
రసాభాసగా టీడీపీ సమావేశం
► అంతర్గత విభేదాలతో దూషణలు
► కార్యకర్తలను ఓదార్చిన రామానాయుడు
మాడుగుల: టీడీపీ మండల కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. అంతర్గత విభేదాలతో ఒకరిని ఒకరు దూషించుకున్నారు. స్థానిక వేంకటేశ్వర ఆలయంలో ఆపార్టీ నియోజకవర్గ ఇన్‌చార్‌జ గవిరెడ్డి రామానాయుడు శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు జన్మభూమి కమిటీల ద్వారా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుందని చెప్పారు. దీంతో మాడుగుల గ్రామానికి నిధులు కేటాయించడం లేదని రూ.3 లక్షలు మంజూరు చేస్తామని చెప్పి ఒక్కపైసా ఇవ్వలేదని, 62 ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పి 25 కూడా ఇవ్వలేదని ఇలా అయితే గ్రామంలో పార్టీ ఎలా నిలబడుతుందని గ్రామానికి చెందిన వేగి రాంబాబు రామానాయుడును ప్రశ్నించారు.
పార్టీ ద్వారా తమకు సమాచారం రాలేదని పత్రికలలో చదువుకుని సమావేశానికి హాజరుకావాల్సిన దుస్థితి ఏర్పడిందని, తమను పట్టించుకోవడం లేదని రామానాయుడుతో పాటు మండల పార్టీ నాయకులను కె.జె.పురానికి చెందిన వేగి గాంధీ నిలదీశారు. పార్టీ మండల కార్యదర్శి నందారపు సన్యాసిరావు మాట్లాడుతూ రామానాయుడు పుట్టిన రోజున ఆయన ఫొటోతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకపోతే పార్టీ నిధులు కట్ అవుతాయని కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మజ్జి తాతబాబు, అద్దెపల్లి జగ్గారావు వైస్ ఎంపీపీ పెరుమళ్ళ వెంకటరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.