గిద్దలూరు రూరల్ : కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఆటోడ్రైవర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు మడత బ్లేడుతో గొంతుకోసి అతి కిరాతకంగా హత్యచేశారు. ఈ సంఘటన గిద్దలూరు మండలంలోని కేఎస్ పల్లె రోడ్డులో ఉన్న ఫారమ్ సమీపంలో మంగళవారం వేకువజామున జరిగింది. ఆ వివరాల ప్రకారం... కర్నూలు జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన టంకం జాకీర్‌హుస్సేన్ (25) టాటా ఏస్ లగేజీ ఆటోకు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎక్కువగా నంద్యాల, మహానంది ప్రాంతాల నుంచి అరటిలోడులు వేసుకుని గిద్దలూరు, చుట్టుపక్కల ప్రాంతాలకు వస్తుంటాడు. ఈ నేపథ్యంలో గిద్దలూరు మండలం నరవ గ్రామంలో బియ్యం లోడు ఉందని ఇంట్లో చెప్పి బయలుదేరాడు.
సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో గోపవరం గ్రామంలోని ఇంటి నుంచి బయలుదేరిన జాకీర్‌హుస్సేన్.. మంగళవారం ఉదయం స్థానిక కేఎస్ పల్లె రోడ్డులోని ఫారమ్ సమీపంలో శవమై కనిపించాడు. అతని ఆటో అక్కడే రోడ్డు మార్జిన్‌లో నిలిపి ఉంది. ఆ వాహనానికి కొంతదూరంలో ఉన్న రైల్వే పట్టాలు, రోడ్డుకు మధ్య చిల్లచెట్లలో శవమై పడిఉన్నాడు. అతని గొంతుపై బ్లేడుతో కోసినట్లు గాయమై ఉంది. మంగళవారం ఉదయం అటుగా వెళ్తున్న వారి ద్వారా సమాచారం అందుకున్న మార్కాపురం డీఎస్పీ శ్రీహరిరావు, సీఐ ఎండీ ఫిరోజ్, ఎస్సై ఎం.రాజేష్‌లు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు.
జాకీర్‌ను ఆటోలో నుంచి హంతకులు బలవంతంగా బయటకు ఈడ్చుకెళ్లి అదే ఆటోలో ఉన్న అరటి గెలలు కోసేందుకు ఉపయోగించే మడత బ్లేడ్లతో గొంతుకోసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు ఉపయోగించిన బ్లేడ్లలో ఎరుపు రంగు బ్లేడు ఒకటి హత్య జరిగిన స్థలంలోనే పడి ఉండగా, పసుపురంగు బ్లేడు రక్తపు మరకలతో ఆటోలోనే ఉంది. మరో బ్లేడు విరిగి ఆటో టైర్లవద్ద పడి ఉంది. ఆటోలో మరో వ్యక్తికి సంబంధించిన చెప్పులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు జాకీర్‌కు ఏప్రిల్ నెలలో వివాహం కుదిరినట్లు సమాచారం. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ఏరియా వైద్యశాలకు పోలీసులు తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
యువకుని దారుణ హత్య
Published Wed, Feb 4 2015 4:29 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM
Advertisement
Advertisement