Challa Venkatram Reddy
-
సీఎం రేవంత్ రెడ్డితో భేటీకానున్న ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి
-
బరిలోకి బీఆర్ఎస్ ఫుల్ టీమ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫుల్‌టీమ్ రంగంలోకి దిగింది. పార్టీ అభ్యర్థులంతా ఖరారవడంతోపాటు బీఫారాల పంపిణీ మంగళ వారం పూర్తయింది. పెండింగ్‌లో ఉన్న గోషామహ ల్ నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నంద కిషోర్ వ్యాస్ బిలాల్, నాంపల్లి నుంచి సీహెచ్ ఆనంద్కుమార్గౌడ్లకు టికెట్లు ఖరారయ్యాయి. ఇక అలంపూర్ (ఎస్సీ) అభ్యర్థిగా గతంలో ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను మారుస్తూ.. ఆయన స్థానంలో కొత్తగా కోడెదూడ విజయుడును ఎంపిక చేశారు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని ఎనిమిది స్థానాల అభ్యర్థులకు, విజయుడుకు మంగళవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పార్టీ బీఫారాలను అందజేశారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, బీఫారాల జారీ పూర్తయిందని నేతలు ప్రకటించారు. చల్లా అనుచరుడికి చాన్స్.. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం తొలి జాబితాలోనే అలంపూర్ బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్నా.. స్థానిక నేతల్లో ఆయనపై వ్యతిరేకత వ్యక్తమైంది. దానికితోడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డితో ఉన్న విభేదాలు కూడా ప్రభావం చూపాయి. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తన అనుచరుడు ‘విజయుడు’కు టికెట్ కోసం ఒత్తిడి చేసిన ఎమ్మెల్సీ చల్లా చివరికి తన పంతం నెగ్గించుకున్నారు. ఎమ్మెల్సీ చల్లా మంగళవారం అలంపూర్ అభ్యర్థి విజయుడును వెంటబెట్టుకుని తొలుత ప్రగతిభవన్‌కు, తర్వాత తెలంగాణ భవన్‌కు వచ్చారు. తాజాగా బీఫారం అందుకున్న అభ్యర్థులు వీరే.. కేటీఆర్ చేతుల మీదుగా మంగళవారం బీ ఫారాలు అందుకున్న వారిలో సామ సుందర్‌రెడ్డి (యాకుత్‌పురా), అయిందాల కృష్ణయ్య (కార్వాన్), నందకిషోర్ వ్యాస్ బిలాల్ (గోషామహల్), ఇబ్రహీం లోడీ (చార్మినార్), ఎం.సీతారాంరెడ్డి (చాంద్రాయణ్‌గుట్ట), అలీ బఖ్రీ (బహదూర్‌పురా), తీగల అజిత్‌రెడ్డి (మలక్‌పేట), సీహెచ్ ఆనంద్‌గౌడ్ (నాంపల్లి), విజయుడు (అలంపూర్) ఉన్నారు. గోషామహల్ టికెట్ ఆశించిన ఆశిష్‌కుమార్ యాదవ్ మంగళవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని, నందకిషోర్‌తో కలసి పనిచేయాలని ఆశిష్‌ను కేటీఆర్ బుజ్జగించారు. 119 స్థానాల్లోనూ అభ్యర్థుల ఖరారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆగస్టు 21వ తేదీనే 115 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తూనే.. ఏడుగురికి మాత్రం నిరాకరించారు. నాలుగు చోట్ల పూర్తిగా కొత్తవారికి అవకాశమిచ్చారు. అప్పట్లో జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి అభ్యర్థుల ప్రకటనను పెండింగ్‌లో పెట్టారు. తర్వాత మల్కాజిగిరి అభ్యర్థిగా ప్రకటించిన మైనంపల్లి హన్మంతరావు పార్టీని వీడటంతో.. ఆ స్థానంలో మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి అవకాశమిచ్చారు. జనగామ నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్ నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిలకు టికెట్ లభించింది. తాజాగా గోషామహల్, నాంపల్లికి కూడా అభ్యర్థులను ప్రకటించారు. అలంపూర్ అభ్యర్థిని మార్చారు. -
ఎమ్మెల్యేకు షాక్.. అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి మార్పు..
సాక్షి, జోగులాంబ గద్వాల జిల్లా: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఓవైపు నామినేషన్లు, ప్రచారంతో రాష్ట్రంలో ఎన్నికల హడావిడీ నెలకొనగా.. మరోవైపు టికెట్ కేటాయించి బీఫామ్‌లు దక్కని అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా అలంపూర్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు షాక్ తగిలింది. నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిత్వంపై సీఎం కేసీఆర్ నిర్ణయం మార్చుకున్నారు. తొలుత అలంపూర్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను ప్రకటించిన కేసీఆర్.. ఇప్పటి వరకు ఆయనకు బీ-ఫామ్ ఇవ్వలేదు. మంగళవారం అనూహ్యంగా స్థానిక నేత విజయుడికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఫామ్ ఇచ్చారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల బరిలో నుంచి అబ్రహం తప్పుకున్నట్లే అయ్యింది. అబ్రహంను ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ మొదటి జాబితాలోనే సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే అబ్రహం అభ్యర్థిత్వంపై నియోజకవర్గంలో మొదట్నుంచీ వ్యతిరేకత వస్తోంది. దీనికితోడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వర్గం సైతం అభ్యంతరం తెలిపింది. అభ్యర్థిని తప్పనిసరిగా మార్చాల్సిందేనన్న డిమాండ్ పెరగడంతో అధిష్టానం పునరాలోచనలో పడింది. నామినేషన్ల స్వీకరణకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో చివరికి అలంపూర్ నుంచి మరో అభ్యర్థిని రంగంలోకి దింపేందుకే బీఆర్ఎస్ సిద్ధమైంది. చదవండి: అవినీతిని అంతం చేస్తాం.. ఇది మోదీ గ్యారంటీ అబ్రహం స్థానంలో చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజేయుడికి టికెట్ ఖాయమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ మంగళవారం రోజు మొత్తం తొమ్మిది మంది బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేశారు. వారిలో అలంపూర్ నుంచి విజేయుడు కూడా ఉన్నారు. దీంతో మొత్తం 119 నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బీ ఫారాల- పంపిణీ కార్యక్రమం పూర్తయింది. మంగళవారం బీ-ఫామ్‌లు అందుకున్నవారు.. ► ఎం సీతారాంరెడ్డి – చాంద్రాయణ గుట్ట ►సామా సుందర్ రెడ్డి – యాకత్ పురా ►ఇనాయత్ అలీబాక్రి -- బహదూర్‌పురా ►తీగల అజిత్ రెడ్డి – మలక్ పేట్ ►అయిందాల కృష్ణ -- కార్వాన్ ►సలావుద్దీన్ లోడి – చార్మినార్ ►సి.హెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ - నాంపల్లి ►నందకిషోర్ వ్యాస్ – గోషామహల్ ►విజేయుడు – అలంపూర్ -
ఎమ్మెల్యే హర్షవర్ధన్, ఎమ్మెల్సీ చల్లా వేధిస్తున్నారు! : చంద్రశేఖర్ వేగే
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి తనను వేధిస్తున్నారని, రాజకీయ పలుకుబడితో తనపై తప్పుడు కేసులు పెట్టి భయాందోళనలకు గురి చేస్తున్నారని గోల్డ్‌ఫిష్ అబోడ్ కంపెనీ ఎండీ చంద్రశేఖర్ వేగే అరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా తమపై పీడీ యాక్ట్ నమోదు చేయిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. తప్పుడు పత్రాలు, ఆరోపణలతో తనపై, తన కంపెనీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కోకాపేటలోని స్థలంపై గోల్డ్ ఫిష్ సంస్థకు, ఎమ్మెల్సీ చల్లాకు మధ్య కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా చల్లా చేసిన ఆరోపణలపై వివరణ ఇస్తూ గురువారం బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్‌లో చంద్రశేఖర్ వేగే విలేకరుల సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... ► కోకాపేటలోని సర్వే నంబరు 85లో 2.30 ఎకరాల స్థలంలో ప్రాజెక్ట్‌ను నిర్మించాలని కంపెనీ భావించింది. ఈ క్రమంలో కంపెనీ డైరెక్టర్ కాటం అశ్వంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన పెట్టుబడిదారుడిగా తన సమీప బంధువైన చల్లా వెంకట్రామిరెడ్డి ఆసక్తిగా ఉన్నారని చెప్పడంతో సంస్థ యాజమాన్యం అందుకు అంగీకరించింది. దీంతో కంపెనీ ప్రతినిధి వాసుదేవరెడ్డి, చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి సర్వే నంబరు–85లో ఉన్న 2.30 ఎకరాల వ్యవసాయ భూమిని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ హోల్డర్స్‌గా 2013 మార్చిలో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. ఆ తర్వాత ఈస్థలాన్ని ఎమ్మెల్సీ, ఇతరుల పేర్లపై సేల్‌డీడ్ పూర్తి చేశాం. ► నిబంధనల ప్రకారం 2013 మేలో చల్లా వెంకట్రామిరెడ్డి ఈ స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు డెవలప్మెంట్ కమ్ జనరల్ పవరాఫ్ అటార్నీ చేస్తూ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. ఇందులో 4 బేస్మెంట్లు గ్రౌండ్ 38 అంతస్తులలో హైరైజ్ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించాం. ► ఈ మేరకు ప్రొవిజన్ నిర్మాణ అనుమతుల కోసం 2014 జూన్‌లో దరఖాస్తు చేసుకోగా.. డిసెంబర్ 12 నాటికి భూ మార్పిడి, హెచ్ఎండీఏ నుంచి నిర్మాణ అనుమతులతో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ, ఫైర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పర్యావరణ అనుమతులన్నీ లభించాయి. అయితే 2014లో రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రతికూల పరిస్థితులు సద్దుమణిగే వరకూ కంపెనీ, ఎమ్మెల్సీ ఇరువురూ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను నెమ్మదించాలని నిర్ణయించుకున్నాం. అప్పటికే తొలుత పెట్టిన పెట్టుబడులకు అదనంగా రూ.12 కోట్లు ఖర్చు చేశాం. ► హెచ్ఎండీఏ నుంచి తుది అనుమతులు, కంపెనీ బిల్టప్ ఏరియా వాటాలను నిర్ధారించే సప్లిమెంటరీ అగ్రిమెంట్‌పై ఎమ్మెల్సీ సంతకాలు చేయకుండా తాత్సారం చేశారు. దీంతో ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు కరోనా మహమ్మారితో నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో ప్రాజెక్ట్ వ్యవహారం గందరగోళంలో పడిపోయింది. ప్రాథమిక ఒప్పందంలో లేని అంశాలను లేవనెత్తుతూ ప్రాజెక్ట్‌కు అడ్డుపడుతుండటంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు కంపెనీ కొత్త ఒప్పందాన్ని ఎమ్మెల్సీ ముందు ఉంచింది. ప్రాజెక్ట్ కొనసాగించడం ఎమ్మెల్సీకి ఇష్టంలేని పక్షంలో వారు పెట్టిన పెట్టుబడికి పది రెట్లు అంటే రూ.40 కోట్లు చెల్లిస్తామని, ఆ తర్వాత ఒప్పందం నుంచి వైదొలిగితే ఆగిపోయిన ప్రాజెక్ట్‌ను కంపెనీ టేకోవర్ చేస్తుందని వివరించాం. ► అయితే ఈ ఒప్పందాన్ని అంగీకరించని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి తనకున్న రాజకీయ పలుకుబడితో గోల్డ్‌ఫిష్ కంపెనీ యాజమాన్యం, ఉద్యోగులపై కేసులు పెట్టించడం మొదలుపెట్టారు. దీంతో కంపెనీ ఎండీ అయిన నేను 21 రోజుల పాటు జైలులో గడపడమే కాకుండా పలు ప్రభుత్వ అధికారులు, నాయకుల నుంచి ప్రాజెక్ట్ నుంచి వైదొలగాలని తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజాలను ఎదుర్కోలేక చల్లా వెంకట్రామి రెడ్డి తమను మోసగాళ్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వీరి అరాచకాలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని ఆయన పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి భూకబ్జా?.. కోకాపేట భూమి నా సొంతం
అలంపూర్: హైదరాబాద్‌లోని కోకాపేట భూ వివాదంపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి స్పందించారు. కోకాపేటలో ఉన్న భూమి భూమి తన సొంతం అని తెలిపారు. మంగళవారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం స్థానిక టూరిజం హోటల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి భూకబ్జా చేసినట్లు కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయన్నారు. కోకాపేటలోని సర్వే నం.85లో 2.30 ఎకరాల భూమి 2013 సంవత్సరంలో కొనుగోలు చేశామన్నారు. తమ కుటుంబంలోని ముగ్గురు పేరిట ఉన్న ఈ భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయన్నారు. తాము కొనుగోలు చేసిన తర్వాతే గోల్డ్ ఫిష్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ వేగేతో భూమి అభివృద్ధి చేయడానికి అగ్రిమెంట్ సంతకం చేసినట్లు వివరించారు. అయితే సదరు సంస్థ ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతోపాటు అందుకు సంబంధించి కనీసం జీహెచ్ఎంసీని ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంతోనే అగ్రిమెంట్ రద్దు చేయాలని 2020లో కోర్టుకు వెళ్లామన్నారు. తమ స్థలంలో ఉన్న కూలీలను వెళ్లగొట్టినట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదని, ఈ స్థలానికి పక్క సైట్లో పనులు జరుగుతుండటంతో కూలీలు అక్కడ ఉన్నారన్నారు. పక్క సైట్లో పనులు జరుగుతుండటంతో హద్దులు చూసుకోవాలని తన తమ్ముడిని పంపించానని చెప్పారు. భూమికి ఫెన్సింగ్ వేస్తుంటే గోల్డ్ ఫిష్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారని వివరించారు. గోల్డ్‌ఫిష్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ వేగేపై గత 15 ఏళ్లలో 12 క్రిమినల్, 9 సివిల్ కేసులు నమోదయ్యాయని, 2021 ఫిబ్రవరి 25న పీడీ యాక్టు సైతం నమోదవగా.. అదే సంవత్సరంలో తెలంగాణ పోలీసులు అతన్ని కేరళలో అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. వీటితోపాటు ప్రస్తుతం ఉన్న సర్వే నం.85కు పక్కనే ఈ సంస్థ డెవలప్ చేస్తున్న స్థలంలో రెండు ఇళ్లు కొనుగోలు చేశామన్నారు. ఇందుకు సంబంధించి మొత్తం డబ్బులు చెల్లించి ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఆరోపించారు. దీనిపై కూడా కోర్టుకు వెళ్లామని చెప్పారు. హీరో ప్రభాస్ బంధువు సత్యనారాయణరాజు ఒక ఇల్లు, సంజయ్ కమతం అనే వ్యక్తి రెండు ఇళ్లు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించిన రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో కోర్టుకు వెళ్లారన్నారు. 2017లో తన తమ్ముడు వాళ్ల నాన్న కలిసి రెండు విల్లాలకు అగ్రిమెంట్ చేసుకొని డబ్బులు చెల్లించినా రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో కోర్టుకు వెళ్లి ఇంజక్షన్ తెచ్చుకున్నారన్నారు. ఎంతో మంది దగ్గర భూములు డెవలప్మెంట్ చేస్తామని తీసుకొని తర్వాత చీటింగ్ చేస్తున్నారని ఆరోపించారు. నేను కోర్టుకు వెళ్లడంతో హైదరబాద్‌కు చెందిన ఒక ఎమ్మెల్యేతో కలిసి కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి వద్దకు మధ్యవర్తిత్వం కోసం వెళ్లారన్నారు. కానీ, హర్షవర్ధన్‌రెడ్డి అదే చంద్రశేఖర్ వేగేకు 2016లో ఇల్లు కొనడానికి డబ్బులు ఇస్తే ఇప్పటి వరకు ఎలాంటి ఇల్లు, డబ్బులు ఇవ్వలేదని, కాబట్టి మధ్యవర్తిగా రాలేనని ఆయన చెప్పారన్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కాబట్టి ఇలాంటి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డారని, దీనిపై కొన్ని మీడియా సంస్థలు నిజాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలు ప్రసారం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీఆర్ఎస్కు షాక్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: నార్సింగ్‌లో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓ స్థలంపై కన్నేశారు. అక్రమంగా భూమిని కబ్జా చేసే ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారిపై నార్సింగిలో కేసు నమోదు అయ్యింది. ఈ ఘటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కోకాపేట ల్యాండ్స్.. వివరాల ప్రకారం.. నార్సింగిలో భూవివాదంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. కోకాపేటలోని సర్వే నంబరు 85లో 2 ఎకరాల 30 గుంటల భూమిపై పెట్టుబడిదారులు, డెవలపర్ మధ్య వివాదం నెలకొంది. దీన్ని పరిష్కరించుకోకుండా డెవలపర్ నిర్మించిన తాత్కాలిక గుడిసెల్లో నివాసముంటున్న కూలీలను ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరులు ఖాళీ చేయించారని డెవలపర్ ప్రతినిధి గుండు శ్రవణ్ గురువారం రాత్రి ఫిర్యాదు చేయగా.. అదేరోజు పోలీసులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోకాపేటలోని సర్వేనంబరు 85లోని స్థలాన్ని గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ కొద్ది నెలల నుంచి అభివృద్ధి చేస్తోంది. అక్రమంగా తరలింపు.. అయితే, గోల్డ్‌ఫిష్ సంస్థతో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్‌రెడ్డికి కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతున్నట్టు గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ ప్రతినిధి గుండు శ్రవణ్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం ఉదయం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి దాదాపు 60 మందికిపైగా కోకాపేటలోని స్థలానికి వచ్చారు. గుడిసెల్లో నివాసముంటున్న కూలీలను ఖాళీ చేయాలంటూ దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్సీ అనుచరులు కూలీల తట్టా, బుట్టా బయటకు విసిరేయడమే కాకుండా గర్భిణులపై దురుసుగా ప్రవర్తించారు. ఈ లోపు సమాచారం అందుకున్న నేను అక్కడికి వెళ్లగా.. నాపైనా దాడి చేశారు. డీసీఎం వాహనాలను తీసుకువచ్చి కూలీలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. కాంటినెంటల్ ఆసుపత్రి వద్ద కూలీలను వదిలేసి మరోసారి అక్కడికి వెళితే అంతేనంటూ హెచ్చరించి వెళ్లిపోయారు అని తెలిపారు. దీంతో, తాము పోలీసులను ఆశ్రయించినట్టు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలతో పాటుగా మరో ఆరుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: మాజీ మంత్రి హరీశ్వర్ రెడ్డి కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం -
‘ప్రజాసంగ్రామ యాత్ర’ .. బీజేపీలోకి చల్లా వెంకట్రామ్రెడ్డి!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజాసంగ్రామ యాత్ర’ సందర్భంగా ఇతర పార్టీల నుంచి నేతల చేరికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామ్రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు, మూడు దఫాలుగా జిల్లా ముఖ్యనేతలతోపాటు సంజయ్ తరఫు ప్రతినిధులు జరిపిన చర్చలకు వెంకట్రామ్రెడ్డి సానుకూలత వ్యక్తం చేశారని చెబుతున్నారు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు (కుమార్తె కుమారుడు) వెంకట్రామ్కు ఆలంపూర్, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో మంచిపట్టు ఉంది. ఇప్పుడు ఆయన వనపర్తి నుంచి పోటీచేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. వెంకట్రామ్తోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మరికొందరు నేతలు కూడా సంజయ్ పాదయాత్ర ముగిసేలోగా పార్టీ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో లేదా మే 14న జరిగే ముగింపు సమావేశానికి అమిత్ షా వస్తున్న నేపథ్యంలో బీజేపీలో చేరే అవకాశాలున్నట్టు సమాచారం.