కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి నివాసం వద్ద ఆయనకు దిష్టి తీస్తున్న దృశ్యం. చిత్రంలో కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/ కామారెడ్డి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పెను సంచలనం సృష్టించారు. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ (బీఆర్‌ఎస్), రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్)లను ఓడించి చరిత్ర లిఖించారు. ఒకేసారి ప్రస్తుత సీఎం కేసీఆర్‌ను, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అవుతారని భావిస్తున్న రేవంత్‌రెడ్డిలను వెంకటరమణారెడ్డి ఓడించడం విశేషం.
అయితే ఆయన ప్రత్యర్థులిద్దరూ రెండుచోట్ల నుంచి పోటీచేయడం గమనార్హం. కామారెడ్డితో పాటు పోటీచేసిన గజ్వేల్‌లో కేసీఆర్ గెలుపొందారు. కామారెడ్డితో పాటు పోటీచేసిన కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఎన్నికల పోలింగ్ ముగిశాక కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో ఆయన మాట్లాడిన సందర్భంగా గెలుపుపై ధీమాను వ్యక్తం చేశారు. భారీ అంచనాల మధ్య కేసీఆర్, రేవంత్‌రెడ్డిలతో పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో చివరకు అదే విశ్వాసం ఆయనను గెలిపించింది. ప్రజల్లో ఆయనకున్న మంచిపేరే వెంకటరమణారెడ్డిని విజయ తీరానికి చేర్చింది.
ప్రజలతో కలిసి ఉద్యమాలు...
వెంకటరమణారెడ్డి 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడ్వాయి జెడ్పీటీసీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2008లో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఎన్నికై 2011 వరకు పనిచేశారు. 2018లో బీజేపీలో చేరిన ఆయన, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటినుంచి నియోజక వర్గంలో ప్రజలతో కలిసి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. ప్రజల్లో మంచి పట్టు సాధించడంతో ఈసారి బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలోనే వెంకటరమణారెడ్డి పేరు ప్రకటించారు.
అయితే సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని తెలిసినా వెనక్కు తగ్గలేదు. సీఎం కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా పోటీకి సిద్ధపడ్డా ఇద్దరినీ ఓడించి తీరతానని శపథం చేశాడు. అన్నట్టే ఇద్దరూ ఆయన చేతిలో ఓడిపోయారు. వెంకటరమణారెడ్డికి 66,652 ఓట్లు రాగా, కేసీఆర్ కు 59,911 ఓట్లు, రేవంత్‌రెడ్డికి 54,916 ఓట్లు వచ్చాయి. కేసీఆర్ మీద 6,741 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అవినీతి రహిత పాలన అందించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు.
అక్రమాలపై ఎక్కుపెట్టిన ఫిరంగి....
వెంకటరమణారెడ్డి జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన కాలంలో మద్యం, ఇసుక మాఫియాపై యుద్ధం చేసి అప్పట్లో వార్తల్లో నిలిచారు. అధికార పారీ్టకి చెందిన జెడ్పీ చైర్మన్‌గా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వారించినా వెనక్కు తగ్గలేదు. ఒకసారి రాజీనామా పత్రాన్ని విసిరికొట్టి, గన్‌మెన్లు, కారును వదిలివెళ్లిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. అప్పట్లో ఉపాధ్యాయుల, ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నారు.
2018లో కామారెడ్డి స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన తరువాత నియోజక వర్గంలో ప్రజాసమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ జనం నోట్లో నాలుకయ్యారు. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎంత ఖర్చు చేస్తున్నా, మద్యం ఎంత పంచుతున్నా వెంకటరమణారెడ్డి మాత్రం వాటికి దూరంగా ఉన్నారు. ఒక సందర్భంలో కార్యకర్తల నుంచి కూడా ఆయన ఇబ్బంది పడ్డారు. ఎన్నికలు దగ్గర పడిన సమయంలో మనం డబ్బులు ఇవ్వకుంటే, మద్యం పంచకుంటే ఇబ్బంది అవుతుందని అనుచరులు ఆయనతో గొడవ పడ్డారు. అయినా ఆయన వెనక్కు తగ్గలేదు. మద్యం పంచడం తనతో కాదని వారికి స్పష్టం చేశారు. దీంతో కార్యకర్తలు కొంత నిరాశ చెందినా, ఊళ్లకు వెళ్లి జనం కాళ్లు మొక్కుతూ ఓట్లు అభ్యర్థించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment