muthumula ashok reddy
-
టీడీపీలో రచ్చ..రచ్చ!
గిద్దలూరులో పాత.. కొత్త టీడీపీ నేతల వార్ కొత్తగా చేరిన నేతలు.. పాత నాయకునిపై దాడి గిద్దలూరు : నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత పోరు రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఇటీవల ఆ పార్టీ ఇన్చార్జి అన్నా రాంబాబు.. తన వర్గీయులతో పాటు ఒంగోలు చేరుకొని ముఖ్యనేతల ముందు నిరసన వ్యక్తం చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వర్గం ఏకంగా దాడులకు పాల్పడున్నట్లు ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మండలంలోని కంచిపల్లెలో మంగళవారం జరిగిన ఘటనలో గ్రామానికి చెందిన టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు, జన్మభూమి కమిటీ సభ్యుడు అయిన పాలుగుళ్ల సూర్యరంగారెడ్డి గాయపడ్డాడు. బాధితుడు స్థానిక ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రైతు రుణ ఉపశమన పత్రాలు ఇచ్చేందుకు గ్రామానికి అధికారులు వచ్చారు. కార్యక్రమం అనంతరం అధికారులు వెళ్లిపోగా, అక్కడే ఉన్న పంచాయతీ కార్యదర్శి సత్యనాయరణ.. వద్దకు సూర్యరంగారెడ్డి వెళ్లారు. వర్షాకాలంలో ట్యాంకర్లతో నీటిని తోలాల్సిన పనేముందని ప్రశ్నించాడు. గ్రామంలోని చెరువుకు నిండా నీరొచ్చిందని, వ్యవసాయ భూముల్లో నీరు సమృద్ధిగా ఉందని.. పంచాయతీ మోటార్లలో నీరు ఎందుకు రావడం లేదని అడిగాడు. నిధులు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పారు. అయితే ఇటీవల టీడీపీలో చేరిన ముత్తుముల అశోక్‌రెడ్డి వర్గానికి చెందిన దప్పిలి శ్రీనివాసరెడ్డి పంచాయతీ పనులు చూస్తుంటాడు. దీంతో ఆయన సీన్లో వచ్చాడు. పంచాయతీలో ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయంటూ సూర్యరంగారెడ్డిపై దాడి చేశాడు. అనంతరం శ్రీనివాసరెడ్డి సోదరులు దప్పిలి రంగస్వామిరెడ్డి, రవీంద్రారెడ్డి కూడా దాడి చేశారు. గాయపడిన సూర్యరంగారెడ్డిని టీడీపీ మండల అధ్యక్షుడు ఏ.శ్రీనివాసులు, తిమ్మాపురం సర్పంచి కోటా రమేష్, పలువురు టీడీపీ నాయకులు పరామర్శించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎస్సై రాంబాబు విచారణ చేపట్టారు. -
గుక్కెడు నీటికీ గండమే
సాగర్ నీరు విడుదల చేయలేదుజిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీసమావేశంలో చైర్మన్ వైవీ ఒంగోలు టౌన్: ‘జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఒంగోలులో నాలుగైదు రోజులకు ఒకసారి తాగునీరు అందిస్తున్నారు. పశ్చిమ ప్రాంతంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. సాగర్ నీటిని విడుదల చేస్తారని ఆశిస్తే కృష్ణా డెల్టాకు ఎక్కువగా నీటిని విడుదల చేసి జిల్లాకు రాకుండా చేశారు. జిల్లా ఆవిర్భవించి 47 సంవత్సరాలైనా అభివృద్ధిలో ప్రగతి సాధించలేకపోతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా జిల్లాపై చిన్నచూపు చూస్తోంది. వెనుకబడిన ఏడు జిల్లాల సరసన ప్రకాశంను ప్రకటించకపోవడం దారుణం. కేంద్ర ప్రభుత్వ నిధులతో సంక్షేమ, అభివృద్ధి పథకాలను రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ అందించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిద్దామని’ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఉద్బోధించారు. శనివారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. సాగర్ నీరు రాకపోతే ఎడారే జిల్లాకు సాగర్ నీరు రాకపోతే మా ప్రాంతమంతా ఎడారిగా మారుతుందని మార్కాపురం శాసనసభ్యుడు జంకె వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో 500 అడుగులకు బోరు వేస్తే చుక్క నీరు రాకపోగా దుమ్ము వస్తోందని, గుండ్లకమ్మ చెరువు పక్కన బోరు వేసినా నీరు రావడం లేదు. ఎన్ని బోర్లు వేసినా ఉపయోగం లేదన్నారు. మహిళలు నీటికోసం బిందెలతో కొట్టుకుంటున్నారని, భవిష్యత్తులో నీటి యుద్ధాలు తప్పవని హెచ్చరించారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఒంగోలు, కందుకూరు, కనిగిరి ప్రాంతాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఇన్‌ఛార్జి కలెక్టర్ స్పందిస్తూ సాగర్ ద్వారా జిల్లాకు 3.12 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. జంకె వెంకటరెడ్డి జోక్యం చేసుకుంటూ జిల్లాకు సాగర్ నీటిని విడుదల చేస్తే మనకు రాకుండా గుంటూరు జిల్లావారు అడ్డుపడతారని, అధికారులు దాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొండపి శాసనసభ్యుడు బాలవీరాంజనేయస్వామి స్పందిస్తూ ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యుఎస్, రెవెన్యూ, పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. తన నియోజకవర్గ పరిధిలోని మూసికి సాగర్ నీరు వచ్చేలా చూడాలని కోరారు. సాగర్ నీరేదీ...? గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ సీపీడబ్ల్యు స్కీమ్ ద్వారా సాగర్‌నీరు రాని ఏకైక నియోజకవర్గం గిద్దలూరు అని చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. సీపీడబ్ల్యు స్కీమ్ ద్వారా గిద్దలూరుకు సాగర్ నీరు వచ్చేవిధంగా సమావేశంలో తీర్మానం చేయాలని సూచించగా, సమావేశం అందుకు ఆమోదించింది. నిధులు విడుదల చేయండి...సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రతరంగా ఉందని, నీటి రవాణా, బోర్ల మరమ్మతులకు సంబంధించి నిధులు విడుదల కావడం లేదన్నారు. నిధులు విడుదలకాక ఇబ్బంది పడుతున్న తరుణంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి నేరుగా కలెక్టర్‌కు నిధులు వచ్చేవిధంగా చూడాలని సూచించారు. జిల్లాలో సీపీడబ్ల్యు స్కీమ్‌లు నత్తనడకన నడుస్తున్నాయని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గ పరిధిలోని పల్లామల్లి స్కీమ్‌కు 2013లో 5కోట్ల రూపాయలు మంజూరైందని, నాలుగున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఇప్పటికీ వినియోగంలోకి రాలేదన్నారు. రూ.8 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది... ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ సంజీవరావు మాట్లాడుతూ తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు 29 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ప్రభుత్వానికి నివేదించగాా, 8 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ముత్తుముల జోక్యం చేసుకుంటూ గత ఏడాది కంటే ఈ ఏడాది నీటి సమస్య తీవ్రంగా ఉంటే ప్రభుత్వం విడుదల చేసిన రూ.8 కోట్లు ఏవిధంగా సరిపోతాయని ప్రశ్నించారు. జిల్లాలోని 12 నియోజకవర్గాలకు కలుపుకుంటే 120 కోట్ల రూపాయల వరకూ అవసరం అవుతాయన్నారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వెలుగొండ ప్రాజెక్టుకు 1500 కోట్ల రూపాయలు విడుదల చేసేవిధంగా తీర్మానం చేయాలని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ప్రతిపాదించగా సమావేశం తీర్మానించింది. -
'అవినీతి రాజకీయాల్లో టీడీపీ నంబర్ వన్'
ప్రకాశం: అవినీతి రాజకీయాలు చేయటంలో టీడీపీ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ లో ఓటుకు కోట్లు మరువక ముందే ఆంధ్రప్రదేశ్ లో కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాజాగా ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందని ఎంపీటీసీ వెంకట్రావు కిడ్నాప్ నకు గురయ్యాడు. కాగా టీడీపీ నేతలే అతణ్ని కిడ్నాప్ చేసి ఉంటారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముత్తుముల అశోక్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. -
విజయం.. వైఎస్సార్ సీపీదే!
ఎమ్మెల్సీ ఎన్నికలపై ముత్తుముల ధీమా.. దర్శి: శాసన మండలి ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపు త థ్యమని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దర్శి నియోజకవర్గ ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో శుక్రవారం నిర్వహించిన సమావే శం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో 992 ఓట్లుకు గాను వైఎస్ఆర్ సీపీకి 492 మంది సభ్యులున్నారని.. స్వతంత్య్ర సభ్యుల మద్దతు తమకే ఉన్నందున విజయం వైఎస్సార్ సీపీని వరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ధనవంతులే రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తగా అట్లా చిన్న వెంకట రెడ్డిని గుర్తించి.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియమించడం అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిబద్ధతకు నిదర్శనమన్నారు. టీడీపీ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన విషయం అందరికీ తెలిసిందేనని తెలిపారు. అదే సంప్రదాయాన్ని జిల్లాలో కొనసాగించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ పార్టీ గుర్తుతో గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు వైఎస్సార్ ఆశయాల కోసం చిన్నవెంకట రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ ,మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్న వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
ప్రజల తీర్పును తిరగరాద్దాం!
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకే జిల్లా ప్రజలు మద్దతు ఇచ్చారు అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల పిలుపు గిద్దలూరు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న అట్ల చినవెంకటరెడ్డిని గెలిపించుకునేందుకు ప్రతి కార్యకర్త కృషిచేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. స్థానిక తన నివాస గృహంలో కొమరోలు, గిద్దలూరు, రాచర్ల మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వైఎస్సార్సీపీ నాయకులతో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పార్టీ అధిష్టానం నిర్ణయానుసారం వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, నగర పంచాయతీ కౌన్సిలర్లు చినవెంకటరెడ్డికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. జిల్లాలో వైఎస్సార్సీపీకి పట్టు ఉందని.. అయితే ఏమాత్రం గెలుపునకు అవకాశం లేని అభ్యర్థిని టీడీపీ బరిలోకి దించిందన్నారు. ఓటుకు నోటు అన్న నినాదంతో టీడీపీ నేతలు స్థానిక ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాలు సాధించేందుకు వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ప్రజలు తీర్పునిచ్చారన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్ని గెలుపొందగలిగామన్నారు. ప్రజలు ఎలాంటి విజయాన్ని ఇచ్చారో అదే విధంగా ఎమ్మెల్సీని ఎన్నుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ఓట్లను కొనుగోలు చేసేందుకు అన్ని నియోజకవర్గాల్లో బృందాలు తిరుగుతున్నాయని హెచ్చరించారు. గిద్దలూరు, కొమరోలు ఎంపీపీలు కడప వంశీధరరెడ్డి, కే.అమూల్య, వైఎస్సార్సీపీ కొమరోలు మండల కన్వీనర్ హెచ్.సార్వభౌమరావు, వైస్ ఎంపీపీ డి.ఆంజనేయులు, సొసైటీ చైర్మన్ కె. వెంకటేశ్వర్లు, నాయకులు రమణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పలువురు నాయకులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
జగన్ మాట ఉద్యమాలకు బాట
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జగన్ మాట ఉద్యమాలకు బాటైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు రెండు రోజుల పాటు నిర్వహించిన సమీక్ష సమావేశాలు కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపాయని అన్నారు. ఈ సమీక్షకు జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు, నాయకులు ఎంతో ఉత్సాహంతో హాజరయ్యారని చెప్పారు. సమావేశాల్లో పార్టీ అధినేత ఇచ్చిన సందేశం కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని పెంచిందన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశాలకు హాజరైన ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, మండల అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
పత్తికి అదనపు ధర చెల్లించండి
గిద్దలూరు : రైతులు కష్టపడి పండించిన పత్తికి అదనపు ధర వచ్చేలా సీసీఐ అధికారులు చర్యలు తీసుకోవాలని గిద్దలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి కోరారు. స్థానిక మార్కెట్ యార్డు ప్రాంగణంలో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. గిద్దలూరు నియోజకవర్గ ప్రాంత రైతులు నాణ్యమైన పత్తి పండిస్తారని సీసీఐ సీనియర్ కాటన్ పర్చేజ్ అధికారి పి.చంద్రారెడ్డితో చెప్పారు. జిల్లాలో పత్తి పండించే అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళారుల బారి నుంచి రైతులను కాపాడాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ సీజన్లో ఎక్కువ మంది రైతులు పత్తి సాగు చేశారని, వర్షాభావ పరిస్థితులతో దిగుబడులు తగ్గిపోయి పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని విచారం వ్యక్తం చేశారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. పంట పూర్తయ్యే వరకూ సీసీఐ కేంద్రాలు కొనసాగించాలన్నారు. పత్తి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే ముత్తుమల ఆకాంక్షించారు. అనంతరం రైతులకు ధరలు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. తేమ 8 నుంచి 12 శాతం వరకు ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. 8 శాతం తేమ ఉన్న పత్తికి రూ.4,050లు, తేమశాతం ఎక్కువగా ఉంటే ఒక్కో శాతానికి రూ.40.50ల చొప్పున తగ్గించి చెల్లిస్తామన్నారు. జిల్లాలో ఏడు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ ఏడాది గిద్దలూరు, దర్శి మార్కెట్ యార్డుల్లో కూడా కొత్తగా కేంద్రాలు ప్రారంభించినట్లు చంద్రారెడ్డి వివరించారు. నిబంధనలకు లోబడే రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తామని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ కడప వంశీధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధికార ప్రతినిధి దప్పిలి రాజేంద్రప్రసాద్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ మోపూరి బ్రహ్మం, నగర పంచాయతీ కో ఆప్షన్ సభ్యుడుదమ్మాల జనార్దన్, నాయకులు సూరా పాండురంగారెడ్డి, ఓబుల్‌రెడ్డి, పాశం మురళి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఆర్డీ రామకృష్ణ, కార్యదర్శి వి.ఆంజనేయులు, పత్తి కొనుగోలు కేంద్రం సహాయ అధికారి రోశయ్య పాల్గొన్నారు. -
'ఐదు నెలల్లోనే భ్రష్టుపట్టిన టీడీపీ పాలన'
ఒంగోలు: చంద్రబాబు హామీలను గాలికి వదిలేసి మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే టీడీపీ పాలన భ్రష్టుపట్టిందని మండిపడ్డారు. ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని చెప్పారు. అశోక్ రెడ్డి నియామకాన్ని ఒంగోలులో బాలినేని అధికారికంగా ప్రకటించారు. -
ఎస్సైని సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్
గిద్దలూరు: ఎస్సై దురుసు వైఖరితో వైఎస్సార్ సీపీ నాయకుడు మృతి చెందడంతో గిద్దలూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గిద్దలూరు సహకార సంఘ అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు వైజా భాస్కరరెడ్డి గుండెలపై ఎస్సై వై శ్రీనివాసరావు బలంగా చేత్తో నెట్టడంతో ఆయన గుండెపోటుకు గురై మృతిచెందారు. దీంతో సోమవారం రాత్రి నుంచి గిద్దలూరు పోలీస్‌స్టేషన్‌లోనే మృతదేహాన్ని ఉంచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ధర్నా నిర్వహించారు. ఎస్సైని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముత్తుముల మాట్లాడుతూ ఎస్సై వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష కట్టి దాడులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడ్ని కొట్టుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లిన ఎస్సై చర్యలను ఖండించిన వైజా భాస్కర్‌రెడ్డిపై దుర్భాషలాడి దాడికి పాల్పడటం ఎంత వరకు సమంజసమన్నారు. గతంలోనూ ఎస్సై ఇలాంటి దాడులకు పాల్పడి వైఎస్సార్ సీపీ కార్యకర్తలను భయాందోళనలకు గురిచేశారని అన్నారు. ఎస్సైతో పాటు డీఆర్ఆర్ ప్లాజా వద్దకు వెళ్లి దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుళ్లను కూడా వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా విరమించాలని సీఐ నిమ్మగడ్డ రామారావు వారిని కోరారు. అయినా ఆందోళన ఉధృతం కావడంతో మార్కాపురం డీఎస్పీ జీ రామాంజనేయులు అక్కడకు వచ్చారు. ఎస్సైని సస్పెండ్ చేయడం కుదరదని డీఎస్పీ చెప్పడంతో పోలీసు వ్యవస్థ టీ డీపీకి అమ్ముడు పోయిందని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తప్పు చేసిన ఎస్సైని రక్షించేందుకు డీఎస్పీ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఏఎస్పీ రామానాయక్ గిద్దలూరు చేరుకుని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డితో చర్చించారు. సంఘటన వివరాలు తెలుసుకున్న ఆయన..ఎస్సైని వీఆర్‌కు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సై శ్రీనివాసరావుపై హత్యాయత్నం (సెక్షన్ 304) కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. వివాదానికి కారణమైన సుబ్బారావుపై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళన విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వైజా భాస్కర్‌రెడ్డి చనిపోయాడని సమాచారం అందుకున్న బంధువులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని బోరున విలపించారు. అసలేం జరిగిందంటే... పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో డీజీఆర్ హాస్పిటల్‌ను నిర్వహిస్తున్న డాక్టర్ హరనాథరెడ్డి స్థానిక డీఆర్ఆర్ ప్లాజాలో నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్లో హీరోహోండా షోరూం నిర్వాహకుడు తోట సుబ్బారావు కుటుంబం నివాసం ఉంటోంది. ముందుగా హరనాథరెడ్డి వాహనాన్ని పార్కింగ్‌లో పెట్టారు. వెనకాల అపార్ట్‌మెంట్‌కు వచ్చిన సుబ్బారావు తన కారుకు హరనాథరెడ్డి కారు అడ్డుగా ఉందంటూ ఆ వాహనాన్ని ఢీ కొట్టి దూషించారు. దీంతో ఆగ్రహించిన హరనాథరెడ్డి తండ్రి ‘మా పార్కింగ్ స్థలంలో కారును పెట్టుకున్నాం.. నీవెందుకు తిడుతున్నావని’ ప్రశ్నించగా ఆయనపై సుబ్బారావు దాడికి దిగాడు. పక్కనే ఉన్న మరో విశ్రాంత ఉద్యోగి గొడవెందుకని వారించేందుకు వెళ్లగా సుబ్బారావు భార్య ఆయనను కొట్టిందని స్థానికులు తెలిపారు. ఆ వెంటనే సుబ్బారావు ఎస్సైకి ఫోన్ చేసి గొడవ జరుగుతుందని సమాచారం అందించాడు. ఎస్సై వై.శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని డాక్టర్ హరనాథరెడ్డి, ఆయన తండ్రి, భార్య ఇలా అందరిపై దాడి చేశారు. మహిళ అని కూడా చూడకుండా హరనాథరెడ్డి భార్యను దూషించి తన వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించాడు. డీఆర్ఆర్ ప్లాజా యజమాని అయిన వైజా భాస్కర్‌రెడ్డి సమాచారం తెలుసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అప్పటికి హరనాథరెడ్డిని వైద్యుడు అని కూడా చూడకుండా పోలీసులు కింద కూర్చోబెట్టి..సుబ్బారావును కుర్చీలో కూర్చోబెట్టారు. దీంతో ఆగ్రహించిన భాస్కర్‌రెడ్డి డాక్టర్‌కు ఇచ్చే మర్యాద ఇదేనా..అని సీఐ రామారావును ప్రశ్నించారు. తాను మాట్లాడి పంపిస్తానని సీఐ చెబుతుండగానే..పక్కనే గదిలో ఉన్న ఎస్సై అక్కడకు చేరుకుని సుబ్బారావుపై దాడిచేసిన వారితో మాట్లాడేదేంటి అని..ముగ్గురిపై కేసు కడతానని ఆగ్రహంగా ఉన్నాడు. తాను వారితో మాట్లాడతానని సీఐ సర్దిచెప్పినా వినకుండా..కేసు రిజిస్టర్ చేయకపోతే తాను రాజీనామా చేస్తానని ఎస్సై చెప్పాడు. దీంతో ‘మా వారిపై కేసులు పెట్టడం మామూలే కదా’ అని వైజా భాస్కరరెడ్డి ఎస్సైని నిలదీశారు. అలా మాటా..మాటా పెరిగి ఎస్సై భాస్కర్‌రెడ్డి గుండెలపై చేత్తో బలంగా నెట్టాడు. దీంతో ఆయన గుండెల్లో నొప్పి అంటూ మంచినీళ్లు తాగి కాసేపు కూర్చున్నారు. శ్వాస అందడం లేదని బయటకు వచ్చిన వైజా నేలకొరిగి చనిపోయారు. భాస్కర్‌రెడ్డిని ఎస్సై కొట్టడంతోనే గుండెనొప్పికి గురై మరణించాడని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తూ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు.