మన ఢిల్లీ... మన హెరిటేజ్‌ | World Heritage Sites in Delhi | Sakshi
Sakshi News home page

మన ఢిల్లీ... మన హెరిటేజ్‌

Published Mon, Feb 10 2025 8:19 AM | Last Updated on Mon, Feb 10 2025 10:12 AM

World Heritage Sites in Delhi

ఇక్కడ మనం చూస్తున్నవన్నీ ఢిల్లీ గొప్పదనాలు. వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా యునెస్కో గుర్తించిన నిర్మాణాలు. ఆగ్రాలో ఉన్న తాజ్‌మహల్‌... ఆగ్రా రెడ్‌ఫోర్ట్‌... ఈ రెండింటికీ గుర్తింపు 1983లో వచ్చింది. కుతుబ్‌ మినార్‌... హుమయూన్‌ సమాధి... వీటికి 1993లో ఆ హోదా వచ్చింది. దేశ రాజస దర్పణం రెడ్‌ఫోర్ట్‌ మాత్రం... ఈ గౌరవాన్ని 2007లో అందుకుంది.

ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ తబలా వాయించి ‘అరే హుజూర్‌ వాహ్‌ తాజ్‌ బోలియే’ అన్న ప్రకటనను మనదేశంలో దాదాపుగా అందరూ చూసి ఉంటారు. బ్యాక్‌గ్రౌండ్‌లో తాజ్‌మహల్‌ ఎంత అందంగా ఉంటుందో చెప్పలేం. ఇక్కడ ఓ విషయాన్ని గుర్తు చేసుకుందాం. రెడ్‌ఫోర్ట్‌కి తాజ్‌ మహల్‌కి ఓ దగ్గరి సంబంధం ఉంది. రెండింటి ఆర్కిటెక్ట్‌ ఒకరే... అతడే ఉస్తాద్‌ అహ్మద్‌ లాహోరీ. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించేటంతటి సౌందర్యం తాజ్‌మహల్‌ది. ఉత్తరప్రదేశ్‌లో కర్మాగారాల నుంచి విడుదలయ్యే కాలుష్యం కారణంగా పాతికేళ్ల కిందట తాజ్‌మహల్‌ గోడలు పసుపురంగులోకి మారాయి. 

ఆ సమయంలో తాజ్‌మహల్‌ని చూసిన వాళ్లు ఫొటోల్లోనే బాగుందనుకున్నారు. ఇప్పుడు అలాంటి అసంతృప్తి ఉండదు. మనదేశానికి అమెరికా అధ్యక్షుడు (తొలి దఫా అధ్యక్షుడుగా ఉన్న సమయం) డొనాల్డ్‌ ట్రంప్‌ వచ్చిన సందర్భంగా తాజ్‌మహల్‌కి మెరుగులు దిద్దారు. ఇప్పుడు పాలరాయి తెల్లగా మెరుస్తోంది. 42 ఎకరాల్లో నిర్మించిన తాజ్‌మహల్‌ నిర్మాణం రెడ్‌ఫోర్ట్‌ నిర్మాణం కంటే ఎనిమిదేళ్లు ముందు మొదలైంది. రెడ్‌ఫోర్ట్‌ పూర్తయిన తర్వాత ఐదేళ్లకు పూర్తయింది. అంటే 1631– 1653 వరకు 22 ఏళ్లు కట్టారు. ప్రధాన ద్వారం నుంచి లోపలికి అడుగు పెట్టిన తర్వాత ముందుకు నడిచే కొద్దీ తాజ్‌ మహల్‌ను తలెత్తి చూడాలి. తాజ్‌మహల్‌ నుంచి ఆగ్రాఫోర్ట్, షాజహాన్‌ ప్యాలెస్‌ చూడవచ్చు. తాజ్‌మహల్‌ వెనుక వైపు నుంచి బేస్‌మెంట్‌ కిందకు చూస్తే యమునా నది గంభీరంగా ప్రవహిస్తుంటుంది.

హుమయూన్‌ సమాధి భార్య ప్రేమకు చిహ్నం 
హుమయూన్‌ కా మఖ్బారా... హుమయూన్‌సమాధి. మనదేశానికి పర్షియా ఉద్యానవనశైలిని మనకు పరిచయం చేసిన కట్టడం ఇది. మనదేశంలో మొఘల్‌ వాస్తుశైలిలో నిర్మితమైన తొలికట్టడం. తాజ్‌ మహల్, హుమయూన్స్‌ టూంబ్‌ రెండూ సమాధి నిర్మాణాలే. రెండూ ఆర్కిటెక్చర్‌ పరంగా గొప్ప కట్టడాలే. తాజ్‌ మహల్‌ని భార్య జ్ఞాపకార్థం భర్త కట్టించాడు. హుమయూన్‌ టూంబ్‌ను భర్త జ్ఞాపకార్థం భార్య కట్టించింది. ప్రేమ చిహ్నంగా గొప్ప ప్రమోషన్‌ రాలేదు, కానీ నిర్మాణపరంగా ఇది కూడా గొప్ప కట్టడమే. 

హుమయూన్‌ సమాధి ఢిల్లీ శివార్లలో నిజాముద్దీన్‌లో ఉంది. ఈ సమాధి పైన గుమ్మటం ఎత్తు 42.5 మీటర్లు. ఈ సమాధి మొత్తం నేలకు ఒకటిన్నర మీటర్ల ఎత్తున్న గట్టు మీద ఉంటుంది. దాని మీద ఆరు మీటర్లకు పైగా ఎత్తున్న భవనాన్ని నిర్మించారు. ప్రధాన కట్టడం నిర్మాణం మాత్రమే కాకుండా దాని చుట్టూ ఉన్న ఉద్యానవనాల నిర్మాణం కూడా ప్రత్యేకమైనదే. మొఘల్‌ ఉద్యానవన శైలి చార్‌బాగ్‌ శైలి ఇందులో కూడా కనిపిస్తుంది. ఈ గార్డెన్‌ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన నీటి పంపులు, వాటర్‌ఫౌంటెయిన్‌లతో ఆధునిక సాంకేతికత కనిపిస్తుంది.

హుమయూన్‌ సమాధి నిర్మాణం క్రీ.శ 1562లో మొదలైంది. ఈ సంగతి తెలియగానే వచ్చే సందేహం ఒక్కటే...∙హుమయూన్‌ మరణించింది క్రీ.శ 1556 జనవరి 20వ తేదీ. మరి సమాధి అప్పుడు కట్టలేదా అనే ప్రశ్న నిజమే. మరణించిన వెంటనే పురానాఖిలాలో ఖననం చేశారు. కొంతకాలానికి శవపేటికను పెకలించి పంజాబ్‌ లోని సిర్‌హింద్‌కు తీసుకెళ్లారు. రాజ్యంలో పరిస్థితులు చక్కబడిన తర్వాత హుమయూన్‌ భార్య హమీదాబేగం (అక్బర్‌ తల్లి) భర్త జ్ఞాపకార్థం గొప్ప నిర్మాణం చేయాలనుకుంది. అదే ఇప్పుడు మనం చూస్తున్న హుమయూన్‌ సమాధి. ఈ నిర్మాణం పూర్తవడానికి పదేళ్లు పట్టింది. ఢిల్లీకి ట్రైన్‌లో వెళ్లేటప్పుడు నగరంలోకి ప్రవేశించడానికి ముందే నిజాముద్దీన్‌ స్టేషన్‌ వస్తుంది. సమాధి నిర్మాణం ఎత్తైన బేస్‌మెంట్‌ మీద ఉండడంతో ట్రైన్‌లోకి కనిపిస్తుంది.

సలామ్‌ .. రెడ్‌ ఫోర్ట్‌
మొఘలుల సామ్రాజ్య విస్తరణలో రెడ్‌ఫోర్ట్‌ది కీలకమైన స్థానం. షాజహాన్‌ తన రాజధానిని ఆగ్రా నుంచి ఢిల్లీకి మార్చాడు. ఇందులో షాజహాన్‌ నివసించిన ప్యాలెస్, ముంతాజ్‌ మహల్, రంగ్‌ మహల్, మోతీ మసీదు, ఇతర ప్యాలెస్‌లు ప్రతిదీ దేనికదే ప్రత్యేకమైన నిర్మాణాలే. ఇక్కడున్న దివానీ ఖాస్, దివానీ ఆమ్‌లు ఆగ్రాఫోర్ట్‌లో ఉన్న వాటికంటే భారీ నిర్మాణాలు. ఈ కోట ్రపాంగణం అంతా కలియదిరిగినప్పుడు ఇంత గొప్పగా డిజైన్‌ చేసిన ఆర్కిటెక్ట్‌ ఎవరో అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఉస్తాద్‌ అహ్మద్‌ లాహోరీ దీనిని డిజైన్‌ చేశాడు. ఇందులో ఇండియన్‌ నిర్మాణశైలితోపాటు పర్షియన్‌ శైలి స్పష్టంగా కనిపిస్తుంది. దీనిని కట్టడానికి పదేళ్లు పట్టింది. రాజసాన్ని ప్రదర్శించే ఈ కోట 1648– 1857 వరకు మొఘలుల అధీనంలో ఉంది. సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్‌ స్వాధీనంలోకి వెళ్లింది. స్వాతంత్య్ర సాధనతో మన జాతీయపతాకం ఎగిరింది. అప్పటి నుంచి ఏటా పతాకావిష్కరణ సందర్భంగా టీవీలు, పత్రికల్లో దేశ ప్రజలకు దర్శనమిస్తోంది. 

నిర్వహణ భేష్‌!
రెడ్‌ఫోర్ట్‌ నిర్వహణ బాధ్యత ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా చేపట్టిన తర్వాత కోట ్రపాంగణం టూరిస్ట్‌ ఫ్రెండ్లీగా మారింది. నిర్మాణాలను దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంచడంతోపాటు పచ్చటి లాన్‌లను మెయింటెయిన్‌ చేయడంతో ఇక్కడ ఎండాకాలంలో కూడా టూరిస్టులు సౌకర్యంగా తిరుగగలుగుతున్నారు. టాయిలెట్‌లు, మంచినీటి సౌకర్యాలు కూడా బాగున్నాయిప్పుడు. అనేక కాంప్లెక్స్‌లను మ్యూజియాలుగా మార్చడం మరొక మంచి పరిణామం. రెడ్‌ఫోర్ట్‌ టూర్‌ను ఆద్యంతం ఆస్వాదించే క్రమంలోనే ముంతాజ్‌ మ్యూజియం, ఇండియన్‌ ఆర్ట్‌ మ్యూజియం వంటి వాటిని కూడా కవర్‌ చేయవచ్చు. 

దిగుడుబావి ఉంది!
రెడ్‌ఫోర్ట్‌ ఆవరణలో ఒక స్టెప్‌వెల్‌ ఉంది. రెడ్‌ఫోర్ట్‌ని ఓ పదేళ్ల కిందట చూసిన వాళ్లు దీనిని గమనించి ఉండకపోవచ్చు. ఈ సారి వెళ్లినప్పుడు మర్చిపోకుండా చూడాలి. అయితే ఈ బావిలోకి దిగడానికి ఏ మాత్రం వీల్లేదు. ఢిల్లీ నగరంలోని అగ్రసేన్‌కీ బావోలీ వంటి కొన్ని స్టెప్‌వెల్స్‌లోకి ఒకటి– రెండు అంతస్థుల వరకైనా అనుమతిస్తారు. కానీ ఈ రెడ్‌ఫోర్ట్‌ స్టెప్‌వెల్‌ని పూర్తిగా లాక్‌ చేసి పైన గ్రిల్‌ అమర్చారు. నేల మీద నుంచి వంగి చూడాల్సిందే.

తొలి ఎర్రకోట ఆగ్రా ఫోర్ట్‌
ఈ ఎర్రకోట ఆగ్రాలో ఉంది. ఢిల్లీ ఎర్రకోట కంటే ముందుది. ఈ కోట యమునాతీరాన తాజ్‌ మహల్‌కు పక్కన ఉంది. ఇక్కడి నుంచి చూస్తే తాజ్‌మహల్‌ అందంగా కనిపిస్తుంది. తాజ్‌ మహల్‌ నుంచి ఈ కోట ఠీవిగా కనిపిస్తుంది. ఈ కోటలో ఏమేమి ఉన్నాయంటే ఢిల్లీ రెడ్‌ఫోర్ట్‌ అన్నవన్నీ ఉన్నాయి. వంద ఎకరాల్లో విస్తరించిన కోట ఇది. దివానీ ఆమ్, దివానీ ఖాస్‌ వంటి పాలన భవనాలతోపాటు ప్యాలెస్‌లున్నాయి. షాజహాన్‌ అంత్యకాలంలో నివసించిన ప్యాలెస్‌ షా బుర్జ్‌ ఇక్కడే ఉంది. ఈ ప్యాలెస్‌ నుంచి తాజ్‌మహల్‌ వ్యూ అందంగా ఉంటుంది. షాజహాన్‌ను కొడుకు ఔరంగజేబు ఖైదు చేశాడని తెలిసినప్పుడు సానుభూతి కలుగుతుంది. కానీ ఈ ప్యాలెస్‌ను చూస్తే రాజు జైల్‌లో ఉన్నా రాజరికపు సౌకర్యాలేమీ తగ్గవనే వాస్తవం తెలిసి వస్తుంది. 

అక్బర్‌ కట్టించిన ‘జహంగీర్‌ మహల్‌’ ఒక అద్భుతం. మధ్య ఆసియా నుంచి అక్కడ ప్రసిద్ధులైన వాస్తు శిల్పులను పిలిపించి, స్థానికంగా ఉన్న హిందూ వాస్తుశిల్పులలో నిపుణులను ఎంపిక చేసి అందరి సమష్టి కృషితో గొప్ప నిర్మాణం జరగాలని ఆదేశించాడట. ఆ మేరకే వాళ్లు దీనిని డిజైన్‌ చేశారట. మొఘలుల ఉత్థానపతనాలకు ఈ కోట ప్రత్యక్షసాక్షి. కోట లోపల అక్బర్‌కు విజయం అందించిన ఆయుధాగారం ఉంది. రతన్‌సింగ్‌ హవేలీ, బెంగాల్‌మహల్, శీష్‌మహల్, షాజహాన్‌ మహల్, జహంగీర్‌ బాత్‌టబ్‌లను చూడడం మరువకూడదు. ఈ ఎర్రకోటలోకి పర్యాటకులను అమర్‌సింగ్‌ గేట్‌ నుంచి అనుమతిస్తారు. పాలరాతిలో ఇన్‌లే వర్క్‌ ఇక్కడి ప్యాలెస్‌లలోనూ కనిపిస్తుంది. టూర్‌ ఆపరేటర్‌లు తాజ్‌మహల్‌ కంటే ఈ కోటకు తీసుకువెళ్తారు. త్వరగా రాకపోతే తాజ్‌మహల్‌ చూడడానికి సమయం చాలదని తొందరపెడుతుంటారు. దాంతో పర్యాటకులు ప్రశాంతంగా ఆస్వాదించలేకపోతారు.

కుతుబ్‌ మినార్‌
కుతుబ్‌మినార్‌ ఐదు అంతస్థుల కట్టడం. ఢిల్లీ శివారులో మెహ్రౌలీలో ఉంది. దీని నిర్మాణం క్రీ.శ 1199 నుంచి 1220 వరకు అనేక దఫాలుగా జరిగింది. అనంగపాల్‌ తోమార్‌ నుంచి పృథ్వీరాజ్‌ చౌహాన్, కుతుబుద్దీన్‌ ఐబక్‌ షంషుద్దీన్‌ ఇల్టుట్‌ మిష్‌ వరకు అనేక రాజవంశాల చరిత్రలో ఈ మినార్‌ది కేంద్రస్థానం. హుమయూన్‌కి అక్బర్‌కి మధ్య కాలంలో షేర్‌షా సూరి కూడా తన వంతుగా కొన్ని మెరుగులు దిద్దాడు. ఈ 62 మీటర్ల ఎత్తున్న ఈ మినార్‌కు 14వ తతాబ్దంలో ఫిరోజ్‌షా తుగ్లక్‌ పై అంతస్థును నిర్మించాడు. ఈ నిర్మాణం ఇండో ఇస్లామిక్‌ సమ్మేళనం. సూక్ష్మంగా పరిశీలిస్తే ఇందులో అరబిక్‌ భాషలో రాసిన ఖురాన్‌ సూక్తులు కనిపిస్తాయి. నిర్మాణంలో వలలాంటి అల్లికల నిర్మాణం పర్షియన్‌ వాస్తుశైలిని ప్రతిబింబిస్తుంది. తామర రేకులను పోలిన అంచులు హిందూ నిర్మాణాల శైలికి నిదర్శనం. ఇందులో ఉపయోగించిన ఇటుకలను ఆఫ్గనిస్థాన్‌ నుంచి తెప్పించారు. ఈ ్రపాంతాన్ని ఏలిన పాలకులందరూ ఈ నిర్మాణానికి ఏదో ఒక సొబగులద్ది చరిత్రలో తమ పేరు కూడా ఉండేటట్లు జాగ్రత్తపడ్డారు.

ఐరన్‌ పిల్లర్‌ ప్రత్యేక ఆకర్షణ
కుతుబ్‌మినార్‌తోపాటు అనేక కట్టడాలున్నాయి. విశాలమైన ్రపాంగణంలో ఇతమిద్ధంగా ఇదీ అని చెప్పడానికి వీల్లేని నిర్మాణాల అవశేషాలుంటాయి. ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఆ శిథిలాలకు రూపమిచ్చే ప్రయత్నం చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే కుతుబ్‌మినార్‌ కట్టడం లాల్‌ కోట్‌ శిథిలాల మీద మొదలైందని చరిత్రకారులు నిర్ధారించారు. ఇక్కడున్న ఐరన్‌ పిల్లర్‌ మరో చారిత్రక గొప్పదనం. అది ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటుంది. కానీ తుప్పు పట్టదు. మనదేశంలో లోహశాస్త్రం ఎంత శాస్త్రబద్ధంగా అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఏయే లోహాలను ఎంతెంత నిష్పత్తిలో వాడారనే విషయంలో రీసెర్చ్‌ స్కాలర్స్‌ పరిశోధనలు చేస్తుంటారు.

టూర్‌ ప్యాకేజ్‌లిలా ఉంటాయి!
∙ఢిల్లీకి విమానం లేదా రైల్లో వెళ్లిన తర్వాత లోకల్‌ టూర్‌ ప్యాకేజ్‌ తీసుకోవడం సౌకర్యంగా ఉంటుంది. ఢిల్లీ డే టూర్‌ ప్యాకేజ్‌లుంటాయి.

ఏసీ బస్సు లేదా విడిగా కారు మాట్లాడుకోవచ్చు. కారుకు రోజుకు ఏడు లేదా ఎనిమిది వేలుంటుంది. బస్సులో ఒకరికి వెయ్యి రూపాయలకు అటూఇటూగా ఉంటుంది. 

∙ఢిల్లీకి వెళ్లడానికి ముందే నగరంలో చూడాల్సిన ప్రదేశాల జాబితాతోపాటు సిటీ టూర్‌ మ్యాప్‌ను పరిశీలించాలి. ఏయే ప్రదేశాలను ఒక క్లస్టర్‌గా ప్లాన్‌ చేసుకోవచ్చనే అవగాహన వస్తుంది. అలాగే ఆయా ప్రదేశాలకు సెలవు దినాల వివరాలను కూడా ఆయా వెబ్‌సైట్‌ల ద్వారా నిర్ధారించుకోవాలి.

∙ఆహారం విషయానికి వస్తే చోలే–బటూరా, బటర్‌ చికెన్, జిలేబీ, రబ్రీ ఫాలూదాలను తప్పనిసరిగా రుచి చూడాలి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement