ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ముఖ్యమైన నాయకులు సైతం కనిపించకుండా పోయారు. కరోనా విపత్కర పరిస్థితులు మొదలు ప్రజలకు సంబంధించి ఏ కష్టంలోనూ వారు పాలుపంచుకోలేదు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇప్పుడిప్పుడే వారికి జనంపై ప్రేమ ఉప్పొంగిపోతోంది. పార్టీ అధిష్టానం కూడా ‘ఇదేం ఖర్మ’ నిర్వహించాలని చెప్పడంతో ప్రజల ముందు ప్రత్యక్ష మవుతున్నారు. కానీ, ఆ కార్యక్రమమే ఇప్పుడు టీడీపీలో కుమ్ములాటలకు ఆజ్యం పోస్తోంది. ఏ నాయకుడికి మద్దతు ఇవ్వాలో తెలీక ‘మాకిదేం ఖర్మ బాబూ’ అని ఆ పార్టీ కార్యకర్తలే పెదవి విరుస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టికి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్గత కుమ్ములాటలతో ఆ పార్టీ నాయకులు రోడ్లెక్కడంతో ఆ పార్టీ చెందిన ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలకు దిక్కుతోచడం లేదు. ఏ నియోజకవర్గంలో చూసినా నాలుగైదు వర్గాలు కామన్ అయిపోయాయి. తాజాగా ఆ పార్టీ అధిష్టానం పిలుపిచ్చిన ‘ఇదేంఖర్మ’ కార్యక్రమం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. దీంతో ఆ పార్టీ కేడర్‌లో నిస్తేజం నెలకొంది.
తారస్థాయికి విభేదాలు
- శింగనమల నియోజకవర్గంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. నియోజకవర్గంలో ఆలం నరసనాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి... బండారు శ్రావణికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. నరసనాయుడు, ముంటిమడుగు వర్గాలు కార్యక్రమం చేయడానికి రావడంతో శ్రావణి వర్గం వారిని అడ్డుకుంది. ఈ వ్యవహారం పోలీస్‌స్టేషన్ దాకా వెళ్లింది. రోడ్డుమీదనే తెలుగుతమ్ముళ్లు కొట్టుకోవడంతో ఆ పార్టీ కార్యకర్తలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. పెనుకొండలో సవితమ్మ, పార్థసారధి, నిమ్మల కిష్టప్ప వర్గాలు తలోమార్గంలో వెళ్తున్నాయి. ఒకరి పేరిత్తితే మరొకరు భగ్గుమంటున్న పరిస్థితి. దీంతో కార్యక్రమం చేస్తే ఎటు వెళ్లాలో కూడా కార్యకర్తలు తేల్చుకోలేకపోతున్నారు.
- కళ్యాణదుర్గంలో ఉన్నం హనుమంతరాయ చౌదరి, మహేశ్వరనాయుడు వర్గాల మధ్య పాము ముంగిస వైరంలా మారింది. ఏకంగా వేర్వేరుగా పార్టీ కార్యాలయాలు నడుపుతుండటంతో టీడీపీ కేడర్ రెండుగా చీలింది.
- అనంతపురం అర్బన్‌లో ప్రభాకర్‌చౌదరికి వ్యతిరేకంగా చాలా మంది నాయకులు పావులు కదుపుతున్నారు. ప్రభాకర్‌చౌదరికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ రాకుండా చేయాలని యత్నిస్తున్నారు. అదేస్థాయిలో ఆయన కూడా రాజకీయం చేస్తున్నారు.
- మడకశిరలో గుండుమల తిప్పేస్వామి, ఈరన్న వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. ఏ కార్యక్రమం చేసినా విడివిడిగా చేస్తూ ఒకరిపై మరొకరు పై చేయి సాధించాలని యతి్నస్తూ ఉన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నిసార్లు చెప్పినా మేమింతే అన్న రీతిలో వారు ముందుకెళ్తున్నారు.
- పుట్టపర్తిలో మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి చెక్ పెట్టేలా సైకం శ్రీనివాసరెడ్డి, పెద్దరాసు సుబ్రహ్మణ్యం జోరుగా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పల్లెకు టికెట్ ఇస్తే అసలు తాము పనేచేయమంటూ మరికొందరు నాయకులు తిరుగుబాటు చేస్తుండటంతో పార్టీ కేడర్ సందిగ్ధంలో పడిపోయింది.
- కదిరిలో అత్తార్ చాంద్‌బాషా, కందికుంట ప్రసాద్ వర్గాలు ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటికే అనేకసార్లు ఇరు వర్గాలు బాహాబహికి దిగిన విషయం తెలిసిందే. కార్యక్రమాలన్నీ విడివిడిగా చేస్తుండటం ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
- గుంతకల్లు టీడీపీ నాలుగు వర్గాలుగా విడిపోయింది. జితేంద్రగౌడ్, వెంకటశివుడు యాదవ్, పత్తి హిమబిందు, జీవానందరెడ్డి టికెట్ కోసం జోరుగా యత్నిస్తున్నారు. పార్టీ కేడర్ కూడా నాయకుల వారీగా విడిపోవడంతో అధిష్టానానికి ఏం చేయాలో కూడా దిక్కుతోచడం లేదు.
- ధర్మవరంలో పరిటాల శ్రీరామ్‌కు ప్రస్తుతం బీజేపీలో ఉన్న వరదాపురం సూరి చెక్ పెడతారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. వారిద్దరి మధ్య తరచూ జరుగుతున్న మాటల యుద్ధం దీన్ని బలపరుస్తోంది.
వెంటాడుతున్న ఈడీ, సీబీఐ కేసులు
టీడీపీ హయాంలో చేసిన అవినీతి, అక్రమాలు ఆ పార్టీ నాయకులకు నిద్రపట్టనివ్వకుండా చేస్తున్నాయి. ఇప్పటికే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఈడీ, సీబీఐ కేసులు మెడకు ఉచ్చులా తగులుకున్నాయి. బీఎస్–3 వాహనాలను బీఎస్– 4గా మార్చి అమ్మిన కేసులో ఇప్పటికే చార్జిషీట్లు దాఖలయ్యాయి. ధర్మవరంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వరదాపురం సూరిపై భూఆక్రమణ కేసుల్లో సీఐడీ విచారణ జరుగుతోంది.
దీనికితోడు తాజాగా కర్ణాటక నుంచి అక్రమంగా డీజిల్ రవాణా చేస్తూ దొరికిపోవడంతో కేసు నమోదు చేశారు. మరోవైపు అక్రమాస్తుల కేసులో పెనుకొండకు చెందిన సవితమ్మ ఇంట్లో ఇటీవలే సీబీఐ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించి ఇప్పుడు కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి జ్వాలలు రోజూ ఎక్కడో చోట రగులుతూనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment