konapur
-
TS Election 2023: ఎవరెవరు.. ఎక్కడెక్కడ..? బీఆర్ఎస్ లో త్వరలో స్పష్టత..!
నిజామాబాద్: బాన్సువాడలో తిరిగి పోచారం శ్రీనివాస్‌రెడ్డే బరిలో ఉంటారని సీఎం కేసీఆర్ తేల్చేయగా.. పక్కనున్న జుక్కల్‌లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్ సింధేనే మరోసారి గెలిపించాలని మంత్రి కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇటీవల ఎల్లారెడ్డిలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. జాజాల సురేందర్‌ను బంపర్ మెజారిటీతో మరోసారి అసెంబ్లీకి పంపాలని ప్రజలను కోరారు. ఇలా జిల్లాలోని మిగతా మూడుచోట్ల అధికార పార్టీనుంచి బరిలో నిలిచేది ఎవరో తేల్చేసిన బీఆర్ఎస్ అధిష్టానం.. కామారెడ్డిపై మాత్రం ప్రకటన చేయకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే అనుచరుల్లో ఆందోళన నెలకొంది. అయితే కామారెడ్డి టికెట్టు తనదేనన్న నమ్మకంతో ఉన్న గంప గోవర్ధన్.. తన అనుచరుల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం.. ఎన్నికలకు పకడ్బందీగా సన్నద్ధమవుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సర్వేలు చేయించిన సీఎం కేసీఆర్.. గెలుపుకోసం అవసరమైన చోట అభ్యర్థులను మారుస్తారన్న ప్రచారం జరిగింది. అందులో కామారెడ్డి అసెంబ్లీ స్థానం ఒకటన్న ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఇటీవల కామారెడ్డిలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. గంప గోవర్ధన్ నేతృత్వంలో కామారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని అభినందించారు. కేటీఆర్ గోవర్ధన్‌ను అభినందించడం కేడర్‌కు కొంత ఉత్సాహాన్నిచ్చినా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోవడంతో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్.. కామారెడ్డి నుంచి పోటీ చేయాలని తానే సీఎం కేసీఆర్‌ను కోరానన్నారు. కేసీఆర్ పోటీ చేస్తే కామారెడ్డి మరింత అభివృద్ధి చెందుతుందన్న భావనతో తాను సీఎంను ఆహ్వానించానని పేర్కొన్నారు. ఈ అంశంపై రాజకీయంగా చర్చ జరిగింది. గోవర్ధన్ గెలవడని సర్వేలు చెబుతున్నాయని, అందుకే ఓటమి భయంతోనే కేసీఆర్ పేరు తెరపైకి తీసుకువచ్చారంటూ మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పందించారు. కేసీఆర్ పోటీ చేసినా, ఇంకా ఎవరు పోటీ చేసినా తన గెలుపును ఎవరూ ఆపలేరన్న ధీమా వ్యక్తం చేశారు. దీంతో గంప గోవర్ధన్ తన స్వరం పెంచారు. కేసీఆర్ పోటీ చేయకపోతే తానే బరిలో ఉంటానని, షబ్బీర్‌అలీని చిత్తుగా ఓడిస్తానని ప్రకటించారు. మిగతా నియోజకవర్గాల్లో.. బాన్సువాడలో అధికార పార్టీ అభ్యర్థి ఎవరో సీఎం కేసీఆర్ ఎప్పుడో తేల్చేశారు. బీర్కూర్ మండలంలోని తెలంగాణ తిరుమలను సందర్శించిన సమయంలో మళ్లీ పోచారం శ్రీనివాస్‌రెడ్డినే గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. నాగమడుగు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన అనంతరం పిట్లంలో నిర్వహించిన సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. జుక్కల్ ఎమ్మెల్యేగా హన్మంత్ సింధేకు మరో అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈనెల 14న జిల్లాకు వచ్చిన మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డి పర్యటనలో జాజాల సురేందర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇలా జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో సిట్టింగ్‌లే బరిలో నిలుస్తారన్న స్పష్టత రావడం, కామారెడ్డిపై మాత్రం ప్రకటన చేయకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే అనుచరుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. తమ నాయకుడికి టికెట్టు వస్తుందో లేదోనన్న టెన్షన్లో వారున్నారు. దీనికి తోడు పలువురు నాయకులు టికెట్టు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండడంతో గంప అనుచరుల్లో ఆందోళన మరింత పెరిగిపోతోంది. దీంతో గంప వారి ఆందోళన తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి గ్యారంటీ అంటూ.. మంత్రి కేటీఆర్ నాయినమ్మ ఊరైన కోనాపూర్‌లో నిర్మించిన స్కూల్ బిల్డింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. కేటీఆర్ విదేశీ పర్యటన తర్వాత కోనాపూర్‌కు వస్తారని, అప్పుడు నియోజక వర్గస్థాయిలో నిర్వహించే సభలో కామారెడ్డి టికెట్టుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీఎం కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఉంటే ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులు మంజూరై, పార్టీ నాయకత్వం, అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యేదని అంటున్నారు. అలాంటి పరిస్థితులు కనిపించకపోవడంతో సీఎం ఇక్కడినుంచి పోటీ చేయకపోవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్టు తనకే వస్తుందని గంప సైతం ధీమాతో ఉన్నారు. క్యాడర్లో నెలకొన్న ఆందోళనకు పుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రయత్నిస్తున్నారు. మొన్నటివరకు టికెట్టు విషయమై మాట్లాడని గోవర్ధన్.. ఇటీవల టికెట్టు తనకే వస్తుందంటూ తనను కలుస్తున్నవారితో పేర్కొంటున్నారు. పోటీ చేయడమే కాదు మరోసారి విజయం సాధిస్తానన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందడానికి ఇక్కడి నుంచి పోటీ చేయమని సీఎం కేసీఆర్‌ను కోరానని, ఆయన పోటీ చేస్తానంటే తాను త్యాగం చేయడానికి రెడీగా ఉన్నానని చెబుతున్నారు. అయితే సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో తనకు టికెట్టు పక్కా అనే ధీమా గోవర్ధన్‌లో కనిపిస్తోంది. -
అమ్మా.. మేం చేసిన తప్పేంటి?
భర్త, పిల్లలను విడిచి.. ప్రియులతో వెళ్లిన ఇద్దరు మహిళలు! - విజయవాడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు - జగిత్యాల కోర్టులో హాజరుపరిచిన పోలీసులు - చిన్నారుల రోదనలు.. అయినా కరగని తల్లులు ‘అమ్మ’అనే ఒకే ఒక్క పిలుపుతో తల్లి మనసు పరవసించిపోతుంది. కన్న బిడ్డ కంట కన్నీరు కనిపిస్తేనే తల్లడిల్లిపోతుంది. అలాంటిది గంటల తరబడి పిల్లలు రోధిస్తే..! అమ్మా.. అమ్మా అని తపిస్తే..! ఆ మాతృమూర్తి హృదయం ఏం కావాలి..? ఆ తల్లి ఎలా స్పందించాలి..? కానీ ఆ ఇద్దరు తల్లులనూ పేగు బంధం కదిలించలేదు. పిల్లలు ఏడ్చినా.. అమ్మా అమ్మా అని కలవరించినా వారి మనసులు కరగలేదు. మాతృత్వం మరచి.. భర్త, పిల్లలను విడిచి.. ప్రియులతో వెళ్లిన ఇద్దరు మహిళల కథ ఇదీ. జగిత్యాల జోన్: సారంగాపూర్ మండలం కోనాపూర్‌కు చెందిన ఇద్దరు కూలీలు రాళ్లు కొట్టుకుంటూ తమ కుటుంబాలతో కలసి జీవించేవారు. వారి భార్యలు కూడా కూలీ పనులకు వెళ్తుండేవారు. ఈ క్రమంలో ఊళ్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన అన్నదమ్ములు పొదిలి హరిబాబు, బ్రహ్మనాయుడు మేస్త్రీలుగా వచ్చారు. మేస్త్రీలకు పనుల్లో సాయంగా ఇద్దరు మహిళలు కూలీలుగా పనికి వెళ్లారు. పనులు చేసే సమయంలో ఇద్దరు మహిళలకు మేస్త్రీలతో సాన్నిహిత్యం ఏర్పడింది. మేస్త్రీలు, ఆ మహిళల్ని తీసుకుని ఆరు నెలల క్రితం ఊరు విడిచి వెళ్లిపోయారు. తమ భార్యలను మేస్త్రీలు ఎత్తుకెళ్లారని.. మహిళల భర్తలు సారంగాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు.. విజయవాడలో ఉన్న రెండు జంటలను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మేస్త్రీలపై కిడ్నాప్ కేసులు నమోదు చేసి, వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హైడ్రామా.. పోలీసులు ఆ ఇద్దరు మహిళలను గురువారం మధ్యాహ్నం 2 గంటలకు జగిత్యాల కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న ఇద్దరు మహిళలకు చెందిన ఆరుగురు పిల్లలు, బంధువులు, కులస్తులు 200 మంది వరకు కోర్టుకు చేరారు. దీంతో ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్ఐలు, వంద మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. బంధువులు ఒక్కసారిగా మహిళలను తీసుకొచ్చిన జీపు వైపు దూసుకెళ్లగా.. పోలీసులు అడ్డుకున్నారు. అమ్మా.. మేం ఏం తప్పు చేశాం.. మహిళలను కోర్టులో ప్రవేశపెట్టేముందు గంటసేపు పోలీసు జీపులోనే ఉంచారు. ఒక మహిళకు కూతుళ్లు లాలీ(17), సైనా(8), కొడుకు ఆజ్మత్(6) ఉన్నారు. మరో మహిళకు కొడుకులు హబీద్(13), హైదర్(8), కూతురు చాన్‌బీ(5) ఉంది. ఈ సమయంలో తల్లులను చూసిన పిల్లలు ‘అమ్మా.. ఒక్కసారి మమ్మల్ని చూడమ్మా.. మేం ఏం తప్పుచేశాం అమ్మా.. మమ్మల్ని ఎందుకు తల్లిలేని పిల్లలను చేస్తున్నారు.. ఇక మాకెవరు దిక్కు.. ఒక్కసారైనా మా దగ్గరకు రామ్మా’అని కన్నీటి పర్యంతమయ్యారు. వారి రోదనలు కోర్టులో ఉన్న వారికి సైతం కన్నీళ్లు తెప్పించినా.. ఆ తల్లుల రాతిగుండె కరగలేదు. ఇదంతా చూసి బంధువులు ఆగ్రహంతో మహిళలపై దాడి చేసేందుకు పలుమార్లు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. మాకు మేమే బతుకుతాం.. పోలీసులు బంధువుల కళ్లుగప్పి జగిత్యాల రెండో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సతీశ్‌కుమార్ ముందు మహిళలను ప్రవేశపెట్టగా.. తాము భర్తల దగ్గరకు వెళ్లబోమని వారు స్పష్టం చేశారు. ‘మేం వెళ్తే అక్కడ గొడవలు జరుగుతాయి.. మేం బయటకెళ్లి పిల్లలను పోషించుకుందామంటే ఆ స్థితిలో లేం.. మా ఆర్థిక పరిస్థితీ అంతంతే.. మాకు అమ్మానాన్నంటూ ఎవరూ లేరు. మేం కూడా అనాథలుగానే ఉన్నాం.. ఇకపై అలాగే ఉంటాం.. మాకు మేమే బతుకుతాం’ అని మేజిస్ట్రేట్‌కు వివరించారు. ‘మీరు వెళ్లిపోతే మీ పిల్లల పరిస్థితి ఏంటి.. వాళ్లు ఎలా బతకాలి. ఒక్కసారి పిల్లల గురించైనా ఆలోచించండి’ అంటూ మేజిస్ట్రేట్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. కుటుంబాల వద్దకు వెళ్లమని చెప్పడంతో వారిద్దరినీ కరీంనగర్‌లోని స్వధార్ గృహానికి తరలించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఇదిలాఉండగా కనీసం ఒక్కసారైనా తమ తల్లులను చూడనివ్వాలని ఆరుగురు పిల్లలు పోలీసులను వేడుకోగా.. ఇదిగో చూపిస్తాం.. అదిగో చూపిస్తాం.. మేజిస్ట్రేట్ పర్మిషన్ అవసరమని చెప్పి.. చివరకు పిల్లలకు వారిని చూపించకుండానే కరీంనగర్‌కు తరలించారు. దీంతో ఆ చిన్నారులు గుండెలవిసేలా రోదిస్తూ నిరాశతో ఇళ్లకు వెళ్లిపోయారు. -
చెరువులో స్నానానికి వెళ్లి గల్లంతు
బాన్సువాడ టౌన్ : స్నానం చేసేందుకు చెరువులోకి దిగిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన మండలంలోని కోనాపూర్‌లో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పులిగుండు తండాకు చెందిన లకావత్ శ్రీనివాస్ (24) ఇటీవల జరిగిన ఎస్సై, కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించాడు. రాతపరీక్షకు సన్నద్ధమయ్యేందుకు గాను హైదరాబాద్‌కు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. సోమవారం కటింగ్ చేయించుకొనిస్నేహితుడితో కలిసి ఇంటికి బయల్దేరాడు. మధ్యలో కోనాపూర్ చెరువులో స్నానం చేసేందుకని దిగాడు. ఎంతకీ శ్రీనివాస్ బయటకు రాకపోవడంతో అతడి స్నేహితుడు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి, పరారయ్యాడు. కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ అక్కడకు చేరుకున్నారు. శ్రీనివాస్ తల్లి ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోయింది. రాత్రి వరకు చెరువులో వెతికినా యువకుడి ఆచూకీ లభించలేదు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.