సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడితే నవ్వు వస్తోందని ఎద్దేవా చేశారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. అలాగే, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ పనిఅయిపోయిందన్నారు.
కాగా, షబ్బీర్ అలీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫిరాయింపులపై బీఆర్‌ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదు. భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేతగా హోదా లేకుండా చేసింది కేసీఆర్ కాదా?. శాసనమండలిలో నా ప్రతిపక్ష నేత హోదా తొలగించలేదా?. మా పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను చేర్చుకుంది మీరు కాదా?. బీఆర్‌ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లలో డిపాజిట్ కోల్పోయింది. ఇప్పుడు అనర్హత వేటు గురించి మాట్లాడుతున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖతం అయ్యింది. హైదరాబాద్‌లో 11 ఎకరాలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం ఎందుకు?. ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు ఆఫీస్ లేదు. కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలి. భూమి వేలం వేసి ఆ డబ్బులు రుణమాఫీకి వాడాలి. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న ఆఫీస్ ఎక్కువ. దానికి కూడా మేమే భూమి ఇచ్చాం. తెలంగాణని కేసీఆర్ అంగడి బజారులో పెట్టారు. కేసీఆర్ తెలంగాణని అమ్మకానికి పెట్టారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment