ఎమ్మెల్యేకు షాక్‌.. అలంపూర్‌ బీఆర్ఎస్ అభ్యర్థి మార్పు.. | Shock To MLA Abraham Alampur BRS Candidate Changed | Sakshi
Sakshi News home page

సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు షాక్‌.. అలంపూర్‌ బీఆర్ఎస్ అభ్యర్థి మార్పు..

Published Tue, Nov 7 2023 8:29 PM | Last Updated on Tue, Nov 7 2023 9:01 PM

Shock To MLA Abraham Alampur BRS Candidate Changed - Sakshi

సాక్షి, జోగులాంబ గద్వాల జిల్లా: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఓవైపు నామినేషన్లు, ప్రచారంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడీ నెలకొనగా.. మరోవైపు టికెట్ ​కేటాయించి బీఫామ్‌లు దక్కని అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా అలంపూర్‌ బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు షాక్‌ తగిలింది. నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వంపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం మార్చుకున్నారు. 

తొలుత అలంపూర్‌ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను ప్రకటించిన కేసీఆర్‌.. ఇప్పటి వరకు ఆయనకు బీ-ఫామ్‌ ఇవ్వలేదు. మంగళవారం అనూహ్యంగా స్థానిక నేత విజయుడికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బీఫామ్‌ ఇచ్చారు. దీంతో అసెం‍బ్లీ ఎన్నికల బరిలో నుంచి అబ్రహం తప్పుకున్నట్లే అయ్యింది.

అబ్రహంను ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్‌ఎస్‌ మొదటి జాబితాలోనే సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అయితే అబ్రహం అభ్యర్థిత్వంపై నియోజకవర్గంలో మొదట్నుంచీ వ్యతిరేకత వస్తోంది. దీనికితోడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వర్గం సైతం అభ్యంతరం తెలిపింది. అభ్యర్థిని తప్పనిసరిగా మార్చాల్సిందేనన్న డిమాండ్‌ పెరగడంతో అధిష్టానం   పునరాలోచనలో పడింది. నామినేషన్ల స్వీకరణకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో చివరికి అలంపూర్ నుంచి మరో అభ్యర్థిని రంగంలోకి దింపేందుకే బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. 
చదవండి: అవినీతిని అంతం చేస్తాం.. ఇది మోదీ గ్యారంటీ

 అబ్రహం స్థానంలో చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజేయుడికి టికెట్ ఖాయమైంది.  సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కేటీఆర్‌ మంగళవారం రోజు మొత్తం తొమ్మిది మంది బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేశారు. వారిలో అలంపూర్‌ నుంచి విజేయుడు కూడా ఉన్నారు. దీంతో మొత్తం 119 నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బీ ఫారాల- పంపిణీ కార్యక్రమం పూర్తయింది.

మంగళవారం బీ-ఫామ్‌లు అందుకున్నవారు..

► ఎం సీతారాంరెడ్డి – చాంద్రాయణ గుట్ట
►సామా సుందర్ రెడ్డి – యాకత్ పురా
►ఇనాయత్ అలీబాక్రి -- బహదూర్‌పురా
►తీగల అజిత్ రెడ్డి – మలక్ పేట్
►అయిందాల కృష్ణ --  కార్వాన్ 
►సలావుద్దీన్ లోడి – చార్మినార్
►సి.హెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ - నాంపల్లి 
►నందకిషోర్ వ్యాస్ – గోషామహల్
►విజేయుడు – అలంపూర్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement