లాక్‌డౌన్ కారణంగా నిర్మానుష్యంగా మారిన పారిస్‌లోని మోంటోర్గిల్ జిల్లాలో ఓ వీధి
వాషింగ్టన్/లండన్: కరోనా మహమ్మారి యూరప్, అమెరికా దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మొదటి సారి కంటే సెకండ్ వేవ్‌లో అత్యంత భయంకరంగా వైరస్ విజృంభిస్తోంది. అమెరికాలో రికార్డు స్థాయిలో గురువారం ఒకే రోజు 90 వేల కేసులు నమోదు కాగా యూరప్ దేశాలైన ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీలలో కరోనా రోగులతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఫ్రాన్స్‌లో నెలరోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్ అమలు చేస్తే, జర్మనీలో పాక్షికంగా లాక్‌డౌన్ ప్రకటించారు. పోర్చుగల్, చెక్ రిపబ్లిక్ వంటి దేశాల్లో కర్ఫ్యూని అమలు చేశారు. ఐర్లాండ్ వారం రోజుల క్రితమే అత్యవసరాలు మినహా మార్కెట్లని మూసేసింది. దీంతో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌పై కూడా దేశంలో లాక్‌డౌన్ విధించాలంటూ ఒత్తిడి పెరిగిపోతోంది. మరోవైపు వివిధ దేశాల్లో లాక్‌డౌన్ పట్ల వ్యాపారస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఇలా మార్కెట్లను మూసేస్తుంటే తాము ఎలా జీవించాలంటూ స్పెయిన్ నుంచి ఇటలీ వరకు ప్రజలు రోడ్లెక్కి లాక్‌డౌన్‌కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
మరో 5 నెలలు ఇంతే..!
యూరప్ దేశాల్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ వరకు కొనసాగే అవకాశాలున్నాయని యూకే సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఎమర్జెన్సీస్ (ఎస్‌ఏజీఈ) అంచనా వేసింది. అత్యంత కఠినంగా లాక్‌డౌన్‌ని అమలు పరచకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని బ్రిటన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కరోనా అంశంలో ఎస్‌ఏజీఈ వేసిన అంచనాలకు సంబంధించిన ఒక పత్రం లీకైంది. దాని ప్రకారం యూకేలోనే 85 వేల మంది వరకు మరణించే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కరోనా మరింత ఉధృత స్థాయికి చేరుకొని రోజుకి 800 మంది వరకు మరణిస్తారు. 25 వేల మంది వరకు ఆస్పత్రి పాలవుతారని ఆ సంస్థ పేర్కొంది. వారిలో 5 వేల మంది వరకు ఐసీయూలో ఉంటారు. ఇక బ్రిటన్‌లో ప్రతి రోజూ లక్ష మంది కరోనా బారిన పడతారని న్యూ ఇంపీరియల్ కాలేజీ స్టడీ వెల్లడించింది. ఒకే ఒక్క రోజు పది లక్షల మందికి కరోనా సోకిందన్న వార్త వినడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.
► ప్రతిరోజూ సగటున యూరప్ దేశాల్లో 1,370 మంది చనిపోతుండగా, అమెరికాలో 808 మంది చొప్పున మరణిస్తున్నారు.
► గత వారంలో యూరోపియన్ యూనియన్, యూకేలో సగటున రోజుకి లక్షా 76 వేల మంది కరోనా బారిన పడగా, అమెరికాలో రోజుకి సగటున 72 వేల కేసులు నమోదవుతున్నాయి.
► ఫ్రాన్స్‌లో సగానికి పైగా ఐసీయూ బెడ్స్ కరోనా రోగులతో నిండిపోయాయి.
► ఇటలీలోని మిలాన్ నగరంలో వాణిజ్య ప్రదర్శనకు వినియోగించే కేంద్రాలను తాత్కాలిక కోవిడ్ ఆస్పత్రులుగా మార్చారు.
► బెల్జియంలోని 10% ఆస్పత్రుల్లో నర్సులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో లక్షణాలు లేకుండా కరోనా ఉన్నవారందరూ విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
► యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ సిఫారసుల ప్రకారం కరోనా చేసిన పరీక్షల్లో 3శాతం కంటే తక్కువ మందికే పాజిటివ్ రావాలి. కానీ స్పెయిన్‌లో 11%, ఫ్రాన్స్‌లో 18%, నెదర్లాండ్స్, చెక్ రిపబ్లిక్‌లలో 26% వరకు పాజిటివిటీ రేటు ఉంది.
► కోవిడ్ అమెరికా, యూరప్‌లపై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపించింది. యూరోజోన్ ఎకానమీ 2020లో 8.3% తగ్గిపోతే, అమెరికా ఎకానమీలో 4.3% తగ్గుదల కనిపించింది.
ఎందుకీ విజృంభణ?
యూరప్ దేశాల్లో కోవిడ్–19 తొలి దశ విజృంభణ ముగిసిపోయాక ఆ దేశాలన్నీ బాగా రిలాక్స్ అయిపోయాయి. మొదటి సారి లాక్‌డౌన్ సమయంలో మళ్లీ మహమ్మారి విజృంభిస్తే ఎదుర్కోవడానికి అవసరమైన ప్రణాళికలను ప్రభుత్వాలు పక్కాగా రచించలేదు. కరోనా రోగుల ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్ కార్యక్రమం మిగిలిన దేశాలతో పోల్చి చూస్తే యూరప్‌లో పకడ్బందీగా అమలు కాలేదు. అంతేకాదు గత వేసవిలో ప్రజలు కూడా యథేచ్ఛగా తిరిగారు. విపరీతంగా ప్రయాణాలు చేయడం, నైట్ లైఫ్ ఎంజాయ్ చేయడం, క్లబ్బులు పబ్బులు, బీచ్‌ల వెంట తిరగడం చేశారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యలన్నీ గాలికి వదిలేశారు. దీంతో అక్టోబర్‌లో మళ్లీ కరోనా బాంబు పేలింది.
Comments
Please login to add a commentAdd a comment