అత్తెసరు ప్రజాభిమానంతో కొట్టుమిట్టాడుతున్న తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. తెలుగు తమ్ముళ్ల మధ్య ఒకరంటే మరొకరికి గిట్టని పరిస్థితి ఉత్పన్నమైంది. కడప మేయర్ అభ్యర్థి ఎంపికలో నేతల మధ్య ఉన్న విభేదాలు ఒక్కమారుగా ప్రస్ఫుటం అయ్యాయి. నువ్వెంతంటే నువ్వెంతని పరస్పరం దూషణలకు దిగారు. ఒక్కమాటలో చెప్పాలంటే యుద్ధవాతావరణం నెలకొంది. వెరసి ఓ వర్గం సమావేశం నుంచి అర్ధాంతరంగా వెనుతిరిగింది.
ప్రజాభిమానం పొందడంలో విఫలమైన తెలుగు తమ్ముళ్లు వర్గ విభేదాలను సృష్టించుకోవడంలో ముందుంటున్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో చోటు చేసుకున్న గొడవ ఇందుకు నిదర్శంగా నిలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, కమలాపురం ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి, టీడీపీ నేత శశికుమార్ మధ్య నెలకొన్న గొడవ చిన్నసైజు యుద్ధ వాతావరణాన్ని తలపించినట్లు సమాచారం.
ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు కేకలు వేయడం, ఒకదశలో పరస్పరం కుర్చీలు చేతికి తీసుకోవడంతో తీవ్ర గందరగోళంచోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఉన్నతికి కృషి చేయాల్సిన నాయకులు వ్యక్తిగత ఇమేజ్ కోసం పాకులాడటమే గొడవకు కారణమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు.
పుత్తాకు శృంగభంగం....
కడప నియోజకవర్గంలో తనమాట చెల్లుబాటు కావాలని, తాను చెప్పినోళ్లనే పరిగణలోకి తీసుకోవాలని భావిస్తూ వచ్చిన మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కడప పరిధిలో ప్రతి చిన్న విషయానికి కమలాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి అయిన పుత్తా నరసింహారెడ్డి జోక్యం చేసుకోవడంపై స్థానిక నేతలు అభ్యంతరం చేస్తూ వస్తున్నారు.
పార్టీ బలోపేతమే లక్ష్యంగా కాకుండా, తన వర్గాన్ని పెంచుకునేందుకు దృష్టి సారించడంపై కడప నేతలు ఆక్షేపణ తెలుపుతున్నారు. కమలాపురంలో వర్గ రాజకీయాల నేపధ్యంలో ఇప్పటికే రెండు పర్యాయాలు పుత్తా నరసింహారెడ్డి ఓటమి పాలయ్యారు. కడపలో పాగా వేసేందుకు పుత్తా పావులు కదుపుతూ వచ్చారని పరిశీలకులు పేర్కొంటున్నారు.
పుత్తా వైఖరిని అంచనా వేసిన కడప నేతలు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా స్థానికునికి మాత్రమే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఇలాంటి తరుణంలో మున్సిపల్ ఎన్నికలు రావడంతో అంతర్గత విభేదాలు ఒక్కమారుగా బహిర్గతం అయ్యాయి. కడప మేయర్ అభ్యర్థిత్వాన్ని తన అనుయాయుడు సుభాన్‌బాషకు ఇవ్వాలని పుత్తా పట్టుపట్టినట్లు సమాచారం. అందుకు కడప నియోజకవర్గంలోని మెజార్టీ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈపరిణామాన్ని జీర్ణించుకోలేని పుత్తా నరసింహారెడ్డి టీడీపీ నేత శశికుమార్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అంతే తీవ్రతతో శశికుమార్ సైతం ప్రతిఘటించినట్లు సమాచారం. ఒకరిపైకి మరొకరు కుర్చీలు తీసుకోవడంతో అంగరక్షకులు మధ్యలోకి వచ్చి అడ్డగించినట్లు తెలుస్తోంది. టీడీపీ కార్యాలయం నుంచి వస్తున్న కేకలకు రోడ్డు మార్గంలో వెళ్తున్నవారు సైతం ఏమి జరుగుతోందని వింతగా చూస్తుండిపోయినట్లు సమాచారం.
ఇలాంటి తరుణంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పుత్తా, రమేష్ మధ్య సైతం తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం అక్కడి నుంచి పుత్తా అర్ధాంతరంగా నిష్ర్కమించారు.