సాగర్ నీరు విడుదల చేయలేదుజిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీసమావేశంలో చైర్మన్ వైవీ
ఒంగోలు టౌన్: ‘జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఒంగోలులో నాలుగైదు రోజులకు ఒకసారి తాగునీరు అందిస్తున్నారు. పశ్చిమ ప్రాంతంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. సాగర్ నీటిని విడుదల చేస్తారని ఆశిస్తే కృష్ణా డెల్టాకు ఎక్కువగా నీటిని విడుదల చేసి జిల్లాకు రాకుండా చేశారు. జిల్లా ఆవిర్భవించి 47 సంవత్సరాలైనా అభివృద్ధిలో ప్రగతి సాధించలేకపోతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా జిల్లాపై చిన్నచూపు చూస్తోంది. వెనుకబడిన ఏడు జిల్లాల సరసన ప్రకాశంను ప్రకటించకపోవడం దారుణం. కేంద్ర ప్రభుత్వ నిధులతో సంక్షేమ, అభివృద్ధి పథకాలను రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ అందించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిద్దామని’ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఉద్బోధించారు. శనివారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు.
సాగర్ నీరు రాకపోతే ఎడారే జిల్లాకు సాగర్ నీరు రాకపోతే మా ప్రాంతమంతా ఎడారిగా మారుతుందని మార్కాపురం శాసనసభ్యుడు జంకె వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో 500 అడుగులకు బోరు వేస్తే చుక్క నీరు రాకపోగా దుమ్ము వస్తోందని, గుండ్లకమ్మ చెరువు పక్కన బోరు వేసినా నీరు రావడం లేదు.
ఎన్ని బోర్లు వేసినా ఉపయోగం లేదన్నారు. మహిళలు నీటికోసం బిందెలతో కొట్టుకుంటున్నారని, భవిష్యత్తులో నీటి యుద్ధాలు తప్పవని హెచ్చరించారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఒంగోలు, కందుకూరు, కనిగిరి ప్రాంతాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఇన్‌ఛార్జి కలెక్టర్ స్పందిస్తూ సాగర్ ద్వారా జిల్లాకు 3.12 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. జంకె వెంకటరెడ్డి జోక్యం చేసుకుంటూ జిల్లాకు సాగర్ నీటిని విడుదల చేస్తే మనకు రాకుండా గుంటూరు జిల్లావారు అడ్డుపడతారని, అధికారులు దాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొండపి శాసనసభ్యుడు బాలవీరాంజనేయస్వామి స్పందిస్తూ ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యుఎస్, రెవెన్యూ, పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. తన నియోజకవర్గ పరిధిలోని మూసికి సాగర్ నీరు వచ్చేలా చూడాలని కోరారు.
సాగర్ నీరేదీ...?
గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ సీపీడబ్ల్యు స్కీమ్ ద్వారా సాగర్‌నీరు రాని ఏకైక నియోజకవర్గం గిద్దలూరు అని చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. సీపీడబ్ల్యు స్కీమ్ ద్వారా గిద్దలూరుకు సాగర్ నీరు వచ్చేవిధంగా సమావేశంలో తీర్మానం చేయాలని సూచించగా, సమావేశం అందుకు ఆమోదించింది. నిధులు విడుదల చేయండి...సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రతరంగా ఉందని, నీటి రవాణా, బోర్ల మరమ్మతులకు సంబంధించి నిధులు విడుదల కావడం లేదన్నారు. నిధులు విడుదలకాక ఇబ్బంది పడుతున్న తరుణంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నుంచి నేరుగా కలెక్టర్‌కు నిధులు వచ్చేవిధంగా చూడాలని సూచించారు. జిల్లాలో సీపీడబ్ల్యు స్కీమ్‌లు నత్తనడకన నడుస్తున్నాయని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గ పరిధిలోని పల్లామల్లి స్కీమ్‌కు 2013లో 5కోట్ల రూపాయలు మంజూరైందని, నాలుగున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఇప్పటికీ వినియోగంలోకి రాలేదన్నారు.
రూ.8 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది...
ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ సంజీవరావు మాట్లాడుతూ తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు 29 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ప్రభుత్వానికి నివేదించగాా, 8 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ముత్తుముల జోక్యం చేసుకుంటూ గత ఏడాది కంటే ఈ ఏడాది నీటి సమస్య తీవ్రంగా ఉంటే ప్రభుత్వం విడుదల చేసిన రూ.8 కోట్లు ఏవిధంగా సరిపోతాయని ప్రశ్నించారు. జిల్లాలోని 12 నియోజకవర్గాలకు కలుపుకుంటే 120 కోట్ల రూపాయల వరకూ అవసరం అవుతాయన్నారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వెలుగొండ ప్రాజెక్టుకు 1500 కోట్ల రూపాయలు విడుదల చేసేవిధంగా తీర్మానం చేయాలని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ప్రతిపాదించగా సమావేశం తీర్మానించింది.
గుక్కెడు నీటికీ గండమే
Published Sun, Feb 7 2016 5:48 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM
Advertisement
Advertisement