సాక్షి, కామారెడ్డి: ‘ఓటుకు రూ.10 వేల చొప్పున రూ.200 కోట్లు ఖర్చుచేసి రెండు లక్షల ఓట్లు కొని, రూ.2 వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టాలని సీఎం కేసీఆర్ చూస్తున్నాడు. మీ అండతో భూములు మింగే అనకొండల భరతం పడతా. తెలంగాణను దోచుకున్న కేసీఆర్‌ను ఎన్నికల్లో ఓడించాలి..’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు, రాజంపేట మండల కేంద్రాల్లో నిర్వహించిన రోడ్ షోల్లో ఆయన మాట్లాడారు.
‘గజ్వేల్‌లో భూములను కొల్లగొట్టి అక్కడి రైతులను రోడ్డు పాలు జేసిండ్రు. ఇప్పుడు వాళ్ల కన్ను కామారెడ్డి మీద పడ్డది. పచ్చని పంటలు పండే భూములను కొల్లగొట్టేందుకే వస్తుండ్రు. పాము పాలుపోసి పెంచినోళ్లను కూడా వదలదు. అందుకే మీ భూములను కొల్లగొట్టడానికి వస్తున్న కేసీఆర్‌ను ఓటుతో బండకేసి కొట్టాలి. మన భూములు మన చేతిలో ఉండాలంటే కేసీఆర్‌ను ఓడించాల్సిందే.
బీరయ్య అనే రైతు వడ్ల కుప్పమీద చనిపోయినపుడు, వడగండ్ల వానలతో పంటలు దెబ్బతిన్నపుడు గుర్తుకు రాని అమ్మమ్మ ఊరు, అమ్మ పుట్టిన ఊరు.. కేసీఆర్‌కు ఇప్పుడు ఎందుకు గుర్తుకు వస్తోందో ఆలోచించాలి. 40 ఏళ్లు పదవుల్లో ఉన్నపుడు ఏ ఒక్కనాడూ కోనాపూర్ గుర్తుకు రాలేదు. ఇప్పుడు ఓట్లు కావాలనే అమ్మ ఊరు అంటున్నాడు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే సిద్దిపేటకో, సిరిసిల్లకో పోవచ్చు. లేదంటే అంత మంచిగ జేసిన అంటున్న గజ్వేల్‌లోనే ఉండొచ్చు. కానీ కామారెడ్డికి రావడంలోనే పెద్ద ప్లాన్ ఉంది. ఇక్కడి భూముల మీద కేసీఆర్, ఆయన కుటుంబం, బంధువులు కన్నేశారు..’ అని రేవంత్ ఆరోపించారు.
నిరుద్యోగుల ఉసురుపోసుకుండు...
‘తెలంగాణ వస్తే ఉద్యోగాలొస్తాయని చెప్పిన ముఖ్యమంత్రి లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నాడు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్‌కు, కొడుక్కు, అల్లుడికి, బిడ్డకు, తోడల్లుడి కొడుక్కు ఉద్యోగాలు వచ్చాయి గానీ నిరుద్యోగులకు మాత్రం రాలేదు.
మూడోసారి గెలిపించండి అంటూ కొడుకును ముఖ్యమంత్రిని జేసేందుకు కేసీఆర్ తాపత్రయపడుతున్నాడు. మందు తాగించి, పైసలు పంచి ఓట్లు దండుకోవాలని జూస్తున్న కేసీఆర్ పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తాం..’ అని చెప్పారు.
అయ్య వీధికుక్క.. కొడుకు పిచ్చి కుక్క..
‘నేను ఇరవై ఏళ్లుగా ప్రతిపక్షంలో ప్రజల పక్షాన పోరాడి, ప్రజల గొంతుకగా పనిచేశా. కేసీఆర్‌ను నిలదీసినందుకే నన్ను జైళ్లకు పంపిండు. అయినా వెరవకుండా కొట్లాడుతూనే ఉన్నా. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్‌లకు ఓటమి భయం పట్టుకుని నన్ను కుక్కతో పోల్చారు. తెలంగాణ రాగానే దళితున్ని ముఖ్యమంత్రిని జేసి, తాను కాపలా కుక్కలాగా ఉంటానన్న కేసీఆర్.. దళితున్ని ముఖ్యమంత్రిని చేయకుండా మోసం జేశాడు.
కాపలా కుక్కలా ఉండకుండా వీధికుక్కలా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆఖరుకు పంజాబ్‌కు వెళ్లి మన పైసలు పంచాడు. కొడుకు కేటీఆర్ పిచ్చికుక్కలా ఎవరిని పడితే వాళ్లను కరుస్తున్నాడు. వీధికుక్కను, పిచ్చి కుక్కను పొలిమెరలు దాటేదాకా తరమాల్సిన బాధ్యత కామారెడ్డి ఓటర్లపై ఉంది..’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం హెలికాప్టర్ రాకుండా కుట్ర చేసినా, తన కోసం వేలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారని, తాను రోడ్డు మార్గాన వచ్చానని చెప్పారు.
మూడు గంటలు ఆలస్యంగా వచ్చి నా, తన కోసం ఎదురుచూసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సభలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, పార్టీ నేతలు యూసుఫ్‌అలీ, ఈరవత్రి అనిల్, అరికెల నర్సారెడ్డి, నేరెళ్ల శారద, కైలాస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment