సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఫుల్‌టీమ్ రంగంలోకి దిగింది. పార్టీ అభ్యర్థులంతా ఖరారవడంతోపాటు బీఫారాల పంపిణీ మంగళ వారం పూర్తయింది. పెండింగ్‌లో ఉన్న గోషామహ ల్ నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి నంద కిషోర్ వ్యాస్ బిలాల్, నాంపల్లి నుంచి సీహెచ్ ఆనంద్‌కుమార్‌గౌడ్‌లకు టికెట్లు ఖరారయ్యాయి. ఇక అలంపూర్ (ఎస్సీ) అభ్యర్థిగా గతంలో ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను మారుస్తూ.. ఆయన స్థానంలో కొత్తగా కోడెదూడ విజయుడును ఎంపిక చేశారు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని ఎనిమిది స్థానాల అభ్యర్థులకు, విజయుడుకు మంగళవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పార్టీ బీఫారాలను అందజేశారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, బీఫారాల జారీ పూర్తయిందని నేతలు ప్రకటించారు.
చల్లా అనుచరుడికి చాన్స్..
సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం తొలి జాబితాలోనే అలంపూర్ బీఆర్‌ఎస్ టికెట్ దక్కించుకున్నా.. స్థానిక నేతల్లో ఆయనపై వ్యతిరేకత వ్యక్తమైంది. దానికితోడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డితో ఉన్న విభేదాలు కూడా ప్రభావం చూపాయి. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తన అనుచరుడు ‘విజయుడు’కు టికెట్ కోసం ఒత్తిడి చేసిన ఎమ్మెల్సీ చల్లా చివరికి తన పంతం నెగ్గించుకున్నారు. ఎమ్మెల్సీ చల్లా మంగళవారం అలంపూర్ అభ్యర్థి విజయుడును వెంటబెట్టుకుని తొలుత ప్రగతిభవన్‌కు, తర్వాత తెలంగాణ భవన్‌కు వచ్చారు.
తాజాగా బీఫారం అందుకున్న అభ్యర్థులు వీరే..
కేటీఆర్ చేతుల మీదుగా మంగళవారం బీ ఫారాలు అందుకున్న వారిలో సామ సుందర్‌రెడ్డి (యాకుత్‌పురా), అయిందాల కృష్ణయ్య (కార్వాన్), నందకిషోర్ వ్యాస్ బిలాల్ (గోషామహల్), ఇబ్రహీం లోడీ (చార్మినార్), ఎం.సీతారాంరెడ్డి (చాంద్రాయణ్‌గుట్ట), అలీ బఖ్రీ (బహదూర్‌పురా), తీగల అజిత్‌రెడ్డి (మలక్‌పేట), సీహెచ్ ఆనంద్‌గౌడ్ (నాంపల్లి), విజయుడు (అలంపూర్) ఉన్నారు. గోషామహల్ టికెట్ ఆశించిన ఆశిష్‌కుమార్ యాదవ్ మంగళవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని, నందకిషోర్‌తో కలసి పనిచేయాలని ఆశిష్‌ను కేటీఆర్ బుజ్జగించారు.
119 స్థానాల్లోనూ అభ్యర్థుల ఖరారు
బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆగస్టు 21వ తేదీనే 115 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తూనే.. ఏడుగురికి మాత్రం నిరాకరించారు. నాలుగు చోట్ల పూర్తిగా కొత్తవారికి అవకాశమిచ్చారు. అప్పట్లో జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి అభ్యర్థుల ప్రకటనను పెండింగ్‌లో పెట్టారు. తర్వాత మల్కాజిగిరి అభ్యర్థిగా ప్రకటించిన మైనంపల్లి హన్మంతరావు పార్టీని వీడటంతో.. ఆ స్థానంలో మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి అవకాశమిచ్చారు. జనగామ నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్ నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిలకు టికెట్ లభించింది. తాజాగా గోషామహల్, నాంపల్లికి కూడా అభ్యర్థులను ప్రకటించారు. అలంపూర్ అభ్యర్థిని మార్చారు.
Comments
Please login to add a commentAdd a comment