కమలం వికసించేనా?.. కేడర్‌ ఉన్నా లీడర్ల మధ్య సఖ్యత కరువు!  | No Compatibility Among BJP Leaders In Rangareddy District | Sakshi
Sakshi News home page

Rangareddy District: కమలం వికసించేనా?.. కేడర్‌ ఉన్నా లీడర్ల మధ్య సఖ్యత కరువు! 

Published Tue, Apr 26 2022 3:38 PM | Last Updated on Tue, Apr 26 2022 5:03 PM

No Compatibility Among BJP Leaders In Rangareddy District - Sakshi

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎన్నికలకు ముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్‌ వరుస విజయాలతో బీజేపీ దూకుడు పెంచింది. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తెలంగాణకు గుండెకాయలాంటి రంగారెడ్డి జిల్లాలో మాత్రం కమల వికాసం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో పార్టీకి మంచి కేడర్‌ ఉన్నప్పటికీ లీడర్ల మధ్య సఖ్యత కొరవడింది.

చదవండి: కామారెడ్డి: కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. రచ్చకెక్కిన విభేదాలు 

ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు నేతలు పోటీకి సిద్ధమవుతుండటం.. ప్రజా సమస్యలపై సమష్టిగా కాకుండా ఎవరికి వారే కార్యక్రమాలు రూపొందిస్తుండడం.. అంతర్గత  విభేదాలు బహిర్గతమవుతుండటం.. అధినాయకత్వం జిల్లాపై దృష్టి సారించకపోవడం.. నియోజకవర్గాల వారీగా సమీక్షలు, సమావేశాలు ఏర్పాటు చేయకపోవడం వంటి అంశాలు పార్టీ వెను కబాటుకు కారణమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉండగా, అధికార పారీ్టకి ఐదు చోట్ల గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని, సమష్టిగా కృషి చేస్తే రాబోయే ఎన్నికల్లో విజయావకాశాలు లేకపోలేదని పేర్కొంటున్నారు.

కల్వకుర్తిలో.. 
జిల్లాలో మొదటి నుంచి పార్టీకి మంచి పట్టున్న నియోజకవర్గం ఇదే. గ్రామం నుంచి మండల స్థాయి వరకు కమిటీలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టిపోటీ ఉండనుంది. జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బరిలోకి దిగి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత బీసీ కమిషన్‌ సభ్యుడి హోదాలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. నెలలో 20 రోజులు ఇక్కడే మకాం వేస్తున్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో 12 బీజేపీ గెలిచినప్పటికీ.. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదనే అపవాదు పారీ్టకి లేకపోలేదు.

షాద్‌నగర్‌లో.. 
గతంతో పోలిస్తే ప్రస్తుతం ఇక్కడ పార్టీ కొంత బలపడినప్పటికీ.. ఎన్నికల్లో పోటీకి ఆశించిన ప్రజా మద్దతును కూడగట్టలేకపోయింది. మొదటి నుంచి అదే పార్టీలో కొనసాగుతున్న శ్రీవర్ధన్‌రెడ్డి సహా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తనయుడు మిథున్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి వచ్చిన అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్థన్‌రెడ్డి  టికెటు ఆశిస్తున్నారు. బూత్‌ లెవల్‌లో పార్టీ పటిష్టత కోసం పాటుపడటం లేదనే విమర్శలు ఉన్నాయి. మారుమూల గ్రా మాల్లోనే కాదు పట్టణ ప్రాంతాల్లోనూ మరింత బలపడాల్సిన అవసరం ఉంది.  

చేవెళ్లలో..
ప్రధాని మోదీపై ఉన్న అభిమానంతో యువత బీజేపీ వైపు ఆకర్షితులవుతోంది. ఇక్కడ అధికారపార్టీని ప్రభావితం చేయగలిగే లీడర్లు లేకపోవడం కొంత ఇబ్బందికరంగా మారింది. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నాయకుడు వస్తే తప్ప పట్టు సాధించలేని పరిస్థితి. మొదటి నుంచి పార్టీలోనే కొనసాగుతున్న సీనియర్‌ నేతలు సైతం అధికారపార్టీ అభ్యర్థితో పోటీపడలేకపోతున్నారు. ఇక్కడ పాగా వేయాలంటే కేడర్‌ శక్తికి మించి కష్టపడాల్సి ఉంటుందని భావిస్తున్నారు.

ఇబ్రహీంపట్నంలో.. 
అంతర్గత కుమ్ములాటలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి. ఏదైనా సమస్యపై అధిష్టానం పిలుపు ఇస్తే కానీ కేడర్‌ రోడ్డుపైకి రావడం లేదు. ప్రజల్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం కూడా పెద్దగా చేయడం లేదంటున్నారు. గత ఎన్నికల్లో కొత్త అశోక్‌గౌడ్‌ పార్టీ తరఫున పోటీ చేసి 17 వేల ఓట్లు మాత్రమే సాధించారు. తుర్కయంజాల్, పెద్ద అంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఒకటి రెండు సీట్లకే పరిమితమైంది. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేస్తే కానీ పోటీలో నిలబడలేని పరిస్థితి.

రాజేంద్రనగర్‌లో.. 
గతంతో పోలిస్తే ప్రస్తుతం ఇక్కడ పార్టీ బలపడింది. ప్రాబల్యమున్న ప్రాంతాలు మినహా అన్ని చోట్ల పట్టు సాధించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఐదు డివిజన్లు ఉండగా, వీటిలో మూడు గెలుచుకుంది.  శంషాబాద్‌ పట్టణం.. మండలాల్లో కేడర్‌ పటిష్టంగా ఉంది. మైలార్‌దేవులపల్లి కార్పొరేటర్‌ తోకల శ్రీనివాసరెడ్డి, బుక్క వేణుగోపాల్‌ పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల లోక్‌సత్తా రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోల్కర్‌రెడ్డి సైతం బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఆ పారీ్టకి కలిసి వచ్చే అంశం. క్షేత్రస్థాయి లీడర్లు, కేడర్‌ కలిసికట్టుగా పని చేస్తే విజయానికి అవకాశం లేకపోలేదు.

మహేశ్వరంలో.. 
జీహెచ్‌ఎంసీలోని ఆర్కేపురం, సరూర్‌నగర్‌ డివిజన్లు సహా తుక్కుగూడ చైర్మన్‌ స్థానం బీజేపీ కైవసం చేసుకుంది. బడంగ్‌పేట్, మీర్‌పేట్, జల్‌పల్లి మున్సిపాలిటీల్లోనూ పార్టీ ప్రభావం చూపింది. కందుకూరు ఎంపీపీ కూడా ఆ పార్టీ అభ్యర్థే. మహేశ్వరం మండలం లోని పలు గ్రామాల్లోని ఎంపీటీసీ, సర్పంచ్‌ స్థానాలు పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, సీనియర్‌ నేత అందెల శ్రీరాములు యాదవ్, మాజీ మంత్రి దేవేందర్‌ గౌడ్‌ తనయుడు వీరేందర్‌గౌడ్‌ ఇక్కడి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. సంస్థాగతంగా పార్టీ బలంగా ఉన్నప్పటికీ లీడర్ల మధ్య అంతర్గత విభేదాలు పుట్టిముంచే ప్రమాదం ఉందంటున్నారు.      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement