిపర్యంతమయ్యారు. తమ పేగు బంధాన్ని కుమార్తెకు గుర్తు చేశారు. కరిగిన యువతి తల్లిదండ్రుల వెంట నడిచింది. ప్రేమించినోడికి బైబై చెప్పింది. సదరు యువకుడు వాహనం వెంట పడినా ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ సంఘటనకు ఆదివారం గిద్దలూరు పోలీసుస్టేషన్ వేదికగా నిలిచింది. గిద్దలూరు రూరల్ : మండలంలోని సూరేపల్లె గ్రామానికి చెందిన బాషా విశాఖపట్నంలో బీటెక్ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఎంటెక్ చదువుతున్న యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఇంతలో ఆ యువతికి వేరే వ్యక్తితో పెద్దలు వివాహం కుదిర్చారు. పెళ్లి ఇష్టం లేక ఆమె బాషాతో కలిసి గిద్దలూరు వచ్చింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. ఇంతలో యువతి తల్లిదండ్రులు గిద్దలూరు వచ్చారు. తమ కుమార్తెకు నచ్చజెప్పారు. మధ్యలో చదువు ఆగిపోతుందన్నారు. పేగు బంధాన్నీ సదరు గుర్తు చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె తల్లిదండ్రుల వెంట నడి చేందుకు సిద్ధమైంది. స్నేహితుడు బాషా ఎంత బతిమాలినా ఆమె పట్టించుకోలేదు. యువతి వెళ్తున్న వాహనం వెంట బాషా పరుగులు తీశాడు. ఒకసారి ఆలోచించాలని వేడుకున్నాడు. ఇద్దరి మధ్య ప్రేమనూ గుర్తు చేశాడు. చివరకు పేగు బంధం ముందు ప్రేమ ఓడిపోయింది. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేదాని కన్నా ఆ సన్నివేశం పలువురిని ఆలోచింపజేసింది. -
లారీ బోల్తా,ఆరుగురు మృతి
-
తెల్ల బంగారానికి తెగుళ్ల దెబ్బ
ఆకాశాన్నంటిన ఎరువులు, క్రిమిసంహారక మందులతో సతమతమవుతున్న పత్తి రైతుకు పిండి నల్లి, ఇతర తెగుళ్లు కూడా భయపెడుతున్నాయి. ఇప్పటి వరకు పత్తి పంటకు దాదాపు రూ.15 నుంచి రూ.20వేల వరకు పెట్టుబడి పెట్టారు. తీరా కాయ దశకు చేరుకునే సమయంలో తెగుళ్లు ఆశించడంతో దిగులు పట్టుకుంది. గిద్దలూరు సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో దాదాపు 10,500 హెక్టార్లలో పత్తి పంట సాగుచేశారు. పంట సాగుచేసినప్పటి నుంచి పత్తి రైతులను ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంది. పది రోజుల కిందటి వరకు వర్షాభావ పరిస్థితులతో పంట ఎదుగుదల లేక దిగుబడి తగ్గింది. అనంతరం కురిసిన వర్షాలతో కలుపు మొక్కలు పెరిగి పెట్టుబడి భారం పెరిగింది. వర్షం నిలిచిపోయిన తరుణంలో తిరిగి పత్తి పంటకు దోమ పోటు, పిండినల్లి సమస్య తీవ్రమైంది. ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా ఉధృతి తగ్గడం లేదని రైతులు తెలిపారు. ఈ ఏడాది పత్తి పంట దిగుబడి సగానికిపైగా పడిపోయే పరిస్థితి ఏర్పడింది. తెగుళ్లతో మొక్క పెరుగుదల నిలిచిపోయి వచ్చిన పూత, పిందెలు రాలిపోతున్నాయి. నివారణకు ఇవీ సూచనలు : పచ్చదోమ నివారణకు థయోమితాక్జిన్ లేదా, ఎసిటమిప్రైడ్ మందుల్లో ఏదో ఒకదానిని లీటరు నీటిలో 0.2 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. ఇమిడాక్లోప్రిడ్‌ను 10 లీటరు నీటికి 6 నుంచి 10 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేస్తే నివారించవచ్చని వ్యవసాయ అధికారి జి.మీరయ్య సూచించారు. పిండి నల్లి నివారణకు లీటరు నీటికి 3 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ మందును కలిపి పిచికారీ చేస్తే పూర్తిగా నివారించవచ్చన్నారు. ఆకులు ఎర్రగా మారినట్లు కనిపిస్తే అందుకు కిలో మెగ్నీషియం సల్ఫేట్‌ను పిచికారీ చేయాలన్నారు. -
పత్తికి అదనపు ధర చెల్లించండి
గిద్దలూరు : రైతులు కష్టపడి పండించిన పత్తికి అదనపు ధర వచ్చేలా సీసీఐ అధికారులు చర్యలు తీసుకోవాలని గిద్దలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి కోరారు. స్థానిక మార్కెట్ యార్డు ప్రాంగణంలో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. గిద్దలూరు నియోజకవర్గ ప్రాంత రైతులు నాణ్యమైన పత్తి పండిస్తారని సీసీఐ సీనియర్ కాటన్ పర్చేజ్ అధికారి పి.చంద్రారెడ్డితో చెప్పారు. జిల్లాలో పత్తి పండించే అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళారుల బారి నుంచి రైతులను కాపాడాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ సీజన్లో ఎక్కువ మంది రైతులు పత్తి సాగు చేశారని, వర్షాభావ పరిస్థితులతో దిగుబడులు తగ్గిపోయి పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని విచారం వ్యక్తం చేశారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. పంట పూర్తయ్యే వరకూ సీసీఐ కేంద్రాలు కొనసాగించాలన్నారు. పత్తి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే ముత్తుమల ఆకాంక్షించారు. అనంతరం రైతులకు ధరలు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. తేమ 8 నుంచి 12 శాతం వరకు ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. 8 శాతం తేమ ఉన్న పత్తికి రూ.4,050లు, తేమశాతం ఎక్కువగా ఉంటే ఒక్కో శాతానికి రూ.40.50ల చొప్పున తగ్గించి చెల్లిస్తామన్నారు. జిల్లాలో ఏడు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ ఏడాది గిద్దలూరు, దర్శి మార్కెట్ యార్డుల్లో కూడా కొత్తగా కేంద్రాలు ప్రారంభించినట్లు చంద్రారెడ్డి వివరించారు. నిబంధనలకు లోబడే రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తామని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ కడప వంశీధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధికార ప్రతినిధి దప్పిలి రాజేంద్రప్రసాద్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ మోపూరి బ్రహ్మం, నగర పంచాయతీ కో ఆప్షన్ సభ్యుడుదమ్మాల జనార్దన్, నాయకులు సూరా పాండురంగారెడ్డి, ఓబుల్‌రెడ్డి, పాశం మురళి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఆర్డీ రామకృష్ణ, కార్యదర్శి వి.ఆంజనేయులు, పత్తి కొనుగోలు కేంద్రం సహాయ అధికారి రోశయ్య పాల్గొన్నారు. -
ఇక దద్దవాడకు మహర్దశ
గిద్దలూరు: వెనుకబడిన గిద్దలూరు నియోజకవర్గంలో అభివృద్ధికి దూరంగా ఉన్న దద్దవాడ పంచాయతీని సంసాద్ ఆదర్శ గ్రామ యోజనలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎన్నుకోవడంతో ఆ గ్రామానికి మహర్దశ పట్టనుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. స్థానిక తన నివాసంలో దద్దవాడ గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఐదేళ్ల కాలంలో మూడు గ్రామాలను ఎన్నుకుని అభివృద్ధి చేయాలని నిర్ణయించారన్నారు. అందులో దద్దవాడను చేర్చాలని కోరిన వెంటనే ఎంపీ ప్రకటించడం ఆనందదాయకమన్నారు. గిద్దలూరు ప్రాంతంలో జవాన్లు అధికంగా ఉన్నారని సైనిక స్కూల్ ఏర్పాటు చేయాలని కోరగానే ఎంపీ రక్షణశాఖ మంత్రిని కలిసి ప్రతిపాదనలు చేశారన్నారు. ఈ సంద ర్భంగా ఎంపీ వై.వి.సుబ్బారెడ్డికి నియోజకవర్గ ప్రజలు, దద్దవాడ ప్రజల తర ఫున కృతజ్ఞతలు తెలిపారు. రుణమాఫీపై ప్రభుత్వ తీరు దారుణం: ఎన్నికల సమయంలో అధి కారం కోసం టీడీపీ వ్యవసాయ రుణాలను ఎలాంటి ఆంక్షలు లేకుండా మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. రూ.87 వేల కోట్లుఉన్న రుణాలను రూ.5 వేల కోట్లకు తగ్గించేందుకు కుట్రపన్నుతున్నారని విమర్శించారు. రేషన్‌కార్డుకు, ఆధార్‌కార్డుకు ఒక్క అక్షరం తప్పు ఉన్నా రుణమాఫీ చేయకుండా కొర్రీ వేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు రైతులను అబద్ధపు హామీలతో మోసగించేకన్నా...తన కు చేతకాదని చెప్పి వారికి క్షమాపణ చెప్పవచ్చుకదా అని ఎద్దేవా చేశారు. వేలాది మంది లబ్ధిదారులను విచారించేందుకు, వారి రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు తీసుకునేందుకు రెండు రోజుల సమయం ఇస్తే వారు ఎలా సర్వే నిర్వహిస్తారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీలకు అప్పగిస్తే ఈసర్వే పూర్తి చేసి 15వ తేదీలోగా బ్యాంకులో అప్లోడ్ చేయడం సాధ్యమయ్యే పనేనా అని ఆయన ప్రశ్నించారు. రాష్ర్టం విడిపోయిన నేపథ్యంలో ఆర్ధిక పరిస్థితిని గమనించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి రైతులకు రుణమాఫీ చేయడం సాధ్యంకాదని హామీ ఇవ్వలేదని, హామీలు ఇచ్చి రైతులను మోసం చేయడం ఇష్టం లేకనే చెప్పలేదన్నారు. టీడీపీ మోసపూరిత హామీలు ఇచ్చి కమిటీలు, సాధికార సంస్థల పేరుతో కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బూటకపు రుణమాఫీ హామీ వలన రైతులు తీసుకున్న రుణాలకు అధిక వడ్డీలు చెల్లించాల్సి పరిస్థితి నెలకొందన్నారు. రుణాలు చెల్లించకపోవడంతో పంటల బీమా కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఆయన వెంట దద్దవాడ సర్పంచి గులాం చిన్నవీరయ్య, ఉపసర్పంచి బిజ్జం వెంకటరెడ్డి, కొమరోలు వైస్ ఎంపీపీ బి.చిన్నఆంజనేయులు, మాజీ సర్పంచి బిజ్జం వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సూరా స్వామిరంగారెడ్డి, నాయకులు రోశిరెడ్డి, నారు వెంకటేశ్వర్లు, నారాయణరెడ్డి, కైపా కోటేశ్వరరెడ్డి ఉన్నారు. -
రాక్షస పాలనను వీడు బాబూ..
గిద్దలూరు: ప్రజలను మోసం చేస్తే తాము సహించమని, తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు వైఎస్సార్సీపీ వెనకాడదని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, ఒంగోలు ఎంపీ వైవీ.సుబ్బారెడ్డి అన్నారు. టీడీపీ ప్రకటించిన రైతులు, డ్వాక్రా రుణమాఫీపై చేస్తున్న తాత్సారానికి నిరసనగా స్థానిక తహ శీల్దారు కార్యాలయం ఎదుట బుధవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. మోసపూరితమైన రాక్షస పాలనను విడిచి ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి సంక్షేమ పాలనను అందించాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులు, డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలు చెల్లించొద్దని, తాను అధికారంలోకి రాగానే అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తామని చెప్పిందన్నారు. రైతులు, మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు వారికిచ్చిన హామీలను అమలు పరచడంలో మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. పంట దిగుబడులు రాక, పండిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు నాలుగేళ్లుగా అప్పుల్లో కూరుకుపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు చెల్లించలేని పరిస్థితిలో నలిగిపోతున్నారని, అప్పులు పుట్టక పెట్టుబడులు లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. 2004 లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్‌పై మొదటి సంతకం పెడతానని ఇచ్చిన హామీని నెరవేర్చారని, అలానే చంద్రబాబు చేస్తాడని ఆశపడి ఓట్లేసిన వారి ఆశల్ని అడియాశలు చేస్తూ రోజుకో ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ జరుగుతుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రైతులు, మహిళలను ఇలా మోసం చేయడం ఎంత వరకు భావ్యమని ఆయన ప్రశ్నించారు. రైతులు, మహిళలు తీసుకున్న రుణాలు తీరక పోగా, కొత్త అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకాడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 86 వేల కోట్ల రూపాయల అప్పులుండగా, దానికి మరో రూ.26 వేల కోట్ల వరకు వడ్డీ వచ్చిందని, ఇప్పటి వరకు ఒక్క రూపాయి మాఫీ చేయలేదన్నారు. లక్ష కోట్లకు పైగా ఉన్న అప్పుకు రూ.5 వేల కోట్లు మంజూరు చేస్తామని చెప్పడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారు: ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని చె ప్పి.. ఐదు నెలలైంది ఏ ఒక్కటైనా అమలు చేశావా అని ఎంపీ ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేశార ని...జాబు రావడం కాదు ఉన్న జాబు ఊడగొట్టావని విమర్శించారు. కార్మికులు, ఆదర్శ రైతులను తొలగించి వారి ఉసురుకొట్టుకున్నారన్నారు. ఫీజు రీయంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల అవస్థలు అన్నీ ఇన్నీ కావని, ఫీజులు చెల్లించి చదువుకోలేక, చదువు మానేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. చంద్రబాబు సంక్షేమ పాలనను తెస్తానని నమ్మబలికి రాక్షస పాలనను అందిస్తున్నాడన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కార్పొరేషన్ సమావేశంలో ప్రశ్నించినందుకు మూడు కేసులు పెట్టించి రౌడీ షీట్ తెరుస్తామని చెబుతున్నారని, ఇలాంటి పాలన ఎన్నడూ చూడలేదన్నారు. ఇదేనా సంక్షేమం.. వృద్ధులు, వితంతువుల పింఛన్లు వెయ్యి రూపాయలకు పెంచుతామని చెప్పిన బాబు రాష్ట్రంలో 10 లక్షల మంది పింఛన్లు తొలగించి, 16 లక్షల మందికి చెందిన తెల్లరేషన్ కార్డులు తొలగించారని, వారిని వీధులపాలు చేసి ఉసురుపోసుకున్నాడని దుయ్యబట్టారు. ఇదేనా సంక్షేమమని ప్రశ్నించారు. పశ్చిమ ప్రకాశానికి తలమానికగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు తాము కృషిచేస్తామని, అందుకు తగిన నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు వైఎస్సార్సీపీ ముందుంటుందని, రేషన్ కార్డులు, పింఛన్లు అన్నీ మంజూరయ్యేలా పోరాటం చేస్తామన్నారు. ముందుగా ముత్తుముల గృహం నుంచి ర్యాలీగా తహ శీల్దారు కార్యాలయం వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. అనంతరం డిప్యూటీ తహ శీల్దారు వరకుమార్‌కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు కేవీ.రమణారెడ్డి, యేలం వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధులు సూరా స్వామిరంగారెడ్డి, దప్పిలి రాజేంద్రప్రసాద్‌రెడ్డి, మండల కన్వీనరు కే.హిమశేఖరరెడ్డి, పట్టణ కన్వీనర్ మోపూరి బ్రహ్మం, నగర పంచాయతీ చైర్పర్సన్ బండారు వెంకటసుబ్బమ్మ, ఎంపీపీ కడప వంశీధరరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు దుగ్గా రామ్మోహన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, రైతులు, డ్వాక్రా మహిళలు వేలాదిగా పాల్గొన్నారు. -
బాబు హామీలపై కన్నెర్ర
ఎన్నికల ముందు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారుస్తానని, రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని హామీల గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మొదటి ఐదు సంతకాలతో రాష్ట్ర రూపురేఖలే మారుస్తానన్న బాబు అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నత్తనడక కూడా నడవడం లేదు. బాబు వస్తే జాబు రాకపోగా ఉన్నవి ఊడుతున్నాయి ... నిరుద్యోగులకు భృతి రాకపోగా ఉద్యోగ ప్రకటనలు కూడా వెలువడడం లేదు. పింఛన్లు పెంచకపోగా... పింఛన్లు పెంచుతున్నామని చెప్పి కొత్త మార్గదర్శకాల పేరుతో జిల్లాలో 80 వేల మంది వృద్ధులకు పింఛన్లు ఎత్తివేశారు. దరఖాస్తులు అందజేసినా పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. డ్వాక్రాపై రూ.20 కోట్ల భారం జిల్లాలో 49 వేల డ్వాక్రా సంఘాలున్నాయి. ఎన్నికల హామీకి ముందు డ్వాక్రా రుణాలు రూ.750 కోట్లుండగా ఇప్పుడు అది రూ. 805 కోట్లకు చేరాయి. సకాలంలో రుణమాఫీ చేయకపోవడంవల్ల 4.5 శాతం వడ్డీ పడింది. దీంతో దాదాపుగా ఈ ఏడాది చివరికి రూ. 40 నుంచి 50 కోట్ల భారం పడనుంది. వడ్డీని కూడా అసలులో కలపడం వల్ల మరో రూ. 10 నుంచి 20 కోట్ల అదనపు భారం పడనుంది. రుణాలు కట్టలేదన్న సాకుతో ఈ ఏడాది రుణాలు కూడా బ్యాంకులు ఇవ్వడం లేదు. కాగితాలకే పరిమితం విమానాశ్రయం, శిల్పారామం, నిమ్జ్ కాగితాలకే పరిమితమయ్యాయి. శనగ రైతూ కుదేలు శనగరైతు కుదేలయ్యాడు. వీరి వద్ద నుంచి శనగలు కొనుగోలు చేస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. అసలు మాఫీకి బదులు వడ్డీ భారం రైతుల రుణాలు మాఫీ చేయడంలో ఘోరంగా విఫలమయింది. జిల్లాలో జాతీయ బ్యాంకులతోపాటు సహకార బ్యాంకుల ద్వారా రైతులు తీసుకున్న రుణాలు ప్రస్తుతం రూ.5,900 కోట్లున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు మూడు లక్షల మంది లబ్ధిదారులు రైతురుణ మాఫీకి అర్హులుగా ఉన్నారు. ప్రస్తుతం వీరిపై వడ్డీ రూపంలో రూ.300 కోట్లకు పైగా భారం పడింది. బాబూ వచ్చే జాబు పాయే జాబు కావాలంటే బాబు రావాలంటూ ఊదరకొట్టిన తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ డీలర్లు, మధ్యాహ్న భోజన వంట కార్మికులు, వివిధ ప్రభుత్వ సంస్థల్లోని పొరుగు సేవల ఉద్యోగలను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. మోగని సైరన్ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పినా ఒక్క పరిశ్రమ కూడా జిల్లాకు రాలేదు. రామాయపట్నం పోర్టు, పూలసుబ్బయ్య వెలి గొండ ప్రాజెక్టు, గుండ్లకమ్మ ప్రాజెక్టులు కూడా పూర్తయ్యే పరిస్థితి కనపడటం లేదు. నిరుద్యోగ భృతి తాను అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యోగమే కాదు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని బాబు ప్రకటించారు. తరువాత ఆ ఊసే ఎత్తడం లేదు. జిల్లాలో లక్షలాది మంది నిరుద్యోగులుండగా, అందులో 59 వే లమంది ఇప్పటికే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చెంజీల్లోలో నమోదు చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. విజయవంతం చేయండి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసేవరకూ పోరాటం చేస్తామని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని తహశీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించే ధర్నాలను విజయవంతం చేయాలని ఆయన జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. గిద్దలూరులో జరిగే ధర్నాలో తాను పాల్గొంటానన్నారు. -
వాటర్‌షెడ్‌లో అవినీతి ఊట
గిద్దలూరు: వాటర్‌షెడ్ పనులు అధికారుల జేబులు నింపుతున్నాయి. మండలంలోని ముండ్లపాడు మెగావాటర్‌షెడ్ పరిధిలో నాశిరకపు పనులకు తోడు, బోగస్ మస్టర్లతో నిధులు స్వాహా చేశారు. వారం రోజులుగా జరుగుతున్న సామాజిక తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.30 లక్షలకుపైగా అవినీతి బయటపడింది. జయరాంపురంలో సోమవారం జరిగిన సామాజిక తనిఖీ గ్రామసభలో ఆ గ్రామస్తులు వాటర్‌షెడ్ పనుల్లో అవకతవకలను అధికారులకు వివరించారు. మెగావాటర్ షెడ్ పరిధిలో 7 మైక్రో వాటర్షెడ్లున్నాయి. వీటికింద 2011 నుంచి దాదాపు రూ.1.60 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో సగం పనులు నీటి నిల్వ కార్యక్రమాలకు, మిగిలినవి పేదల జీవనోపాధులు పెంపొందించేందుకు రుణాలివ్వడం, శిక్షణ కార్యక్రమాలు, ఉద్యానవన మొక్కల పెంపకానికి ఖర్చు చేశారు. అయితే సిబ్బంది చేతివాటం ప్రదర్శించి సగానికిపైగా నిధులు దోచేసినట్లు తెలుస్తోంది. నీటినిల్వ కార్యక్రమాల తీరు ఇదీ... ముండ్లపాడు మెగావాటర్‌షెడ్ పరిధిలో రూ.61.70 లక్షలతో నీటినిల్వ కార్యక్రమాలు చేపట్టారు. నీటినిల్వ కుంటలు, రాతికత్తువలు, చెక్‌డ్యాంలు, రాక్‌ఫిల్‌డ్యాంలు నిర్మించారు. ఇందుకు రూ.87.45 లక్షలు ఖర్చు చేశారు. కూలీలకు రూ.17.68 లక్షలు, మెటీరియల్‌కు రూ.69.77 లక్షలు, ప్రాజెక్టును పరిచయం చేసేందుకు ప్రాథమిక పని కింద క్రిష్ణంశెట్టిపల్లెలో వాటర్‌ప్లాంటు ఏర్పాటుకు రూ.4.25 లక్షలు వెచ్చించారు. ఇందులో నాణ్యతలేని పరికరాలు ఇచ్చి నిధులు స్వాహా చేశారు. నీటినిల్వ పనుల్లో కూలీల చేత చేయించాల్సిన వాటిని జేసీబీలతో చేసి కూలీల పేర్లతో మస్టర్లు వేసి తపాలాశాఖ సిబ్బంది సహకారంతో వాటర్‌షెడ్ అధికారులు నిధులు దోచేశారు. ఇలా రూ.17.68 లక్షలను సిబ్బంది నొక్కేసినట్లు విచారణలో తేలింది. మెటీరియల్ పేమెంట్ కింద ఖర్చు చేసిన నిధుల్లో భారీగా అవినీతి జరిగినట్లు బయటపడింది. రాతి కత్తువల నిర్మాణానికి తరలించిన రాళ్లను నాలుగు కిలోమీటర్లకు బదులు 8 కిలోమీటర్లుగా నమోదు చేసి అధిక మొత్తంలో నిధులు డ్రాచేశారు. అంబవరంలో నిర్మించిన కుంటలకు కట్టిన రాతి కత్తువలు తక్కువ సైజు కుంటలకు ఎక్కువ కొలతలు చూపించి నిధులు నొక్కేశారు. ఇలా నిర్మించిన కుంటలు అధిక శాతం కొట్టుకుపోయాయని తేలింది. ప్రాజెక్టు పరిధిలోని పనులను వాటర్‌షెడ్ సిబ్బందే కాంట్రాక్టరు అవతారం ఎత్తి నాశిరకంగా చేసి నిధులు స్వాహా చేశారని రైతులు ఆరోపించారు. జయరాంపురంలో నిర్మించిన మూడు చెక్‌డ్యాంలు నాశిరకంగా ఉండటంతో వర్షపు నీరు నిల్వ ఉండటం లేదని గ్రామస్తులు తెలిపారు. చాలా చోట్ల చెక్‌డ్యాంల నిర్మాణాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. మెటీరియల్ పేమెంట్‌లో సిబ్బంది వారికి అనుకూలంగా ఉండే వారి ఖాతాల్లో నిధులు జమచేసి అనంతరం వారి నుంచి నిధులు తీసేసుకున్నారని తేలింది. జీవనోపాధుల నిధుల్లోనూ మాయాజాలం: మెగా వాటర్‌షెడ్ కింద పేద మహిళలకు జీవనోపాధులు పెంపొందించేందుకు కేటాయించిన నిధుల్లోనూ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. వాటర్‌షెడ్ కమిటీలకు తెలియకుండానే తమకు నచ్చిన వారికి రుణాలిచ్చారు. వ్యవసాయం కోసం రుణాలు ఇవ్వకూడదని ఉన్నా ఐకేపీ సిబ్బందికి తగిన అవగాహన కల్పించకపోవడంతో ఎక్కువ రుణాలను వ్యవసాయం కోసం ఇచ్చారు. విత్తనపు పొట్టేళ్ల యూనిట్లు 26 మంజూరు చేయగా అందులో ఎక్కువ మందికి గొర్రెలు లేనివారికి ఇచ్చి సిబ్బంది సొమ్ము చేసుకున్నారు. మొక్కలు నాటకుండానే బిల్లులు: వాటర్‌షెడ్ పరిధిలో ఉద్యానవన మొక్కల పెంపకానికి కేటాయించిన నిధులను మొక్కలు నాటకుండానే స్వాహా చేశారు. ఇలా ఒక్క జయరాంపురం మైక్రో వాటర్‌షెడ్ పరిధిలోనే దాదాపు రూ.2 లక్షల వరకు డ్రా చేసుకున్నారు. వాటర్‌షెడ్ అధికారులు గ్రామ స్థాయిలో తన అనుయాయులను పెట్టుకుని నిధులను స్వాహా చేశారని జయరాంపురం గ్రామస్తులు సామాజిక తనిఖీ సిబ్బందికి వివరించారు. సామాజిక తనిఖీ గ్రామసభలో కంభం వ్యవసాయాధికారి అర్జున్‌నాయక్, వెల్లుపల్లె పశువైద్యాధికారి శ్రావణ్‌కుమార్, మెగా వాటర్‌షెడ్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసరెడ్డి సామాజిక తనిఖీ స్టేట్ రిసోర్సుపర్సన్ నాగార్జున, డీఆర్పీలు, ఐకేపి సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు. -
ఎస్సైని సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్
గిద్దలూరు: ఎస్సై దురుసు వైఖరితో వైఎస్సార్ సీపీ నాయకుడు మృతి చెందడంతో గిద్దలూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గిద్దలూరు సహకార సంఘ అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు వైజా భాస్కరరెడ్డి గుండెలపై ఎస్సై వై శ్రీనివాసరావు బలంగా చేత్తో నెట్టడంతో ఆయన గుండెపోటుకు గురై మృతిచెందారు. దీంతో సోమవారం రాత్రి నుంచి గిద్దలూరు పోలీస్‌స్టేషన్‌లోనే మృతదేహాన్ని ఉంచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ధర్నా నిర్వహించారు. ఎస్సైని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముత్తుముల మాట్లాడుతూ ఎస్సై వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష కట్టి దాడులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడ్ని కొట్టుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లిన ఎస్సై చర్యలను ఖండించిన వైజా భాస్కర్‌రెడ్డిపై దుర్భాషలాడి దాడికి పాల్పడటం ఎంత వరకు సమంజసమన్నారు. గతంలోనూ ఎస్సై ఇలాంటి దాడులకు పాల్పడి వైఎస్సార్ సీపీ కార్యకర్తలను భయాందోళనలకు గురిచేశారని అన్నారు. ఎస్సైతో పాటు డీఆర్ఆర్ ప్లాజా వద్దకు వెళ్లి దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుళ్లను కూడా వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా విరమించాలని సీఐ నిమ్మగడ్డ రామారావు వారిని కోరారు. అయినా ఆందోళన ఉధృతం కావడంతో మార్కాపురం డీఎస్పీ జీ రామాంజనేయులు అక్కడకు వచ్చారు. ఎస్సైని సస్పెండ్ చేయడం కుదరదని డీఎస్పీ చెప్పడంతో పోలీసు వ్యవస్థ టీ డీపీకి అమ్ముడు పోయిందని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తప్పు చేసిన ఎస్సైని రక్షించేందుకు డీఎస్పీ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఏఎస్పీ రామానాయక్ గిద్దలూరు చేరుకుని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డితో చర్చించారు. సంఘటన వివరాలు తెలుసుకున్న ఆయన..ఎస్సైని వీఆర్‌కు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సై శ్రీనివాసరావుపై హత్యాయత్నం (సెక్షన్ 304) కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. వివాదానికి కారణమైన సుబ్బారావుపై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళన విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వైజా భాస్కర్‌రెడ్డి చనిపోయాడని సమాచారం అందుకున్న బంధువులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని బోరున విలపించారు. అసలేం జరిగిందంటే... పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో డీజీఆర్ హాస్పిటల్‌ను నిర్వహిస్తున్న డాక్టర్ హరనాథరెడ్డి స్థానిక డీఆర్ఆర్ ప్లాజాలో నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్లో హీరోహోండా షోరూం నిర్వాహకుడు తోట సుబ్బారావు కుటుంబం నివాసం ఉంటోంది. ముందుగా హరనాథరెడ్డి వాహనాన్ని పార్కింగ్‌లో పెట్టారు. వెనకాల అపార్ట్‌మెంట్‌కు వచ్చిన సుబ్బారావు తన కారుకు హరనాథరెడ్డి కారు అడ్డుగా ఉందంటూ ఆ వాహనాన్ని ఢీ కొట్టి దూషించారు. దీంతో ఆగ్రహించిన హరనాథరెడ్డి తండ్రి ‘మా పార్కింగ్ స్థలంలో కారును పెట్టుకున్నాం.. నీవెందుకు తిడుతున్నావని’ ప్రశ్నించగా ఆయనపై సుబ్బారావు దాడికి దిగాడు. పక్కనే ఉన్న మరో విశ్రాంత ఉద్యోగి గొడవెందుకని వారించేందుకు వెళ్లగా సుబ్బారావు భార్య ఆయనను కొట్టిందని స్థానికులు తెలిపారు. ఆ వెంటనే సుబ్బారావు ఎస్సైకి ఫోన్ చేసి గొడవ జరుగుతుందని సమాచారం అందించాడు. ఎస్సై వై.శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని డాక్టర్ హరనాథరెడ్డి, ఆయన తండ్రి, భార్య ఇలా అందరిపై దాడి చేశారు. మహిళ అని కూడా చూడకుండా హరనాథరెడ్డి భార్యను దూషించి తన వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించాడు. డీఆర్ఆర్ ప్లాజా యజమాని అయిన వైజా భాస్కర్‌రెడ్డి సమాచారం తెలుసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అప్పటికి హరనాథరెడ్డిని వైద్యుడు అని కూడా చూడకుండా పోలీసులు కింద కూర్చోబెట్టి..సుబ్బారావును కుర్చీలో కూర్చోబెట్టారు. దీంతో ఆగ్రహించిన భాస్కర్‌రెడ్డి డాక్టర్‌కు ఇచ్చే మర్యాద ఇదేనా..అని సీఐ రామారావును ప్రశ్నించారు. తాను మాట్లాడి పంపిస్తానని సీఐ చెబుతుండగానే..పక్కనే గదిలో ఉన్న ఎస్సై అక్కడకు చేరుకుని సుబ్బారావుపై దాడిచేసిన వారితో మాట్లాడేదేంటి అని..ముగ్గురిపై కేసు కడతానని ఆగ్రహంగా ఉన్నాడు. తాను వారితో మాట్లాడతానని సీఐ సర్దిచెప్పినా వినకుండా..కేసు రిజిస్టర్ చేయకపోతే తాను రాజీనామా చేస్తానని ఎస్సై చెప్పాడు. దీంతో ‘మా వారిపై కేసులు పెట్టడం మామూలే కదా’ అని వైజా భాస్కరరెడ్డి ఎస్సైని నిలదీశారు. అలా మాటా..మాటా పెరిగి ఎస్సై భాస్కర్‌రెడ్డి గుండెలపై చేత్తో బలంగా నెట్టాడు. దీంతో ఆయన గుండెల్లో నొప్పి అంటూ మంచినీళ్లు తాగి కాసేపు కూర్చున్నారు. శ్వాస అందడం లేదని బయటకు వచ్చిన వైజా నేలకొరిగి చనిపోయారు. భాస్కర్‌రెడ్డిని ఎస్సై కొట్టడంతోనే గుండెనొప్పికి గురై మరణించాడని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తూ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. -
'రాష్ట్రాన్ని చంద్రబాబు సోమాలియాగా మారుస్తున్నారు'
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటూ సోమాలియాగా మారుస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... ప్రకాశం జిల్లా గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భాస్కరరెడ్డి మరణం పోలీసులతో టీడీపీ నేతలు చేయించిన రాజకీయ హత్య అని ఆమె అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రానికి కొత్త చరిత్ర కావాలి కానీ... రక్త చరిత్ర కాదని చంద్ర బాబుకు ఈ సందర్బంగా పద్మ హితవు పలికారు. రాష్ట్రంలో టీడీపీ హత్య రాజకీయాలను తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రస్తావించారని పద్మ ఈ సందర్బంగా గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ తాజాగా అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తల దాడిలో 17 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హత్యకు గురవ్వగా, 110 మందికి తీవ్ర గాయాలయ్యాయని, వారిలో 40 మంది పరిస్థితి విషమంగా ఉందని శాసనసభ దృష్టికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన విషయాన్ని మీడియాకు గుర్తు చేశారు. టీడీపీ చేస్తున్న హత్యా రాజకీయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని ఆమె స్పష్టం చేశారు. -
అకాల వర్షంతో రైతులు విలవిల
గిద్దలూరు రూరల్, న్యూస్‌లైన్: మండలంలో సోమవారం సాయంత్రం వీచిన బలమైన ఈదురుగాలులు, వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వెంకటాపురం, బురుజుపల్లి, దిగువమెట్ట, రాజుపేటలో రైతులు ఎక్కువగా నష్టపోయారు. వెంకటాపురానికి చెందిన పసుపు రైతులు అకాల వర్షం దెబ్బకు పసుపు కొమ్ముల్ని రక్షించుకునేందుకు అవస్థ పడ్డారు. గ్రామానికి చెందిన వట్టికూటి శ్రీనివాసరావు ఇంటి వద్ద బయట ఆరబోసిన పసుపు కొమ్ములు తడిసిపోయాయి. దిగువమెట్ట సమీపంలోని మామిడి తోటలో ఈదురుగాలులకు మామిడి కాయలు రాలిపోయాయి. రాజుపేట, మిట్టమీదపల్లె గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభం నేలకొరిగింది. ఫలితంగా గ్రామంలోని 28 వ్యవసాయ మోటార్లకు సరఫరా నిలిచిపోయింది. గాలులకు బురుజుపల్లె వెంకటాపురం గ్రామానికి వెళ్లే రోడ్డులో ఉన్న విద్యుత్ స్తంభం తీగలతో సహా కిందకు ఒరిగి ప్రమాదకరంగా ఉంది. -
గిద్దలూరులో తెలుగు తమ్ముళ్ల గుర్రు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో చేరి గిద్దలూరు సీటు దక్కించుకున్న అన్నా రాంబాబుకు తెలుగు తమ్ముళ్ల నుంచి వ్యతిరేకత ఏర్పడుతోంది. చేరిన రోజే ఆయనకు సీటు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్ల పాటు జెండాలు మోసిన తమను కాదని, నామినేషన్లకు ఒక రోజు ముందు వచ్చిన రాంబాబుకు గిద్దలూరు సీటును కేటాయించడంపై గుర్రుమంటున్నారు. టీడీపీకి ఓటు వేసే గ్రామ స్థాయి ఓటర్లు కూడా ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తెలుగుదేశం ఓటర్లకు కనీసం రేషను కార్డు కూడా ఇప్పించని రాంబాబుకు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నిస్తున్నారు. గతంలో తమకు ఏమీ చేయలేదని, కాంగ్రెసు పార్టీకి చెందిన వారికే ప్రభుత్వ లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు చేశారని అంటున్నారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీకి వచ్చినా ఓటు ఎలా వేస్తామంటున్నారు. - ఇదిలా ఉంటే అన్నా రాంబాబు తెలుగుదేశం నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి వారితో ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. కార్యకర్తలకు, గ్రామ స్థాయి ఓటర్లకు మద్యం సరఫరా చేసి, ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గిద్దలూరులో మద్యం ఏరులై పారుతున్నట్లు సమాచారం. - ఈ నేపథ్యంలో తెలుగుదేశం సీటు ఆశించిన సాయికల్పనా రెడ్డి, తనకు సీటు దక్కకపోవడంతో, తన పుట్టిల్లు కర్నూలుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె కూడా అన్నా రాంబాబుకు సహకరించేందుకు సుముఖంగా లేరన్నట్లు సమాచారం. ఎన్నికల తరువాత గాని ఆమె గిద్దలూరు చేరుకునే అవకాశం లేదు. - ఇక ద్వితీయ శ్రేణి నాయకులు మహానంది యాదవ్, దేవ ప్రభాకర్ లాంటి వారు కూడా అన్నా రాంబాబు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. - అయితే అన్నా రాంబాబు ఆ పార్టీలోని అన్ని వర్గాల నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నా, ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. - తెలుగుదేశంకు చెందిన నాయకుడు ఒకరు మాట్లాడుతూ తాము గత 20 సంవత్సరాలుగా తెలుగు దేశం పార్టీ జెండాలు మోస్తున్నామని, తమను కాదని, ఒక్క రోజు ముందు వచ్చిన కాంగ్రెసు నాయకులకు పార్టీ టికెట్లు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. - తెలుగుదేశం నాయకులకు టికెట్ ఇస్తే, వారు గెలిచిన తరువాత, వారికి సహచరులుగా ఉన్న తమ లాంటి వారు ఎదగడానికి ఏదో ఒక అవకాశం వస్తుందని ఆశించామని అన్నారు. అయితే కొత్త వ్యక్తికి ఇవ్వడం వల్ల, ఆ అభ్యర్థి , తన సహచరులు ఎదగడానికి ప్రయత్నిస్తారని తెలిపారు. ఇన్నాళ్లు పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుందని అంటున్నారు. - ఇలాంటి నాయకులు అనేక మంది అన్నా రాంబాబు టీడీపీలోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలకు మరో రెండువారాల సమయం ఉండగా, అన్నా రాంబాబు వీరిని ఏవిధంగా సంతృప్తి పరచనున్నారో వేచి చూడాల్సి ఉంది.