సాక్షి, విజయవాడ: టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఆ రెండు పార్టీల మధ్య ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. విజయవాడలో టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై బీజేపీ ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీని కించపరిచే చర్యలను టీడీపీ మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ నేతలు సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు, మాధవ్ సోమవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ నేతలు ఎక్కువ చేస్తే వాళ్ల అవినీతిపై నిలదీయాల్సి వస్తుందని హెచ్చరించారు. చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేయడాన్ని టీడీపీ నేతలు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు సహా ఎవరికీ బీజేపీ భయపడదని వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ ...‘టీడీపీ అధికార ప్రతినిధి మమ్మల్ని గుడ్డలు విప్పి కొడతాం అంటున్నారు. వార్తా ఛానల్స్ చర్చా వేదికల్లో టీడీపీ వాళ్లు ఆ తీరుగా మాట్లాడటాన్ని ఏమంటారు?. అమిత్ షా ఫోన్ చేస్తే భయపడి ఫోన్ చేశారు అంటున్నారు. ప్రత్యేక హోదా పొడిగించలేదని బీజేపీ ఎంపీ హరిబాబు చెప్పారు. కేంద్ర పార్టీ కూడా స్పష్టం చేసింది. పవన్ కల్యాణ్ లాంటి కమిటీలు చాలా ఉంటాయి. జేఎఫ్‌సీ నివేదిక చూసి స్పందిస్తాం.
నేను వార్డ్ మెంబర్‌గా పోటీ చేయలేదు. నన్ను ఎన్నో మాటలు అంటున్నారు. ఎన్నికల్లో ఓడినా 40ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. నాకు నోటు లేదు..ఓటు లేదు. నా అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా. నాకు భిక్షగా వేసిన ఎమ్మెల్సీ వల్ల ఒరిగేది ఏమీలేదు. ఎప్పుడైనా వదులుకుంటా.’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment