ఫ్లెక్సీపై అంటించిన జీవీఎంసీ అనుమతి పత్రం
ఆరిలోవ: ‘రహదారుల శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే వెలగపూడి వస్తున్నారు.. వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలు తొలగించండి.. లేదంటే మేమే ఆ పని చేస్తాం’. ఇదీ ఒకటో వార్డు పైనాపిల్ కాలనీ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం సముదాయంలో టీడీపీ నాయకులు అజమాయిషీ. ఇక్కడ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే వెలగపూడి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కాలనీలో 416 నివాసాలున్నాయి. వాటిలో 80 శాతం టీడీపీకి చెందిన వారే ఉండేవారు. ఎమ్మెల్యే ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదని సుమారు 70 శాతంపైగా కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో ఇటీవల చేరిపోయారు. దీంతో ఈ కాలనీలో ఎక్కడచూసినా వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలు, ఆ పార్టీ జెండాలే రెపరెపలాడుతున్నాయి. శివరాత్రి, ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ సమన్యయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్‌తోపాటు స్థానిక నాయకుల ఫొటోలతో ఎక్కడకక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే వచ్చి వాటిని చూస్తే తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తారనే భయంతో స్థానిక టీడీపీ నాయకులు ఇక్కడ వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలను తొలగించడానికి రెండురోజులుగా విశ్వప్రయత్నాలు చేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు వారి ప్రయత్నానికి అడ్డుకట్టవేశారు. దీంతో టీడీపీ నాయకులు జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులపై ఈ ఫ్లెక్సీలు తొలగించాలని ఒత్తిడి చేశారు. ఈ విషయం తెలుసుకొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు జీవీఎంసీకి చలానా చెల్లించి టౌన్‌ప్లానింగ్ ఉన్నతాధికారుల నుంచి నెల రోజులకు అనుమతి తీసుకున్నారు. ఆ అనుమతి పత్రాలను ఇక్కడ ఏర్పాటు చేసిన రెండు ఫ్లెక్సీలపై అంటించారు. దీంతో టైన్‌ప్లానింగ్ సిబ్బంది కూడా వాటి జోలికి వెళ్లలేకపోయారు. చేసేదేమీలేక టీడీపీ నాయకులు తొలగింపు ప్రయత్నం విరమించుకున్నారు. ఇక్కడ వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలు, జెండాలు చూసిన ఎమ్మెల్యే వెలగపూడి స్థానిక టీడీపీ నాయకులను ఆఫీసుకు పిలుపించుకొని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment