నిజామాబాద్: బాన్సువాడలో తిరిగి పోచారం శ్రీనివాస్‌రెడ్డే బరిలో ఉంటారని సీఎం కేసీఆర్ తేల్చేయగా.. పక్కనున్న జుక్కల్‌లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్ సింధేనే మరోసారి గెలిపించాలని మంత్రి కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇటీవల ఎల్లారెడ్డిలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. జాజాల సురేందర్‌ను బంపర్ మెజారిటీతో మరోసారి అసెంబ్లీకి పంపాలని ప్రజలను కోరారు.
ఇలా జిల్లాలోని మిగతా మూడుచోట్ల అధికార పార్టీనుంచి బరిలో నిలిచేది ఎవరో తేల్చేసిన బీఆర్‌ఎస్ అధిష్టానం.. కామారెడ్డిపై మాత్రం ప్రకటన చేయకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే అనుచరుల్లో ఆందోళన నెలకొంది. అయితే కామారెడ్డి టికెట్టు తనదేనన్న నమ్మకంతో ఉన్న గంప గోవర్ధన్.. తన అనుచరుల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు.
త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీఆర్‌ఎస్ అధిష్టానం.. ఎన్నికలకు పకడ్బందీగా సన్నద్ధమవుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సర్వేలు చేయించిన సీఎం కేసీఆర్.. గెలుపుకోసం అవసరమైన చోట అభ్యర్థులను మారుస్తారన్న ప్రచారం జరిగింది. అందులో కామారెడ్డి అసెంబ్లీ స్థానం ఒకటన్న ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది.
ఇటీవల కామారెడ్డిలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. గంప గోవర్ధన్ నేతృత్వంలో కామారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని అభినందించారు. కేటీఆర్ గోవర్ధన్‌ను అభినందించడం కేడర్‌కు కొంత ఉత్సాహాన్నిచ్చినా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోవడంతో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్.. కామారెడ్డి నుంచి పోటీ చేయాలని తానే సీఎం కేసీఆర్‌ను కోరానన్నారు.
కేసీఆర్ పోటీ చేస్తే కామారెడ్డి మరింత అభివృద్ధి చెందుతుందన్న భావనతో తాను సీఎంను ఆహ్వానించానని పేర్కొన్నారు. ఈ అంశంపై రాజకీయంగా చర్చ జరిగింది. గోవర్ధన్ గెలవడని సర్వేలు చెబుతున్నాయని, అందుకే ఓటమి భయంతోనే కేసీఆర్ పేరు తెరపైకి తీసుకువచ్చారంటూ మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పందించారు. కేసీఆర్ పోటీ చేసినా, ఇంకా ఎవరు పోటీ చేసినా తన గెలుపును ఎవరూ ఆపలేరన్న ధీమా వ్యక్తం చేశారు. దీంతో గంప గోవర్ధన్ తన స్వరం పెంచారు. కేసీఆర్ పోటీ చేయకపోతే తానే బరిలో ఉంటానని, షబ్బీర్‌అలీని చిత్తుగా ఓడిస్తానని ప్రకటించారు.
మిగతా నియోజకవర్గాల్లో..
బాన్సువాడలో అధికార పార్టీ అభ్యర్థి ఎవరో సీఎం కేసీఆర్ ఎప్పుడో తేల్చేశారు. బీర్కూర్ మండలంలోని తెలంగాణ తిరుమలను సందర్శించిన సమయంలో మళ్లీ పోచారం శ్రీనివాస్‌రెడ్డినే గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. నాగమడుగు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన అనంతరం పిట్లంలో నిర్వహించిన సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. జుక్కల్ ఎమ్మెల్యేగా హన్మంత్ సింధేకు మరో అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఈనెల 14న జిల్లాకు వచ్చిన మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డి పర్యటనలో జాజాల సురేందర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇలా జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో సిట్టింగ్‌లే బరిలో నిలుస్తారన్న స్పష్టత రావడం, కామారెడ్డిపై మాత్రం ప్రకటన చేయకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే అనుచరుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. తమ నాయకుడికి టికెట్టు వస్తుందో లేదోనన్న టెన్షన్‌లో వారున్నారు. దీనికి తోడు పలువురు నాయకులు టికెట్టు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండడంతో గంప అనుచరుల్లో ఆందోళన మరింత పెరిగిపోతోంది. దీంతో గంప వారి ఆందోళన తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
మరోసారి గ్యారంటీ అంటూ..
మంత్రి కేటీఆర్ నాయినమ్మ ఊరైన కోనాపూర్‌లో నిర్మించిన స్కూల్ బిల్డింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. కేటీఆర్ విదేశీ పర్యటన తర్వాత కోనాపూర్‌కు వస్తారని, అప్పుడు నియోజక వర్గస్థాయిలో నిర్వహించే సభలో కామారెడ్డి టికెట్టుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీఎం కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఉంటే ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు మంజూరై, పార్టీ నాయకత్వం, అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యేదని అంటున్నారు.
అలాంటి పరిస్థితులు కనిపించకపోవడంతో సీఎం ఇక్కడినుంచి పోటీ చేయకపోవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్టు తనకే వస్తుందని గంప సైతం ధీమాతో ఉన్నారు. క్యాడర్‌లో నెలకొన్న ఆందోళనకు పుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రయత్నిస్తున్నారు. మొన్నటివరకు టికెట్టు విషయమై మాట్లాడని గోవర్ధన్.. ఇటీవల టికెట్టు తనకే వస్తుందంటూ తనను కలుస్తున్నవారితో పేర్కొంటున్నారు.
పోటీ చేయడమే కాదు మరోసారి విజయం సాధిస్తానన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందడానికి ఇక్కడి నుంచి పోటీ చేయమని సీఎం కేసీఆర్‌ను కోరానని, ఆయన పోటీ చేస్తానంటే తాను త్యాగం చేయడానికి రెడీగా ఉన్నానని చెబుతున్నారు. అయితే సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో తనకు టికెట్టు పక్కా అనే ధీమా గోవర్ధన్‌లో కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment