కామారెడ్డి, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎక్కడా లేని విధంగా కామారెడ్డి నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థులైన ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. పనిలో పనిగా ఒకరిపై ఒకరు ప్రత్యక్ష, పరోక్ష విమర్శ లు చేసుకుంటున్నారు. తెలంగాణ కోసం పోరాడింది తామంటే, తెలంగాణ ఇచ్చింది తమ పార్టీ అని చెప్పుకుంటూ ఆధిపత్యం చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో సాధారణ ఎన్నికలకు ఐదు నెలల ముందే ప్రచార సందడి కనిపిస్తోంది.
ఆర్భాటాల్లోనూ..
ఇద్దరు నేతలు ఆర్భాటాల్లోనూ పోటాపోటీగా సాగుతున్నారు. ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ ఐదారు వాహనాలకు త గ్గకుండా కాన్వాయ్‌లో వెళ్తుంటే.. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కూడా తానేం తక్కువ కాదన్నట్టుగా కాన్వాయ్‌లో నాలుగైదు వాహనాలను వినియోగిస్తున్నారు. అనుచ ర గణాన్ని వెంటేసుకొని కార్యక్రమాలకు వెళ్తున్నారు.
ఘర్షణ వాతావరణం
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఇద్దరు నేతలు పోటీ పడుతుండడంతో పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం సైతం ఏర్పడుతోంది. ఆదివారం భిక్కనూరు మండలంలోని బాగిర్తిపల్లిలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమం కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య గొడవకు దారితీసింది. ఈ గ్రామంలో రోడ్డు మరమ్మతుకు సంబంధించి రూ.10 లక్షల నిధులు మంజూరు చేయించింది తమ నాయకుడంటే తమ నాయకుడంటూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. ఎస్‌ఐ గంగాధర్ ఇరువర్గాలను సముదాయించారు. ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ శనివారం మాచారెడ్డి మండలంలోని భవానీపేట, పోతారం, ఇసాయిపేట తదితర గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అదేరోజు దోమకొండ మండలంలోని మాందాపూర్‌లో, ఆదివారం భిక్కనూరు మండలం బాగిర్తిపల్లిలో పర్యటించారు.
తెలంగాణ విషయంలో..
తెలంగాణ ఇస్తామన్న మాటకు కట్టుబడి రాష్ర్టం ఇచ్చిన సోనియాగాంధీకి అందరూ రుణపడి ఉండాలని ఎమ్మెల్సీ షబ్బీర్ ప్రజలను కోరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ కోసం పదమూడేళ్లుగా టీఆర్ ఎస్ చేస్తున్న పోరాటం, వెయ్యి మంది తెలంగాణవాదుల బలిదానం ఫలితంగానే రాష్ట్రం సిద్ధిస్తోందని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేర్కొంటున్నారు.
వలసలపై కాంగ్రెస్ ఆశలు
2009 సాధారణ ఎన్నికలతో పాటు 2011 ఉప ఎన్నికల్లోనూ కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందింది. నియోజకవర్గంలో కాంగ్రెస్‌పై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు ఈ ఫలితాలు నిదర్శనంగా నిలిచాయి. పార్టీ, ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడం ఆ పార్టీకి భారంగా మారింది. అందుకే ముందస్తు ఎన్నికల ప్రచారానికి తెరలేపినట్టు పరిశీలకులు భావిస్తున్నారు. వలసలపైనా ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. గతంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేసిన ఎంజీ వేణుగోపాల్‌గౌడ్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. కుల సంఘాలకు కమ్యూనిటీ హాళ్లు మంజూరు చేస్తూ ఆయా సంఘాల నేతలను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోంది.
తెలంగాణమే టీఆర్‌ఎస్ బలం
తెలంగాణవాదమే బలంగా టీఆర్‌ఎస్ సాగుతోంది. నియోజకవర్గంలో తిరుగులేని పట్టు సాధించిన టీఆర్‌ఎస్ వచ్చే ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో గెలుపొంది కాంగ్రెస్‌ను చావుదెబ్బకొట్టాలని చూస్తోంది. అందులో భాగంగా ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. అసంతృప్త నేతలను బుజ్జగించి తన వెంట తిప్పుకుంటున్నారు. తనపై బహిరంగ విమర్శలు చేసిన పార్టీ రాష్ట్ర నాయకులు కొమ్ముల తిర్మల్‌రెడ్డి, భూంరెడ్డిలాంటి వారిని కలిసి, బుజ్జగించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ వైఖరి వల్లే వందలాది మంది తెలంగాణవాదులు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారని, తెలంగాణ కోసం నిజాయితీగా పోరాడింది టీఆర్‌ఎస్ పార్టీయేనని ఎమ్మెల్యే తన పర్యటనల్లో ప్రజలకు వివరిస్తున్నారు. తద్వారా తెలంగాణ ఓటు బ్యాంకు పెంచుకునేందుకు యత్నిస్తున్నారు. ఇలా ఇద్దరు నేతలు పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్తుండడంతో నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.
ముందే కూసిన ‘ఓట్ల’ కోయిల!
Published Mon, Dec 23 2013 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM
Advertisement