కరోనా రక్కసి నగరాలకు ఊపిరాడనివ్వడం లేదు. అత్యధిక జనసాంద్రత, వాణిజ్య కార్యకలాపాలు, భౌతిక దూరం పాటించడానికి అవకాశం లేని పరిస్థితి ఉండడంతో కోవిడ్ కాటేస్తోంది. ప్రపంచంలో అత్యధిక కోవిడ్–19 కేసులు నమోదైన అమెరికా, స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ ఇలా ఏ దేశాన్ని తీసుకున్నా వాణిజ్య కార్యకలాపాలు జరిగే నగరాలే కోవిడ్ దెబ్బకి అల్లాడిపోతున్నాయి. అమెరికాలో న్యూయార్క్, స్పెయిన్‌లో మాడ్రిడ్, ఇటలీలో మిలన్, బ్రిటన్‌లో లండన్, ఫ్రాన్స్‌లో పారిస్ ఇలా ఏ నగరాన్ని చూసుకున్నా కరోనా విధ్వంసం సృష్టించింది.
కరోనా వ్యాప్తి
కరోనా వైరస్ దాడి చేయడం మొదలు పెట్టాక అన్ని చోట్లా ఒకే మాదిరిగా వ్యాపించడం లేదు. అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు, లాక్‌డౌన్ అమలు తీరుతెన్నులు, యువ జనాభా, వృద్ధజనాభాలో ఉన్న తేడాలు, ప్రజల్లో రోగనిరోధక శక్తి, వైద్య సదుపాయాలు వంటివెన్నో కరోనా వ్యాప్తిపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. న్యూయార్క్, మాడ్రిడ్ వంటి నగరాల్లో కరోనా ఎప్పుడు మొదలైంది, ఎలా వ్యాప్తి చెందింది అన్నది పరిశీలించి చూస్తే ఆ రెండు నగరాల్లో కరోనా తీవ్రంగా మొదలై కొద్ది రోజుల్లోనే అత్యంత తీవ్రమైన స్థితికి చేరుకొని (ఒక్క రోజులోనే కేసుల సంఖ్యలో రెట్టింపు కావడం) ఆ తర్వాత నెమ్మదిగా తగ్గడం మొదలు పెట్టింది. కేసులు నమోదైన రోజు దగ్గర్నుంచి 12 రోజుల్లో్లనే తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఆ తర్వాత కేసుల సంఖ్య బాగా తగ్గడానికి నెలరోజులు పట్టింది.
భారత్‌లో నగరాల పరిస్థితి ఏంటి ?
దేశ వాణిజ్య రాజధాని ముంబై, రాజధాని ఢిల్లీలను కరోనా భయపెడుతోంది. తొలి కేసు నమోదైన దగ్గర్నుంచి ఇప్పటివరకు రోజువారీగా నమోదైన కేసుల తీరుని విశ్లేషించి చూస్తే కేసులు ఉన్నట్టుండి పెరగడం, తగ్గడం, మళ్లీ పెరుగుతూ వచ్చి తగ్గడం ఇలా చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. మిగిలిన ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే భారత్‌లో ముందస్తుగానే లాక్‌డౌన్ ప్రకటించింది. ఢిల్లీలో తొలి కేసు నమోదైన 19 రోజుల తర్వాత కేసులు కాస్త నెమ్మదించాయి. భారీగా కేసుల్లో తగ్గుదల కనిపించకపోయినా నిలకడగా నమోదవుతున్నాయి. అదే ముంబైని తీసుకుంటే తొలి కేసు నమోదైన తర్వాత అయిదారు రోజులు కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
ఆ తర్వాత తగ్గుముఖం పట్టి మళ్లీ తీవ్రస్థాయిలో పెరిగింది. ఏప్రిల్ మొదటి వారంలో తగ్గుతూ వచ్చిన కేసులు రెండో వారం తర్వాత మళ్లీ పెరిగిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. జనాభాతో కిటకిటలాడే ముంబైలో కేసుల సంఖ్య ఇలాగే పెరిగితే ముందు ముందు ఎలా ఉంటుందన్న ఆందోళనైతే నెలకొంది. ఈ రెండు నగరాలతో పాటు అహ్మదాబాద్, ఇండోర్‌లో కూడా కరోనా విజృంభిస్తోంది. మన దేశంలో మే 11వ తేదీ తర్వాత కోవిడ్ కేసులు తీవ్ర స్థాయికి చేరుకొని నెలాఖరు నుంచి తగ్గుముఖం పడుతుందన్న అంచనాలైతే ఉన్నాయి. సాధారణంగా ఏ దేశాన్నయినా కరోనా మహమ్మారి 70 నుంచి 80 రోజుల పాటు పీడించాక గానీ తగ్గుముఖం పట్టడం లేదని వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment