సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు రాజకీయ దిగ్గజాలకు ఓటర్లు షాక్ ఇచ్చారు. పలుమార్లు విజేతలైన సీనియర్లకూ పరాభవం తప్పలేదు. తిరుగులేదనుకున్న మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు. ఆఖరుకు సీఎం కేసీఆర్ కూడా కామారెడ్డి ప్రజలు చేదు అనుభవాన్ని మిగిల్చారు. మరోవైపు సర్వశక్తులూ ఒడ్డి పోరాడిన నేతలు కూడా పరాజయం పాలయ్యారు. ఇలాంటి కొన్ని ఆసక్తికర ఫలితాలను పరిశీలిస్తే...
♦ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా జీవితంతో పెనవేసుకున్న నేత. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. వరుసగా రెండుసార్లు సీఎంగా పనిచేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా అపారమైన అనుభవం ఉంది. ఈసారి ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసిన ఆయన గజ్వేల్‌లో గెలిచినా కామారెడ్డిలో మాత్రం ఓడిపోయారు.
♦ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు టీడీపీ హయాంలోనే సీనియర్ నేత. ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట, పాలకుర్తి నుంచి ఆరు పర్యాయాలు గెలిచిన నాయకుడు. ఈసారి మాత్రం పిన్న వయస్కురాలు, కొత్తగా రాజకీయ అరంగ్రేటం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని ఆయన్ను ఖంగు తినిపించారు.
♦ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కి తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు రాజకీయ వారసత్వం ఉంది. 2014లో వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి, 2018లో అదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కేసీఆర్ మంత్రి వర్గంలో కీలక మంత్రి. కానీ ఈసారి తుమ్మల నాగేశ్వరరావు చేతుల్లో ఓటమి ఎదురైంది.
♦ బండి సంజయ్ పరిచయం అక్కర్లేని బీజేపీ నేత. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పార్టీకి ఊపు తెచ్చిన వ్యక్తి. కరీనంగర్ ఎంపీగా విజయం సాధించిన నేపథ్యం ఆయనది. కానీ ఈసారి కరీంనగర్ స్థానంలో పరాజయం చవిచూశారు. ఆ పార్టీ మరో ఎంపీ ధర్మపురి అరవింద్‌దీ ఇదే పరిస్థితి.
♦ తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌తో కలిసి పోరాడిన చరిత్ర ఈటల రాజేందర్‌ది. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక, వైద్యశాఖ మంత్రిగా పనిచేశారు. బీఆర్‌ఎస్‌తో వివాదం రావడంతో బీజేపీలో చేరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఈసారి మాత్రం ఓటమి తప్పలేదు.
♦ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ స్థానానికి 2014 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్‌ఎస్ తరఫున 2014లో గెలిచారు. 2018లోనూ విజయం సాధించారు. ఈసారి మాత్రం కాంగ్రెస్ గాలికి పరాజయం తప్పలేదు. మరో సీనియర్ నేత జోగు రామన్నదీ ఇదే అనుభవం. ఆదిలాబాద్ స్థానంలో 2009 నుంచి విజయాలను నమోదు చేశారు. 2023 ఎన్నిక ఆయనకు ఓటమిని అందించింది.
♦ ఉమ్మడి నిజామాబాద్‌లోని బాన్సువాడ, ఆర్మూర్, నిజామాబాద్ స్థానాల నుంచి మూడుసార్లు విజయం సాధించిన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కూడా అనుభవం ఈ ఎన్నికల్లో పనిచేయలేదు.
ఓడిపోయిన అనుభవం
Published Mon, Dec 4 2023 4:04 AM | Last Updated on Mon, Dec 4 2023 8:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment