వాషింగ్టన్/బీజింగ్/మాడ్రిడ్: ‘‘మా అమ్మ వయసు 85 సంవత్సరాలు. కరోనా వ్యాధి సోకి ఊపిరి పీల్చుకోలేని దుస్థితి. ఆస్పత్రికి తీసుకువెళితే మత్తు మందు ఇచ్చి వెనక్కి పంపించేశారు. వృద్ధులకు చికిత్స చేయడానికి ఆస్పత్రులు సరిపోవడం లేదు. ఐసీయూలో యువతకే చికిత్స అందిస్తున్నారు ఇంక ఎవరూ చేయగలిగిందేమీ లేదు’’స్పెయిన్‌లోని బార్సిలోనాకు చెందిన మారియా జోస్ అనే కూతురి ఆవేదన ఇది. కేవలం ఆమె మాత్రమే కాదు స్పెయిన్‌లో చాలా నగరాల్లో ఇదే దుస్థితి నెలకొంది. రోగులకు చికిత్స అందించడానికి ఆస్పత్రులు సరిపోవడం లేదు. రేయింబగళ్లు పనిచేయలేక వైద్యులు అలిసిపోతున్నారు. ప్రపంచ దేశాల్లో ఇటలీ తర్వాత అత్యధిక కరోనా మృతులు స్పెయిన్‌లో నమోదయ్యాయి. ఆదివారం ఒక్క రోజే 674 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 13 వేలకు చేరువలో ఉంది. కేసులు లక్షా 40 వేలు దాటేశాయి.
మృతుల సంఖ్యను ఊహించలేం:
అమెరికా అధ్యక్షుడు ట్రంప్
కరోనా రక్కసి గుప్పిట్లో చిక్కుకొని అమెరికా విలవిల్లాడుతోంది. రాబోయే రోజులు భయంకరంగా ఉండబోతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వచ్చే కొద్ది వారాల్లో కోవిడ్–19 మృతులు భయంకరంగా నమోదవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దేశాన్ని లాక్‌డౌన్ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అమెరికాని లాక్‌డౌన్ చేయడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతను అరికట్టవచ్చు, దేశాన్ని నాశనం చేయలేమన్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యకి చికిత్స చెయ్యాలే తప్ప నివారణ మార్గాల వల్ల వచ్చే అదనపు ప్రయోజనం ఉండదని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
న్యూయార్క్‌కు మిలటరీ వైద్యులు
కరోనా విశ్వరూపం చూస్తున్న న్యూయార్క్‌లో రోగులకు చికిత్స అందించడానికి వైద్యుల కొరత ఏర్పడింది. దీంతో లైసెన్స్ కలిగిన వైద్య సిబ్బంది సాయానికి రావాలంటూ నగర మేయర్ బిల్ పిలుపునిచ్చారు. ఏప్రిల్, మే నెలల్లో 45 వేల మంది వైద్య సిబ్బంది అవసరం ఉంటుందన్నారు. మిలటరీలో పనిచేసే వైద్య సిబ్బందిలో వెయ్యి మందిని అత్యవసర సేవల కోసం న్యూయార్క్‌కు పంపించారు. వెంటిలేటర్లకు కొరత ఏర్పడడంతో న్యూయార్క్ నగరానికి చైనా వెయ్యి వెంటిలేటర్లను పంపింది. మొత్తం 17 వేల వెంటిలేటర్లు అవసరం ఉందని మేయర్ అంటున్నారు.
► చైనాలో కోవిడ్–19 కేసులు మళ్లీ బయట పడుతున్నాయి. తాజాగా మరో 30 కేసులు నమోదయ్యాయి.
► వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి దుబాయ్ రెండు వారాలు లాక్‌డౌన్ విధించింది.
► పాకిస్తానీయులకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, అయినా కరోనాని దీటుగా ఎదుర్కొంటామని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. న్యూయార్క్‌ని చూసి అయినా ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాక్‌లో కరోనా కేసుల సంఖ్య 3 వేలకు చేరువలో ఉంది.
► కరోనా భయంతో ఈజిప్టు ప్రభుత్వం ఈస్టర్ ఉత్సవాలను రద్దు చేస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది.
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు: 12,53,043
మరణాలు : 68,153
కోలుకున్న వారు : 2,57,199
ప్రపంచం ఉక్కిరిబిక్కిరి
Published Mon, Apr 6 2020 4:03 AM | Last Updated on Mon, Apr 6 2020 8:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment