స్థలానికి సంబంధించిన పత్రాలను మీడియాకు చూపుతున్న ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి
అలంపూర్: హైదరాబాద్‌లోని కోకాపేట భూ వివాదంపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి స్పందించారు. కోకాపేటలో ఉన్న భూమి భూమి తన సొంతం అని తెలిపారు. మంగళవారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం స్థానిక టూరిజం హోటల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి భూకబ్జా చేసినట్లు కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయన్నారు. కోకాపేటలోని సర్వే నం.85లో 2.30 ఎకరాల భూమి 2013 సంవత్సరంలో కొనుగోలు చేశామన్నారు. తమ కుటుంబంలోని ముగ్గురు పేరిట ఉన్న ఈ భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయన్నారు.
తాము కొనుగోలు చేసిన తర్వాతే గోల్డ్ ఫిష్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ వేగేతో భూమి అభివృద్ధి చేయడానికి అగ్రిమెంట్ సంతకం చేసినట్లు వివరించారు. అయితే సదరు సంస్థ ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతోపాటు అందుకు సంబంధించి కనీసం జీహెచ్‌ఎంసీని ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంతోనే అగ్రిమెంట్ రద్దు చేయాలని 2020లో కోర్టుకు వెళ్లామన్నారు. తమ స్థలంలో ఉన్న కూలీలను వెళ్లగొట్టినట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదని, ఈ స్థలానికి పక్క సైట్‌లో పనులు జరుగుతుండటంతో కూలీలు అక్కడ ఉన్నారన్నారు. పక్క సైట్‌లో పనులు జరుగుతుండటంతో హద్దులు చూసుకోవాలని తన తమ్ముడిని పంపించానని చెప్పారు. భూమికి ఫెన్సింగ్ వేస్తుంటే గోల్డ్ ఫిష్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారని వివరించారు.
గోల్డ్‌ఫిష్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ వేగేపై గత 15 ఏళ్లలో 12 క్రిమినల్, 9 సివిల్ కేసులు నమోదయ్యాయని, 2021 ఫిబ్రవరి 25న పీడీ యాక్టు సైతం నమోదవగా.. అదే సంవత్సరంలో తెలంగాణ పోలీసులు అతన్ని కేరళలో అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. వీటితోపాటు ప్రస్తుతం ఉన్న సర్వే నం.85కు పక్కనే ఈ సంస్థ డెవలప్ చేస్తున్న స్థలంలో రెండు ఇళ్లు కొనుగోలు చేశామన్నారు. ఇందుకు సంబంధించి మొత్తం డబ్బులు చెల్లించి ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఆరోపించారు. దీనిపై కూడా కోర్టుకు వెళ్లామని చెప్పారు.
హీరో ప్రభాస్ బంధువు సత్యనారాయణరాజు ఒక ఇల్లు, సంజయ్ కమతం అనే వ్యక్తి రెండు ఇళ్లు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించిన రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో కోర్టుకు వెళ్లారన్నారు. 2017లో తన తమ్ముడు వాళ్ల నాన్న కలిసి రెండు విల్లాలకు అగ్రిమెంట్ చేసుకొని డబ్బులు చెల్లించినా రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో కోర్టుకు వెళ్లి ఇంజక్షన్ తెచ్చుకున్నారన్నారు. ఎంతో మంది దగ్గర భూములు డెవలప్‌మెంట్ చేస్తామని తీసుకొని తర్వాత చీటింగ్ చేస్తున్నారని ఆరోపించారు. నేను కోర్టుకు వెళ్లడంతో హైదరబాద్‌కు చెందిన ఒక ఎమ్మెల్యేతో కలిసి కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి వద్దకు మధ్యవర్తిత్వం కోసం వెళ్లారన్నారు.
కానీ, హర్షవర్ధన్‌రెడ్డి అదే చంద్రశేఖర్ వేగేకు 2016లో ఇల్లు కొనడానికి డబ్బులు ఇస్తే ఇప్పటి వరకు ఎలాంటి ఇల్లు, డబ్బులు ఇవ్వలేదని, కాబట్టి మధ్యవర్తిగా రాలేనని ఆయన చెప్పారన్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కాబట్టి ఇలాంటి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డారని, దీనిపై కొన్ని మీడియా సంస్థలు నిజాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలు ప్రసారం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment