kamareddy constituency
-
జెయింట్ కిల్లర్!
సాక్షి, హైదరాబాద్/ కామారెడ్డి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పెను సంచలనం సృష్టించారు. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ (బీఆర్ఎస్), రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్)లను ఓడించి చరిత్ర లిఖించారు. ఒకేసారి ప్రస్తుత సీఎం కేసీఆర్‌ను, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం అవుతారని భావిస్తున్న రేవంత్‌రెడ్డిలను వెంకటరమణారెడ్డి ఓడించడం విశేషం. అయితే ఆయన ప్రత్యర్థులిద్దరూ రెండుచోట్ల నుంచి పోటీచేయడం గమనార్హం. కామారెడ్డితో పాటు పోటీచేసిన గజ్వేల్‌లో కేసీఆర్ గెలుపొందారు. కామారెడ్డితో పాటు పోటీచేసిన కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఎన్నికల పోలింగ్ ముగిశాక కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో ఆయన మాట్లాడిన సందర్భంగా గెలుపుపై ధీమాను వ్యక్తం చేశారు. భారీ అంచనాల మధ్య కేసీఆర్, రేవంత్‌రెడ్డిలతో పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో చివరకు అదే విశ్వాసం ఆయనను గెలిపించింది. ప్రజల్లో ఆయనకున్న మంచిపేరే వెంకటరమణారెడ్డిని విజయ తీరానికి చేర్చింది. ప్రజలతో కలిసి ఉద్యమాలు... వెంకటరమణారెడ్డి 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తాడ్వాయి జెడ్పీటీసీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2008లో ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఎన్నికై 2011 వరకు పనిచేశారు. 2018లో బీజేపీలో చేరిన ఆయన, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటినుంచి నియోజక వర్గంలో ప్రజలతో కలిసి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాడు. ప్రజల్లో మంచి పట్టు సాధించడంతో ఈసారి బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలోనే వెంకటరమణారెడ్డి పేరు ప్రకటించారు. అయితే సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని తెలిసినా వెనక్కు తగ్గలేదు. సీఎం కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా పోటీకి సిద్ధపడ్డా ఇద్దరినీ ఓడించి తీరతానని శపథం చేశాడు. అన్నట్టే ఇద్దరూ ఆయన చేతిలో ఓడిపోయారు. వెంకటరమణారెడ్డికి 66,652 ఓట్లు రాగా, కేసీఆర్ కు 59,911 ఓట్లు, రేవంత్‌రెడ్డికి 54,916 ఓట్లు వచ్చాయి. కేసీఆర్ మీద 6,741 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అవినీతి రహిత పాలన అందించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. అక్రమాలపై ఎక్కుపెట్టిన ఫిరంగి.... వెంకటరమణారెడ్డి జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన కాలంలో మద్యం, ఇసుక మాఫియాపై యుద్ధం చేసి అప్పట్లో వార్తల్లో నిలిచారు. అధికార పారీ్టకి చెందిన జెడ్పీ చైర్మన్‌గా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు వారించినా వెనక్కు తగ్గలేదు. ఒకసారి రాజీనామా పత్రాన్ని విసిరికొట్టి, గన్మెన్లు, కారును వదిలివెళ్లిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. అప్పట్లో ఉపాధ్యాయుల, ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నారు. 2018లో కామారెడ్డి స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన తరువాత నియోజక వర్గంలో ప్రజాసమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ జనం నోట్లో నాలుకయ్యారు. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎంత ఖర్చు చేస్తున్నా, మద్యం ఎంత పంచుతున్నా వెంకటరమణారెడ్డి మాత్రం వాటికి దూరంగా ఉన్నారు. ఒక సందర్భంలో కార్యకర్తల నుంచి కూడా ఆయన ఇబ్బంది పడ్డారు. ఎన్నికలు దగ్గర పడిన సమయంలో మనం డబ్బులు ఇవ్వకుంటే, మద్యం పంచకుంటే ఇబ్బంది అవుతుందని అనుచరులు ఆయనతో గొడవ పడ్డారు. అయినా ఆయన వెనక్కు తగ్గలేదు. మద్యం పంచడం తనతో కాదని వారికి స్పష్టం చేశారు. దీంతో కార్యకర్తలు కొంత నిరాశ చెందినా, ఊళ్లకు వెళ్లి జనం కాళ్లు మొక్కుతూ ఓట్లు అభ్యర్థించడం విశేషం. -
గులాబీ బాస్ ప్రయోగం చేయబోతున్నారా?.. నిజంగానే అలా జరిగితే..
గులాబీ బాస్ వచ్చే ఎన్నికల్లో కూడా ప్రయోగం చేయబోతున్నారా? గతంలో సిద్ధిపేటలో వరుసగా గెలిచిన కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావం తర్వాత గజ్వేల్ నుంచి రెండుసార్లు విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేయరంటూ ప్రచారం సాగుతోంది. నిజంగానే గజ్వేల్ నుంచి మరో నియోజకవర్గానికి వలస వెళ్లాలని డిసైడ్ అయ్యారా? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? నిర్ణయం నిజమే అయితే ఎక్కడికి వెళ్ళబోతున్నారు? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ పరిధిలోకి వచ్చే కామారెడ్డి నుంచి బరిలో నిలుస్తారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుంచి పోటీచేస్తే ఉమ్మడి జిల్లాలోని 9 నియోజవర్గాల్లోనూ స్వీప్ చేయవచ్చనే ఆలోచనతో కామారెడ్డి నుంచి పోటీ చేయాలని అక్కడి నేతలు కేసీఆర్‌ను కోరుతున్నట్లు చెబుతున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్థన్ స్వయంగా కేసీఆర్ పోటీ గురించి ప్రకటించడంతో జిల్లాలో సంచలనంగా మారింది. కామారెడ్డి నుంచి పోటీ చేయాలని తానే సీఎం కేసీఆర్‌ను మూడు సార్లు కోరినట్లు గోవర్థన్ తెలిపారు. కేసీఆర్ బరిలో ఉంటే ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసి కేసీఆర్‌ను గెలిపించుకుంటామని అన్నారు. తాను ఏమి చేయాలో సీఎం కేసీఆరే నిర్ణయిస్తారని ప్రభుత్వ విప్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ సొంత గ్రామం కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేట మండలం కోనాపూర్ అని గోవర్థన్ తెలిపారు. ఇటీవల మంత్రి కేటీఆర్ సైతం తన నానమ్మ పేరిట సొంత నిధులతో కోనాపూర్‌లో ప్రభుత్వ పాఠశాల నిర్మించారన్నారు. అయితే కేసీఆర్ కామారెడ్డి బరిలో ఉంటారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. చదవండి: కాంగ్రెస్‌కు హ్యాండిచ్చారా?.. కారు దిగాలనుకున్న ఆ నేతలు రూట్ మార్చారా? కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా పొరుగు జిల్లాలైన జగిత్యాల, సిరిసిల్లా, సిద్దిపేటలోను బీఆర్ఎస్కు మరింత బలం చేకూరే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 స్థానాల్లో బీఆర్ఎస్ నిర్వహించిన పలు సర్వేల్లో రెండు, మూడు నియోజకవర్గాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నట్లు తేలింది. దీంతో కామారెడ్డి నుంచి కేసీఆర్ బరిలో ఉంటే ఉమ్మడి జిల్లాలోని 9 సీట్లలోనూ క్లీన్ స్వీప్ చేయవచ్చని ఆ పార్టీ ముఖ్యనేతలు సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌తో పోటీ చేయించాలన్న ఆలోచనను ఆ పార్టీ నేతలు కూడా స్వాగతిస్తున్నారు. గత ఏడాది కిందట బీబీపేట మండలం కోనాపూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం మంత్రి కేటీఆర్ వచ్చారు. ఆ సమయంలో తన నానమ్మ నివాసం ఉన్న కోనాపూర్‌లోని ఇల్లుని మంత్రి కేటీఆర్ సందర్శించి తన పూర్వీకులను గుర్తు చేసుకున్నారు. తమ సొంత ఊరుకు ఏదో ఒకటి చేయాలనే భావనతో కేటీఆర్ కోనాపూర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను 2.5 కోట్ల సొంత నిధులతో పునర్నిర్మించారు. పాఠశాల భవనమే కాకుండా ఆ గ్రామంలో పలు బీటీ, సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణం చేపట్టారు. త్వరలోనే ఈ అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. గత ఎన్నికల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది స్థానాల్లో ఎనిమిదింటిని గులాబీ పార్టీ గెలుచుకుంది. ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీపై బీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్దన్ కేవలం ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి కామారెడ్డిలో వ్యతిరేకత మరింతగా పెరిగిందని..కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కామారెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కామారెడ్డి నుంచి పోటీ చేయడం వల్ల ఆ సీటును కాపాడుకోవడంతో పాటు.. చుట్టుపక్కల నియోజక వర్గాలు, జిల్లాల్లో ప్రభావం పడేలా చేయడం ద్వారా ద్విముఖ వ్యూహం అనుసరించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఫైనల్ డెసిషన్ తీసుకోగలిగేది గులాబీ బాస్ మాత్రమే. -
TS Election 2023: ఎవరెవరు.. ఎక్కడెక్కడ..? బీఆర్ఎస్ లో త్వరలో స్పష్టత..!
నిజామాబాద్: బాన్సువాడలో తిరిగి పోచారం శ్రీనివాస్‌రెడ్డే బరిలో ఉంటారని సీఎం కేసీఆర్ తేల్చేయగా.. పక్కనున్న జుక్కల్‌లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్ సింధేనే మరోసారి గెలిపించాలని మంత్రి కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇటీవల ఎల్లారెడ్డిలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. జాజాల సురేందర్‌ను బంపర్ మెజారిటీతో మరోసారి అసెంబ్లీకి పంపాలని ప్రజలను కోరారు. ఇలా జిల్లాలోని మిగతా మూడుచోట్ల అధికార పార్టీనుంచి బరిలో నిలిచేది ఎవరో తేల్చేసిన బీఆర్ఎస్ అధిష్టానం.. కామారెడ్డిపై మాత్రం ప్రకటన చేయకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే అనుచరుల్లో ఆందోళన నెలకొంది. అయితే కామారెడ్డి టికెట్టు తనదేనన్న నమ్మకంతో ఉన్న గంప గోవర్ధన్.. తన అనుచరుల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం.. ఎన్నికలకు పకడ్బందీగా సన్నద్ధమవుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సర్వేలు చేయించిన సీఎం కేసీఆర్.. గెలుపుకోసం అవసరమైన చోట అభ్యర్థులను మారుస్తారన్న ప్రచారం జరిగింది. అందులో కామారెడ్డి అసెంబ్లీ స్థానం ఒకటన్న ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఇటీవల కామారెడ్డిలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. గంప గోవర్ధన్ నేతృత్వంలో కామారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని అభినందించారు. కేటీఆర్ గోవర్ధన్‌ను అభినందించడం కేడర్‌కు కొంత ఉత్సాహాన్నిచ్చినా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోవడంతో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్.. కామారెడ్డి నుంచి పోటీ చేయాలని తానే సీఎం కేసీఆర్‌ను కోరానన్నారు. కేసీఆర్ పోటీ చేస్తే కామారెడ్డి మరింత అభివృద్ధి చెందుతుందన్న భావనతో తాను సీఎంను ఆహ్వానించానని పేర్కొన్నారు. ఈ అంశంపై రాజకీయంగా చర్చ జరిగింది. గోవర్ధన్ గెలవడని సర్వేలు చెబుతున్నాయని, అందుకే ఓటమి భయంతోనే కేసీఆర్ పేరు తెరపైకి తీసుకువచ్చారంటూ మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పందించారు. కేసీఆర్ పోటీ చేసినా, ఇంకా ఎవరు పోటీ చేసినా తన గెలుపును ఎవరూ ఆపలేరన్న ధీమా వ్యక్తం చేశారు. దీంతో గంప గోవర్ధన్ తన స్వరం పెంచారు. కేసీఆర్ పోటీ చేయకపోతే తానే బరిలో ఉంటానని, షబ్బీర్‌అలీని చిత్తుగా ఓడిస్తానని ప్రకటించారు. మిగతా నియోజకవర్గాల్లో.. బాన్సువాడలో అధికార పార్టీ అభ్యర్థి ఎవరో సీఎం కేసీఆర్ ఎప్పుడో తేల్చేశారు. బీర్కూర్ మండలంలోని తెలంగాణ తిరుమలను సందర్శించిన సమయంలో మళ్లీ పోచారం శ్రీనివాస్‌రెడ్డినే గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. నాగమడుగు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన అనంతరం పిట్లంలో నిర్వహించిన సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. జుక్కల్ ఎమ్మెల్యేగా హన్మంత్ సింధేకు మరో అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈనెల 14న జిల్లాకు వచ్చిన మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డి పర్యటనలో జాజాల సురేందర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇలా జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో సిట్టింగ్‌లే బరిలో నిలుస్తారన్న స్పష్టత రావడం, కామారెడ్డిపై మాత్రం ప్రకటన చేయకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే అనుచరుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. తమ నాయకుడికి టికెట్టు వస్తుందో లేదోనన్న టెన్షన్లో వారున్నారు. దీనికి తోడు పలువురు నాయకులు టికెట్టు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండడంతో గంప అనుచరుల్లో ఆందోళన మరింత పెరిగిపోతోంది. దీంతో గంప వారి ఆందోళన తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి గ్యారంటీ అంటూ.. మంత్రి కేటీఆర్ నాయినమ్మ ఊరైన కోనాపూర్‌లో నిర్మించిన స్కూల్ బిల్డింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. కేటీఆర్ విదేశీ పర్యటన తర్వాత కోనాపూర్‌కు వస్తారని, అప్పుడు నియోజక వర్గస్థాయిలో నిర్వహించే సభలో కామారెడ్డి టికెట్టుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీఎం కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఉంటే ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు మంజూరై, పార్టీ నాయకత్వం, అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యేదని అంటున్నారు. అలాంటి పరిస్థితులు కనిపించకపోవడంతో సీఎం ఇక్కడినుంచి పోటీ చేయకపోవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్టు తనకే వస్తుందని గంప సైతం ధీమాతో ఉన్నారు. క్యాడర్లో నెలకొన్న ఆందోళనకు పుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రయత్నిస్తున్నారు. మొన్నటివరకు టికెట్టు విషయమై మాట్లాడని గోవర్ధన్.. ఇటీవల టికెట్టు తనకే వస్తుందంటూ తనను కలుస్తున్నవారితో పేర్కొంటున్నారు. పోటీ చేయడమే కాదు మరోసారి విజయం సాధిస్తానన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందడానికి ఇక్కడి నుంచి పోటీ చేయమని సీఎం కేసీఆర్‌ను కోరానని, ఆయన పోటీ చేస్తానంటే తాను త్యాగం చేయడానికి రెడీగా ఉన్నానని చెబుతున్నారు. అయితే సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో తనకు టికెట్టు పక్కా అనే ధీమా గోవర్ధన్‌లో కనిపిస్తోంది. -
‘మిషన్ కాకతీయ’లో రూ. 4.42 కోట్లు మంజూరు
ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ కామారెడ్డి : మిషన్ కాకతీయ కింద కామారెడ్డి నియోజకవర్గంలో 25 చెరువుల మరమ్మతుకు రూ.4.42 కోట్లు మంజూరైనట్లు ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ తెలిపారు. గురువారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భిక్కనూరు మండలంలో నాలుగు చెరువులకు రూ. 44.57 లక్షలు, దోమకొండలో ఏడు చెరువులకు రూ. 1.1 కోట్లు, కామారెడ్డి మండలంలో ఒక చెరువుకు రూ. 43.30 లక్షలు, మాచారెడ్డి మండలంలో 13 చెరువులకు రూ 2కోట్ల 53 లక్షల 82 వేలు మంజూరయ్యూయని వివరించారు. భిక్కనూరు మండలం ఇస్సన్నపల్లిలోని ఇసన్నచెరువుకు రూ.11.20 లక్షలు, కాచాపూర్‌లోని పటేల్‌కుంటకు రూ. 10.80 లక్షలు, రాజంపేటలోని పటేల్‌కుంటకు రూ. 11.57 లక్షలు, ఆరెపల్లిలోని తురుకవానికుంటకు రూ. 11 లక్షలు, దోమకొండ మండలం అంచనూర్లోని పెద్దచెరువుకు రూ.15.40 లక్షలు, చింతామనిపల్లిలోని ఊరచెరువుకు రూ. 18.20 లక్షలు, ఉప్పర్‌పల్లిలోని చింతలకుంటకు రూ. 14.80 లక్షలు, జనగామలోని బదలవానికుంటకు రూ. 13.30 లక్షలు, ఇస్సానగర్లోని పటేల్‌కుంటకు రూ. 11.50 లక్షలు, దోమకొండలోని బయ్యన్నకుంటకు రూ. 16.15 లక్షలు, కామారె డ్డి మండలం తిమ్మక్‌పల్లి పెద్దచెరువుకు రూ. 43.30 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. మాచారెడ్డి మండలంలోని దేవునిపల్లిలో పులిచెరుకుంటకు రూ. 11.35 లక్షలు, ఇస్సాయిపేటలోని మల్లుకుంటకు రూ. 9.10 లక్షలు, ఎల్పుగొండలోని తురుకవానికుంటలకు రూ. 12.20 లక్షలు, గన్పూర్(ఎం) లోని ఊరచెరువుకు రూ. 13.85 లక్షలు, సింగరాయపల్లిలోని సామగంజికుంటకు రూ. 10.45 లక్షలు, భవానీపేటలోని చందాచెరువుకు రూ. 11.50 లక్షలు, బీఆర్పల్లిలోని కావేరికుంటకు రూ. 16.40 లక్షలు, రెడ్డిపేటలోని దామెరచెరువుకు రూ. 36.10 లక్షలు, అన్నారంలోని బసిరెడ్డికుంటకు రూ. 10.70 లక్షలు, మద్దికుంటలోని గుడికుంటకు రూ. 10.45 లక్షలు, ఎల్లంపేటలోని వెంకటాద్రి చెరువుకు రూ. 59.60 లక్షలు, సోమారంపేటలోని తాళ్లచెరువుకు రూ. 17.35 లక్షలు, లచ్చాపేటలోని లచ్చిచెరువుకు రూ. 34.77 లక్షలు మంజూరైనట్టు వివరించారు. ఈ నిధులతో చేపట్టే పనులలో ఎలాంటి అవినీతి జరిగినా కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని గోవర్దన్ హెచ్చరించారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దిన్, టీఆర్ఎస్ నేతలు వేణుగోపాల్రావ్, మధుసూధన్‌రావ్, లక్ష్మారెడ్డి, ఆంజనేయులు, మోహన్‌రెడ్డి, శేఖర్, బల్వంత్‌రావ్ పాల్గొన్నారు. -
ముందే కూసిన ‘ఓట్ల’ కోయిల!
కామారెడ్డి, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎక్కడా లేని విధంగా కామారెడ్డి నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థులైన ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. పనిలో పనిగా ఒకరిపై ఒకరు ప్రత్యక్ష, పరోక్ష విమర్శ లు చేసుకుంటున్నారు. తెలంగాణ కోసం పోరాడింది తామంటే, తెలంగాణ ఇచ్చింది తమ పార్టీ అని చెప్పుకుంటూ ఆధిపత్యం చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో సాధారణ ఎన్నికలకు ఐదు నెలల ముందే ప్రచార సందడి కనిపిస్తోంది. ఆర్భాటాల్లోనూ.. ఇద్దరు నేతలు ఆర్భాటాల్లోనూ పోటాపోటీగా సాగుతున్నారు. ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ ఐదారు వాహనాలకు త గ్గకుండా కాన్వాయ్‌లో వెళ్తుంటే.. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కూడా తానేం తక్కువ కాదన్నట్టుగా కాన్వాయ్‌లో నాలుగైదు వాహనాలను వినియోగిస్తున్నారు. అనుచ ర గణాన్ని వెంటేసుకొని కార్యక్రమాలకు వెళ్తున్నారు. ఘర్షణ వాతావరణం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఇద్దరు నేతలు పోటీ పడుతుండడంతో పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం సైతం ఏర్పడుతోంది. ఆదివారం భిక్కనూరు మండలంలోని బాగిర్తిపల్లిలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమం కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవకు దారితీసింది. ఈ గ్రామంలో రోడ్డు మరమ్మతుకు సంబంధించి రూ.10 లక్షల నిధులు మంజూరు చేయించింది తమ నాయకుడంటే తమ నాయకుడంటూ కాంగ్రెస్, టీఆర్ఎస్ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. ఎస్ఐ గంగాధర్ ఇరువర్గాలను సముదాయించారు. ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ శనివారం మాచారెడ్డి మండలంలోని భవానీపేట, పోతారం, ఇసాయిపేట తదితర గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అదేరోజు దోమకొండ మండలంలోని మాందాపూర్‌లో, ఆదివారం భిక్కనూరు మండలం బాగిర్తిపల్లిలో పర్యటించారు. తెలంగాణ విషయంలో.. తెలంగాణ ఇస్తామన్న మాటకు కట్టుబడి రాష్ర్టం ఇచ్చిన సోనియాగాంధీకి అందరూ రుణపడి ఉండాలని ఎమ్మెల్సీ షబ్బీర్ ప్రజలను కోరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ కోసం పదమూడేళ్లుగా టీఆర్ ఎస్ చేస్తున్న పోరాటం, వెయ్యి మంది తెలంగాణవాదుల బలిదానం ఫలితంగానే రాష్ట్రం సిద్ధిస్తోందని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేర్కొంటున్నారు. వలసలపై కాంగ్రెస్ ఆశలు 2009 సాధారణ ఎన్నికలతో పాటు 2011 ఉప ఎన్నికల్లోనూ కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందింది. నియోజకవర్గంలో కాంగ్రెస్‌పై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు ఈ ఫలితాలు నిదర్శనంగా నిలిచాయి. పార్టీ, ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడం ఆ పార్టీకి భారంగా మారింది. అందుకే ముందస్తు ఎన్నికల ప్రచారానికి తెరలేపినట్టు పరిశీలకులు భావిస్తున్నారు. వలసలపైనా ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా టీఆర్ఎస్కు చెందిన నాయకులు, కార్యకర్తలను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. గతంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసిన ఎంజీ వేణుగోపాల్‌గౌడ్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. కుల సంఘాలకు కమ్యూనిటీ హాళ్లు మంజూరు చేస్తూ ఆయా సంఘాల నేతలను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోంది. తెలంగాణమే టీఆర్ఎస్ బలం తెలంగాణవాదమే బలంగా టీఆర్ఎస్ సాగుతోంది. నియోజకవర్గంలో తిరుగులేని పట్టు సాధించిన టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో గెలుపొంది కాంగ్రెస్‌ను చావుదెబ్బకొట్టాలని చూస్తోంది. అందులో భాగంగా ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. అసంతృప్త నేతలను బుజ్జగించి తన వెంట తిప్పుకుంటున్నారు. తనపై బహిరంగ విమర్శలు చేసిన పార్టీ రాష్ట్ర నాయకులు కొమ్ముల తిర్మల్‌రెడ్డి, భూంరెడ్డిలాంటి వారిని కలిసి, బుజ్జగించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ వైఖరి వల్లే వందలాది మంది తెలంగాణవాదులు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారని, తెలంగాణ కోసం నిజాయితీగా పోరాడింది టీఆర్ఎస్ పార్టీయేనని ఎమ్మెల్యే తన పర్యటనల్లో ప్రజలకు వివరిస్తున్నారు. తద్వారా తెలంగాణ ఓటు బ్యాంకు పెంచుకునేందుకు యత్నిస్తున్నారు. ఇలా ఇద్దరు నేతలు పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్తుండడంతో నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.