గిద్దలూరులో పాత.. కొత్త టీడీపీ నేతల వార్
కొత్తగా చేరిన నేతలు.. పాత నాయకునిపై దాడి
గిద్దలూరు : నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత పోరు రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఇటీవల ఆ పార్టీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు.. తన వర్గీయులతో పాటు ఒంగోలు చేరుకొని ముఖ్యనేతల ముందు నిరసన వ్యక్తం చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వర్గం ఏకంగా దాడులకు పాల్పడున్నట్లు ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.
మండలంలోని కంచిపల్లెలో మంగళవారం జరిగిన ఘటనలో గ్రామానికి చెందిన టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు, జన్మభూమి కమిటీ సభ్యుడు అయిన పాలుగుళ్ల సూర్యరంగారెడ్డి గాయపడ్డాడు. బాధితుడు స్థానిక ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రైతు రుణ ఉపశమన పత్రాలు ఇచ్చేందుకు గ్రామానికి అధికారులు వచ్చారు. కార్యక్రమం అనంతరం అధికారులు వెళ్లిపోగా, అక్కడే ఉన్న పంచాయతీ కార్యదర్శి సత్యనాయరణ.. వద్దకు సూర్యరంగారెడ్డి వెళ్లారు. వర్షాకాలంలో ట్యాంకర్లతో నీటిని తోలాల్సిన పనేముందని ప్రశ్నించాడు. గ్రామంలోని చెరువుకు నిండా నీరొచ్చిందని, వ్యవసాయ భూముల్లో నీరు సమృద్ధిగా ఉందని.. పంచాయతీ మోటార్లలో నీరు ఎందుకు రావడం లేదని అడిగాడు. నిధులు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పారు.
అయితే ఇటీవల టీడీపీలో చేరిన ముత్తుముల అశోక్‌రెడ్డి వర్గానికి చెందిన దప్పిలి శ్రీనివాసరెడ్డి పంచాయతీ పనులు చూస్తుంటాడు. దీంతో ఆయన సీన్‌లో వచ్చాడు. పంచాయతీలో ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయంటూ సూర్యరంగారెడ్డిపై దాడి చేశాడు. అనంతరం శ్రీనివాసరెడ్డి సోదరులు దప్పిలి రంగస్వామిరెడ్డి, రవీంద్రారెడ్డి కూడా దాడి చేశారు. గాయపడిన సూర్యరంగారెడ్డిని టీడీపీ మండల అధ్యక్షుడు ఏ.శ్రీనివాసులు, తిమ్మాపురం సర్పంచి కోటా రమేష్, పలువురు టీడీపీ నాయకులు పరామర్శించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎస్సై రాంబాబు విచారణ చేపట్టారు.