అమ్మా.. మేం చేసిన తప్పేంటి?
భర్త, పిల్లలను విడిచి.. ప్రియులతో వెళ్లిన ఇద్దరు మహిళలు!
- విజయవాడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- జగిత్యాల కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
- చిన్నారుల రోదనలు.. అయినా కరగని తల్లులు
‘అమ్మ’అనే ఒకే ఒక్క పిలుపుతో తల్లి మనసు పరవసించిపోతుంది. కన్న బిడ్డ కంట కన్నీరు కనిపిస్తేనే తల్లడిల్లిపోతుంది. అలాంటిది గంటల తరబడి పిల్లలు రోధిస్తే..! అమ్మా.. అమ్మా అని తపిస్తే..! ఆ మాతృమూర్తి హృదయం ఏం కావాలి..? ఆ తల్లి ఎలా స్పందించాలి..? కానీ ఆ ఇద్దరు తల్లులనూ పేగు బంధం కదిలించలేదు. పిల్లలు ఏడ్చినా.. అమ్మా అమ్మా అని కలవరించినా వారి మనసులు కరగలేదు. మాతృత్వం మరచి.. భర్త, పిల్లలను విడిచి.. ప్రియులతో వెళ్లిన ఇద్దరు మహిళల కథ ఇదీ.
జగిత్యాల జోన్: సారంగాపూర్ మండలం కోనాపూర్‌కు చెందిన ఇద్దరు కూలీలు రాళ్లు కొట్టుకుంటూ తమ కుటుంబాలతో కలసి జీవించేవారు. వారి భార్యలు కూడా కూలీ పనులకు వెళ్తుండేవారు. ఈ క్రమంలో ఊళ్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన అన్నదమ్ములు పొదిలి హరిబాబు, బ్రహ్మనాయుడు మేస్త్రీలుగా వచ్చారు. మేస్త్రీలకు పనుల్లో సాయంగా ఇద్దరు మహిళలు కూలీలుగా పనికి వెళ్లారు. పనులు చేసే సమయంలో ఇద్దరు మహిళలకు మేస్త్రీలతో సాన్నిహిత్యం ఏర్పడింది. మేస్త్రీలు, ఆ మహిళల్ని తీసుకుని ఆరు నెలల క్రితం ఊరు విడిచి వెళ్లిపోయారు. తమ భార్యలను మేస్త్రీలు ఎత్తుకెళ్లారని.. మహిళల భర్తలు సారంగాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు.. విజయవాడలో ఉన్న రెండు జంటలను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మేస్త్రీలపై కిడ్నాప్ కేసులు నమోదు చేసి, వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
కోర్టులో హైడ్రామా..
పోలీసులు ఆ ఇద్దరు మహిళలను గురువారం మధ్యాహ్నం 2 గంటలకు జగిత్యాల కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న ఇద్దరు మహిళలకు చెందిన ఆరుగురు పిల్లలు, బంధువులు, కులస్తులు 200 మంది వరకు కోర్టుకు చేరారు. దీంతో ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్‌ఐలు, వంద మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. బంధువులు ఒక్కసారిగా మహిళలను తీసుకొచ్చిన జీపు వైపు దూసుకెళ్లగా.. పోలీసులు అడ్డుకున్నారు.
అమ్మా.. మేం ఏం తప్పు చేశాం..
మహిళలను కోర్టులో ప్రవేశపెట్టేముందు గంటసేపు పోలీసు జీపులోనే ఉంచారు. ఒక మహిళకు కూతుళ్లు లాలీ(17), సైనా(8), కొడుకు ఆజ్మత్(6) ఉన్నారు. మరో మహిళకు కొడుకులు హబీద్(13), హైదర్(8), కూతురు చాన్‌బీ(5) ఉంది. ఈ సమయంలో తల్లులను చూసిన పిల్లలు ‘అమ్మా.. ఒక్కసారి మమ్మల్ని చూడమ్మా.. మేం ఏం తప్పుచేశాం అమ్మా.. మమ్మల్ని ఎందుకు తల్లిలేని పిల్లలను చేస్తున్నారు.. ఇక మాకెవరు దిక్కు.. ఒక్కసారైనా మా దగ్గరకు రామ్మా’అని కన్నీటి పర్యంతమయ్యారు. వారి రోదనలు కోర్టులో ఉన్న వారికి సైతం కన్నీళ్లు తెప్పించినా.. ఆ తల్లుల రాతిగుండె కరగలేదు. ఇదంతా చూసి బంధువులు ఆగ్రహంతో మహిళలపై దాడి చేసేందుకు పలుమార్లు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.
మాకు మేమే బతుకుతాం..
పోలీసులు బంధువుల కళ్లుగప్పి జగిత్యాల రెండో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సతీశ్‌కుమార్ ముందు మహిళలను ప్రవేశపెట్టగా.. తాము భర్తల దగ్గరకు వెళ్లబోమని వారు స్పష్టం చేశారు. ‘మేం వెళ్తే అక్కడ గొడవలు జరుగుతాయి.. మేం బయటకెళ్లి పిల్లలను పోషించుకుందామంటే ఆ స్థితిలో లేం.. మా ఆర్థిక పరిస్థితీ అంతంతే.. మాకు అమ్మానాన్నంటూ ఎవరూ లేరు. మేం కూడా అనాథలుగానే ఉన్నాం.. ఇకపై అలాగే ఉంటాం.. మాకు మేమే బతుకుతాం’ అని మేజిస్ట్రేట్‌కు వివరించారు.
‘మీరు వెళ్లిపోతే మీ పిల్లల పరిస్థితి ఏంటి.. వాళ్లు ఎలా బతకాలి. ఒక్కసారి పిల్లల గురించైనా ఆలోచించండి’ అంటూ మేజిస్ట్రేట్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. కుటుంబాల వద్దకు వెళ్లమని చెప్పడంతో వారిద్దరినీ కరీంనగర్‌లోని స్వధార్ గృహానికి తరలించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఇదిలాఉండగా కనీసం ఒక్కసారైనా తమ తల్లులను చూడనివ్వాలని ఆరుగురు పిల్లలు పోలీసులను వేడుకోగా.. ఇదిగో చూపిస్తాం.. అదిగో చూపిస్తాం.. మేజిస్ట్రేట్ పర్మిషన్ అవసరమని చెప్పి.. చివరకు పిల్లలకు వారిని చూపించకుండానే కరీంనగర్‌కు తరలించారు. దీంతో ఆ చిన్నారులు గుండెలవిసేలా రోదిస్తూ నిరాశతో ఇళ్లకు వెళ్లిపోయారు.