
పోర్ట్–అవ్–ప్రిన్స్: కరేబియన్ దేశమైన హైతి అధ్యక్షుడు జోవెనెల్ మోయిజ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మంగళవారం అర్ధరాత్రి ఆయన నివాసంపై దాడి చేసిన దుండగులు జోవెనెల్‌ను కాల్చి చంపినట్టుగా ఆ దేశ తాత్కాలిక ప్రధాని క్లాడ్ జోసెఫ్ వెల్లడించారు. అనాగరిక, అమానవీయ, విద్వేషపూరిత చర్యగా దీనిని అభివర్ణించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దుండగుల దాడిలో గాయపడిన అధ్యక్షుడి భార్య, దేశ ప్రథమ మహిళ మార్టిన్ మోయిజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
దాడికి దిగిన వారిలో కొందరు స్పానిష్ , ఇంగ్లీషు భాషలో మాట్లాడారని జోసెఫ్ ఆ ప్రకటనలో తెలిపారు. అయితే ఎవరు ఈ ఘాతుకానికి ఒడిగట్టారో ఇంకా తెలియలేదు. ప్రస్తుతం దేశంలో భద్రతా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని జోసెఫ్ స్పష్టం చేశారు. 53 ఏళ్ల వయసున్న మోయిజ్ 2017లో అధికారంలోకి వచ్చారు. అప్పట్నుంచి ఆయన తన అధికారాన్ని పెంచుకునే ప్రయత్నాలే చేశారు. కోర్టులు, ప్రభుత్వ కాంట్రాక్టర్లు, ఆడిటర్లు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కేవలం అధ్యక్షుడికే జవాబుదారీలా ఉండేలా నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో ఎన్నికలు నిర్వహించడంలో ఆయన విఫలమయ్యారు. దీంతో అధ్యక్షుడిపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. విపక్ష నేతలు ఆయన గద్దె దిగాలని కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment