సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. స్థానిక ఎమ్మెల్యే అబ్రహం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. ప్రధానంగా పాలనా వ్యవహారాల్లో ఆయన తనయుడు జోక్యం చేసుకోవడం.. పార్టీలోని స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
చదవండి👉: కేసీఆర్ సుముఖత.. టీఆర్‌ఎస్ వెంట పీకే టీమ్
నియోజకవర్గ పరిధిలోని పలువురు అసంతృప్త నేతలు ఇటీవల రహస్యంగా సమావేశమై పోరు కార్యాచరణ పథకం రచించారు. ఇందుకనుగుణంగా దూకుడుగా వ్యవహరిస్తుండటంతో కారులో కిరికిరి తారాస్థాయికి చేరినట్లు స్పష్టమవుతోంది. పాలమూరులో ఒకవైపు బీజేపీ ప్రజాసంగ్రా మ యాత్ర కొనసాగుతుండగా మరోవైపు కాంగ్రెస్ సైతం క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై పోరుబాట పట్టింది. ఈ క్రమంలో అలంపూర్‌లో అధికార పార్టీలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. గులాబీలో అంతర్గత పోరు రచ్చకెక్కిన నేపథ్యంలో ఈ పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయోనని చర్చ జోరుగా సాగుతోంది.
ఇలా ముదిరింది..
2009 డీలిమిటేషన్‌లో అలంపూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యరి్థగా వీఎం అబ్రహం బరిలో నిలిచి విజయం సాధించారు. 2014లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్‌కుమార్ గెలుపొందారు. తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో ఈసారి టీఆర్‌ఎస్ నుంచి అబ్రహం పోటీచేసి గెలిచారు. అయితే గెలిచిన కొంతకాలం తర్వాత స్థానిక నేతలను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. అదే సమయంలో ఆయన తనయుడు అజయ్ పొలిటికల్ ఎంట్రీకి అబ్రహం సన్నాహాలు చేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో అలంపూర్ నుంచే వారసత్వం పుచ్చుకోనున్నట్లు ప్రచారం మొదలైంది.
దీంతో పాటు అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానం అందకపోవడం.. అందినా చివరి నిమిషంలో కబురు రావడం వంటి సంఘటనలు స్థానిక ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తిని రగిల్చాయి. దళితబంధు, ఇతర పథకాల అమలులో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకోకపోవడం మరింత నిప్పు రాజేసినట్లు సమాచారం. దీంతో పలువురు అసమ్మతి నేతలు ఇప్పటికే నాలుగైదు పర్యాయాలు రహస్యంగా భేటీ అయినట్లు తెలిసింది. అయితే పార్టీకి చెడ్డ పేరు రావొద్దనే ఉద్దేశంతో తగిన సమయం కోసం వేచిచూసినట్లు తెలుస్తోంది.
అయిజలో రహస్య భేటీ..
ప్రస్తుతం అసంతృప్తితో రగులుతున్న నేతలు మొదట్లో ఎమ్మెల్యే అబ్రహంతో సఖ్యతగానే ఉన్నారు. ఎప్పుడైతే తన కొడుకు అజయ్ పొలిటికల్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టడం.. అధికారిక కార్యక్రమాలతో పాటు తమ పరిధిలోని మండలాలు, గ్రామాల్లో జరిగే వివిధ కార్యకళాపాల్లో అజయ్ పెత్తనం చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పీఏసీఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు సోమవారం అయిజలోని ఓ ఫంక్షన్ హాల్‌లో సమావేశమై పోరు కార్యాచరణపై చర్చించారు.
కేటీఆర్ వద్దకు పంచాయితీ..
ఓ నిర్ణయానికి వచ్చిన అసంతృప్త నేతలు సమావేశం అనంతరం టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కలిశారు. ఎమ్మెల్యే అబ్రహం తీరుతో తమకు జరుగుతున్న అవమానాలను ఏకరువు పెట్టారు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని వారి క్యాంపు కార్యాలయాల్లో కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యను పరిష్కరించాలని కోరినట్లు సమాచారం. స్పందించిన వారు ‘అలాగేనని.. ప్లీనరీ ఉంది.. తర్వాత కలిసి మాట్లాడదాం’ అని అసంతృప్త నేతలను సముదాయించినట్లు తెలిసింది. ఎక్కడ కూడా బహిర్గతం కావొద్దని.. అంతర్గతంగానే పరిష్కరించుకుందామని సూచించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ పంచాయితీ కేటీఆర్ వద్దకు చేరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్లీనరీ తర్వాత దీనిపై ఆయన దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అలంపూర్‌లో గట్టి పట్టు ఉన్న టీఆర్‌ఎస్ నేత తిరుమల్‌రెడ్డి మృతిచెందడం.. మరోవైపు గెలుపోటములను శాసించే చల్లా వెంకట్రామరెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతుండడం.. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కడం చర్చనీయాంశాలుగా మారాయి. అలంపూర్ నియోజకవర్గంపై దృష్టి సారించిన అధికార పారీ్టలో కొందరు నేతలు ఇప్పటి నుంచే చక్రం తిప్పుతున్నారని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇసుకదందాలో తనయుడి మితి మీరిన జోక్యంతోనే ఎమ్మెల్యేపై అసమ్మతి సెగ రాజుకుందనే అభిప్రాయాలు టీఆర్‌ఎస్ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment