
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడు కాట్రగడ్డ బాబుపై బీజేపీ నాయకులు నిప్పులు చెరిగారు. కార్పోరేటర్‌గా కూడా పోటీ చేయలేని కాట్రగడ్డకు పురంధేశ్వరిని విమర్శించే స్థాయి లేదని బీజేపీ నగరాధ్యక్షుడు ఉమా మహేశ్వరరాజు మండిపడ్డారు. రాజకీయ అజ్ఞాని కాట్రగడ్డను టీడీపీ నాయకులే పక్కన పెట్టారని అన్నారు. రాజకీయాల్ని రాజకీయంగా చూడాలేగానీ, వ్యక్తిగత విమర్శలు తగవని హితవు పలికారు. అధిష్టానం దృష్టిలో పడడానికి ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. బ్యానర్లు కడుతున్నారని ధ్వజమెత్తారు. దొందలందరూ టీడీపీలోనే ఉన్నారని విమర్శించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ దొంగ దీక్షలు చేయడం వారికి మామూలేనని టీడీపీ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అదొక బ్లేడు బ్యాచ్
చేతిలో వెయ్యి రూపాయలు ఉంటే చాలు.. ముందూ వెనకా ఆలోచించకుండా ఓ బ్లేడు బ్యాచ్ దేశ ప్రధానిపై కూడా తలా తోకాలేని విమర్శలు చేస్తూ ఫ్లెక్లీలు ఏర్పాటు చేస్తారని విజయవాడ యువమోర్చా అధ్యక్షుడు రవీంద్ర ధ్వజమెత్తారు. కాట్రగడ్డకు కళ్లు నెత్తికెక్కాయని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులపై విమర్శలు చేస్తున్నవారు దమ్ముంటే టీడీపీ మేనిఫెస్టోపై బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. లేదంటే ఫ్లెక్సీలు తొలగించి నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment