సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అమలవుతున్న సబ్‌ప్లాన్‌ను బీసీలకు కూడా వర్తింపజేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తాము అధికారంలోకి వస్తే బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వనుంది. ఈ సబ్‌ప్లాన్ కింద ప్రత్యేకంగా నిధులను కేటాయించి అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా ఈ నిధులను ఖర్చు చేయించడం ద్వారా రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని వివరించనుంది.
ఈ నెల 10వ తేదీన కామారెడ్డిలో జరగనున్న ‘బీసీ గర్జన’సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించే బీసీ డిక్లరేషన్‌లో సబ్‌ప్లాన్‌ను పొందుపరచాలని నిర్ణయించింది. దీనితో పాటు బీసీ వర్గాల గణన చేపడతామని కూడా హామీ ఇవ్వనుంది. ఈ రెండు ప్రధాన హామీల ద్వారా రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ వర్గాలకు చెందిన ఓటర్లను ఆకట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ఇదే వ్యూహంలో భాగంగా బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేస్తామని కూడా ప్రకటించనుంది. ప్రస్తుతం బీసీ విద్యార్థులకు ర్యాంకుల వారీగా ఫీజును ప్రభుత్వం చెల్లిస్తోంది. అలా కాకుండా డిగ్రీ నుంచి పై స్థాయిలో ఉండే ఏ కోర్సులో అడ్మిషన్ పొందిన బీసీ విద్యార్థికైనా పూర్తి ఫీజు చెల్లిస్తామని హామీ ఇవ్వనుంది.
ఎంబీసీ కార్పొరేషన్‌కు ప్రత్యేక నిధులు
బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే బీసీ బంధు పేరుతో అమలు చేస్తున్న రూ.లక్ష నగదు సాయం పథకానికి కౌంటర్‌గా బీసీ డిక్లరేషన్ సభ వేదికగానే కొత్త పథకాన్ని ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. అయితే నగదు మొత్తాన్ని పెంచి ఇవ్వాలా? నగదు కాకుండా బీసీల అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రత్యేకంగా మరో పథకాన్ని రూపొందించాలా? అన్న దానిపై టీపీసీసీ నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిందని, ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని కామారెడ్డి సభలో సిద్ధరామయ్య ప్రకటిస్తారని చెబుతున్నారు.
దీంతో పాటు కుల కార్పొరేషన్ల ఏర్పాటు, వాటికి నిధుల కేటాయింపు, అత్యంత వెనుకబడిన వర్గాల (ఎంబీసీ) కార్పొరేషన్‌కు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు లాంటివి కూడా ప్రకటించనుంది. బీసీలతో పాటు మైనారీ్టల కోసం కూడా ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించగా, ఈనెల 9న ఆ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నట్టు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి.
నేటి నుంచి రేవంత్ రాష్ట్ర పర్యటన
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. హెలికాప్టర్‌లో ప్రయాణించడం ద్వారా రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. 7వ తేదీన ఆలంపూర్ జోగుళాంబ దేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభతో ప్రచారం ప్రారంభం కానుంది. అదే రోజు గద్వాల, మక్తల్ నియోజకవర్గాల్లోనూ రేవంత్ పర్యటించనున్నారు.
ఈ నెల 8వ తేదీన ఖానాపూర్, ఆదిలాబాద్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో, 9వ తేదీన పాలకుర్తిలో, హైదరాబాద్‌లో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించి సికింద్రాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.10వ తేదీన కామారెడ్డిలో జరిగే బీసీ గర్జన సభకు హాజరవుతారు. అదే రోజున కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. హైదరాబాద్‌లో మైనార్టీ ముఖ్యులతో డిన్నర్ కార్యక్రమానికి హాజరవుతారు. ఇక ఈనెల 11వ తేదీన బెల్లంపల్లి, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాల్లో పర్యటిస్తారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment