లాటిన్ అమెరికాలో భాగంగా.. కరేబియన్ దీవుల్లో వలస పాలన నుంచి విముక్తి పొందిన తొలి దేశంగా హైతీకి ఓ గుర్తింపు ఉంది. అయితే స్వేచ్ఛా దేశం అనేపేరే తప్పించి.. ఏనాడూ ఆ గడ్డ ప్రశాంతంగా ఉండింది లేదు. హింస, దురాక్రమణలు, రాజకీయ సంక్షోభం, ప్రజల తిరుగుబాటు, అణచివేతలు, పేదరికం, తిరుగుబాటుదారుల మారణ హోమాలు హైతీని నెత్తుటి నేలగా మార్చేశాయి. తాజాగా ఏకంగా అధ్యక్షుడు జోవెనెల్ మోయిస్ హత్యతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
వెబ్‌డెస్క్: ఆఫ్రికన్ జాతులతో విరజిల్లుతున్న కరేబియన్ సముద్రపు హిస్పనియోల దీవుల్లో.. ఇటలీ నావికాన్వేషకుడు క్రిస్టోఫర్ కొలంబస్ అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఈ భూభాగంలో స్పెయిన్ కాలనీలు వెలిశాయి. రెండు వందల ఏళ్ల తర్వాత పశ్చిమం వైపు సగ భాగాన్ని ఫ్రాన్స్ చేజిక్కిచ్చుకుంది. అప్పటి నుంచి వాళ్లను బానిసలుగా మార్చుకుని షుగర్, రమ్, కాఫీ ఉత్పత్తులను ఫ్రాన్స్‌కు అక్రమంగా తరలించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో వాళ్లు దారుణమైన హింసను చవిచూశారు. 1801లో.. టౌస్సెయింట్ లోవెర్‌టర్ తిరుగుబాటుతో బానిసత్వాన్ని రద్దు చేశారు.
ఆపై 1804లో ఫ్రాన్స్ నుంచి విముక్తి పొంది హైతీ స్వతంత్ర్య దేశంగా ఆవిర్భవించింది. బానిస బతుకుల విముక్తి కోసం పోరాడిన జీన్ జాక్వెస్ డెస్సాలైన్స్ తొలి అధ్యక్షుడు అయ్యాడు. కానీ, రెండేళ్లకే అతన్ని దారుణంగా హత్య చేశారు(వాళ్లెవరో ఇప్పటిదాకా తెలియదు). ఆపై వంద సంవత్సరాలపాటు అంతర్యుద్దంతో నలిగిపోయిన హైతీలో 1915లో అమెరికా సైన్యం అడుగుపెట్టింది. అయితే 1943లో తమ దళాలను వెనక్కి తీసుకున్నప్పటికీ.. ఇప్పటికీ ఆర్థిక, రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకుంటూ వస్తోంది.
దాయాదిగా పొరుగు దేశం!
పొరగున ఉండే డొమినికన్ రిపబ్లిక్‌తో 1937లో హైతీకి శత్రుత్వం మొదలైంది. సరిహద్దు విషయంలో జరిగిన గొడవలతో అప్పటి డొమినికా నియంతాధ్యక్షుడు టట్రుజిల్లో నర మేధానికి ఆదేశాలిచ్చాడు. దీంతో సరిహద్దులో నివసిస్తున్న హైతీ ప్రజల్ని.. డొమినికా సైన్యం ఊచకోత కోసింది. ఆ తర్వాత కాల్పులు తగ్గుముఖం పట్టినప్పటికీ .. సరిహద్దు ఒప్పందాలు మాత్రం కొనసాగుతున్నాయి.
సైన్యం తిరుగుబాటులు
1957లో హైతీ రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. దీంతో అప్పటి సైన్యాధ్యక్షుడు ఫ్రాన్‌కోయిస్ పాపా డాక్ డువెలైర్.. మిలిటరీ సాయంతో అధికార పీఠాన్ని చేజిక్కించుకున్నాడు. ఆ పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన ఎవరూ ఊహించని స్థాయిలో జరిగింది. చివరికి అంతర్జాతీయ సమాజం విమర్శలకు తలొగ్గి, టోంటోన్ మాకౌట్స్ రహస్య బృందాలకు భయపడి డువెలైర్ కొంచెం తగ్గాడు. 1964లో తనను తాను అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించుకున్నాడు. అతని మరణం తర్వాత కొడుకు జీన్ కౌడ్(బేబీ డాక్) అధ్యక్షుడు అయ్యాడు. అతని పాలనలో ప్రజలు నరకం అనుభవించారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఫ్లోరిడాకు పడవల్లో పారిపోయే ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయాణాల్లో వేల మంది మృత్యువాత పడ్డారు.
ఎన్నికలు.. పేదరిక ప్రభావం
వరుస తిరుగుబాట్లు, ప్రజల నిరసన ప్రభావంతో బేబీ డాక్.. 1986లో ఫ్రాన్స్‌కు శరణార్థికి పారిపోవడంతో లెఫ్టినెంట్ జనరల్ హెన్రీ నాంపి పాలనను చేపట్టాడు. రెండేళ్లకు జనరల్ ప్రాస్‌పర్ అవిరిల్ తానే నిజమైన అధ్యక్షుడినని ప్రకటించుకోగా.. అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో రాజీనామా చేసి తొలిసారి ఎన్నికలు నిర్వహించారు. అయితే పేదల పెన్నిధిగా పేరున్న వామపక్ష నేత జీన్ బెర్ట్‌రాండ్ అర్టిస్టిడె ఆ ఎన్నికల్లో గెలవగా.. ఆ మరుసటి ఏడాది(1991)లో హింస చెలరేగడంతో అతన్ని పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది.
మూడేళ్ల పాటు ఆ మారణకాండలు అలాగే కొనసాగడంతో.. 1994లో అమెరికా జోక్యం చేసుకుంది. తమ సైన్యాన్ని దించి హైతీ మిలిటరీ చర్యల్ని అణచివేసి.. తిరిగి అర్టిస్టిడ్‌ను అధ్యక్షుడిగా నియమించి శాంతి స్థాపనకు ప్రయత్నించింది. అప్పటి రాజకీయ అస్థిరత్వం నడుమే అధ్యక్షుడిగా కొనసాగినప్పటికీ.. 2004లో మళ్లీ హింస చెలరేగడంతో అర్టిస్టిడ్ దేశం విడిచి పారిపోయాడు. దీంతో మరోసారి ఎన్నికలు జరగ్గా.. ప్రెవెల్ నెగ్గాడు. ఆపై నిరసనలు, ఆహార కొరత, కలరా.. 2010లో భారీ భూకంపాలతో రెండున్నర లక్షల మంది దుర్మరణం పాలవ్వడంతో హైతీ ఘోరంగా కుదేలు అయ్యింది.
కోలుకున్నట్లే అనిపించి..
వరుస విషాదాలతో కొలుకున్న హైతీకి.. 2011 ఎన్నికల్లో మైకేల్ మార్టెల్లీ గెలవడంతో ఆశలు చిగురించాయి. అయితే ఆ ఆనందం ఏడాది కూడా నిలవలేదు. పేదరికం, ఆర్థిక సంక్షోభం, పైగా అవినీతి ఆరోపణలతో ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు మొదలయ్యాయి. దీంతో మార్టెల్లీ రాజీనామా చేయాల్సి వచ్చింది. 2017లో అరటి పండ్ల వ్యాపారిగా ఉన్న జోవెనెల్ మోయిస్.. రాజకీయాల్లోకి అడుగుపెట్టి బ్రహ్మండమైన మెజార్టీతో గెలుపొందాడు. అయితే అధికార దుర్వినియోగంతో ఎన్నికలకు సిద్ధపడకపోకపోవడంతో.. మరోసారి వ్యతిరేక గళం వినిపించింది హైతీ గడ్డపై. ఈ ఏడాది మొదట్లో నియంతృత్వం వద్దంటూ లక్షల మంది నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
చంపిందెవరు?
హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిస్ అతిదారుణంగా హత్య చేసిన వాళ్ల గురించి రకరకాల కథనాలు వెలువడ్డాయి. నిందితులు కాల్పుల సమయంలో స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడారని పోలీసులు ధృవీకరించుకున్నారు. ఇక ఇది ఫ్రాన్స్ చేయించిన హత్య అని, కాదు అమెరికా చేయించిన హత్య అని, డొమెనికా సీక్రెట్ గ్రూప్ చేయించిన పని అని.. ఇలా ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే ఆయా దేశాలు మాత్రం ఆరోపణల్ని.. మోయిస్ హత్యను ముక్తకంఠంతో ఖండించాయి. ఇక హత్యకు పాల్పడిన ముఠాగా అనుమానిస్తున్న ముగ్గురిని ఇప్పటికే హైతీ భద్రతా దళాలు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాయి. తీవ్రంగా గాయపడిన మోయిస్ భార్య మార్టైన్ మోయిస్ స్పృహలోకి వస్తే.. ఈ హత్యకు సంబంధించిన వివరాలేవైనా తెలుస్తాయని భద్రతా దళాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న క్లౌండ్ జోసెఫ్.. తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment