చండీగఢ్: పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. వచ్చే 7– 10 రోజుల్లో పంజాబ్ కాంగ్రెస్ అభ్యర్థి పేరును ప్రకటించాలని రాహుల్‌గాంధీకి పీపీసీసీ చీఫ్ నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ గురువారం డెడ్‌లైన్ విధించారు. జలంధర్‌లో జరుగుతున్న ప్రచారంలో రాహుల్‌ను సిద్ధూ ప్రశ్నించారు. తనను షోకేస్‌లో బొమ్మలాగా ఎల్లకాలం చూపాలని కోరడం లేదని సిద్ధూ స్పష్టం చేశారు.
సీఎం అభ్యర్ధి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ తక్షణం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ను ఎవరు నడిపిస్తారో పంజాబ్ ప్రజలకు వెల్లడించాలని, అప్పుడే కాంగ్రెస్ సులభంగా 70 సీట్లు నెగ్గుతుందని చెప్పారు. ఇదే వేదికపై ఉన్న ప్రస్తుత సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ కూడా అదే డిమాండ్‌ను వినిపించారు. వేదికపై సిద్దూను ఆలింగనం చేసుకొని తమ మధ్య ఏలాంటి విభేదాలు లేవని చెప్పారు.
అయితే సీఎం అభ్యర్ధి పేరును ప్రకటించడం ద్వారా అరవింద్ కేజ్రీవాల్ నోరు మూయించాలని చన్నీ కోరారు. పంజాబ్ కోసం తాను ప్రాణమిస్తానని, అయితే ప్రజలు ఈ రోజు సీఎం అభ్యర్ధి ఎవరని అడుగుతున్నారని చెప్పారు. రాహుల్ తనకు ఎన్నో ఇచ్చారన్నారు. సీఎం కేండిడేట్‌గా ఎవరిని ప్రకటించినా తనకు సంతోషమేనన్నారు. కాంగ్రెస్‌కు పెళ్లికొడుకు ( సీఎం అభ్యర్ధి) లేరనే కేజ్రీవాల్ విమర్శలు వినదలుచుకోలేదని చెప్పారు.
త్వరలో నిర్ణయిస్తాం
పంజాబ్ కాంగ్రెస్ కార్యకర్తలను సంప్రదించిన అనంతరం సీఎం అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని రాహుల్‌గాంధీ ప్రకటించారు. అలా ప్రకటించాల్సిన అవసరం ఉందో, లేదో కూడా కార్యకర్తలను అడుగుతామన్నారు. ఎవరో ఒక్కరే పార్టీని ముం దుండి నడిపిస్తారని చెప్పారు. ఒకరికి అవకాశం ఇస్తే మరొకరు మద్దతు ఇస్తామని ఇద్దరూ(చన్నీ, సిద్ధూ) వాగ్దానం చేశారని, ఇద్దరి గుండెల్లో కాంగ్రెస్ ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment