పత్తికి అదనపు ధర చెల్లించండి | Pay the extra price for cotton | Sakshi
Sakshi News home page

పత్తికి అదనపు ధర చెల్లించండి

Published Tue, Nov 18 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM

Pay the extra price for cotton

గిద్దలూరు : రైతులు కష్టపడి పండించిన పత్తికి అదనపు ధర వచ్చేలా సీసీఐ అధికారులు చర్యలు తీసుకోవాలని గిద్దలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి  కోరారు. స్థానిక మార్కెట్ యార్డు ప్రాంగణంలో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. గిద్దలూరు నియోజకవర్గ ప్రాంత రైతులు నాణ్యమైన పత్తి పండిస్తారని సీసీఐ సీనియర్ కాటన్ పర్చేజ్ అధికారి పి.చంద్రారెడ్డితో చెప్పారు.

జిల్లాలో పత్తి పండించే అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళారుల బారి నుంచి రైతులను కాపాడాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ సీజన్‌లో ఎక్కువ మంది రైతులు పత్తి సాగు చేశారని, వర్షాభావ పరిస్థితులతో దిగుబడులు తగ్గిపోయి పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని విచారం వ్యక్తం చేశారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. పంట పూర్తయ్యే వరకూ సీసీఐ కేంద్రాలు కొనసాగించాలన్నారు.

పత్తి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే ముత్తుమల ఆకాంక్షించారు. అనంతరం రైతులకు ధరలు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. తేమ 8 నుంచి 12 శాతం వరకు ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. 8 శాతం తేమ ఉన్న పత్తికి రూ.4,050లు, తేమశాతం ఎక్కువగా ఉంటే ఒక్కో శాతానికి రూ.40.50ల చొప్పున తగ్గించి చెల్లిస్తామన్నారు. జిల్లాలో ఏడు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ ఏడాది గిద్దలూరు, దర్శి మార్కెట్ యార్డుల్లో కూడా కొత్తగా కేంద్రాలు ప్రారంభించినట్లు చంద్రారెడ్డి వివరించారు.

నిబంధనలకు లోబడే రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తామని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ కడప వంశీధర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధికార ప్రతినిధి దప్పిలి రాజేంద్రప్రసాద్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ మోపూరి బ్రహ్మం, నగర పంచాయతీ కో ఆప్షన్ సభ్యుడుదమ్మాల జనార్దన్, నాయకులు సూరా పాండురంగారెడ్డి, ఓబుల్‌రెడ్డి, పాశం మురళి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఆర్‌డీ రామకృష్ణ, కార్యదర్శి వి.ఆంజనేయులు, పత్తి కొనుగోలు కేంద్రం సహాయ అధికారి రోశయ్య పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement