internal Conflicts
-
తలలు పట్టుకున్న తెలుగు తమ్ముళ్లు..అగ్నికి ఆజ్యం పోస్తున్న 'ఇదేం ఖర్మ'
ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ముఖ్యమైన నాయకులు సైతం కనిపించకుండా పోయారు. కరోనా విపత్కర పరిస్థితులు మొదలు ప్రజలకు సంబంధించి ఏ కష్టంలోనూ వారు పాలుపంచుకోలేదు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇప్పుడిప్పుడే వారికి జనంపై ప్రేమ ఉప్పొంగిపోతోంది. పార్టీ అధిష్టానం కూడా ‘ఇదేం ఖర్మ’ నిర్వహించాలని చెప్పడంతో ప్రజల ముందు ప్రత్యక్ష మవుతున్నారు. కానీ, ఆ కార్యక్రమమే ఇప్పుడు టీడీపీలో కుమ్ములాటలకు ఆజ్యం పోస్తోంది. ఏ నాయకుడికి మద్దతు ఇవ్వాలో తెలీక ‘మాకిదేం ఖర్మ బాబూ’ అని ఆ పార్టీ కార్యకర్తలే పెదవి విరుస్తున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టికి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్గత కుమ్ములాటలతో ఆ పార్టీ నాయకులు రోడ్లెక్కడంతో ఆ పార్టీ చెందిన ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలకు దిక్కుతోచడం లేదు. ఏ నియోజకవర్గంలో చూసినా నాలుగైదు వర్గాలు కామన్ అయిపోయాయి. తాజాగా ఆ పార్టీ అధిష్టానం పిలుపిచ్చిన ‘ఇదేంఖర్మ’ కార్యక్రమం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. దీంతో ఆ పార్టీ కేడర్‌లో నిస్తేజం నెలకొంది. తారస్థాయికి విభేదాలు శింగనమల నియోజకవర్గంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. నియోజకవర్గంలో ఆలం నరసనాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి... బండారు శ్రావణికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. నరసనాయుడు, ముంటిమడుగు వర్గాలు కార్యక్రమం చేయడానికి రావడంతో శ్రావణి వర్గం వారిని అడ్డుకుంది. ఈ వ్యవహారం పోలీస్‌స్టేషన్ దాకా వెళ్లింది. రోడ్డుమీదనే తెలుగుతమ్ముళ్లు కొట్టుకోవడంతో ఆ పార్టీ కార్యకర్తలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. పెనుకొండలో సవితమ్మ, పార్థసారధి, నిమ్మల కిష్టప్ప వర్గాలు తలోమార్గంలో వెళ్తున్నాయి. ఒకరి పేరిత్తితే మరొకరు భగ్గుమంటున్న పరిస్థితి. దీంతో కార్యక్రమం చేస్తే ఎటు వెళ్లాలో కూడా కార్యకర్తలు తేల్చుకోలేకపోతున్నారు. కళ్యాణదుర్గంలో ఉన్నం హనుమంతరాయ చౌదరి, మహేశ్వరనాయుడు వర్గాల మధ్య పాము ముంగిస వైరంలా మారింది. ఏకంగా వేర్వేరుగా పార్టీ కార్యాలయాలు నడుపుతుండటంతో టీడీపీ కేడర్ రెండుగా చీలింది. అనంతపురం అర్బన్‌లో ప్రభాకర్‌చౌదరికి వ్యతిరేకంగా చాలా మంది నాయకులు పావులు కదుపుతున్నారు. ప్రభాకర్‌చౌదరికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ రాకుండా చేయాలని యత్నిస్తున్నారు. అదేస్థాయిలో ఆయన కూడా రాజకీయం చేస్తున్నారు. మడకశిరలో గుండుమల తిప్పేస్వామి, ఈరన్న వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. ఏ కార్యక్రమం చేసినా విడివిడిగా చేస్తూ ఒకరిపై మరొకరు పై చేయి సాధించాలని యతి్నస్తూ ఉన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నిసార్లు చెప్పినా మేమింతే అన్న రీతిలో వారు ముందుకెళ్తున్నారు. పుట్టపర్తిలో మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి చెక్ పెట్టేలా సైకం శ్రీనివాసరెడ్డి, పెద్దరాసు సుబ్రహ్మణ్యం జోరుగా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పల్లెకు టికెట్ ఇస్తే అసలు తాము పనేచేయమంటూ మరికొందరు నాయకులు తిరుగుబాటు చేస్తుండటంతో పార్టీ కేడర్ సందిగ్ధంలో పడిపోయింది. కదిరిలో అత్తార్ చాంద్‌బాషా, కందికుంట ప్రసాద్ వర్గాలు ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటికే అనేకసార్లు ఇరు వర్గాలు బాహాబహికి దిగిన విషయం తెలిసిందే. కార్యక్రమాలన్నీ విడివిడిగా చేస్తుండటం ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. గుంతకల్లు టీడీపీ నాలుగు వర్గాలుగా విడిపోయింది. జితేంద్రగౌడ్, వెంకటశివుడు యాదవ్, పత్తి హిమబిందు, జీవానందరెడ్డి టికెట్ కోసం జోరుగా యత్నిస్తున్నారు. పార్టీ కేడర్ కూడా నాయకుల వారీగా విడిపోవడంతో అధిష్టానానికి ఏం చేయాలో కూడా దిక్కుతోచడం లేదు. ధర్మవరంలో పరిటాల శ్రీరామ్‌కు ప్రస్తుతం బీజేపీలో ఉన్న వరదాపురం సూరి చెక్ పెడతారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. వారిద్దరి మధ్య తరచూ జరుగుతున్న మాటల యుద్ధం దీన్ని బలపరుస్తోంది. వెంటాడుతున్న ఈడీ, సీబీఐ కేసులు టీడీపీ హయాంలో చేసిన అవినీతి, అక్రమాలు ఆ పార్టీ నాయకులకు నిద్రపట్టనివ్వకుండా చేస్తున్నాయి. ఇప్పటికే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఈడీ, సీబీఐ కేసులు మెడకు ఉచ్చులా తగులుకున్నాయి. బీఎస్–3 వాహనాలను బీఎస్– 4గా మార్చి అమ్మిన కేసులో ఇప్పటికే చార్జిషీట్లు దాఖలయ్యాయి. ధర్మవరంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వరదాపురం సూరిపై భూఆక్రమణ కేసుల్లో సీఐడీ విచారణ జరుగుతోంది. దీనికితోడు తాజాగా కర్ణాటక నుంచి అక్రమంగా డీజిల్ రవాణా చేస్తూ దొరికిపోవడంతో కేసు నమోదు చేశారు. మరోవైపు అక్రమాస్తుల కేసులో పెనుకొండకు చెందిన సవితమ్మ ఇంట్లో ఇటీవలే సీబీఐ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించి ఇప్పుడు కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి జ్వాలలు రోజూ ఎక్కడో చోట రగులుతూనే ఉన్నాయి. -
మునుగోడు ఉప ఎన్నిక ముందు కాంగ్రెస్ లో కల్లోలం
-
‘కారు’లో లుకలుకలు.. ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి అక్కడికే ..!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: గులాబీ పార్టీకి సొంత పార్టీ నేతలే షాక్ ఇస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆపరేషన్ ఆకర్‡్ష మంత్రాన్ని ఆచరించి.. సంఖ్యాబలం లేకున్నా పురపాలికలను చేజిక్కించుకున్న ఆ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గెలిచిన పార్టీలకు ఝలక్ ఇస్తూ కారెక్కిన నేతలు.. ఇప్పుడు సొంతగూటి బాట పడుతున్నారు. కొన్నాళ్ల క్రితం తుక్కుగూడ పురపాలక సంఘం చైర్మన్, తాజాగా బడంగ్‌పేట నగరపాలక సంస్థ మేయర్ గులాబీకి గుడ్‌బై చెప్పడం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్/మేయర్ పదవులను దక్కించుకునేందుకు తగినన్నీ సీట్లు రాకపోవడం టీఆర్ఎస్ను నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థి పార్టీల విజేతలకు వల విసరడం ద్వారా మేజిక్ ఫిగర్‌ను చేరుకోగలిగింది. ఈ క్రమంలోనే బీజేపీ సీటు ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా గెలిచిన మదన్మోహన్కు తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. అదే తరహాలో బడంగ్‌పేటలో పారిజాత నర్సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్‌గా గెలవడమేగాకుండా.. తన మద్దతుదారులను కూడా భారీ సంఖ్యలో గెలిపించగలిగారు. దీంతో ఈ కార్పొరేషన్ ప్రత్యర్థుల వశంకాకుండా పావులు కదిపిన మంత్రి సబితారెడ్డి.. కాంగ్రెస్ కార్పొరేటర్లను టీఆర్ఎస్లోకి ఆహ్వానించడం ద్వారా మేయర్ పదవిని పారిజాతకు దక్కేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో వలసనేతలకు గులాబీ అగ్రనేతలతో మనస్పర్థలు రావడం మొదలైంది. ఈ క్రమంలోనే మూడు నెలల క్రితం తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మదన్మోహన్ కాషాయతీర్థం పుచ్చుకోగా.. తాజాగా బడంగ్‌పేట మేయర్, మరో నలుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిణామాలు మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ నేతలను ఆత్మరక్షణలో పడేశాయి. దీనికితోడు మీర్‌పేట నగరపాలక సంస్థ కార్పొరేటర్లు కూడా కొందరు పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆదిబట్లలోనూ అదే సీను.. తుక్కుగూడ, బడంగ్‌పేట పరిధిలో చోటుచేసుకున్న పరిణామాలే ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని ఆదిబట్ల మున్సిపాలిటీలోనూ చోటుచేసుకు న్నాయి. ఇక్కడ కాంగ్రెస్ మెజార్టీ సీట్లు కైవసం చేసుకున్నా.. పార్టీని చీల్చి అదే పార్టీకి చెందిన కౌన్సిలర్ కొత్త హరితకు చైర్పర్సన్ గిరిని కట్టబెట్టడం ద్వారా టీఆర్ఎస్ ఖాతాలో ఈ పురపాలికను వేసుకోగలిగింది. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో ఏర్పడ్డ అభిప్రాయబేధాలతో హరిత..‘కారు’ దిగి హస్తం గూటికి చేరారు. ఇదిలావుండగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోనూ రాజకీయాలు వేడెక్కాయి. కౌన్సిలర్లు, చైర్పర్సన్ మధ్య గ్రూపులుగా విడిపోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ కూడా పలువురు కౌన్సిలర్లు పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. -
టీఆర్ఎస్లో అసంతృప్తి సెగలు.. రహస్య భేటీ..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ టీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. స్థానిక ఎమ్మెల్యే అబ్రహం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. ప్రధానంగా పాలనా వ్యవహారాల్లో ఆయన తనయుడు జోక్యం చేసుకోవడం.. పార్టీలోని స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. చదవండి👉: కేసీఆర్ సుముఖత.. టీఆర్ఎస్ వెంట పీకే టీమ్ నియోజకవర్గ పరిధిలోని పలువురు అసంతృప్త నేతలు ఇటీవల రహస్యంగా సమావేశమై పోరు కార్యాచరణ పథకం రచించారు. ఇందుకనుగుణంగా దూకుడుగా వ్యవహరిస్తుండటంతో కారులో కిరికిరి తారాస్థాయికి చేరినట్లు స్పష్టమవుతోంది. పాలమూరులో ఒకవైపు బీజేపీ ప్రజాసంగ్రా మ యాత్ర కొనసాగుతుండగా మరోవైపు కాంగ్రెస్ సైతం క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై పోరుబాట పట్టింది. ఈ క్రమంలో అలంపూర్‌లో అధికార పార్టీలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. గులాబీలో అంతర్గత పోరు రచ్చకెక్కిన నేపథ్యంలో ఈ పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయోనని చర్చ జోరుగా సాగుతోంది. ఇలా ముదిరింది.. 2009 డీలిమిటేషన్లో అలంపూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్గా మారింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యరి్థగా వీఎం అబ్రహం బరిలో నిలిచి విజయం సాధించారు. 2014లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్‌కుమార్ గెలుపొందారు. తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో ఈసారి టీఆర్ఎస్ నుంచి అబ్రహం పోటీచేసి గెలిచారు. అయితే గెలిచిన కొంతకాలం తర్వాత స్థానిక నేతలను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. అదే సమయంలో ఆయన తనయుడు అజయ్ పొలిటికల్ ఎంట్రీకి అబ్రహం సన్నాహాలు చేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో అలంపూర్ నుంచే వారసత్వం పుచ్చుకోనున్నట్లు ప్రచారం మొదలైంది. దీంతో పాటు అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానం అందకపోవడం.. అందినా చివరి నిమిషంలో కబురు రావడం వంటి సంఘటనలు స్థానిక ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తిని రగిల్చాయి. దళితబంధు, ఇతర పథకాల అమలులో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకోకపోవడం మరింత నిప్పు రాజేసినట్లు సమాచారం. దీంతో పలువురు అసమ్మతి నేతలు ఇప్పటికే నాలుగైదు పర్యాయాలు రహస్యంగా భేటీ అయినట్లు తెలిసింది. అయితే పార్టీకి చెడ్డ పేరు రావొద్దనే ఉద్దేశంతో తగిన సమయం కోసం వేచిచూసినట్లు తెలుస్తోంది. అయిజలో రహస్య భేటీ.. ప్రస్తుతం అసంతృప్తితో రగులుతున్న నేతలు మొదట్లో ఎమ్మెల్యే అబ్రహంతో సఖ్యతగానే ఉన్నారు. ఎప్పుడైతే తన కొడుకు అజయ్ పొలిటికల్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టడం.. అధికారిక కార్యక్రమాలతో పాటు తమ పరిధిలోని మండలాలు, గ్రామాల్లో జరిగే వివిధ కార్యకళాపాల్లో అజయ్ పెత్తనం చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పీఏసీఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు సోమవారం అయిజలోని ఓ ఫంక్షన్ హాల్లో సమావేశమై పోరు కార్యాచరణపై చర్చించారు. కేటీఆర్ వద్దకు పంచాయితీ.. ఓ నిర్ణయానికి వచ్చిన అసంతృప్త నేతలు సమావేశం అనంతరం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కలిశారు. ఎమ్మెల్యే అబ్రహం తీరుతో తమకు జరుగుతున్న అవమానాలను ఏకరువు పెట్టారు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని వారి క్యాంపు కార్యాలయాల్లో కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యను పరిష్కరించాలని కోరినట్లు సమాచారం. స్పందించిన వారు ‘అలాగేనని.. ప్లీనరీ ఉంది.. తర్వాత కలిసి మాట్లాడదాం’ అని అసంతృప్త నేతలను సముదాయించినట్లు తెలిసింది. ఎక్కడ కూడా బహిర్గతం కావొద్దని.. అంతర్గతంగానే పరిష్కరించుకుందామని సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఈ పంచాయితీ కేటీఆర్ వద్దకు చేరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్లీనరీ తర్వాత దీనిపై ఆయన దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అలంపూర్‌లో గట్టి పట్టు ఉన్న టీఆర్ఎస్ నేత తిరుమల్‌రెడ్డి మృతిచెందడం.. మరోవైపు గెలుపోటములను శాసించే చల్లా వెంకట్రామరెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతుండడం.. ఈ క్రమంలో టీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కడం చర్చనీయాంశాలుగా మారాయి. అలంపూర్ నియోజకవర్గంపై దృష్టి సారించిన అధికార పారీ్టలో కొందరు నేతలు ఇప్పటి నుంచే చక్రం తిప్పుతున్నారని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇసుకదందాలో తనయుడి మితి మీరిన జోక్యంతోనే ఎమ్మెల్యేపై అసమ్మతి సెగ రాజుకుందనే అభిప్రాయాలు టీఆర్ఎస్ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. -
కమలం వికసించేనా?.. కేడర్ ఉన్నా లీడర్ల మధ్య సఖ్యత కరువు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎన్నికలకు ముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ వరుస విజయాలతో బీజేపీ దూకుడు పెంచింది. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తెలంగాణకు గుండెకాయలాంటి రంగారెడ్డి జిల్లాలో మాత్రం కమల వికాసం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో పార్టీకి మంచి కేడర్ ఉన్నప్పటికీ లీడర్ల మధ్య సఖ్యత కొరవడింది. చదవండి: కామారెడ్డి: కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. రచ్చకెక్కిన విభేదాలు ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు నేతలు పోటీకి సిద్ధమవుతుండటం.. ప్రజా సమస్యలపై సమష్టిగా కాకుండా ఎవరికి వారే కార్యక్రమాలు రూపొందిస్తుండడం.. అంతర్గత విభేదాలు బహిర్గతమవుతుండటం.. అధినాయకత్వం జిల్లాపై దృష్టి సారించకపోవడం.. నియోజకవర్గాల వారీగా సమీక్షలు, సమావేశాలు ఏర్పాటు చేయకపోవడం వంటి అంశాలు పార్టీ వెను కబాటుకు కారణమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉండగా, అధికార పారీ్టకి ఐదు చోట్ల గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని, సమష్టిగా కృషి చేస్తే రాబోయే ఎన్నికల్లో విజయావకాశాలు లేకపోలేదని పేర్కొంటున్నారు. కల్వకుర్తిలో.. జిల్లాలో మొదటి నుంచి పార్టీకి మంచి పట్టున్న నియోజకవర్గం ఇదే. గ్రామం నుంచి మండల స్థాయి వరకు కమిటీలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టిపోటీ ఉండనుంది. జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బరిలోకి దిగి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత బీసీ కమిషన్ సభ్యుడి హోదాలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. నెలలో 20 రోజులు ఇక్కడే మకాం వేస్తున్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో 12 బీజేపీ గెలిచినప్పటికీ.. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదనే అపవాదు పారీ్టకి లేకపోలేదు. షాద్‌నగర్‌లో.. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఇక్కడ పార్టీ కొంత బలపడినప్పటికీ.. ఎన్నికల్లో పోటీకి ఆశించిన ప్రజా మద్దతును కూడగట్టలేకపోయింది. మొదటి నుంచి అదే పార్టీలో కొనసాగుతున్న శ్రీవర్ధన్‌రెడ్డి సహా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తనయుడు మిథున్‌రెడ్డి, టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్థన్‌రెడ్డి టికెటు ఆశిస్తున్నారు. బూత్ లెవల్లో పార్టీ పటిష్టత కోసం పాటుపడటం లేదనే విమర్శలు ఉన్నాయి. మారుమూల గ్రా మాల్లోనే కాదు పట్టణ ప్రాంతాల్లోనూ మరింత బలపడాల్సిన అవసరం ఉంది. చేవెళ్లలో.. ప్రధాని మోదీపై ఉన్న అభిమానంతో యువత బీజేపీ వైపు ఆకర్షితులవుతోంది. ఇక్కడ అధికారపార్టీని ప్రభావితం చేయగలిగే లీడర్లు లేకపోవడం కొంత ఇబ్బందికరంగా మారింది. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నాయకుడు వస్తే తప్ప పట్టు సాధించలేని పరిస్థితి. మొదటి నుంచి పార్టీలోనే కొనసాగుతున్న సీనియర్ నేతలు సైతం అధికారపార్టీ అభ్యర్థితో పోటీపడలేకపోతున్నారు. ఇక్కడ పాగా వేయాలంటే కేడర్ శక్తికి మించి కష్టపడాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో.. అంతర్గత కుమ్ములాటలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి. ఏదైనా సమస్యపై అధిష్టానం పిలుపు ఇస్తే కానీ కేడర్ రోడ్డుపైకి రావడం లేదు. ప్రజల్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం కూడా పెద్దగా చేయడం లేదంటున్నారు. గత ఎన్నికల్లో కొత్త అశోక్‌గౌడ్ పార్టీ తరఫున పోటీ చేసి 17 వేల ఓట్లు మాత్రమే సాధించారు. తుర్కయంజాల్, పెద్ద అంబర్పేట్, ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఒకటి రెండు సీట్లకే పరిమితమైంది. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేస్తే కానీ పోటీలో నిలబడలేని పరిస్థితి. రాజేంద్రనగర్‌లో.. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఇక్కడ పార్టీ బలపడింది. ప్రాబల్యమున్న ప్రాంతాలు మినహా అన్ని చోట్ల పట్టు సాధించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఐదు డివిజన్లు ఉండగా, వీటిలో మూడు గెలుచుకుంది. శంషాబాద్ పట్టణం.. మండలాల్లో కేడర్ పటిష్టంగా ఉంది. మైలార్దేవులపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి, బుక్క వేణుగోపాల్ పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల లోక్‌సత్తా రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోల్కర్‌రెడ్డి సైతం బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఆ పారీ్టకి కలిసి వచ్చే అంశం. క్షేత్రస్థాయి లీడర్లు, కేడర్ కలిసికట్టుగా పని చేస్తే విజయానికి అవకాశం లేకపోలేదు. మహేశ్వరంలో.. జీహెచ్ఎంసీలోని ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్లు సహా తుక్కుగూడ చైర్మన్ స్థానం బీజేపీ కైవసం చేసుకుంది. బడంగ్పేట్, మీర్పేట్, జల్పల్లి మున్సిపాలిటీల్లోనూ పార్టీ ప్రభావం చూపింది. కందుకూరు ఎంపీపీ కూడా ఆ పార్టీ అభ్యర్థే. మహేశ్వరం మండలం లోని పలు గ్రామాల్లోని ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలు పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, సీనియర్ నేత అందెల శ్రీరాములు యాదవ్, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్‌గౌడ్ ఇక్కడి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. సంస్థాగతంగా పార్టీ బలంగా ఉన్నప్పటికీ లీడర్ల మధ్య అంతర్గత విభేదాలు పుట్టిముంచే ప్రమాదం ఉందంటున్నారు. -
సీఎం అభ్యర్థిని ప్రకటించండి!
చండీగఢ్: పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. వచ్చే 7– 10 రోజుల్లో పంజాబ్ కాంగ్రెస్ అభ్యర్థి పేరును ప్రకటించాలని రాహుల్‌గాంధీకి పీపీసీసీ చీఫ్ నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ గురువారం డెడ్‌లైన్ విధించారు. జలంధర్‌లో జరుగుతున్న ప్రచారంలో రాహుల్‌ను సిద్ధూ ప్రశ్నించారు. తనను షోకేస్‌లో బొమ్మలాగా ఎల్లకాలం చూపాలని కోరడం లేదని సిద్ధూ స్పష్టం చేశారు. సీఎం అభ్యర్ధి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ తక్షణం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ను ఎవరు నడిపిస్తారో పంజాబ్ ప్రజలకు వెల్లడించాలని, అప్పుడే కాంగ్రెస్ సులభంగా 70 సీట్లు నెగ్గుతుందని చెప్పారు. ఇదే వేదికపై ఉన్న ప్రస్తుత సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ కూడా అదే డిమాండ్‌ను వినిపించారు. వేదికపై సిద్దూను ఆలింగనం చేసుకొని తమ మధ్య ఏలాంటి విభేదాలు లేవని చెప్పారు. అయితే సీఎం అభ్యర్ధి పేరును ప్రకటించడం ద్వారా అరవింద్ కేజ్రీవాల్ నోరు మూయించాలని చన్నీ కోరారు. పంజాబ్ కోసం తాను ప్రాణమిస్తానని, అయితే ప్రజలు ఈ రోజు సీఎం అభ్యర్ధి ఎవరని అడుగుతున్నారని చెప్పారు. రాహుల్ తనకు ఎన్నో ఇచ్చారన్నారు. సీఎం కేండిడేట్‌గా ఎవరిని ప్రకటించినా తనకు సంతోషమేనన్నారు. కాంగ్రెస్‌కు పెళ్లికొడుకు ( సీఎం అభ్యర్ధి) లేరనే కేజ్రీవాల్ విమర్శలు వినదలుచుకోలేదని చెప్పారు. త్వరలో నిర్ణయిస్తాం పంజాబ్ కాంగ్రెస్ కార్యకర్తలను సంప్రదించిన అనంతరం సీఎం అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని రాహుల్‌గాంధీ ప్రకటించారు. అలా ప్రకటించాల్సిన అవసరం ఉందో, లేదో కూడా కార్యకర్తలను అడుగుతామన్నారు. ఎవరో ఒక్కరే పార్టీని ముం దుండి నడిపిస్తారని చెప్పారు. ఒకరికి అవకాశం ఇస్తే మరొకరు మద్దతు ఇస్తామని ఇద్దరూ(చన్నీ, సిద్ధూ) వాగ్దానం చేశారని, ఇద్దరి గుండెల్లో కాంగ్రెస్ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. -
తాలిబన్ల తలపట్లు
ఇల్లు అలకగానే పండుగ కాదు, ముందుంది మొసళ్ల పండుగ... ఇలాంటి సామెతలన్నీ తాలిబన్లకు వర్తించేలా పరిస్థితులు మారుతున్నాయి. అఫ్గాన్‌ను స్వా«దీనం చేసుకున్న ఆనందం ఆవిరవడానికి తాలిబన్లకు ఎక్కువ సమయం పట్టడం లేదు. తాత్కాలిక ప్రభుత్వంలో వివిధవర్గాలకు ప్రాతినిధ్యం వహించే నేతల మధ్య సయోధ్య కరువవడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. అఫ్గాన్‌ను అమెరికా సైన్యాలు వదిలిపోవడంతో అలవోకగా స్వాదీనం చేసుకున్న తాలిబన్లు.. అది తమ ఘనవిజయంగా భావించారు. కానీ దేశానికి ఆధిపత్యం వహించే విషయంలో అగ్రనేతల మధ్య ఆరంభమైన కుమ్ములాటలు అఫ్గాన్ స్వాధీన విజయాన్ని ఆవిరి చేస్తున్నాయి. నిజానికి బయటనుంచి చూసేవారికి తాలిబన్లంతా ఒకటేనని, వారి సిద్ధాంతాల్లో తేడాలుండవని అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. అన్ని పారీ్టల్లాగానే తాలిబన్లలో కూడా వర్గాలు, గ్రూపులు, అభిప్రాయభేదాలు, కుమ్ములాటలు బోలెడున్నాయని తాలిబన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇంతవరకు అజ్ఞాతంలో బతుకుతూ అమెరికాతో యుద్దం చేయాల్సిరావడం వల్ల ఈ వర్గాలు, భేదాభిప్రాయాలు బయటపడలేదు. కానీ ఎప్పుడైతే దేశం స్వాదీనమై పాలనా పగ్గాలు చేతికి వచ్చాయో వీరిలో విభేదాలు ముదురుతున్నాయి. ఉమ్మడి శత్రువు మొఖం చాటేయగానే తాలిబన్లలో గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. ఈ మంటలు ముదిరి సోమవారం రెండువర్గాల మధ్య అధ్యక్ష భవనంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో తాలిబన్ అగ్రనేత, సహవ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ మరణించాడని పుకార్లు షికారు చేశాయి. కానీ తాను బతికే ఉన్నానని బరాదర్ ఒక ఆడియో రిలీజ్ చేశాడు. అయినా సరే తన పరిస్థితిపై అయోమయం నెలకొంది. (చదవండి: ప్రభుత్వ ఏర్పాటుతో వేర్పాటు బీజాలు అఫ్గాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందనగానే బరాదర్ నాయకుడిగా ఉంటారని ఎక్కువమంది భావించారు. అమెరికాతో చర్చలు జరిపి, వారి సేనలు వెనక్కుమరలిపోయేలా చేయడంలో బరాదర్ కీలకపాత్ర పోషించాడు. దీనికితోడు అతను ముల్లాఒమర్కు సన్నిహితుడు. ఖతార్‌తో తనకు సత్సంబంధాలున్నాయి. అందుకే సహజంగా బరాదరే ప్రధాని అనుకున్నారు. కానీ అనూహ్యంగా అఖుండ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. దీంతో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయని అఫ్గాన్ పరిణామాల విశ్లేషకుడు నైమతుల్లా ఇబ్రహిమి అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వంలో కాందహార్‌కు చెందిన పాతతరం తాలిబన్లతో పాటు అల్‌కాయిదా, పాక్ ఐఎస్ఐతో సత్సంబంధాలున్న హక్కానీలకు పెద్దపీట దక్కింది. ఇరాన్ అండ ఉన్న పశ్చిమ తాలిబన్ గ్రూపునకు అసలు ప్రాధాన్యమే దక్కలేదు. గతంలో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కాందహార్ గ్రూపుదే ప్రభుత్వంలో ఆధిపత్యం ఉండేది. కానీ తాజా ప్రభుత్వంలో హక్కానీలకు ప్రాధాన్యత పెరిగింది. ఐఎస్ఐ అండదండలే హక్కానీల బలం పెరిగేందుకు కారణమయ్యాయని నైమతుల్లా చెప్పారు. హక్కానీల నేత సిరాజుద్దీన్ తలపై అమెరికా కోటి డాలర్ల బహుమతి ప్రకటించింది. కానీ ప్రస్తుతం సిరాజుద్దీన్ అఫ్గాన్ ప్రభుత్వంలో కీలకమంత్రి అయ్యారు. ఇది పాశ్చాత్య దేశాలకు మింగుడుపడని అంశం. (చదవండి: తాలిబన్ ముప్పు.. పాక్ చేరిన అఫ్ఘాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు) ఉమ్మడి ప్రభుత్వమే శరణ్యం? హక్కానీల ప్రాధాన్యత పెరగడం వల్లనే అఫ్గాన్ ప్రభుత్వాన్ని యూఎస్, మిత్రపక్షాలు గుర్తించడంలో జాప్యం చేయడం, అమెరికాలోని అఫ్గాన్ బ్యాంకు నిధులు విడుదల చేయకుండా తొక్కిపట్టడం చేస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే దీన్ని బరాదర్ వైఫల్యంగా హక్కానీలు ఎత్తిచూపుతున్నారు. అయితే ప్రాధాన్యం లేని పోస్టు ఇచ్చినందుకు ఈ విషయంలో తామెందుకు జోక్యం చేసుకోవాలని బరాదర్ వర్గం భావిస్తోంది. పాశ్చాత్య ప్రపంచం గుర్తించకపోతే అఫ్గాన్‌కు ఆర్థిక సాయం అందదు. దీంతో దేశం తీవ్ర సంక్షోభంలో మునిగే ప్రమాదం ఉంది. దీన్ని పట్టించుకోకుండా తాలిబన్– హక్కానీలు సిగపట్లు పడుతున్నారు. ఇది కేవలం అఫ్గాన్‌కే కాకుండా పొరుగుదేశాలకు కూడా ప్రమాదం తెస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అఫ్గాన్‌లోని పలు వర్గాలను ప్రభుత్వంలో చేర్చుకోకపోవడంతో వారిలో అసంతృప్తి పెరుగుతోందని, దీనివల్ల తిరిగి దేశంలో అంతర్యుద్ధం ఆరంభం కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్యుద్ధమే ఆరంభమైతే మరలా రష్యా, ఇరాన్, ఇతర దేశాలు తమ అనుకూల గ్రూపులకు సాయం చేయడం మొదలుపెడతాయి. దీంతో మరోమారు అఫ్గాన్‌లో హింసాత్మక పోరు పెచ్చరిల్లుతుందని నైమతుల్లా అభిప్రాయపడ్డారు. మరి ఇప్పటికైనా తాలిబన్లు, హక్కానీలు భేదాభిప్రాయాలు మరిచి ఇతర గ్రూపులకు కూడా ప్రభుత్వంలో స్థానం కల్పిస్తాయా? లేక గ్రూపు రాజకీయాలను పెంచుతాయా? అని అన్ని దేశాలు ఆందోళనతో ఎదురు చూస్తున్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
Panjshir: తాలిబన్ల పైచేయి.. పంజ్‌షీర్ కైవసం
అఫ్గనిస్తాన్‌లో హోరాహోరీగా సాగుతున్న ఆధిపత్య పోరు ఎట్టకేలకు ముగిసింది!. పంజ్‌షీర్ ప్రావిన్స్‌పై పట్టు సాధించేందుకు జరుగుతున్న పోరులో తాలిబన్లు పైచేయి సాధించారు. మొత్తం ప్రాంతమంతా వాళ్ల ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం అధికారికంగా తాలిబన్లు ఈ విషయాన్ని ప్రకటించుకున్నారు. అఫ్గనిస్తాన్‌లో చిట్టచివరి ప్రాంతాన్ని కైవసం చేసుకోవడంలో తాలిబన్లు సఫలమైనట్లు తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తెలిపాడు. మరోపక్క పంజ్‌షీర్ ప్రావిన్సియల్ గవర్నర్ కార్యాలయంపై తాలిబన్లు జెండా ఎగరవేస్తున్న దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాడులకు సంబంధించిన పూర్తి స్థాయి నష్టం వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే తాలిబన్లను భారీ సంఖ్యలో మట్టుపెట్టామని పంజ్‌షీర్ యోధులు ప్రకటించిన రోజు వ్యవధిలోనే.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం. చదవండి: పోరాటాల గడ్డ.. పంజ్‌షీర్ మరోవైపు పంజ్‌షీర్ సాయుధ దళాల నేత అహ్మద్ మసూద్ పోరాటం పక్కనపెట్టి, చర్చల కోసం హస్తం చాస్తున్నట్లు ఆదివారం సాయంత్రం ప్రకటించాడు. అయితే ఆయుధం పక్కనపెట్టే ప్రసక్లే లేదని తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల తాజా ‘పంజ్‌షీర్ కైవసం’ ప్రకటన కథనాలపై స్పందించేందుకు అహ్మద్ అందుబాటులో లేకుండా పోయాడు. ఆయన పరారీలో ఉన్నట్లు లోకల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. #FahimDashty was not a fighter, he was a journalist. And killing a journalist is a war crime. One of many, alas, committed by the Taliban. He was brave and sweet. He was with #AhmadShahMassoud on Sept 9, 2001; but he did not survive the assault on #Panjshir ... #PrayForPanjshir pic.twitter.com/nOOumkhsZN — Bernard-Henri Lévy (@BHL) September 5, 2021 అఫ్గన్ జాతీయ ప్రతిఘటన దళాల ప్రతినిధి, అఫ్గన్ జర్నలిస్టుల సమాఖ్య సభ్యుడు ఫహిమ్ దాష్టీని తాలిబన్లు మట్టుపెట్టిన విషయం తెలిసిందే. అయితే పాక్ దళాలు జరిపిన డ్రోన్ బాంబు దాడుల్లో ఆయన మరణించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. పాక్ సహకారంతో తాలిబన్లు పంజ్‌షీర్‌ను కైవసం చేసుకుందని అంతర్జాతీయ మీడియా జర్నలిస్టులు కొందరు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో పంజ్‌షీర్‌లో మారణహోమం జరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. చదవండి: భారీ నష్టం తాలిబన్లకేనా? -
Haiti: రాజకీయ స్థిరత్వం లేని నెత్తుటి నేల
లాటిన్ అమెరికాలో భాగంగా.. కరేబియన్ దీవుల్లో వలస పాలన నుంచి విముక్తి పొందిన తొలి దేశంగా హైతీకి ఓ గుర్తింపు ఉంది. అయితే స్వేచ్ఛా దేశం అనేపేరే తప్పించి.. ఏనాడూ ఆ గడ్డ ప్రశాంతంగా ఉండింది లేదు. హింస, దురాక్రమణలు, రాజకీయ సంక్షోభం, ప్రజల తిరుగుబాటు, అణచివేతలు, పేదరికం, తిరుగుబాటుదారుల మారణ హోమాలు హైతీని నెత్తుటి నేలగా మార్చేశాయి. తాజాగా ఏకంగా అధ్యక్షుడు జోవెనెల్ మోయిస్ హత్యతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. వెబ్‌డెస్క్: ఆఫ్రికన్ జాతులతో విరజిల్లుతున్న కరేబియన్ సముద్రపు హిస్పనియోల దీవుల్లో.. ఇటలీ నావికాన్వేషకుడు క్రిస్టోఫర్ కొలంబస్ అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఈ భూభాగంలో స్పెయిన్ కాలనీలు వెలిశాయి. రెండు వందల ఏళ్ల తర్వాత పశ్చిమం వైపు సగ భాగాన్ని ఫ్రాన్స్ చేజిక్కిచ్చుకుంది. అప్పటి నుంచి వాళ్లను బానిసలుగా మార్చుకుని షుగర్, రమ్, కాఫీ ఉత్పత్తులను ఫ్రాన్స్‌కు అక్రమంగా తరలించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో వాళ్లు దారుణమైన హింసను చవిచూశారు. 1801లో.. టౌస్సెయింట్ లోవెర్టర్ తిరుగుబాటుతో బానిసత్వాన్ని రద్దు చేశారు. ఆపై 1804లో ఫ్రాన్స్ నుంచి విముక్తి పొంది హైతీ స్వతంత్ర్య దేశంగా ఆవిర్భవించింది. బానిస బతుకుల విముక్తి కోసం పోరాడిన జీన్ జాక్వెస్ డెస్సాలైన్స్ తొలి అధ్యక్షుడు అయ్యాడు. కానీ, రెండేళ్లకే అతన్ని దారుణంగా హత్య చేశారు(వాళ్లెవరో ఇప్పటిదాకా తెలియదు). ఆపై వంద సంవత్సరాలపాటు అంతర్యుద్దంతో నలిగిపోయిన హైతీలో 1915లో అమెరికా సైన్యం అడుగుపెట్టింది. అయితే 1943లో తమ దళాలను వెనక్కి తీసుకున్నప్పటికీ.. ఇప్పటికీ ఆర్థిక, రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకుంటూ వస్తోంది. దాయాదిగా పొరుగు దేశం! పొరగున ఉండే డొమినికన్ రిపబ్లిక్‌తో 1937లో హైతీకి శత్రుత్వం మొదలైంది. సరిహద్దు విషయంలో జరిగిన గొడవలతో అప్పటి డొమినికా నియంతాధ్యక్షుడు టట్రుజిల్లో నర మేధానికి ఆదేశాలిచ్చాడు. దీంతో సరిహద్దులో నివసిస్తున్న హైతీ ప్రజల్ని.. డొమినికా సైన్యం ఊచకోత కోసింది. ఆ తర్వాత కాల్పులు తగ్గుముఖం పట్టినప్పటికీ .. సరిహద్దు ఒప్పందాలు మాత్రం కొనసాగుతున్నాయి. సైన్యం తిరుగుబాటులు 1957లో హైతీ రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. దీంతో అప్పటి సైన్యాధ్యక్షుడు ఫ్రాన్కోయిస్ పాపా డాక్ డువెలైర్.. మిలిటరీ సాయంతో అధికార పీఠాన్ని చేజిక్కించుకున్నాడు. ఆ పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన ఎవరూ ఊహించని స్థాయిలో జరిగింది. చివరికి అంతర్జాతీయ సమాజం విమర్శలకు తలొగ్గి, టోంటోన్ మాకౌట్స్ రహస్య బృందాలకు భయపడి డువెలైర్ కొంచెం తగ్గాడు. 1964లో తనను తాను అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించుకున్నాడు. అతని మరణం తర్వాత కొడుకు జీన్ కౌడ్(బేబీ డాక్) అధ్యక్షుడు అయ్యాడు. అతని పాలనలో ప్రజలు నరకం అనుభవించారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఫ్లోరిడాకు పడవల్లో పారిపోయే ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయాణాల్లో వేల మంది మృత్యువాత పడ్డారు. ఎన్నికలు.. పేదరిక ప్రభావం వరుస తిరుగుబాట్లు, ప్రజల నిరసన ప్రభావంతో బేబీ డాక్.. 1986లో ఫ్రాన్స్‌కు శరణార్థికి పారిపోవడంతో లెఫ్టినెంట్ జనరల్ హెన్రీ నాంపి పాలనను చేపట్టాడు. రెండేళ్లకు జనరల్ ప్రాస్పర్ అవిరిల్ తానే నిజమైన అధ్యక్షుడినని ప్రకటించుకోగా.. అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో రాజీనామా చేసి తొలిసారి ఎన్నికలు నిర్వహించారు. అయితే పేదల పెన్నిధిగా పేరున్న వామపక్ష నేత జీన్ బెర్ట్రాండ్ అర్టిస్టిడె ఆ ఎన్నికల్లో గెలవగా.. ఆ మరుసటి ఏడాది(1991)లో హింస చెలరేగడంతో అతన్ని పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. మూడేళ్ల పాటు ఆ మారణకాండలు అలాగే కొనసాగడంతో.. 1994లో అమెరికా జోక్యం చేసుకుంది. తమ సైన్యాన్ని దించి హైతీ మిలిటరీ చర్యల్ని అణచివేసి.. తిరిగి అర్టిస్టిడ్ను అధ్యక్షుడిగా నియమించి శాంతి స్థాపనకు ప్రయత్నించింది. అప్పటి రాజకీయ అస్థిరత్వం నడుమే అధ్యక్షుడిగా కొనసాగినప్పటికీ.. 2004లో మళ్లీ హింస చెలరేగడంతో అర్టిస్టిడ్ దేశం విడిచి పారిపోయాడు. దీంతో మరోసారి ఎన్నికలు జరగ్గా.. ప్రెవెల్ నెగ్గాడు. ఆపై నిరసనలు, ఆహార కొరత, కలరా.. 2010లో భారీ భూకంపాలతో రెండున్నర లక్షల మంది దుర్మరణం పాలవ్వడంతో హైతీ ఘోరంగా కుదేలు అయ్యింది. కోలుకున్నట్లే అనిపించి.. వరుస విషాదాలతో కొలుకున్న హైతీకి.. 2011 ఎన్నికల్లో మైకేల్ మార్టెల్లీ గెలవడంతో ఆశలు చిగురించాయి. అయితే ఆ ఆనందం ఏడాది కూడా నిలవలేదు. పేదరికం, ఆర్థిక సంక్షోభం, పైగా అవినీతి ఆరోపణలతో ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు మొదలయ్యాయి. దీంతో మార్టెల్లీ రాజీనామా చేయాల్సి వచ్చింది. 2017లో అరటి పండ్ల వ్యాపారిగా ఉన్న జోవెనెల్ మోయిస్.. రాజకీయాల్లోకి అడుగుపెట్టి బ్రహ్మండమైన మెజార్టీతో గెలుపొందాడు. అయితే అధికార దుర్వినియోగంతో ఎన్నికలకు సిద్ధపడకపోకపోవడంతో.. మరోసారి వ్యతిరేక గళం వినిపించింది హైతీ గడ్డపై. ఈ ఏడాది మొదట్లో నియంతృత్వం వద్దంటూ లక్షల మంది నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చంపిందెవరు? హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిస్ అతిదారుణంగా హత్య చేసిన వాళ్ల గురించి రకరకాల కథనాలు వెలువడ్డాయి. నిందితులు కాల్పుల సమయంలో స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడారని పోలీసులు ధృవీకరించుకున్నారు. ఇక ఇది ఫ్రాన్స్ చేయించిన హత్య అని, కాదు అమెరికా చేయించిన హత్య అని, డొమెనికా సీక్రెట్ గ్రూప్ చేయించిన పని అని.. ఇలా ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే ఆయా దేశాలు మాత్రం ఆరోపణల్ని.. మోయిస్ హత్యను ముక్తకంఠంతో ఖండించాయి. ఇక హత్యకు పాల్పడిన ముఠాగా అనుమానిస్తున్న ముగ్గురిని ఇప్పటికే హైతీ భద్రతా దళాలు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాయి. తీవ్రంగా గాయపడిన మోయిస్ భార్య మార్టైన్ మోయిస్ స్పృహలోకి వస్తే.. ఈ హత్యకు సంబంధించిన వివరాలేవైనా తెలుస్తాయని భద్రతా దళాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న క్లౌండ్ జోసెఫ్.. తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు. -
అధినేత సమక్షంలోనే తమ్ముళ్ల తన్నులాట
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఈ ఏడాది ఎన్నికల్లో జనమిచ్చిన తీర్పుతో చావు దెబ్బతిన్న జిల్లా టీడీపీ ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. ఎన్నికలనంతరం కూడా అంతర్గత విభేదాలతో పార్టీ మరింత పతనావస్థకు చేరింది. తమ పార్టీ అధినేత చూస్తున్నారన్న భయం కూడా కడప తెలుగు తమ్ముళ్లలో లేకపోయింది. తాజాగా ఏకంగా అధినేత సమక్షంలోనే కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగడం పార్టీలో తీవ్ర కలకలం రేపింది. కడప పర్యటనలో రెండవరోజు మంగళవారం స్థానిక శ్రీనివాస కళ్యాణ మండపంలో జిరిగిన కమలాపురం, ప్రొద్దుటూరు ,కడప, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. సమీక్షా సమావేశంలో 15వ డివిజన్ ఇన్చార్జ్ దళిత కార్యకర్త కొండా సుబ్బయ్య మాట్లాడుతూ.. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడంతో గొడవ మొదలైంది. సుబ్బయ్య చేతిలోని మైకును లాక్కొని.. చంద్రబాబు సమక్షంలోనే సుబ్బయ్యపై శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు సరైన విధంగా స్పందించక పోవడం గమనార్హం. ఈ సంఘటనపై రిమ్స్ పోలీస్ స్టేషన్లో సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి, 8 మంది అతని అనుచరులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కమలంలో కలహాలు...
ఎన్నికల అనంతరం పార్టీల్లో ఫలితాలపై మేథోమధనం సర్వసాధారణమే. జరిగిన తప్పిదాలపై చర్చించుకోవడం.. భవిష్యత్తు కార్యక్రమాలకు సమాయత్తం కావడం దీని ముఖ్యోద్దేశం. కానీ జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీలో ఇప్పుడు కలహాలు మొదలయ్యాయి. జిల్లాకు కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇవి కాస్తా ఢిల్లీవరకూ చేరాయి. సీపీఐలో ఆధిపత్య పోరు మొదలైంది. ఇక తెలుగుదేశం పార్టీ ఉనికినే కోల్పోయేలా నాయకులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన పార్టీల్లో కొన్ని కనుమరుగైపోగా కొన్ని పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికల్లో జిల్లాలోని ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే స్థానాన్నీ గెలుచుకోలేకపోయిన టీడీపీ నేతలు ఇంటికే పరిమితమైపోయారు. జిల్లాలోని భారతీయ జనతాపార్టీ నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా... సీపీఐ వంటి జాతీయ పార్టీలో ఆధిపత్య పోరు రచ్చకెక్కుతోంది. బీజేపీలో నిధుల దుర్వినియోగం వ్యవహారం ఢిల్లీ వరకూ చేరింది. ఈ వ్యవహారాలన్నింటిపైనా ఆయా పార్టీల్లో ఇప్పుడు పంచాయితీ మొదలైంది. జిల్లాలో ఎన్నికల ముందు బీజేపీ కొంత ఉత్సాహంగానే కనిపించింది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడైన అమిత్‌షా కూడా విజయనగరం వచ్చి బహిరంగ సభ నిర్వహించారు. గెలుపుపై ఆ పార్టీ అభ్యర్థులు ఆశలు కూడా పెట్టుకున్నారు. అయితే జిల్లాకు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడి కారణంగా గెలిచే అభ్యర్థులకు టిక్కెట్లు దక్కలేదనేది వివాదానికి కారణమైంది. పార్టీ కోసం పనిచేసేవారిని ఒక్కొక్కరుగా బయటకు పంపించేసి ఒక నియంతలా ఆయన వ్యవహరించడంతో పాటు జిల్లాలోని బీజేపీ అభ్యర్థులకు ఇవ్వాల్సిన పార్టీ ఫండ్‌ను పూర్తిగా ఇవ్వకుండా అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు లేవనెత్తారు. రాష్ట్రంలోని 175 స్థానాలకు పంచాల్సిన పార్టీ ఫండ్ రూ.30 కోట్లు దుర్వినియోగం అయ్యిందని, దానిలో జిల్లాకు చెందిన ఆ రాష్ట్ర నాయకుడి వాటా రూ.4 కోట్లు అని బీజేపీ అధిష్టానానికి ఇప్పటికే ఫిర్యాదులు కూడా అందాయి. అంతేగాకుండా ప్రతి జిల్లాలోనూ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి బీజేపీ జిల్లాకు రూ.2 కోట్లు చొప్పున గతంలోనే ఇచ్చింది. ఈ నిధులతో జిల్లాలో ఓ భవనాన్ని కొనుగోలు చేశారు. ఎన్నికల ముందు దానిని కూల్చి కొత్తభవన నిర్మాణాన్ని మొదలుపెట్టారు. దీనికి సంబంధించి కోర్ కమిటీ సమావేశం జరగలేదు. ఎలాంటి లెక్కలు జిల్లా పార్టీ సభ్యులకు తెలియజేయలేదు. తద్వారా ఆ నిధులను పక్కదారి పట్టిస్తున్నారనేది మరో ఆరోపణ. అమిత్‌షాకు ఫిర్యాదు జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో బీజేపీ ఓటమికి కారణాలను కూడా జిల్లా పార్టీ నేతలు అమిత్‌షాకు వివరించారు. కురుపాంలో నిమ్మక జయరాజ్‌కు రాష్ట్ర నాయకత్వం నుంచి ప్రోత్సాహం లేకపోయిందనీ, పార్వతీపురంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న పట్నాసింగ్ రవికుమార్‌ను పక్కనపెట్టి కేవలం పదిరోజుల ముందు వచ్చిన టీడీపీ నేత సురగల ఉమామహేశ్వరరావుకు టిక్కెట్ ఇచ్చారనీ, బొబ్బిలికి చెందిన జిల్లా అధ్యక్షుడు పెద్దింటి జగన్మోహన్రావుకు ఏమాత్రం పరిచయాలు లేని గజపతినగరం టిక్కెట్ ఇచ్చారనీ, విజయనగరంలో జిల్లా మాజీ అధ్యక్షుడు బవిరెడ్డి శివప్రసాద్‌ను కాదని కురిమినేని దామోదర్ పేరును పరిశీలించినా చివరి నిమిషంలో కుసుమంచి సుబ్బారావును అభ్యర్థిగా ప్రకటించారని ఇవన్నీ వారి ఓటమికి కారణాలయ్యాయని తెలిపారు. నెల్లిమర్లలో 25ఏళ్లుగా పార్టీలో ఉన్న కె.ఎన్.ఎం.కృష్ణారావును కాదని, ఎన్నికలకు నెల రోజుల ముందు వచ్చిన పతివాడ రమణకు టిక్కెట్టు ఇవ్వడంపై జిల్లా పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. ఎస్‌కోటలోనూ లెంక రామన్నపాత్రుడిని పక్కనపెట్టి పరిచయం లేని వ్యక్తికి టిక్కెట్టు కేటాయించడం వల్ల పార్టీకి నష్టం జరిగిందని అమిత్‌షాకు వివరించారు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ స్వయంకృతాపరాధం వల్లనే అభ్యర్థులు ఘోరపరాజయం పాలయ్యారని విశ్లేషించుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసి ఈ అనర్థాలన్నిటికీ జిల్లాకు చెందిన రాష్ట్ర కోశాధికారి పాకలపాటి సన్యాసిరాజు కారణమని ఫిర్యాదు చేశారు. జిల్లా పార్టీకి చెందిన 76 మంది నాయకులు ఆ ఫిర్యాదుకు మద్దతుగా సంతకాలు కూడా చేశారు. సీపీఐలో అంతర్గత విభేదాలు జిల్లా సీపీఐలో 2017 వరకు పి.కామేశ్వరరావు జిల్లా కార్యదర్శిగా వ్యవహరించారు. 2018లో జిల్లా కార్యవర్గం నూతన ఎన్నికల్లో బొబ్బిలి ప్రాంతానికి చెందిన ఒమ్మి రమణను జిల్లాకార్యదర్శిగా ఎన్నుకున్నారు. నూతన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టారు. ఎన్నికల తర్వాత నుండి పార్టీలో వర్గవిభేదాలు మొదలయ్యాయి. ప్రధానంగా జిల్లా కేంద్రంలో కార్యదర్శి స్థానికంగా ఉండకపోవటం, అందిరినీ కలుపుకుని ముందుకు వెళ్లక పోవటం వల్ల పార్టీలో వివాదాలు తలెత్తుతున్నాయనేది ఒక వర్గం వాదన. పార్టీ తరపున నిర్వహించే కార్యక్రమాలు కార్యచరణలో కూడా నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరటం లేదు. ఈ కారణంగా జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు తుమ్మి అప్పలరాజుదొర, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు టి.జీవా తదితరులు జిల్లా కార్యదర్శి పదవి నుంచి ఒమ్మి రమణను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే పార్టీ నుంచి ఈ ముగ్గురిని దూరం చేసేందుకు కార్యదర్శి రమణ కూడా అంతేస్థాయిలో ఆలోచిస్తున్నట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఇతర పార్టీల వైపు మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో రెండు జాతీయ పార్టీల్లో పరిస్థితి ఇలా మారిపోవడంతో వాటి భవిష్యత్‌పైనా కార్యకర్తల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. -
నేతల విబేధాలపై సీఎం కేసీఆర్ సీరియస్
-
టీడీపీలో రచ్చ..రచ్చ!
గిద్దలూరులో పాత.. కొత్త టీడీపీ నేతల వార్ కొత్తగా చేరిన నేతలు.. పాత నాయకునిపై దాడి గిద్దలూరు : నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత పోరు రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఇటీవల ఆ పార్టీ ఇన్చార్జి అన్నా రాంబాబు.. తన వర్గీయులతో పాటు ఒంగోలు చేరుకొని ముఖ్యనేతల ముందు నిరసన వ్యక్తం చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి వర్గం ఏకంగా దాడులకు పాల్పడున్నట్లు ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మండలంలోని కంచిపల్లెలో మంగళవారం జరిగిన ఘటనలో గ్రామానికి చెందిన టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు, జన్మభూమి కమిటీ సభ్యుడు అయిన పాలుగుళ్ల సూర్యరంగారెడ్డి గాయపడ్డాడు. బాధితుడు స్థానిక ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రైతు రుణ ఉపశమన పత్రాలు ఇచ్చేందుకు గ్రామానికి అధికారులు వచ్చారు. కార్యక్రమం అనంతరం అధికారులు వెళ్లిపోగా, అక్కడే ఉన్న పంచాయతీ కార్యదర్శి సత్యనాయరణ.. వద్దకు సూర్యరంగారెడ్డి వెళ్లారు. వర్షాకాలంలో ట్యాంకర్లతో నీటిని తోలాల్సిన పనేముందని ప్రశ్నించాడు. గ్రామంలోని చెరువుకు నిండా నీరొచ్చిందని, వ్యవసాయ భూముల్లో నీరు సమృద్ధిగా ఉందని.. పంచాయతీ మోటార్లలో నీరు ఎందుకు రావడం లేదని అడిగాడు. నిధులు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పారు. అయితే ఇటీవల టీడీపీలో చేరిన ముత్తుముల అశోక్‌రెడ్డి వర్గానికి చెందిన దప్పిలి శ్రీనివాసరెడ్డి పంచాయతీ పనులు చూస్తుంటాడు. దీంతో ఆయన సీన్లో వచ్చాడు. పంచాయతీలో ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయంటూ సూర్యరంగారెడ్డిపై దాడి చేశాడు. అనంతరం శ్రీనివాసరెడ్డి సోదరులు దప్పిలి రంగస్వామిరెడ్డి, రవీంద్రారెడ్డి కూడా దాడి చేశారు. గాయపడిన సూర్యరంగారెడ్డిని టీడీపీ మండల అధ్యక్షుడు ఏ.శ్రీనివాసులు, తిమ్మాపురం సర్పంచి కోటా రమేష్, పలువురు టీడీపీ నాయకులు పరామర్శించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎస్సై రాంబాబు విచారణ చేపట్టారు. -
రసాభాసగా టీడీపీ సమావేశం
► అంతర్గత విభేదాలతో దూషణలు ► కార్యకర్తలను ఓదార్చిన రామానాయుడు మాడుగుల: టీడీపీ మండల కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. అంతర్గత విభేదాలతో ఒకరిని ఒకరు దూషించుకున్నారు. స్థానిక వేంకటేశ్వర ఆలయంలో ఆపార్టీ నియోజకవర్గ ఇన్చార్జ గవిరెడ్డి రామానాయుడు శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు జన్మభూమి కమిటీల ద్వారా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుందని చెప్పారు. దీంతో మాడుగుల గ్రామానికి నిధులు కేటాయించడం లేదని రూ.3 లక్షలు మంజూరు చేస్తామని చెప్పి ఒక్కపైసా ఇవ్వలేదని, 62 ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పి 25 కూడా ఇవ్వలేదని ఇలా అయితే గ్రామంలో పార్టీ ఎలా నిలబడుతుందని గ్రామానికి చెందిన వేగి రాంబాబు రామానాయుడును ప్రశ్నించారు. పార్టీ ద్వారా తమకు సమాచారం రాలేదని పత్రికలలో చదువుకుని సమావేశానికి హాజరుకావాల్సిన దుస్థితి ఏర్పడిందని, తమను పట్టించుకోవడం లేదని రామానాయుడుతో పాటు మండల పార్టీ నాయకులను కె.జె.పురానికి చెందిన వేగి గాంధీ నిలదీశారు. పార్టీ మండల కార్యదర్శి నందారపు సన్యాసిరావు మాట్లాడుతూ రామానాయుడు పుట్టిన రోజున ఆయన ఫొటోతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకపోతే పార్టీ నిధులు కట్ అవుతాయని కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మజ్జి తాతబాబు, అద్దెపల్లి జగ్గారావు వైస్ ఎంపీపీ పెరుమళ్ళ వెంకటరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చిత్తూరు 'దేశం'లో లుకలుకలు
సత్యవేడు ఎమ్మెల్యే తీరుపై తమ్ముళ్ల అసంతృప్తి తిరుపతిలో ఎమ్మెల్యే అల్లుడిదే హవా శ్రీకాళహస్తిలో చెర్మైన్, కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం చంద్రగిరిలో మూడు ముక్కలాట జీడీ నెల్లూరులో కొరవడిన సఖ్యత కుప్పంలో సీఎం, పీఏ తీరుపై నాయకుల్లో వ్యతిరేకత తిరుపతి: తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. ముఖ్యమంత్రి స్వంత జిల్లాలో పార్టీ నాయకులు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసే స్థాయికి వర్గవిభేదాలు చేరాయి. సత్యవేడులో సామాన్యుల గోడు సత్యవేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే తలారి ఆదిత్య తండ్రి పెత్తనంపై ద్వితీయశ్రేణి నాయకులు రగిలిపోతున్నారు. నియోజకర్గానికే చెందిన పిచ్చాటూరు జెడ్పీటీసీ సభ్యురాలు ఇటీవల తిరుపతిలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి తమను పార్టీలో అవమానాలకు గురిచేస్తున్నారని ప్రకటించడం గమనార్హం. జిల్లాలోని పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని కన్నీటిపర్యంతమయ్యారు. తిరుపతిలో అల్లుడిదే పరపతి తిరుపతిలో ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు, ఆయన కోటరీ పెత్తనంతో ద్వితీయ శ్రేణి నాయకులు రగిలిపోతున్నారు. నగర అధ్యక్షుడి తీరుపై సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా రెండు సామాజికవర్గాల మధ్య పోరు నడుస్తోంది. చంద్రగిరిలో తలో దారి చంద్రగిరిలో దేశం నాయకుల మధ్య మూడు ముక్కలాట సాగుతోంది. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమనాయుడుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంది. దీనికి తోడు చినబాబు, గల్లా వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. జన చైతన్యయాత్రలో సైతం ఇది కొట్టొచ్చినట్లు కనిపించింది. గంగాధర నెల్లూరులో గరం గరం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నియోజవర్గ ఇన్చార్జి కుతూహలమ్మ, పాతగుంట మనోహర్‌నాయుడు వర్గాల మధ్య బహిరంగంగానే మాటల యుద్ధం సాగుతోంది. శ్రీకాళహస్తిలో చిర్రుబుర్రు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్‌కు, అదేపార్టీ కౌన్సిలర్లకు మధ్య అంతరం రోజురోజుకు పెరుగుతూనే వుంది. పార్టీలో దాదాపు 90 శాతానికి పైగా కౌన్సిలర్లు చైర్మన్ తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. కౌన్సిలర్లుగా ఎన్నికై 18 నెలలు గడిచినప్పటికీ ప్రజలకు తామేమీ చేయలేకపోయామని బహిరంగంగా వారు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నియోజకవర్గంలో ద్వితీయశ్రేణి నాయకుల మధ్య ఉన్న వర్గ విభేదాలతో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సైతం తలపట్టుకుంటున్నారు. అన్నింటా అసంతృప్తి మంట పీలేరులో సైతం మూడు గ్రూపుల నడుమ కార్యకర్తలు ఇబ్బందిపడుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి, ఆయన పీఏ తీరుపై నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. చిత్తూరులో రెండు సామాజికవర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. నగరి నియోజకవర్గంలో ఆది నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న దేశం నేతలు, గాలి ముద్దుకృష్ణమనాయుడు వర్గానికి దూరంగా ఉంటున్నారు. మదనపల్లిలో రెండు గ్రూపుల మధ్య తగాదాలు అధినేత తల బొప్పికట్టిస్తున్నాయి. ఇలా ముఖ్యమంత్రి సొంతజిల్లాలోని టీడీపీ నేతల మధ్య అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోతుండటంతో అధిష్టానం ఆందోళన చెందుతోంది. జిల్లాలో నెలకొన్న గ్రూపుల మధ్య సయోధ్య కుదర్చాలని ముఖ్యమంత్రి, చినబాబు చేసిన ప్రయత్నాలు సైతం బెడిసికొట్టడంతో, పార్టీ పెద్దలు అందోళన చెందుతున్నారు. ఈ తగాదాలు ఏ తీరానికి చేరుతాయోనని చర్చించుకుంటున్నారు. -
చంద్రబాబు సీఎం కావడంలో మాధవ రెడ్డిది కీలకపాత్ర
నల్లగొండ రూరల్: టీడీపీలో అంతర్గత విభేదాలు వచ్చిన సమయంలో చంద్రబాబుకు అండగా నిలిచి ఆయన సీఎం కావడంలో దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి కీలకపాత్ర పోషించారని మాధవరెడ్డి సతీమణి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు ఉమా మాధవరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో నిర్వహించిన జిల్లా టీడీపీ అధ్యక్ష ఎన్నిక సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తమ కుటుంబం మొదటి నుంచీ చంద్రబాబుకు అం డగా ఉందన్నారు. -
సీపీఐలో ముసలం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) కరీంనగర్ జిల్లా శాఖలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీలో తొమ్మిదేళ్ల పాటు జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా సుధీర్ఘకాలం పనిచేసిన మర్రి వెంకటస్వామి శనివారం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో ఉన్న విభేదాల కారణంగానే రాజీనామా చేసినట్లు ప్రకటించారు. పార్టీలో క్షేత్రస్థాయి మొదలు జిల్లాశాఖ వరకు గట్టి పట్టున్న వ్యక్తి మర్రి వెంకటస్వామి. ఆయన రాజీనామాతో జిల్లాలో సీపీఐ చీలే అవకాశాలూ లేకపోలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చాడ వెంకటరెడ్డి సొంత జిల్లా కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. మర్రి వెంకటస్వామి సైతం పార్టీని నిట్టనిలువునా చీల్చి తన సత్తా ఏమిటో చూపాలని పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు జిల్లాలోని నాయకులు, కార్యకర్తలతో మంతనాలు జరుపుతున్నారు. మర్రి వెంకటస్వామి 1978లో ఏఐఎస్ఎఫ్లో చేరారు. 1983లో సీపీఐ సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం పార్టీలో అనేక పదవుల్లో కొనసాగారు. దాదాపు తొమ్మిదేళ్ల పాటు జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. మర్రి వెంకటస్వామి జిల్లా పగ్గాలు చేపట్టకముందు పాత ఇందుర్తి, ఇప్పటి హుస్నాబాద్ నియోజకవర్గాలకే పార్టీ పరిమితమైంది. మర్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లావ్యాప్తంగా విసృ్తతంగా పర్యటించి పార్టీని బలోపేతం చేశారు. పార్టీ అనుబంధ సంఘాలకు కమిటీలను నియమించారు. ఆయన హయాంలోనే పార్టీ సభ్యత్వాన్ని పది వేలకుపైగా పెంచారు. మర్రి జిల్లా కార్యదర్శిగా ఉన్న సమయంలోనే సీపీఐ 24వ రాష్ట్ర మహాసభలను కరీంనగర్లో విజయవంతంగా నిర్వహించి పార్టీ అగ్రనేత బర్దన్ ప్రశంసలను పొందారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలను సైతం జిల్లాలో విజయవంతంగా నిర్వహించారు. రెండు గ్రూపులుగా చాడ-మర్రి గత కొన్నేళ్లుగా చాడ వెంకటరెడ్డితో మర్రికి పొసగడం లేదు. 2009 ఎన్నికల్లో మానకొండూరు నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థిగా మర్రి వెంకటస్వామిని నిలబెట్టాలని చంద్రబాబు, కేసీఆర్ ప్రతిపాదించారు. అదే సమయంలో హుస్నాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కెప్టెన్ లక్ష్మీకాంతరావును బరిలో దించాలని నిర్ణయించారు. అప్పటికే హుస్నాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న చాడ వెంకటరెడ్డి సీపీఐ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి తిరిగి హుస్నాబాద్ సీటు దక్కించుకున్నారు. మానకొండూరు సీటు మర్రికి రాకుండా చాడ వెంకటరెడ్డి అడ్డుకున్నారనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ చాడకు, మర్రికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. జిల్లాలో పార్టీ సైతం చాడ, మర్రి గ్రూపులుగా మారిపోయింది. కార్యదర్శి పదవి నుంచి తప్పించాడని ఆగ్రహం వృత్తిపరంగా మర్రి వెంకటస్వామి న్యాయవాది. ఆయన జిల్లా కార్యదర్శిగా కొనసాగుతుండగా 2014 జనవరిలో వీణవంక మండలంలో మాజీ ఎంపీటీసీ ఉయ్యాల బాలరాజు హత్యకు గురయ్యాడు. ఆ కేసులోని నిందితుల తరపున వాదించేందుకు మర్రి వకాల్తా పుచ్చుకున్నారు. ఆ సమయంలో నిందితులను సీపీఐ జిల్లా కార్యాలయంలో దాచి ఉంచారనే కారణంతో మర్రిని జిల్లా కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పించారు. దీనివెనుక చాడ వెంకటరెడ్డి కుట్ర ఉంద ని, పోలీసులతో కుమ్మక్కై తనపై అక్రమ కేసులు బనాయించారని మర్రి ఆరోపణ. ఈ కేసుపై ఒకవైపు న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు జిల్లా కార్యదర్శి పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నించారు. ఇటీవల జరిగిన మహాసభల్లో జిల్లా కార్యదర్శి పదవిని ఆశించి భంగపడ్డ మర్రి వెంకటస్వామి చివరకు రాష్ట్ర కమిటీలోనైనా చోటు దక్కుతుందని భావించారు. అయితే అక్కడ కూడా భంగపాటు ఎదురుకావడంతో ఇక లాభం లేదనుకుని పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా తెలంగాణ పోరాటయోధుడు, సీపీఐ నాయకుడు అనభేరి ప్రభాకర్‌రావు వర్ధంతి రోజైన శనివారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సీపీఎంలో చేరే యోచన.. సీపీఐకి గుడ్‌బై చెప్పిన మర్రి వెంకటస్వామి సీపీఎం నాయకత్వం ఆహ్వానిస్తే ఆ పార్టీలో చేరాలని భావిస్తున్నారు. ఈ మేరకు సీపీఎం నాయకత్వంతోనూ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. జిల్లాలో తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై వారందరినీ సీపీఎంలోకి తీసుకెళ్లాలని యోచిస్తున్నారు. తన ఎదుగుదలను అడ్డుకున్న చాడ వెంకటరెడ్డిని రాజకీయంగా దెబ్బతీసే దిశగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా జిల్లాలో సీపీఐని నిలువునా చీల్చే దిశగా యత్నిస్తున్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీల నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. అతి కొద్దిరోజుల్లోనే జిల్లాలోని ఇరవై మండలాల్లోని పార్టీ శాఖలు ఖాళీ కాబోతున్నట్లు మర్రి వర్గీయులు చెబుతున్నారు. ్చవిప్లవ పంథాలోనే పయనిస్తా : మర్రి మర్రి వెంకటస్వామి శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులోనూ తాను విప్లవ పంథాలోనే శ్రమజీవుల హక్కుల కోసం అంకితమై పయనిస్తానని చెప్పారు. ఏ పార్టీలో చేరేది తనను నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులతో సమావేశమై నిర్ణయిస్తానన్నారు. సీపీఐలో విమర్శ, ఆత్మవిమర్శలకు తిలోదకాలిచ్చిన చాడ వెంకటరెడ్డి ప్రశ్నించే నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వర్గశత్రువులు, పోలీసులతో కుమ్కక్కైన చాడ జిల్లాలో పార్టీని తుంగలో తొక్కారని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో పార్టీని సరైన మార్గంలో నడిపించడం ఎంతమాత్రమూ సాధ్యం కాదనే భావనతోనే సీపీఐకి రాజీనామా చేసినట్లు తెలిపారు. -
బొబ్బిలి టీడీపీలో ముసలం
బొబ్బిలి: బొబ్బిలి తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. బొబ్బిలి, తెర్లాం నియోజకవర్గాలు విలీనం అయిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏర్పడడం మొదటి సారి కావడంతో ఎవరికి వారే తమ ఆధిపత్యం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పటి తెర్లాం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేసి ఇప్పుడు బొబ్బి లి అధికార పార్టీకి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న తెంటు లక్ష్ముంనాయుడుతో ఇటు పట్టణ, అటు మండల నాయకులకు అస్సలు పొసగడం లేదు. బయటకు అందరూ బాగానే ఉంటున్నా, లో పల్లోపల మాత్రం కత్తులు దూసుకుంటున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా వ్యవహరిస్తూ మున్సిపాలిటీలో కీలక బాధ్యతలు వహిస్తున్న తూముల భాస్కరరావుకు నియోజకవర్గ ఇన్చార్జి తెంటుకు మధ్య అంతర్గత విభేదాలు రోజు రోజుకు అధికమవుతున్నట్లు బా హాటంగా ప్రచారం జరుగుతోంది. ము న్సిపల్ చైర్‌పర్సన్‌గా తూముల అచ్యుతవల్లి ఇక్కడ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుడడం, పార్టీ అధినాయకత్వంతో ఎప్పటికప్పుడు సత్సంబంధాలతో ఉండడంతో ఇది మ రింత బలపడుతోంది. జనవరి ఒకటో తేదీ నాడు శుభాకాంక్షలు అందుకోవడానికి పార్టీ కార్యాలయంలో తెంటు ఉంటే, లోకబంధు వద్ద తూముల దంపతులు వేడుకలు జరుపుకున్నారు. అలాగే గత నెలలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో దక్షిణిదేవిడి వద్ద ఇన్చార్జి తెంటు పాల్గొంటే, లోకబంధులో తూ ముల పాల్గొని వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించారు. బొబ్బిలికి వచ్చిన మంత్రులు, జిల్లా స్థాయి నేతలంతా ని యోజకవర్గ పార్టీ కార్యాలయం ఉం టుండగానే పక్కనే ఉన్న తూముల ఇంటికి వెళ్లి అక్కడ నుంచి అటే వెళ్లిపోవడాన్ని కూడా కొంత మంది జీర్ణించుకోలేకపోతున్నారనే వాదన కూడా ఉంది. రెండు నియోజకవర్గాలతో ముడి పడు న్న ఏఎంసీ చైర్మన్ పోస్టు భర్తీ జాప్యం జరగడానికి కూడా ఈ విభేదాలే కారణమని చర్చ జరుగుతోంది. పట్టణంలోని 26వ వార్డు కౌన్సిలరు, సినీ నిర్మాత, అం జనీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పువ్వుల శ్రీనివాసరావుకు ఏఎంసీ ఇవ్వడానికి నియోజకవర్గ ఇన్చార్జి తెంటు దాదాపుగా నిర్ణయానికి వచ్చేశారు. రేపో మాపో ప్రకటన కూడా వెలువడానికి సిద్ధంగా ఉంది. అయితే వ్యవసాయ మా ర్కెట్ కమిటీ పోస్టు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఇస్తే బాగుంటుందని, పార్టీ కూడా అభివృద్ధి జరుగుతుందని, ఒక పదవి ఉన్న వారికి ఈ పదవి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ తెంటు వ్యతిరేక వర్గం పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఈ పోస్టు భర్తీ పెండింగ్ పడినట్లు చెబుతున్నారు. పార్వతీపురం నియోజవర్గంలోని బలిజిపేట, సీతానగరం మండలాలు కూడా బొబ్బిలి ఏఎంసీ పరిధిలో ఉండడంతో ఓ వైపు ఆయా మండలాలకు చెందిన నాయకులకు ఈ పదవి కావాలంటూ మరో వర్గం ఇప్పటికే అధిష్టానం వద్దకు వెళ్లింది. మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ పదవి కోసం పోటీ వచ్చినపుడు ఒకటో వార్డు కౌన్సిలరు చోడిగంజి రమేష్‌నాయుడుకు ఈ పదవి ఇస్తామని మాట ఇచ్చారు. అయితే అప్పుడు ఏఎంసీ చైర్మన్ నియామకం భర్తీలో జా ప్యం జరగడంతో ముందుగా మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని అప్పగించారు. ఏడాది పదవి కోసం అయిదేళ్ల వైస్ చైర్మన్ పదవిని ఎందుకు వదులుకోవాలా అని చోడిగంజి ఆలోచనలో పడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా బొబ్బిలిలో కూడా దేశం నాయకుల ఆధిపత్య పోరు ఎక్కువైంది. మున్సిపాలి టీలో బాధ్యతలు చూస్తున్న తూములకు, మండలంలో బాధ్యతలు చూ స్తున్న అల్లాడ భాస్కరరావుల మధ్య వైరం చాపకింద నీరులా సాగుతుంది. అలాగే మండల నాయకులైన అల్లాడతో ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలోనికి వచ్చిన బొద్దల సత్యనారాయణ వర్గానికి కూడా అంతర్గత పోరు మొదలైంది. ఇటీవల బొబ్బిలిలోని చైర్పర్సన్ అచ్యుతవల్లి సొంత వార్డు అయిన 20 వార్డులో ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ ఇన్చార్జి తెంటు, పారాది సర్పంచి అల్లాడ భాస్కరరావులు హాజరయ్యారు. దీనిపై కూడా పట్టణ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సమాచారం ఇవ్వకుండా వార్డుల్లోకి ఎలా వస్తారంటూ ప్రశ్నించినట్లు సమాచారం. -
ఆధిపత్యపోరు!
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుతమ్ముళ్లు మధ్య అంతర్గత విభేదాలు రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ప్రధాన నాయకులు పైచేయి సాధించాలనే లక్ష్యంతో ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. భవిష్యత్‌లో పోటీగా నిలుస్తారనుకున్న నేతల్ని ఇప్పటి నుంచే కట్టడి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. మైదుకూరు నియోజకవర్గ రాజకీయాల్లో తొలిసారి ఆరంగేట్రం చేసిన పుట్టాసుధాకర్ మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తోఎన్నికల ముందు చెలిమి కొనసాగించారు. ప్రస్తుతం తనదైన శైలిలో పుట్టా ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నట్లు ఆపార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నారుు. అందుకు తగినట్లు కొన్ని సంఘటనలు కనిపిస్తుండంతో వాటికి బలం చేకూరుతోంది. మాజీ మంత్రి డిఎల్ మేనల్లుడు మాజీ ఎంపీపీ మధుసూదనరెడ్డి నేతృత్వంలో చేపట్టిన క్రషర్ మిషన్ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టిందని గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమంగా తవ్వకాలు చేపట్టిందని అందుకు రూ.3.73కోట్లు జరిమాన విధిస్తూ అధికారులు డిసెంబర్లో నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులపై సవాల్ చేస్తూ మధుసూదన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ మంగళవారం మధుసూదన్‌రెడ్డి కంకర మిషన్ సీజ్ చేశారు. మైదుకూరు ప్రాంతంలో ఈచర్య హాట్ టాఫిక్‌గా మారింది. తెరవెనుక పట్టువదలని విక్రమార్కునిలా పుట్టా సుధాకర్ ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారనే భావన కొందరిలో వ్యక్తమౌతోంది. అంతటా అదే పరిస్థితి... బద్వేల్లో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఎన్నికల్లో పోటీ చేసిన విజయజ్యోతి వర్గాలుగా విడిపోయారు. వారి మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయిలో సాగుతోంది. శాసనమండలి డిప్యూటి చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు ఉన్నట్లు తెలుగుతమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. అందుకు కారణం పులివెందుల నియోజకవర్గంలో సతీష్‌రెడ్డికి వ్యతిరేకంగా రాంగోపాల్‌రెడ్డి నేతృత్వంలో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రొద్దుటూరు పరిధిలో మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డి గ్రూపుల మధ్య రాజకీయ ఎత్తుగడలు తెరవెనుక స్పీడుగా సాగుతున్నారుు. కమలాపురంలో సైతం ఇదే పరిస్థితి ఉండడంతో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూనే తెరవెనుక గ్రూపును పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. రాయచోటి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ముదిరిపోయాయి. ఎంపీపై గరంగరం... ఎంపీ సిఎం రమేష్‌పై పార్టీ శ్రేణులు గరంగరంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల హైవే రోడ్డు టెండర్లుల్లో స్థానిక నాయకుల్ని కాదని ఎంపీ శాసించారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. బద్వేల్, మైదుకూరు నాయకుల్ని టెండర్లలో పాల్గొనకుండా నియంత్రించడంపై అగ్గిరాజుకుంది. ప్రతి విషయానికి ఆయన టిక్ కొడితేనే పనులు అవుతున్నాయని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. -
టీడీపీలో రాజుకున్న అంతర్గత విభేదాలు
కొందరికి చెక్ పెట్టే రీతిలో ఎమ్మెల్యే వ్యూహం మాజీ ఎంపీపీ తాతయ్యబాబుతోపాటు పలువురి అలక! చోడవరం : మండల ప్రాదేశిక ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య అభిప్రాయ బేధాలు పొడచూపాయి. రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన కెఎస్ఎన్ఎస్ రాజు తనతోపాటు నియోజకవర్గంలో బలంగా ఉన్న కొందరు సీనియర్ నాయకులకు పార్టీలో ప్రాతినిధ్యం తగ్గించాలనే యోచనలో ఉన్నారన్నట్టు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ ఎన్నికలను ఎమ్మెల్యే వేదికగా చేసుకొని వారిలో కొందరికి చెక్ పెట్టినట్టుగా అంతా భావిస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే టిక్కెట్ రేసు వరకు వెళ్లిన బుచ్చెయ్యపేట మాజీ ఎంపీపీ బత్తుల తాతయ్యబాబుకు ఈ ప్రాదేశిక ఎన్నికల్లో చావుదెబ్బ తగిలింది. ఈ మండలానికి సంబంధించి ఎంపీపీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వుడు కావడంతో ఎంపీపీతోపాటు తన అనుచరుడైన వడ్డాది -3 ఎంపీటీసీ సభ్యుడు దాడి సూరి నాగేశ్వరరావును వైఎస్ ఎంపీపీని చేసి మండలాన్ని తన ఆధిపత్యంలో ఉంచుకోవాలని తాతయ్యబాబు భావించారు. ఈయన వ్యూహానికి ఎమ్మెల్యే చెక్ పెట్టారు. వడ్డాది ప్రాంతానికి కాకుండా ఎర్రవాయు ప్రాంతానికి ఎంపీపీ ఇచ్చి పరోక్షంగా తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఈ పరిణామంతో తాతయ్యబాబు అలిగి ప్రమాణస్వీకారానికి గైర్హాజరయ్యారు. ఇప్పటి వరకు ఒకే వర్గంగా ఉన్న బుచ్చెయ్యపేట మండలంలో ఇప్పుడు ప్రాంతాలు వారీగా వర్గ విభేదాలు చోటుచేసుకొన్నాయి. ఇదే మండలానికి చెందిన మరికొందరు నాయకులను సైతం ప్రాతినిధ్యం తగ్గించాలని ఎమ్మెల్యే యోచిస్తున్నట్టు తెలిసింది. ఇదిలావుంటే నియోజకవర్గ కేంద్రమైన చోడవరం మండలంలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇప్పటికే గత జెడ్పీటీసీ ఎన్నికల్లో టిక్కెట్ రాక డీలా పడ్డ మజ్జి గౌరీశంకర్‌తోపాటు ఆయన మద్దతు దారులైన ఏటవతల గ్రామాల నాయకులు గరంగరంగా ఉన్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం ప్రయత్నించిన గోవాడ సుగర్ ప్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడుని, అతని సోదరుడు పెదబాబుకి ఇక్కడ గట్టి పట్టుంది. ఇప్పటి వరకు అన్నింటిలోనూ కలిసి మెలిసి ఉండే ఎమ్మెల్యే, మల్లునాయుడు, పెద్దబాబు తాజాగా జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో వేరుగా కనిపించారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లు గూనూరు సోదర్లే అన్నీతామై చేసుకున్నారు తప్ప ఎమ్మెల్యే మాత్రం రాకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అలాగే ఏటవత ఉన్న గ్రామాల్లో నాయకులు కూడా ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రావికమతం, రోలుగుంట మండలాల్లో కూడా ఎమ్మెల్యే కొన్ని వర్గాల ఆధిపత్యాన్ని తగ్గించేందుకు చూస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. రావికమతం మండలంలో వైఎస్ ఎంపీపీ పదవిని నలుగురు ఆశించారు. వీరిలో రావికమతం ఎంపీటీ సీ సభ్యుడు గెంజి కనకకు ఆ పీఠం దక్కింది. దీంతో ఈ పదవి ఆశించిన తీవ్రంగా భంగపడ్డ తట్టబంద ఎంపీటీసీ గోకివాడ చినరమణ ప్రమాణస్వీకార ఆవరణలోనే ఆగ్రహంతో ఊగిపోయారు. ఎమ్మెల్యే హామీ ఇచ్చి మోసం చేశారంటూ బహిరంగంగానే ధ్వజమెత్తారు. తాను రాజీనామా చేస్తానని హెచ్చరించారు. మరో పక్క రోలుగుంట మండలంలోనూ ఇదే పరిస్థితి. ఆఖరు నిమిషం వరకు వైఎస్ ఎంపీపీ ఎవరన్నది ఎమ్మెల్యే ప్రకటించక పోవడంపై పార్టీ నాయకుల్లో అసంతృప్తి రాజుకుంది. ఆ పదవి కోసం ఆశిస్తున్న వారిలో ఎక్కుమంది ఉండటంతో ఆఖరి లో గుండుబాబు ఎంపీటీసీ పరికం లోవరాజును ప్రకటించారు. దీంతో ఈ పదవి ఆశించి భంగపడ్డ చి రుకోటి సత్యనారాయణ, మడ్డు రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తె లిసింది. ఏది ఏమైనా నియోజకవర్గం టిడీపీలో ఈ ప్రాదేశిక ఎన్నికలు ముసలం తెచ్చాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
బీజేపీలో లుకలుకలు
బొబ్బిలి : నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీలో లుకలుకలు మొదలయ్యూయి. కేంద్రంలో ఒంటిచేత్తో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయూల్సిన నాయకులు అంతర్గత విభేదాలతో రోడెక్కుతున్నారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారు పార్టీలోని ఒక వర్గానికి నచ్చకపోవడంతో విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ విషయం ఆ పార్టీ జిల్లా నాయకులకు తెలిసినా.. సరిదిద్దడానికి ప్రయత్నించకపోవడం గమనార్హం.బొబ్బిలిలో బీజేపీని పూర్వం నుం చి నడిపిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అయి తే ఇటీవల పట్టణానికి చెందిన కొంతమంది ఇతర పార్టీ ల నాయకులు బీజేపీలో చేరడంతో వారికే ప్రాధాన్యమివ్వడంతో విభేదాలు పొడచూపాయి. ముఖ్యంగా మాజీ మంత్రి డాక్టర్ పెద్దింటి జగన్మోహన్రావు ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. విశాఖ ఎంపీ హరిబాబుతో సాన్నిహిత్యం ఉండడంతో ఆయన్ను పార్టీలో చేర్చుకున్నారు. అప్పటికే పూర్వం నుంచి ఉన్నవారంతా పెద్దిం టి నాయకత్వంలో ముందుకు వచ్చి పని చేయడం మొ దలు పెట్టారు. అయితే బీజేపీలో బొబ్బిలి మున్సిపాలి టీకి కౌన్సిలరుగా పోటీ చేసిన మువ్వల శ్రీనివాసరావు మరో వర్గంతో కార్యక్రమాలు చేయడంతో విభేదాలు రాజుకున్నాయి. ఇటీవల పెద్దింటి పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టడం, రైల్వే, పోస్టల్ శాఖల సమస్యలపై దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి అధినాయకత్వం, మంత్రులకు దృష్టికి తీసుకువెళ్తున్నారు.ఇవి నచ్చని ము వ్వల ఇటీవల ఆయనతో బాహాటంగానే వాదనకు దిగా రు. దీంతో వీరి మధ్య విభేదాలు మరింత రాజుకున్నా రుు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ నాయకులు టీడీపీకి సహకరించింది అంతంత మాత్రమే. పె ద్దింటి విశాఖ ఎంపీకి మద్దతుగా ప్రచారం చేస్తే, ము వ్వల బృందం నెల్లిమర్ల వెళ్లి అక్కడ నాయకుల తరఫున ప్రచారం చేశారు. స్థానిక టీడీపీ నాయకులు అంతగా ప్రాధాన్యమివ్వలేదని, పట్టించుకోలేదని, జెండాలు ఇచ్చినా.. ఎక్కడ కట్టడం లేదంటూ వారిలో వారే కుమ్మలాటలాడుకున్నారు.ఇదంతా ఒక ఎత్తు అయితే ఆది వారం పట్టణంలోని వెలమవారి వీధిలో మువ్వల ఆధ్వర్యంలో జరిగిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి పెద్దింటితో పాటు ఇటీవల పార్టీలో చేరిన సీనియర్ నాయకుడు డాక్టరు రెడ్డి సత్యారావుతో పాటు నాయకులు ఎవరూ హాజరుకాలేదు. సీమాంధ్ర కమిటీ అధ్యక్షుడు పాకల పాటి సన్యాసిరాజుతో పాటు జిల్లా నాయకత్వం ఇక్కడకు వచ్చిన అనుకున్నంత స్థాయిలో ప్రారంభోత్సవ వేడుక జరగకపోవడంతో జిల్లా నాయ కత్వం కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతంత మాత్రంగా ఉన్న పార్టీలోనే ఒకరిని ఒకరు కలుపుకొని వెళ్లలేని పరిస్థితి ఉంటే మరి రాబోయే కాలంలో పార్టీ పరిస్థితి ఏమిటన్న పరిస్థితి వినిపిస్తోంది. ఇప్పటికైనా జిల్లా నాయకులు స్పందించి రెండు వర్గాల మధ్య సయోధ్య కుదర్చాలని ద్వితీయ శ్రేణి నాయకులు కోరుతున్నారు. -
సిగపట్లు
అత్తెసరు ప్రజాభిమానంతో కొట్టుమిట్టాడుతున్న తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. తెలుగు తమ్ముళ్ల మధ్య ఒకరంటే మరొకరికి గిట్టని పరిస్థితి ఉత్పన్నమైంది. కడప మేయర్ అభ్యర్థి ఎంపికలో నేతల మధ్య ఉన్న విభేదాలు ఒక్కమారుగా ప్రస్ఫుటం అయ్యాయి. నువ్వెంతంటే నువ్వెంతని పరస్పరం దూషణలకు దిగారు. ఒక్కమాటలో చెప్పాలంటే యుద్ధవాతావరణం నెలకొంది. వెరసి ఓ వర్గం సమావేశం నుంచి అర్ధాంతరంగా వెనుతిరిగింది. ప్రజాభిమానం పొందడంలో విఫలమైన తెలుగు తమ్ముళ్లు వర్గ విభేదాలను సృష్టించుకోవడంలో ముందుంటున్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో చోటు చేసుకున్న గొడవ ఇందుకు నిదర్శంగా నిలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, కమలాపురం ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి, టీడీపీ నేత శశికుమార్ మధ్య నెలకొన్న గొడవ చిన్నసైజు యుద్ధ వాతావరణాన్ని తలపించినట్లు సమాచారం. ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు కేకలు వేయడం, ఒకదశలో పరస్పరం కుర్చీలు చేతికి తీసుకోవడంతో తీవ్ర గందరగోళంచోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఉన్నతికి కృషి చేయాల్సిన నాయకులు వ్యక్తిగత ఇమేజ్ కోసం పాకులాడటమే గొడవకు కారణమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు. పుత్తాకు శృంగభంగం.... కడప నియోజకవర్గంలో తనమాట చెల్లుబాటు కావాలని, తాను చెప్పినోళ్లనే పరిగణలోకి తీసుకోవాలని భావిస్తూ వచ్చిన మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కడప పరిధిలో ప్రతి చిన్న విషయానికి కమలాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి అయిన పుత్తా నరసింహారెడ్డి జోక్యం చేసుకోవడంపై స్థానిక నేతలు అభ్యంతరం చేస్తూ వస్తున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కాకుండా, తన వర్గాన్ని పెంచుకునేందుకు దృష్టి సారించడంపై కడప నేతలు ఆక్షేపణ తెలుపుతున్నారు. కమలాపురంలో వర్గ రాజకీయాల నేపధ్యంలో ఇప్పటికే రెండు పర్యాయాలు పుత్తా నరసింహారెడ్డి ఓటమి పాలయ్యారు. కడపలో పాగా వేసేందుకు పుత్తా పావులు కదుపుతూ వచ్చారని పరిశీలకులు పేర్కొంటున్నారు. పుత్తా వైఖరిని అంచనా వేసిన కడప నేతలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా స్థానికునికి మాత్రమే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఇలాంటి తరుణంలో మున్సిపల్ ఎన్నికలు రావడంతో అంతర్గత విభేదాలు ఒక్కమారుగా బహిర్గతం అయ్యాయి. కడప మేయర్ అభ్యర్థిత్వాన్ని తన అనుయాయుడు సుభాన్బాషకు ఇవ్వాలని పుత్తా పట్టుపట్టినట్లు సమాచారం. అందుకు కడప నియోజకవర్గంలోని మెజార్టీ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈపరిణామాన్ని జీర్ణించుకోలేని పుత్తా నరసింహారెడ్డి టీడీపీ నేత శశికుమార్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతే తీవ్రతతో శశికుమార్ సైతం ప్రతిఘటించినట్లు సమాచారం. ఒకరిపైకి మరొకరు కుర్చీలు తీసుకోవడంతో అంగరక్షకులు మధ్యలోకి వచ్చి అడ్డగించినట్లు తెలుస్తోంది. టీడీపీ కార్యాలయం నుంచి వస్తున్న కేకలకు రోడ్డు మార్గంలో వెళ్తున్నవారు సైతం ఏమి జరుగుతోందని వింతగా చూస్తుండిపోయినట్లు సమాచారం. ఇలాంటి తరుణంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పుత్తా, రమేష్ మధ్య సైతం తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం అక్కడి నుంచి పుత్తా అర్ధాంతరంగా నిష్ర్కమించారు. -
టీడీపీలో ఇంటిపోరు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలో ‘ఇంటింటికీ తెలుగు దేశం’ కార్యక్రమం పార్టీలో విభేదాలను పెంచుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సీటు ఆశిస్తున్న ముఖ్య నేతలను, వ్యతిరేక వర్గాలను నాయకులు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం లేదు. సొంత కార్యక్రమంగా భావిస్తూ కొందరికే పరిమితం చేస్తున్నారు. ముఖ్య నేతలను పిలిస్తే ప్రజల్లో పలుకుబడి పెరిగి రానున్న ఎన్నికల్లో సీటుకు పోటీ అవుతారనే భయంతో సమాచారమే ఇవ్వడం లేదు. పార్టీని పటిష్టం చేసేందుకు అధినేత చంద్రబాబు రూపొందించిన ఈ కార్యక్రమ నిబంధనలను నేతలు పాటించకపోవడం వల్లనే ఇంటిపోరు పెరుగుతోందని అభిమానులు చెబుతున్నారు. తొలి విడత కార్యక్రమం పేలవంగా ముగియడంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు డిసెంబరు నెలాఖరులో నాయకులతో సమావేశం నిర్వహించి రెండో విడత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయితే ప్రారంభించిన పదిరోజుల్లోనే డొల్లతనం బయట పడింది. జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు, 11 మంది నియోజకవర్గ ఇన్చార్జిలు ఇంటింటికీ దేశం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అయితే నియోజకవర్గ ఇన్చార్జిలకు సీటు కేటాయింపుపై అధినేత నుంచి ఎటువంటి భరోసా లేకపోవడంతో మిగిలిన నేతలను కూడా ప్రజలకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. వారికి ఈ కార్యక్రమాల సమాచారం అందనీయడం లేదు. ఆహ్వానం పంపడం లేదు. ఆహ్వానాలు అందడం లేదు.. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇన్చార్జి బాధ్యతలను నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ తన వ్యతిరేక వర్గానికి ఆహ్వానం పంపడం లేదనే ఆరోపణలున్నాయి. ఇక్కడ ఆయనతోపాటు మరో ఐదారుగురు సీటు ఆశిస్తున్నారు. వీరిలో కొందరికి సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది. నగర పార్టీ మైనార్టీ అధ్యక్షులు షేక్ మీరావలి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి జాగర్లమూడి శ్రీనివాసరావులకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన నాయకులను విస్మరించడం ఎంత వరకు సమంజసమనే అభిప్రాయం వినపడుతోంది. పోటీ చేయాలని పుష్పరాజ్‌పై ఒత్తిడి తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి శ్రావణ్‌కుమార్ ఈ కార్యక్రమం ద్వారా ప్రజ లతో మమేకం అవుతుండటంతో ఆయన వ్యతిరేక వర్గం మాజీ మంత్రి పుష్పరాజ్‌ను కొత్తగా తెరపైకి తీసుకువచ్చి, రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి తమకు ఎటువంటి ఆహ్వానం లేదని శ్రావణ్ వ్యతిరేక వర్గం పేర్కొంటున్నది. మాజీ మంత్రి, నరసరావుపేట నియోజకవర్గ ఇన్చార్జి కోడెల శివప్రసాద్ ఆత్మీయపాదయాత్ర పేరుతో సొంత కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ పాదయాత్రలో అన్ని వర్గాల నాయకుల ను కలుసుకునే యత్నం చేస్తున్నారు. అయితే ఆయన వ్యతిరేక వర్గమైన మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు పులిమి వెంకట రామిరెడ్డి, బీసీ విభాగ రాష్ట్ర నాయకులు వెల్లపు నాగేశ్వరరావు తదితరులు దీనికి దూరంగానే ఉంటున్నారు. కోడెలకు సీటు ఇవ్వరాదనే ప్రధాన ఉద్దేశంతో ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. సొంత కార్యక్రమానికి రూపకల్పన సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి నిమ్మకాయల రాజనారాయణ అక్కడ సీటు ఆశిస్తున్న మరో నాయకుడు మాజీ ఎమ్మెల్యే వై.వి.ఆంజనేయులుకు ఎటువంటి ఆహ్వానం పంపడం లేదు. దీంతో వైవీ ఆంజనేయులు సొంతంగా ఓ కార్యక్రమానికి రూపకల్పన చేసుకున్నారు. ప్రతి రెండు రోజులకు ఓ మారు ఒక గ్రామానికి వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. రానున్న ఎన్నికల్లో సీటు ఆశిస్తున్నానని ప్రజలకు చెబుతున్నారు. మొత్తం మీద ఇంటింటికీ తెలుగుదేశం నియోజకవర్గాల్లో విభేదాలను పెంచుతోందని పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు.