Port-Au-Prince: కరేబియన్ దేశమైన హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిస్ హత్యతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడిన సంగతి తెలిసిందే. మోయిస్ హత్య వెనుక కీలక సూత్రధారిని అరెస్టు చేసినట్లు హైతీలోని అధికారులు సోమవారం తెలిపారు. ఈ ఘటనపై హైతీ పోలీసు అధికారి లియోస్ చార్లెస్ మాట్లాడుతూ.. క్రిస్టియన్ ఇమ్మాన్యుయేల్ సనోన్ (63) రాజకీయ ప్రయోజనాల కోసం ఓ ప్రైవేట్ విమానంలో పలువురు కొలంబియన్లతో హైతీలోకి ప్రవేశించాడని పేర్కొన్నారు.
ఇక ఈ హత్యకు సంబంధించి గత వారం రోజుల నుంచి కనీసం పద్దెనిమిది కొలంబియన్ పౌరులను అరెస్టు చేసినట్లు తెలిపారు. అధ్యక్షుడిని చంపే కుట్ర వెనుక మరో ఇద్దరు సూత్రధాలు కూడా ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఓ ముగ్గురు హైతీ అమెరికన్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో సనోన్ దేశంలోకి ప్రవేశించాడని, అతడి ఇంటి వద్ద పెద్ద ఎత్తున తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మోయిస్ భార్య మార్టైన్ మోయిస్‌ను మయామి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న క్లౌండ్ జోసెఫ్.. తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment