Alampur Assembly Constituency
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అలంపూర్( జోగులాంబ గద్వాల) బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విజయుడి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ బీఎస్పీ అభ్యర్థి ఆర్.ప్రసన్నకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. ప్రసన్న కుమార్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామ పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ పదవికి విజయుడు రాజీనామా చేయకుండానే నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని పేర్కొన్నారు. తన వృత్తికి సంబంధించిన వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదన్నారు. రాజీనామా లేఖను, దానికి లభించిన ఆమోదం తదితర ఆధారాలు సమర్పించలేదన్నారు. నిబంధనల ప్రకారం నామినేషన్‌కు మూడు నెలల ముందు రాజీనామా సమర్పించాల్సి ఉందన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి బీఫామ్ అందుకున్న విజయుడు(ఫైల్ ఫొటో) వాదనలు విన్న న్యాయమూర్తి ఎన్నికపై వివరణ ఇవ్వాలంటూ విజయుడికి నోటీసులు జారీ చేస్తూ విచారణను ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా వేశారు. ఎన్నికలకు ముందు సైతం ప్రసన్నకుమార్ ఇదే అంశంపై పిటిషన్ దాఖలు చేసినా, ఎన్నికల నోటిఫికేషన్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించిన విషయం విదితమే. విజయుడు బీఆర్ఎస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి.. 2023 శాసనసభ ఎన్నికల్లో అలంపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్‌పై 30,573 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. -
కాంగ్రెస్‌లో చేరిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం..
సాక్షి, జోగులాంబ గద్వాల జిల్లా: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుతుండటంతో.. గెలుపే లక్ష్యంగా అన్నీ పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఎన్నికల పోరుకు మరో ఆరు రోజులే సమయమున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. అలంపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం బీఆర్ఎస్ను వీడి. కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్రహంను మరోసారి బీఆర్ఎస్ తరపున అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్.. అనూహ్యంగా అభ్యర్థిని మార్చారు. అబ్రహం స్థానంలో చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజేయుడికి టికెట్ ఖాయం చేసింది పార్టీ అధిష్టానం. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనను కాదని వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో అబ్రహం బీర్ఎస్ పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు. -
బరిలోకి బీఆర్ఎస్ ఫుల్ టీమ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫుల్‌టీమ్ రంగంలోకి దిగింది. పార్టీ అభ్యర్థులంతా ఖరారవడంతోపాటు బీఫారాల పంపిణీ మంగళ వారం పూర్తయింది. పెండింగ్‌లో ఉన్న గోషామహ ల్ నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నంద కిషోర్ వ్యాస్ బిలాల్, నాంపల్లి నుంచి సీహెచ్ ఆనంద్కుమార్గౌడ్లకు టికెట్లు ఖరారయ్యాయి. ఇక అలంపూర్ (ఎస్సీ) అభ్యర్థిగా గతంలో ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను మారుస్తూ.. ఆయన స్థానంలో కొత్తగా కోడెదూడ విజయుడును ఎంపిక చేశారు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని ఎనిమిది స్థానాల అభ్యర్థులకు, విజయుడుకు మంగళవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పార్టీ బీఫారాలను అందజేశారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, బీఫారాల జారీ పూర్తయిందని నేతలు ప్రకటించారు. చల్లా అనుచరుడికి చాన్స్.. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం తొలి జాబితాలోనే అలంపూర్ బీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్నా.. స్థానిక నేతల్లో ఆయనపై వ్యతిరేకత వ్యక్తమైంది. దానికితోడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డితో ఉన్న విభేదాలు కూడా ప్రభావం చూపాయి. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తన అనుచరుడు ‘విజయుడు’కు టికెట్ కోసం ఒత్తిడి చేసిన ఎమ్మెల్సీ చల్లా చివరికి తన పంతం నెగ్గించుకున్నారు. ఎమ్మెల్సీ చల్లా మంగళవారం అలంపూర్ అభ్యర్థి విజయుడును వెంటబెట్టుకుని తొలుత ప్రగతిభవన్‌కు, తర్వాత తెలంగాణ భవన్‌కు వచ్చారు. తాజాగా బీఫారం అందుకున్న అభ్యర్థులు వీరే.. కేటీఆర్ చేతుల మీదుగా మంగళవారం బీ ఫారాలు అందుకున్న వారిలో సామ సుందర్‌రెడ్డి (యాకుత్‌పురా), అయిందాల కృష్ణయ్య (కార్వాన్), నందకిషోర్ వ్యాస్ బిలాల్ (గోషామహల్), ఇబ్రహీం లోడీ (చార్మినార్), ఎం.సీతారాంరెడ్డి (చాంద్రాయణ్‌గుట్ట), అలీ బఖ్రీ (బహదూర్‌పురా), తీగల అజిత్‌రెడ్డి (మలక్‌పేట), సీహెచ్ ఆనంద్‌గౌడ్ (నాంపల్లి), విజయుడు (అలంపూర్) ఉన్నారు. గోషామహల్ టికెట్ ఆశించిన ఆశిష్‌కుమార్ యాదవ్ మంగళవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని, నందకిషోర్‌తో కలసి పనిచేయాలని ఆశిష్‌ను కేటీఆర్ బుజ్జగించారు. 119 స్థానాల్లోనూ అభ్యర్థుల ఖరారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆగస్టు 21వ తేదీనే 115 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తూనే.. ఏడుగురికి మాత్రం నిరాకరించారు. నాలుగు చోట్ల పూర్తిగా కొత్తవారికి అవకాశమిచ్చారు. అప్పట్లో జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి అభ్యర్థుల ప్రకటనను పెండింగ్‌లో పెట్టారు. తర్వాత మల్కాజిగిరి అభ్యర్థిగా ప్రకటించిన మైనంపల్లి హన్మంతరావు పార్టీని వీడటంతో.. ఆ స్థానంలో మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి అవకాశమిచ్చారు. జనగామ నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్ నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిలకు టికెట్ లభించింది. తాజాగా గోషామహల్, నాంపల్లికి కూడా అభ్యర్థులను ప్రకటించారు. అలంపూర్ అభ్యర్థిని మార్చారు. -
అలంపూర్, పాత బస్తీ మినహా!.. మిగిలిన అందరికీ బీఫాంలు ఇచ్చేసిన బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థులందరికీ బీఫాంల పంపిణీ పూర్తి కావస్తున్నా.. హైదరాబాద్ పాతబస్తీలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు అలంపూర్ నియోజకవర్గం అభ్యర్థికి బీఫాంలు ఇప్పటివరకు అందించలేదు. రెండు నెలల కిందటే అభ్యర్థులను స్వయంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించి, ఈ నెల 15వ తేదీ నుంచి బీఫాంల పంపిణీ ప్రారంభించారు. అలంపూర్‌లో చక్రం తిప్పుతున్న ఎమ్మెల్సీ... మరోవైపు అలంపూర్ (ఎస్సీ) నియోజకవర్గం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం పేరును ఆగస్టు 21న ప్రకటించిన జాబితాలో ఖరారు చేసినా నేటికీ బీఫాం ఇవ్వలేదు. గతంలో టీడీపీ నుంచి ఆలంపూర్ ఎమ్మెల్యేగా పనిచేసిన అబ్రహం 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తిరిగి ఆయనకే మరోమారు పోటీ అవకాశం ఇస్తూ ఆలంపూర్ అభ్యర్థిగా పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కేటీఆర్‌ను తరచూ ప్రగతిభవన్, తెలంగాణలో భవన్లో కలిసి బీ ఫారం కోసం విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే అలంపూర్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న చల్లా వెంకట్రామ్రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తన అనుచరుడు విజయుడుకి టికెట్ ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్సీ పల్లా ప్రతిపాదించినట్లు తెలిసింది. అబ్రహంకు టికెట్ ఇస్తే పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఇతర క్షేత్ర స్థాయి నాయకులు పార్టీని వీడుతారని ఎమ్మెల్సీ చల్లా పార్టీ అధిష్టానానికి చెప్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అబ్రహం మాత్రం పార్టీ కేడర్ తన వెంటే ఉందని ఇటీవల కేటీఆర్‌కు విన్నవించుకున్నారు. మొత్తంగా ఒకటి రెండు రోజుల్లో అలంపూర్ టికెట్ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ తొమ్మిది సీట్లు మినహా.. 119 అసెంబ్లీ స్థానాలకు గానూ కేసీఆర్ సహా 110 మంది అభ్యర్థులు బీ ఫాంలు కూడా అందుకున్నారు. నర్సాపూర్ అభ్యర్థి పేరుపై కూడా రెండు నెలలుగా కొనసాగిన సస్పెన్స్‌కు తెరదించుతూ మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి బీ ఫాం అందజేశారు. పాతబస్తీలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను నాంపల్లి, గోషామహ ల్ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. తీగల అజిత్‌రెడ్డి (మలక్‌పేట), అయిందాల కృష్ణ (కార్వాన్), ఇబ్రహీంలోడీ (చార్మినార్), ఎం.సీతారాంరెడ్డి (చాంద్రాయణగుట్ట), సామ సుందర్‌రెడ్డి (యాకుత్‌పురా), అలీ బాఖ్రీ (బహదూర్‌పురా) కు టికెట్లు ఖరారు చేసినా బీ ఫాంలు జారీ చేయలేదు. ఇక నాంపల్లి నుంచి ఆనంద్‌గౌడ్, గోషామహల్ నుంచి నందకిషోర్ వ్యాస్ పేర్లు ఖరారైనట్లు ప్రచారం జరుగుతున్నా పార్టీ నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేసి బీజేపీ టికెట్ ఇచి్చన నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ ప్రతివ్యూహానికి పదును పెడుతోంది. చదవండి: రాజగోపాల్ బాటలో డీకే అరుణ కూడా? -
అలంపూర్ (ఎస్సి) నియోజకవర్గానికి పరిపాలించే పాలకుడు ఎవరు?
అలంపూర్ (ఎస్సి) నియోజకవర్గం అలంపూర్ రిజర్వుడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన మల్లెపోగు అబ్రహం గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ ఐ పక్షాన ఒకసారి గెలిచిన అబ్రహం 2018లో టిఆర్ఎస్లో చేరి పోటీచేసి విజయం సాదించారు. ఇక్కడ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ ఐ అభ్యర్ది సంపత్‌కుమార్ ఓటమి చెందారు. తెలంగాణ అసెంబ్లీ నుంచి సంపత్‌ను అనుచిత ప్రవర్తన పేరుతో బహిష్కరించడం వివాదం అయింది. ఆ సానుభూతి కూడా ఆయనకు పనిచేయలేదు. అబ్రహం 44670 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. అబ్రహంకు 102105 ఓట్లు రాగా, సంపత్ కుమార్‌కు 57426 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎస్.ఎప్.బి తరపున పోటీచేసిన హరిజన అబ్రహంకు 6800 ఓట్లు వచ్చాయి. శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అలంపూర్ నియోజకవర్గం రిజర్వుడు కేటగిరిలోకి వెళ్ళింది. ఆ తర్వాత రెండుసార్లు కాంగ్రెస్ ఐ పార్టీ, ఒకసారి టిఆర్ఎస్ గెలిచాయి. 2014లో కాంగ్రెస్ ఐ అభ్యర్ధి సంపత్ కుమార్, సిటింగ్ ఎమ్మెల్యే వి.ఎమ్.అబ్రహం ను 6730 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు.అబ్రహం కాంగ్రెస్ ఐ నుంచి టిడిపిలోకి వెళ్లి పోటీచేశారు. ఇక్కడ 2014లో టిఆర్ఎస్ తరపున పోటీచేసిన మాజీ ఎమ్.పి మందా జగన్నాధం కుమారుడు శ్రీనాద్ ఓడిపోయారు. శ్రీనాద్కు 38136 ఓట్లు వచ్చాయి.కాగా 2014లో నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజక వర్గానికి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన మందా జగన్నాధం కూడా ఓడిపోవడం విశేషం. అలంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఎనిమిదిసార్లు, భారతీయ జనతాపార్టీ మూడుసార్లు, టిడిపి రెండుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి, జనతా ఒకసారి గెలిచాయి. ఒక ఇండిపెండెంటు కూడా నెగ్గారు. బిజెపి నేత రావుల రవీంద్రనాధరెడ్డి ఇక్కడ మూడుసార్లు గెలిచారు. రవీంద్రనాద్ రెడ్డి తదుపరి కాంగ్రెస్ ఐలో చేరినా, టిక్కెట్ రాకపోవడంతో తిరుగుబాటు అభ్యర్ధిగా దేవరకద్రలో పోటీచేసి ఓడిపోయారు. అలంపూర్‌లో రెండుసార్లు గెలిచిన టి. చంధ్రశేఖర్ రెడ్డి, ఒకసారి గెలిచిన రజనీబాబులు సోదరులు. అలాగే రెండుసార్లు శాసనసభకు, మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన లక్ష్మీకాంతమ్మ కూడా వీరికి సోదరి అవుతారు. 1952లో ఇక్కడ గెలిచిన నాగన్న కల్వకుర్తి, అచ్చంపేట, షాద్‌నగర్‌లలో కలిపి నాలుగుసార్లు గెలిచారు. ఇక్కడ రెండుసార్లు గెలిచిన పి. పుల్లారెడ్డి, గద్వాలలో కూడా మరోసారి గెలిచారు. 2004లో గెలిచిన చల్లా వెంకట్రామిరెడ్డి, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి మనుమడు అవుతారు. ఈయన తండ్రి రాంభూపాల్‌రెడ్డి మూడుసార్లు చట్టసభకు ఎన్నికయ్యారు. కాగా అలంపూర్ రిజర్వు కావడానికి ముందు తొమ్మిదిసార్లు రెడ్లు, నాలుగు సార్లు కమ్మ, ఒకసారి ఇతరులు ఎన్నికయ్యారు. అలంపూర్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..